మీరు కాఫీ ప్రియులా? అపార అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి!

పెరుగుతున్న జనాభా, ఆదాయాలతోబాటు కాఫీ సంస్కృతి కూడా పెరుగుతోంది. అయితే అంతర్జాతీయంగా చూస్తే ఏడాదికి మనిషి తాగే కాఫీ కప్పుల సంఖ్య భారత్‌లో చాలా తక్కువ ఉంది.

Update: 2024-08-29 13:04 GMT

ఈ ప్రపంచంలో ఎప్పటికీ, ఏ కాలంలోనైనా ఆదరణ తగ్గని వ్యాపారాలు రెండే రెండు - ఒకటి ఆహారం, రెండు దుస్తులు. ఈ రెండింటికి సంబంధించిన ఏ వ్యాపారమయినా, చక్కగా నిర్వహించితే తప్పకుండా సక్సెస్ అయితీరుతుంది, వీటికి అన్ సీజన్ అంటూ ఉండదు.

కాఫీ ప్రియుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో ఉదయం లేవగానే తాగే ఒక్క కాఫీతో సరిపుచ్చుకునేవారు. ఇప్పుడు అలా కాదు. కాఫీ కూడా ఒక వ్యసనంలాగా అయింది. రోజులో అనేకసార్లు సేవిస్తున్నారు. అందులోనూ యువతలో కాఫీ తాగేవారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. పెరుగుతున్న జనాభా, ఆదాయాలతోబాటు కాఫీ సంస్కృతి కూడా పెరుగుతోంది. అయితే అంతర్జాతీయంగా చూస్తే ఏడాదికి మనిషి తాగే కాఫీ కప్పుల సంఖ్య భారత్‌లో చాలా తక్కువ ఉంది. అంతర్జాతీయంగా సగటున ఏడాదికి 200 కప్పులు తాగుతుంటే, మన దేశంలో సగటున ఏడాదికి 30 కప్పులు మాత్రమే తాగుతున్నారు. అయితే ముందుముందు ఈ సంఖ్య పెరగబోతోంది. కాబట్టి కాఫీ షాప్ వ్యాపారానికి తప్పకుండా మంచి ఆదరణ ఉంటుంది. కాఫీ కెఫే ఫ్రాంచైజ్ మార్కెట్ 550 మిలియన్ డాలర్లు అవుతుందని ఒక అంచనా. భారతీయ కాఫీ మార్కెట్ ఏడాదికి 10.5% చొప్పున పెరుగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

కాఫీ షాప్ వ్యాపారంలో అనేక అవకాశాలు ఉంటున్నాయి. అందుకే ఈ విభాగంలో చాలా కోర్సులు కూడా వస్తున్నాయి. కాఫీ తయారు చేయటంపై అనేక సర్టిఫికేషన్ కోర్సులు ఉన్నాయి. బరిస్టా సర్టిఫికేషన్ పేరుతో నిర్వహించబడే ఈ కోర్సులు స్వల్ప వ్యవధివి అయిఉంటాయి. హైదరాబాద్‌లో కూడా బరిస్టా సర్టిఫికేషన్ కోర్స్ ఒకటి నిర్వహించబడుతోంది. మరోవైపు కాఫీ టేస్టర్ అనే ఉద్యోగం కూడా ఉంటుంది. అంతర్జాతీయ కాఫీ పరిశ్రమలో ఈ ఉద్యోగానికి కీలక పాత్ర ఉంటుంది. ఈ విభాగంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. దీనిపై చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరులోని కాఫీ బోర్డ్ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖతో కలిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఒకటి నిర్వహిస్తోంది. ఈ కోర్స్ వ్యవధి 12 నెలలు. కాఫీ టేస్టర్‌, క్వాలిటీ మేనేజర్ ఉద్యోగాలకోసం ఈ కోర్స్‌ను డిజైన్ చేశారు. కోర్స్‌లో కాఫీ గింజల సాగు, ప్రాసెసింగ్, క్వాలిటీ కంట్రోల్, మార్కెటింగ్ అంశాలపై థియరీ, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది.

ఈ కోర్స్‌లో చేరటానికి అభ్యర్థులు ఏదైనా సైన్స్ సబ్జెక్టులో డిగ్రీ చదివి ఉండాలి. కాఫీ వ్యాపారంలో ఉన్నవారు, కాఫీ ప్లాంటేషన్, ఎగుమతుల వ్యాపారం చేసేవారు, స్పాన్సర్ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఒక ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది, తర్వాత ఇంటర్వ్యూ, జ్ఞానేంద్రియాల మూల్యాంకనం ఉంటాయి. దరఖాస్తు చేయాలనుకునేవారు కాఫీబోర్డ్ వారి www.coffeeboard.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేయటానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 16. కోర్స్ ఫీజు రు.2.5 లక్షలు. షెడ్యూల్డ్ తరగతులవారికి 50 శాతం రాయితీ ఉంటుంది.

Tags:    

Similar News