మళ్ళీ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన పవన్!

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎంతో అనుభవం ఉన్న నాయకుడు అవసరమని పవన్ అన్నారు. పరిపాలనలో చంద్రబాబే తనకు స్ఫూర్తి అని చెప్పారు.

Update: 2024-10-14 10:11 GMT

పవన్ కళ్యాణ్ ఇటీవల తరచూ చంద్రబాబును పొగడుతున్నారు. ఇవాళ మళ్ళీ చంద్రబాబునాయుడును ఆకాశానికి ఎత్తేశారు. బాబులాంటి నాయకుడి అనుభవాన్ని వాడుకోకపోతే తప్పు చేసినవాళ్ళం అవుతామని అన్నారు. ఆయన అనుభవం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో బలమని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎంతో అనుభవం ఉన్న నాయకుడు అవసరమని పవన్ అన్నారు. పరిపాలనలో చంద్రబాబే తనకు స్ఫూర్తి అని చెప్పారు.

కృష్ణా జిల్లా కంకిపాడులో ఇవాళ జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించటం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. తమ ప్రభుత్వ పాలన ఎంతో పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా పారదర్శకతతో పని చేయాలని సూచించారు. ఏ అధికారి అయినా తప్పు చేస్తే క్షమించేది లేదని అన్నారు.

కాకినాడలో ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన పేరు చెప్పి డబ్బులు అడుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని ఆదేశించానని పవన్ చెప్పారు. ఈ ప్రభుత్వంలో అలాంటి వ్యక్తుల ప్రమేయం ఉండొద్దని స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. తమది లంచాల ప్రభుత్వం కాదు, నిలబడే ప్రభుత్వమని అన్నారు.

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి పవన్ చురకలు వేశారు. గుడివాడ నియోజకవర్గంలోని 43 గ్రామాలలో నీటి సమస్యను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తన దృష్టికి తీసుకొచ్చారని, గత ఎమ్మెల్యే బూతులు, శాపనార్థాలు తప్ప నీటి సమస్య గురించి పట్టించుకోలేదని చెప్పారు.

రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని, యువతకు ఉపాధి అవాకాశాలు రావాలని, పల్లెల్లో వెలుగులు నిండాలన్నదే తమ ఆకాంక్ష అని పవన్ చెప్పారు. అందుకే వైసీపీ ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఉందని, ఆ పార్టీ ఓటమికోసం గట్టిగా కృషి చేశామని అన్నారు. టీడీపీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని దానికోసం ఎన్నో దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడ్డామని చెప్పారు. అప్పుడు తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని అనిపిస్తోందని అన్నారు.

సినిమారంగంలో తనకు ఎవరితోనూ పోటీ లేదని పవన్ చెప్పారు. టాలీవుడ్‌లోని బాలకృష్ణ, చిరంజీవి, తారక్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని అందరూ బాగుండాలని కోరుకుంటానని, ఒక్కొకళ్ళు ఒక్కోదాంట్లో నిష్ణాతులు అని అన్నారు. వినోదం కన్నా ప్రతి ఒక్కరి కడుపు నిండాలని, అందుకే కడుపు నింపే పని చేద్దామని చెప్పారు. గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజుల పని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ అన్నారు.

2029 లోపే చంద్రబాబును దించి, పవన్‌ను త్వరలో ఏపీ ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళుతోందని రాష్ట్రంలో పలు ఊహాగానాలు సాగుతుండగా, పవన్ మాత్రం ఇలా చంద్రబాబు తనకు స్ఫూర్తి అని వ్యాఖ్యానించటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Tags:    

Similar News