అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడంతో హిందూ ఓట్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ నేతలు రామజపం చేశారు. ఆలయం ప్రారంభానికి తోడుగా హిందూ ఓట్లను ప్రభావితం చేసేలా తెలంగాణలోనూ ఇపుడు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే బీజేపీ నేతలు ప్రధాని మోదీని తెలంగాణకు రప్పించి ఆయనతో రూ.62000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపించనున్నారు.
ఆదిలాబాద్ పట్టణంలో ఆరువేల కోట్లరూపాయలతో ఆదిలాబాద్- బేలా రోడ్డు, హైదరాబాద్- భూపాలపట్నం రోడ్డు, రామగుండం ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ప్లాంట్, అంబారి-ఆదిలాబాద్-పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సంగరెడ్డిలోనూ 6800 కోట్లరూపాయలతో రోడ్లు, గ్యాస్ పైపులైన్, ఎంఎంటీఎస్ రెండో దశ పనులను మోదీ చేపట్టనున్నారు. ఒకేసారి 62వేల కోట్లకు పైగా కేంద్ర నిధులతో పనులు చేపట్టడం ద్వారా తెలంగాణలో బీజేపీ ఓటర్లను అభివృద్ధి పేరుతో ఆకర్షించాలని నిర్ణయించింది.
బీజేపీ మూడు ప్రధాన ప్రచారాస్త్రాలు
అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలనే దశాబ్దాలుగా ఉన్న హిందువుల కలను మోదీ నిజం చేసి, ఆలయాన్ని ప్రారంభించారని బీజేపీ నేతలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. దీంతో పాటు వేలకోట్లరూపాయలను తెలంగాణకు కేటాయించడం ద్వారా తాము అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని మోదీ తన అభివృద్ధి మంత్రాన్ని ఓటర్లకు వివరించి చెప్పనున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠను మోదీ ఎలా పెంచారో ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేయనుంది. ఈ మూడు అంశాలే ప్రధాన ప్రచారాస్త్రారాలని బీజేపీ జాతీయకార్యవర్గసభ్యుడు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మోదీ చేసిన అభివృద్ధి పనులే తమను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని రమేష్ రాథోడ్ వివరించారు.
తెలంగాణాలో రూ.9లక్షల కోట్లతో అభివృద్ధి పనులు
తెలంగాణలో గత పదేళ్లలో మోదీ సర్కారు రూ.9లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేసిందని, తాము చేసిన అభివృద్ధే తమను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి పెడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తే నాలుగు గ్యారంటీలను అమలు చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. రైతులను ఆదుకోవడం, మహిళల సంక్షేమం, సాధికారత, యువతను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయడం, పేదలను ఆదుకునే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మోదీ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా విజయ సంకల్ప యాత్రలు పూర్తి చేశామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
డబుల్ డిజిట్ టార్గెట్
తెలంగాణలో గతంలో నాలుగు ఎంపీ స్థానాలు ఉండగా, ఈ సారి ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధి బాధ్యతను తాము తీసుకుంటామని కిషన్ రెడ్డి ప్రకటించారు. దేశ భవిష్యత్, తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో నాలుగు స్థానాలుండగా, ఈ సారి డబుల్ డిజిట్ కు తగ్గేది ఉండదని తెలంగాణ కమలనాథులు వ్యూహాలు పన్నుతున్నారు. గతంలో తమపార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, ఈ సారి 8కి పెరిగిందని, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలను గెల్చుకుంటామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాము కనీసం 12 స్థానాల్లో విజయం సాధిస్తామని పాయల శంకర్ ధీమాగా చెప్పారు.
బీజేపీకి ఓటర్లలో పెరుగుతున్న ఆదరణ?
గత అసెంబ్లీ ఎన్నికలనాటి కంటే పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ ఎన్నికల్లో మోదీకి మూడవ సారి ప్రధానిగా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి గోనే రాజేంద్రప్రసాద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
"ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింమైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ బీజేపీకి 30 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ట్రిపుల్ తలాఖ్ వల్ల ముస్లిం మహిళా ఓట్లు బీజేపీ ఖాతాలో పడుతున్నాయి. ఈ కారణాలతోనే ఈ సారి తెలంగాణలోనూ బీజేపీకి మెరుగైన ఫలితాలు రావచ్చు," అని రాజేంద్రప్రసాద్ చెప్పారు.
యువతరం నేడు మోదీ వైపు చూస్తున్నారని అంటూ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అంతగా ప్రభావం చూపించదని, మూడోస్థానానికే పరిమితమవుతుందని ఆయన అంచనా వేశారు.
ఈ ఎన్నికలు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పోటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.