ఆంధ్రప్రదేశ్ లో ఆట మొదలైంది!

ఒకే రోజు ముగ్గురు నేతలు.. మూడు ప్రసంగాలు..దుమ్మెత్తి పోసుకున్నారు. ఒకరు ఏడుపులే ఏడుపులంటే మరొకరు సైకోలంటే ఇంకొకరు విధ్వంసమంటూ మంటలు పుట్టించారు.

Update: 2023-12-15 03:11 GMT
జగన్, పవన్, చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ లో ఆట మొదలైంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఉద్దరింపులు, కత్తిరింపులు, ప్రేమాయణాలు పెల్లుబుకుతున్నాయి. గొప్పలు గొంతుల నుంచి ఉప్పొంగుతున్నాయి. విమర్శలు జడివానై జనాన్ని ముంచెత్తుతున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాక ప్రజలు నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి దిక్కులు చూస్తున్నారు.

ఒకే రోజు ముగ్గురు నేతలు.. మూడు ప్రసంగాలు.. అన్నీ జనాన్ని ఆకట్టుకున్నవే. ఆలోచింపదగినవే. ఒకరేమో- చంద్రబాబు- జగన్ మద్య తేడా చూడమన్నారు. ఇంకొకరేమో- వైసీపీ అనేది జనం నెత్తిన కుంపటన్నారు. మరొకరేమో- జగన్ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరలా దిక్కులేకుండా పోయిందన్నారు. ఆ ముగ్గురేవరో మీకీ పాటికి తెలిసుంటుంది. తొలి మాట రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పలాసలో.. మలి మాట టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో, మూడో మాట జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరిలో..

ముగ్గురు నేతలు.. మూడు ప్రసంగాలు..

నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఓటర్ల జాబితాలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల సంఘం అధికారులు హడావిడి చేస్తున్నారు. పార్టీ నేతల ఫిర్యాదులు జోరందుకున్నాయి. విజయవాడ మొదలు ఢిల్లీ వరకు- దొంగ ఓటర్లపై ఫిర్యాదులు చేసుకుని వచ్చారు. ఇప్పటికే పొత్తులు, ఎత్తులు కొలిక్కివచ్చాయి. ఎవరెవరు ఏయే పార్టీలతో జట్టు కడతారో తేలిపోయింది. అభ్యర్థుల ఖరారు, జాబితాల ప్రకటనలంటూ రాజకీయ పార్టీలు సందడి చేస్తున్నాయి. ఓటర్ల ఏకీకరణపై చూపు సారించాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు నేతలు పేల్చిన మాటల తుటాలు ఇలా ఉన్నాయి.

ప్రతి దానికీ ఏడుపే ఏడుపు...జగన్

“పేదవాడి బ్రతుకులు ఎలా మర్చాలనే ఆలోచన మీ బిడ్డ జగన్ కి మాత్రమే ఉంది. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంకి కూడా నీళ్లు ఇవ్వలేక పోయాడు. అలాంటి చంద్రబాబుకు ఉత్తరాంద్రాపై ఏ మనసు ఉంటాది? మానవత్వంలేని వ్యక్తి చంద్రబాబు. ఎన్నికలు వచ్చే సరికిపొత్తులు, ఎత్తులు, కుయుక్తులంటాడు. మరో దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ అనే మ్యారేజీవీరుడి మీద ఆదారపడతాడు. ఈ ప్యాకేజి స్టార్ కి తెలంగాణలో బర్రెలక్కకి వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. 2014-19 మధ్య ఇద్దరూ కలిసి ఉన్నారు. కనీసం ఉద్దానం కి మంచి నీరు ఇద్దామనే ఆలోచన కూడా చేయలేదు. ఉత్తరాంద్రా కి చేయని ద్రోహం లేదు. ప్రతిపక్షంలో ఉంటూ విశాఖ రాజదానిని అడ్డు కుంటున్నారు. నేను ఏది మొదలు పెట్టినా ఏడుపే ఏడుపు. దొంగల ముఠా అంతా హైదరాబాదులో ఉండి... మన రాష్ట్రంలో ఏ చేయాలో అని నిర్ణయిస్తామంటారు. నాన్ లోకల్ పాలిటిక్స్ చేయాలని చూస్తారు. కొన్ని మీడియా సంస్థలతో వీరిద్దరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి మనపై ఏడుస్తారు. ప్రతి దానికీ ఏడుపే ఏడుపే” అంటున్నారు సీఎం జగన్.

