తెలంగాణ గల్ఫ్ రిటర్నీల విజయ ప్రస్థానం
గల్ఫ్ దేశాలు తెలంగాణలోని వేలాది కార్మికులకు ఉపాధిబాట చూపించడమే కాకుండా, వారి కుటుంబాలు ఎదిగేందుకు కూడా తోడ్పడ్డాయి. గల్ఫ్ కార్మికుల విజయాలపై ప్రత్యేక కథనం...
By : Saleem Shaik
Update: 2024-08-15 13:15 GMT
తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల కష్టాలు...కన్నీళ్లపై వార్తలు, కథనాలను నిత్యం మనం పత్రికల్లో చూస్తుంటాం. కానీ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడ వివిధ పనులు చేసి పిల్లల్ని చదివించడమే కాకుండా,వారు ఉన్నత స్థాయికి ఎదిగిన గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాల గురించి తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస కార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన 15 లక్షల మందికి పైగా కార్మికులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. పలువురు గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా కస్టపడి పనిచేసి వారి పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు.
ప్రజాప్రతినిధులైన గల్ఫ్ రిటర్నీలు
గల్ఫ్ వెళ్లిన కార్మికుల్లో పలువురు డబ్బు సంపాదించి, వారి స్వగ్రామాల్లో పొలాలు కొని ఆర్థికంగా స్థిరపడ్డారని ప్రవాసీ వ్యవహారాల నిపుణులు మంద భీంరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణలోని పలు గ్రామాల్లో గల్ఫ్ రిటర్నీలు 100 మంది దాకా డబ్బులు సంపాదించడంతోపాటు సర్పంచులుగా, 1000 మంది గ్రామ వార్డు సభ్యులుగా, జడ్పీటీసీలుగా రాజ్యాధికారం సాధించారని ఆయన పేర్కొన్నారు.
నాటి గల్ఫ్ కార్మికుడు...నేడు ఎమ్మెల్యే
బాల్య దశలోనే తల్లిని కోల్పోయిన పైడి రాకేష్ రెడ్డి నాడు ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి అక్కడ అరబ్బు వద్ద డ్రైవరుగా పనిచేశారు. అనంతరం స్వశక్తితో ఉన్నత స్థానానికి ఎదిగిన రాకేష్ రెడ్డి సామాజిక సేవలు చేస్తూ ఇటీవల ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్మూరులో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవరుగా గల్ఫ్ కు వెళ్లారు. 20 గంటల పాటు డ్రైవరుగా పనిచేసి డబ్బు సంపాదించి, ఆర్మూరుకు తిరిగివచ్చి లాజిస్టిక్, ఎర్రచందనం వ్యాపారం చేశారు. కోల్డ్ స్టోరేజీ, హెల్త్ కేర్, హోటల్ వ్యాపార రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించారు.
సేవా కార్యక్రమాలతో ఎమ్మెల్యేనయ్యా...
తాను గల్ఫ్ దేశంలో కష్టపడి పనిచేసి, ఆ స్ఫూర్తితోనే తాను వ్యాపారం చేసి డబ్బు సంపాదించి సేవాకార్యక్రమాలు చేస్తున్నానని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తాను చేస్తున్న సేవలతో ప్రజలు ఆదరించి తనను ఆర్మూరు అసెంబ్లీ ఎన్నికల్లో 29వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారని ఆయన చెప్పారు. తాను ఆర్మూరును అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని రాకేష్ రెడ్డి వివరించారు.
నేను కూడా గల్ఫ్ కార్మికుడి కుమారుడినే...
‘‘నేను కూడా గల్ఫ్ కార్మికుడి కుమారుడిని, మా నాన్న ఈరపత్రి నారాయణ ఉపాధి కోసం దుబాయికు పోయిండు, గల్ఫ్ రిటర్నీ అయిన మా నాన్న ఆ తర్వాత గ్రామ సర్పంచిగా ఎన్నికై రాజకీయాల్లోకి వచ్చారు. తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని వదిలేసి ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టి పిల్లల్ని బాగా చదివించి, వారి భవిష్యత్ భద్రంగా ఉంచడానికి శ్రమిస్తున్నారు’’ అని గురువారం నిజామాబాద్ పోలీసు మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మల్యే ఈరవత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.
గల్ఫ్ కార్మికుల కష్టాలు తెలిసిన వాడిని...
‘‘మా నాన్న దుబాయిలో పనిచేసి నన్ను సీబీఐటీలో బీటెక్ చదివించారు, నేను రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వచ్చానంటే మా నాన్న దుబాయిలో పడిన కష్టం వల్లనే’’అని తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మల్యే ఈరవత్రి అనిల్ కుమార్ చెప్పారు. గల్ఫ్ కార్మికుల కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి తాను వారి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. త్వరలో తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈరపత్రి అనిల్ ప్రకటించారు.
మూడు తరాలు వలస బాటలోనే...
తాత, తండ్రి, కుమారుడు...గల్ఫ్ కార్మిక కుటుంబాలకు చెందిన మూడు తరాల వారు ఉపాధి కోసం వలసబాట పట్టారని, ఇలాంటి ఘటనలు తెలంగాణ పల్లెల్లో పలు ఉన్నాయని ప్రవాసీ వ్యవహారాల నిపుణులు మంద భీంరెడ్డి చెప్పారు. గల్ఫ్ దీనార్ లు, రియాల్స్ కు 20 రెట్లు మన రూపాయలు వస్తుండటంతో పలు గల్ఫ్ కార్మికుల కుటుంబాలు వలసలపై ఆసక్తి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 1970వ సంవత్సరంలో మొదటి తరం గల్ఫ్ వెళ్లి, అక్కడి డబ్బుతో పిల్లల్ని చదివించారని ఆయన తెలిపారు. అలా రెండో తరం చదువుకొని తండ్రి బాటలోనే రెండో తరం యువకులు గల్ఫ్ కు వెళ్లారని ఆయన చెప్పారు. ఆ తర్వాత మూడో తరం పిల్లలు ఇంజినీరింగ్ చదివి తాతయ్య,తండ్రి బాటలో గల్ఫ్ కు కాకుండా యూరప్ దేశాలకు వెళ్లి పనిచేస్తున్నారని మంద భీంరెడ్డి వివరించారు.
గల్ఫ్ వలసలతో తెలంగాణలో ఆర్థికాభివృద్ధి
గల్ఫ్ దేశాలకు తెలంగాణ కార్మికుల వలసలతో ఆర్థికాభివృద్ధి సాధించిందని గల్ఫ్ వలస కార్మికులపై పరిశోధన చేసి పీహెచ్ డీ పొందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ పుల్లూరు సంపత్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘గతంలో పాలేరుగా పనిచేసిన వారు గల్ఫ్ వెళ్లి వచ్చాక పటేళ్ల వద్ద భూమిని కొనుగోలు చేసి వారే పటేళ్లుగా మారారు, మరికొందరు పిల్లల్ని చదివించుకున్నారు, అలా ఆర్థికంగా అభివృద్ధి సాధించారు ’’అని సంపత్ రావు వివరించారు.