తెలంగాణ ఎంపీల్లో నేరచరితులే అధికం
తెలంగాణ రాష్ట్రం నుంచి 18వ లోక్ సభకు ఎన్నికైన కొత్త ఎంపీల్లో నేరచరితులే అధికంగా ఉన్నారు. తెలంగాణలోని 17 మంది ఎంపీల్లో 14 మందిపై వివిధ పోలీసు కేసులున్నాయి.
By : The Federal
Update: 2024-06-08 10:50 GMT
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్లో 14 మందికి నేరచరిత్ర ఉంది.మొత్తం రాష్ట్ర ఎంపీల్లో 82 శాతం మందికి నేరచరిత్ర ఉందని పోలీసుల రికార్డులే చెబుతున్నాయి. ప్రతీ అయిదుగురు ఎంపీల్లో నలుగురు నేరచరితులేనని తేలింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ ఎంపీలపై ఉన్న కేసులను శనివారం విశ్లేషించింది.
ఈటెల రాజేందర్ పై అత్యధిక కేసులు
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు బీజేపీకి చెందిన ఈటెల రాజేందర్ పై అత్యధికంగా 54 కేసులున్నాయని, లోక్ సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ చెబుతోంది. బండి సంజయ్ పై 42 కేసులు, ధర్మపురి అర్వింద్ పై 22, ఎం రఘునందన్ రావుపై 29, మల్లు రవిపై 5 కేసులు, కుందూరు రఘువీర్ పై 2, డీకే అరుణపై 6, కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై 4, అసదుద్దీన్ ఒవైసీపై 5కేసులు నమోదయ్యాయి. గోడం నగేష్, సురేష్ కుమార్ షెట్కార్, రామసహాయం రఘురామిరెడ్డి, బలరాం నాయక్ లపై ఒక్కో కేసు ఉన్నాయి.
ముగ్గురు ఎంపీలపై ఒక్క కేసు లేదు...
సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ జి కిషన్ రెడ్డి, పెద్ద పల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వరంగల్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యలపై ఒక్క కేసు కూడా లేదు.
నోటా ఓట్లు ఏ నియోజకవర్గంలో ఎన్ని వచ్చాయంటే...
తెలంగాణ రాష్ట్రంలోనే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా నోటా ఓట్లు నమోదయ్యాయి. 13,366 మంది ఓటర్లు అభ్యర్థులు ఎవరూ నచ్చలేదని నోటాకు ఓటేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నోటాకు 11,762 ఓట్లు వచ్చాయి. అలాగే పెద్దపల్లిలో 5,711, కరీంనగర్ లో 5,438, నిజామాబాద్ లో 4,483, జహీరాబాద్ లో 2,977,మెదక్ లో 4,617, సికింద్రాబాద్ లోె 5,466, హైదరాబాద్ లో 2,906, చేవేళ్లలో 6,423, మహబూబ్ నగర్ లో 4,330,నాగర్ కర్నూల్ లో 4,580, నల్గొండలో 6,086, భువనగిరిలో 4,646, వరంగల్ 847, మహబూబాబాద్ లో 6,591,ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో 6,782 ఓట్లు నోటాకు వచ్చాయి.
అందరికంటే సంపన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సంపన్న ఎంపీగా బీజేపీకి చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిలిచారు. రూ.1669కోట్ల రూపాయల ఆస్తితో అగ్రస్థానంలో నిలిచారు. మరో వైపు తక్కువ ఆస్తిపరుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. సంజయ్ కు రూ.1.12కోట్ల ఆస్తి ఉందని అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డికి అత్యధిక ఓట్లు
ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డికి అత్యధికంగా 7,66,929 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో 61.31శాతం రఘురామిరెడ్డికే వచ్చాయి. హైదరాబాద్ మజ్లిస్ పార్టీకి చెందిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి 6,61,981 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో 61.30 శాతం ఓట్లు సాధించిన అసద్ రెండో స్థానంలో నిలిచారు.