వైఎస్ఆర్ బ్రాండ్‌పై పేటెంట్ హక్కులు తనవే అంటున్న షర్మిల
మంగళగిరిలో తన తండ్రి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించటంద్వారా ఏపీ రాజకీయాలలో నాలుగో శక్తిగా, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ రాష్ట్రశాఖకు అధ్యక్షురాలుగా షర్మిల తన ఉనికిని చాటుకున్నారు.
వైఎస్ ఆస్తులపై పోటీకి దిగకపోయినా, ఆయన రాజకీయ వారసత్వంలో వాటాపై మాత్రం షర్మిల అన్న జగన్‌తో పోటీకి దిగారు, ఢీ అంటే ఢీ అంటూ సవాల్ విసురుతున్నారు. వైఎస్ బ్రాండ్‌పై సర్వహక్కులూ తనవేనంటున్నారు. నిన్న మంగళగిరిలో తన తండ్రి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించటంద్వారా ఏపీ రాజకీయాలలో నాలుగో శక్తిగా, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ రాష్ట్రశాఖకు అధ్యక్షురాలుగా షర్మిల తన ఉనికిని చాటుకున్నారు. వైఎస్ నిజమైన వారసురాలినని తాను చెప్పుకోవటమే కాకుండా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ దగ్గరనుంచి ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలతో చెప్పించారు.
షర్మిల రాజకీయంగా ఎంతవరకు విజయవంతం అవుతారో చెప్పలేముగానీ, రెండు విషయాలలో మాత్రం కొంతమేరకు విజయం సాధించారు. అది కూడా ఒకే దెబ్బకు రెండు పిట్టలు తరహాలో. ఒకటి, ఏపీలో నిర్జీవంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చిగురు తొడిగేటట్లు చేస్తున్నారు. తద్వారా ఆ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా తనకంటూ ఒక గుర్తింపు, హోదా తెచ్చుకున్నారు. రెండు, తనకు రాజకీయపరంగా, ఆర్థికపరంగా తనకు దక్కవలసిన స్థానాన్ని దక్కకుండా చేసిన అన్నను దెబ్బతీయబోతున్నారు. ఇప్పటికే ఏపీ ఎన్నికలలో వైసీపీకి కాంగ్రెస్ పార్టీవలన ఎంతో కొంత డేమేజ్ జరిగినట్లు స్పష్టమయింది. ఈ డేమేజ్ ముందు ముందు జరిగే ఎన్నికలలో మరింతగా పెరగటం ఖాయం. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లన్నీ వైసీపీనుంచి చీలటంవలన వచ్చేవే. మొత్తంమీద షర్మిల ఆ విధంగా స్వామి కార్యం, స్వకార్యం రెండూ సాధించారు.
మరోవైపు జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి, కడప పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కనుక జరిగితే, కడప పార్లమెంట్ స్థానానికి మళ్ళీ షర్మిల పోటీ పడటం ఖాయం. దానికితోడు, కడప ఉపఎన్నిక జరిగితే షర్మిల ప్రచార బాధ్యతను స్వయంగా తానే తీసుకుంటానని రేవంత్ నిన్న చెప్పారు. అది జరిగితే మాత్రం ఏపీ రాజకీయం రసకందాయంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహంలేదు.