పశ్చిమ బెంగాల్‌లో మ్యాపింగ్ కాని ఓటర్లు 32 లక్షల మంది
డిసెంబర్ 27 నుంచి మ్యాపింగ్‌కు అవకాశం కల్పించిన ఈసీ..
పశ్చిమ బెంగాల్(West bengal)లో మ్యాపింగ్ కాని ఓటర్లు దాదాపు 32 లక్షల మంది ఉన్నారని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ఇలాంటి వార్లు తమ కుటుంబసభ్యులతో లింకు అయ్యేందుకు ఈసీ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్రక్రియ 27వ తేదీ నుంచి మొదలుకానుంది. మ్యాపింగ్ కాని ఓటర్లకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశామని ఈసీ పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (S.I.R) పూర్తయిన విషయం తెలిసిందే.
"ఈరోజు నుంచి దాదాపు 10 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశాం. మిగిలిన 22 లక్షల మంది ఓటర్లకు కూడా మంగళవారం నుంచి నోటీసులు పంపుతాం" అని పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ అధికారి తెలిపారు.
జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయాలు, సబ్-డివిజనల్ కార్యాలయాలు, వివిధ ప్రభుత్వ విభాగాలతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో ఓటరు లింకేజీ కార్యక్రమం కొనసాగుతుందని ఈసీ పేర్కొన్నారు. ‘‘ఈ తరహా ఓటర్ల పరిశీలనకు 4వేల మంది మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నారు. వీరికి డిసెంబర్ 24న కోల్‌కతాలో రెండు దశల్లో శిక్షణ కూడా ఇస్తారు.’’ అని చెప్పారు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (C.M Mamata Banerjee) సోమవారం మైక్రో-అబ్జర్వర్లకు స్థానిక బెంగాలీ భాషపై అవగాహన లేదని ఆరోపించిన నేపథ్యంలో బెంగాళీ భాష తెలిసిన వారినే మైక్రో-అబ్జర్వర్లుగా నియమిస్తోంది ఈసీ.
SIR పురోగతిని సమీక్షించనున్న ఈసీ..
SIR పురోగతిని సమీక్షించడానికి ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం రాష్ట్రాన్ని సందర్శిస్తుందని రాష్ట్ర CEO తెలిపారు. "SIR ప్రక్రియ పురోగతిని తెలుసుకునేందుకు కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ SB జోషి, డిప్యూటీ సెక్రటరీ అభినవ్ అగర్వాల్ రాష్ట్రానికి వస్తారు. డిసెంబర్ 24న మైక్రో-అబ్జర్వర్ల శిక్షణా కార్యక్రమానికి వీరు హాజరవుతారు’’ అని పేర్కొన్నారు.