బెంగళూరులో అడ్డగోలుగా పెరిగిన పీజీలు: యజమానులు అత్యధికులు తెలుగువారే!

పీజీ యజమానులలో అత్యధికశాతం ఉండేది ఏపీకి చెందిన రెడ్లు, కర్ణాటకలోని గౌడలే ఉంటారని చెబుతుంటారు. ఏపీకి చెందినవారిలో కూడా నెల్లూరు రెడ్లే ఎక్కువగా ఉంటారు.

Update: 2024-09-12 11:53 GMT

బెంగళూరులో అడ్డగోలుగా పెరిగిపోయిన పీజీలు నగరవాసులకు పెద్ద సమస్యగా మారిపోయాయి. ఎలాంటి అనుమతులు, నిబంధనలూ లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఏర్పాటు చేస్తున్న ఈ పీజీలతో ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో అని నగరవాసులు, పోలీసులు భయపడుతున్నారు. ఈ పీజీలను నడిపేవారిలో ఆంధ్రప్రదేశ్‌లోని ఒక సామాజికవర్గంవారు అత్యధికులు ఉండటం గమనార్హం.

పీజీ స్లమ్స్ అంటున్నారు!

ఇప్పుడు బెంగళూరులో మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్న వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది పీజీలే. పీజీ అంటే మరేమీ కాదు పేయింగ్ గెస్ట్ వసతిగృహం. బెంగళూరు నగరంలో దాదాపు 20 వేల పీజీలు ఉన్నాయి. పట్టణ, నగర ప్రాంతాలలో ఉండే మురికివాడలలోలాగా కనీస సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు లేకుండా పక్కపక్కనే పేకమేడల్లా లెగుస్తుండటంతో బెంగళూరు పీజీ వసతిగృహాలను ఇప్పుడు పీజీ స్లమ్స్ అని పిలుస్తున్నారు. నగరంలోని ప్రశాంత్ లే అవుట్, డిసిల్వా లే అవుట్, ఉప్కార్ లే అవుట్, నల్లూర్‌హళ్ళి రోడ్‌లలో ఈ అక్రమ పీజీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఈ పీజీలు ఉన్న ప్రతిచోటా, ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందోనని, ఏ అగ్ని ప్రమాదమో, మరొకటో ముంచుకొస్తుందో అని చుట్టుపక్కల ఉండే సాధారణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఈ పీజీలు ఉండే భవనాలు అన్నింటిలో సరైన పార్కింగ్ స్పేస్‌గానీ, సెట్ బ్యాక్‌లుగానీ, అగ్నిమాపక సౌకర్యాలుగానీ ఉండటంలేదని, ఇవేమీ లేకుండానే ఈ పీజీలు నడవగలుగుతున్నాయంటే నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఉదాశీనతే కారణమని పౌరులు ఆరోపిస్తున్నారు. అతి కొద్ది స్థలంలోనే నిట్టనిలువుగా అంతస్తులపై అంతస్తులు కట్టేస్తున్నారని అంటున్నారు. అయితే మొత్తంమీద ఆరు అంతస్తులలోపే ఈ భవనాలను కడుతున్నారు. దీనికి ఒక కారణం ఉంది. 21 మీటర్ల ఎత్తులోపు భవనాలకు ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరంలేదు. చట్టంలోని ఈ లొసుగును పీజీ యజమానులు తెలివిగా వాడుకుంటూ తమ భవనాల ఎత్తును 21 మీటర్లలోపే ఉండేటట్లు చూసుకుంటున్నారు. కొందరు భవనాల యజమానులు మామూలు నివాస ప్రాంతాలలో కుటుంబాలను ఖాళీ చేయించి పీజీలకు అద్దెకు ఇస్తున్నారు. వైట్ ఫీల్డ్ ప్రాంతంలోని ప్రశాంత్ లే అవుట్ దీనికి ఒక ఉదాహరణ. ప్రశాంతంగా ఉండే ఈ నివాస ప్రాంతంలో ఒకప్పుడు దాదాపు 250 కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు అక్కడ అంతా పీజీల మయమైపోయింది. సుమారు 25 వేలమంది పేయింగ్ గెస్టులు ఉంటున్నారు. జనసాంద్రత(చదరపు గజానికి ఉండే మనుషుల సంఖ్య) ఎన్నో రెట్లు పెరిగిపోయింది. దీనితో భూగర్భ జలాల పరిమాణం, జీవన ప్రమాణాలు తీవ్రస్థాయిలో తగ్గిపోయాయి.