జగన్ ప్రసంగం ముగిసిన గంటకు చంద్రబాబు మైకందుకున్నారు. జగన్ పై నిప్పులు చెరిగారు. జనం నెత్తిన జగన్ అనే వ్యక్తి నిప్పుల కుంపటన్నాడు.

జగన్ చేసేవన్నీ చెత్త పనులే- చంద్రబాబు

”వైసీపీలోని అసంతృప్తులు మాకెందుకు..? అక్కడ టిక్కెట్ రాలేదని మా దగ్గరకు వస్తామంటే మాకు అవసరం లేదు. వైసీపీలో మంచి వాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశాన్ని ఆలోచిస్తాం. మద్య నిషేధం చేయకుంటే ఓటు అడగను అని చెప్పిన జగనుకు.. ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఎక్కడిది..? పక్క రాష్ట్రాల్లో ఓటు లేని వారికి.. ఈ రాష్ట్రంలో ఓటు ఉంటే.. వాళ్లూ ఓటేయొద్దని ఎలా చెబుతారు..? జగన్ చేసేవన్నీ చెత్త పనులే. రిషికొండ మీద టూరిజం హోటల్ పేరుతో రూ. 500 కోట్లతో భవనం కడతారా..? చట్టం సీఎంకు వర్తించదా..? జగన్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడే కాదు. మూడు నెలల్లో జగన్ ఇంటికి వెళ్తున్నారు.. మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ట్రాన్సఫర్లు ఉంటాయని నేను ఊహించ లేదు. దళితులు.. బీసీలనే బదిలీ చేశారు. ఇంత మందిని బదిలీలు చేసిన జగన్.. బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి వంటి వారిని ఎందుకు ట్రాన్సఫర్ చేయలేదు. 5 కోట్ల ప్రజలు వర్సెస్ సైకో జగన్ అనే నినాదంతో ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ అభ్యర్ధులకు తాడేపల్లి ఆమోదం.. మా అభ్యర్థులకు ప్రజామోదం” అన్నది చంద్రబాబు మాట

జగన్, చంద్రబాబు ప్రసంగాలు పూర్తయ్యాక పవన్ కల్యాణ్ తెరపైకి వచ్చారు. రాజధాని అమరావతి ప్రాంతం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన విశాఖపట్నం నుంచి వచ్చిన ముస్లిం నేతల్ని పార్టీలోకి చేర్చుకున్నారు. జగన్ పై విరుచుకుపడ్డారు.

కుక్కులు చింపిన విస్తరిలా ఏపీ- పవన్

”వైసీపీ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా దిక్కులేకుండా పోయింది. ఈ విధ్వంసాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే కనీసం దశాబ్ద కాలం పడుతుంది. పదేళ్లుగా వైసీపీ లాంటి గూండా నాయకులను ఎదుర్కొంటున్నాం. మనందరం కలిసి పోరాటాలు చేయాలి. నాకు మతాలపైన చాలా గౌరవం. నన్ను ప్రేమించే మైనారిటీలు బీజేపీతో ఉన్నానని దూరంగా ఉన్నామని అంటుంటారు.. మీకు ఏమైనా నష్టం జరిగితే నేను ఎల్లప్పుడు అండగా ఉంటా.. నేను మత వివక్ష చూపను. కులం, మతం దాటి వచ్చాను..మానవత్వాన్ని నమ్ముతాను. వైజాగ్ ముస్లింల సమస్యలు ఇబ్బందులు నాకు తెలుసు. నేను మీకు అండగా ఉంటా. ఒక్కసారి జనసేనను నమ్మండి.. ముస్లింలను మైనారిటీ ఓటు బ్యాంకుగా చూడను. మీరు ఇప్పటిదాకా వైసీపీని చూశారు. కాని ఒక్కసారి 2024లో జనసేనను నమ్మండి. బీజేపీ అనేది మీకు (ముస్లిం) ఇబ్బంది కరంగా ఉంటే ఒక్క చోట ఒక్కోలో ఉంటుంది. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీకి మద్దతిచ్చా. నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. సినిమా టిక్కెట్ల విధానాల కోసం వాడే చీఫ్ సెక్రటరీలను కాకుండా మీకోసం పనిచేసే చీఫ్ సెక్రటరీలను పెడతాం” అంటున్నారు పవన్ కల్యాణ్.

ఈ మూడు ప్రసంగాల్లోనూ ప్రధానాంశం ఎన్నికలు, ఓట్లు, సుపరిపాలన, మతసామరస్యం, అభివృద్ధి, వ్యక్తిగత విమర్శలు. వీటిలోని మంచి చెడులను ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకే రోజు వచ్చిన ఈ మూడు ప్రసంగాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆలోచనలో పడేశాయి.

Tags:    

Similar News