పీజీలతో స్థానికులకు ముప్పతిప్పలు

కిక్కిరిసిపోయినట్లు ఉండే పీజీలలో నివశించేవారు లోపల సమయం గడపటానికి అనుకూలమైన వాతావరణం లేనందున, సాయంకాలు, రాత్రిళ్ళలో బయటకు వచ్చి కాలం వెళ్ళదీసి, నిద్రపోవటానికి మాత్రమే లోపలకు వెళుతుంటారు. దీనితో ఆ ప్రాంతంలో రాత్రి పొద్దు పోయేదాకా మనుషులు, వాహనాల సంచారం, దుకాణాలు తెరిచి ఉండటం, ఆ వ్యాపారాలతో గోలగోలగా ఉంటోంది. కనీసం రాత్రిళ్ళు కూడా ప్రశాంతంగా ఉండటంలేదని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయటం పెరిగిపోయింది.

బెంగళూరు నగర వ్యాప్తంగా దాదాపు 20 వేల పీజీలు ఉండగా, వీటిలో కేవలం 1,810 పీజీలకు మాత్రమే లైసెన్సులు ఉన్నాయి. వీటిలో 1,022 మగవారివి కాగా, 788 ఆడవారివి. ఆడవారి పీజీలలో భద్రతా ప్రమాణాలు అత్యంత దయనీయంగా ఉంటున్నాయి. గత జులై నెలలో నగరంలో కోరమంగళ ప్రాంతంలోని ఒక పీజీలో ఉంటున్న కృతి కుమారి అనే బీహార్ యువతి గదిలోకి ఒక దుండగుడు ప్రవేశించి ఆమెను గొంతు కోసి చంపి పరారయ్యాడు. ఈ ఘటనతో పీజీ వసతి గృహాలలో భద్రతా ప్రమాణాలలోని డొల్లతనం బయటపడింది.

నిబంధనలను కఠినతరం చేసిన అధికారులు

పీజీలలో చేర్చుకునే ముందు ప్రతి ఒక్కరినుంచి ఐడెంటిటీ కార్డ్ తీసుకోవాలని, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్ తీసుకోవాలని, సందర్శకుల వివరాలు తీసుకోవాలని, సీసీటీవీ కెమేరాలు, అగ్నిమాపక పరికరాలు విధిగా నెలకొల్పాలని బెంగళూరు పోలీసులు పీజీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా పీజీ వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు బీబీఎంపీ(బృహత్ బెంగళూరు మహానగర పాలికె) నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని ఆదేశించారు. పీజీ వసతిగృహాల నియంత్రణకోసం ఒక వ్యవస్థను నెలకొల్పాలని పౌర సంక్షేమ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఈ పీజీలలో అతి తక్కువలో రు.4,500 నుంచి రు.32,000 వరకు రేట్లు ఉన్నాయి. అత్యధికంగా రేట్లు ఉండే లగ్జరీ పీజీలలో ఏసీ, వాషింగ్ మెషిన్, టీవీ, సెక్యూరిటీ, జిమ్ ఉంటాయి. ఒంటరిగా ఉండాలనుకున్నా ఉండవచ్చు, ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురితో షేరింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే నలుగురైదుగురు ఉంటే వాష్ రూమ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఎదురవుతుంది.

పీజీల యజమానులలో తెలుగువారే ఎక్కువ

పీజీ యజమానులలో అత్యధికశాతం ఉండేది ఏపీకి చెందిన రెడ్లు, కర్ణాటకలోని గౌడలే ఉంటారని చెబుతుంటారు. ఏపీకి చెందినవారిలో కూడా నెల్లూరు రెడ్లే ఎక్కువగా ఉంటారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ కంటే చెన్నై, బెంగళూరు నగరాలు దగ్గర కావటంతో ఆ ప్రాంతంలోనివారు ఆ రెండు నగరాలకు వెళుతుంటారు. ముఖ్యంగా కన్‌స్ట్రక్షన్ రంగంలో పేరుగాంచిన రెడ్లు బెంగళూరులో పీజీ వ్యాపారంలో ముందంజలో ఉన్నారు.

ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఈ పీజీ వసతిగృహాలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. గచ్చిబౌలి, దిల్‌షుక్‌నగర్ ప్రాంతంలో ఇవి అత్యధికంగా ఉన్నాయి. అయితే ఇక్కడ బెంగళూరులోలాంటి పరిస్థితులు లేవని, వసతులు, భద్రతా ప్రమాణాలు సంతృప్తికరంగానే ఉన్నాయని మాదాపూర్‌లోని ఒక పీజీలో ఉంటున్న సృజన్ చెప్పారు.

Tags:    

Similar News