ఈ తెలంగాణ టీచర్ ప్రధాని మోదీ కంట ఎలా పడ్డాడు?

విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు వారిని సత్ పౌరులుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొడిపాక రమేష్..

Update: 2024-06-11 08:35 GMT
నర్సింహుల గూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ఉత్తమ ఉపాధ్యాయడు కొడిపాక రమేష్

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరం బుధవారం నుంచి ఆరంభం కానుంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు సమాయత్తం అయ్యారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నర్సింహుల గూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన కోడిపాక రమేష్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికవడంతో పాటు సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.

మూడవసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్రమోదీ ఢిల్లీలో జరిగిన తన ప్రమాణ స్వీకారోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయుడు రమేష్ ప్రత్యేక అతిధిగా పాల్గొని తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా కోడిపాక రమేష్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా విజయయాత్ర, మోదీ ప్రశంసల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి.

గిరిజన విద్యార్థులకు విద్యాగంథం
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింహుల గూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పేరు తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. వందశాతం కోయ, లంబాడ గిరిజనులున్న ఈ గ్రామంలోని పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాను .గిరిజన విద్యార్థులకు విద్యాగంధాన్ని అందిస్తున్న ఈ పాఠశాలలో తాను ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నానని కోడిపాక రమేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

బడిబాటకు సిద్ధం
జూన్ 12వతేదీన నర్సింహుల గూడెం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 26 మంది విద్యార్థులు బడిబాట కార్యక్రమంలో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయుడు రమేష్ చెప్పారు.పాఠశాల ప్రారంభిస్తున్న మొదటి రోజు విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసి వారికి చదవుపట్ల ఆసక్తి కలిగేలా ప్రారంభ పాఠం చెబుతామని ఆయన పేర్కొన్నారు. ఈ పాఠశాల విద్యార్థుల కోసం తాను వినూత్న కార్యక్రమాలు చేపట్టానంటారు రమేష్.

విద్యార్థులకు పొదుపు మంత్రం
నర్సింహులగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ పొదుపు దినోత్సవం సందర్భంగా ప్రతీ విద్యార్థికి ఒక బాక్సు ఇచ్చి, ఎంతో కొంత డబ్బును ఏడాది పొడవునా పొదుపు చేయాలని సూచించారు. ఇలా పొదుపు చేసిన డబ్బును వారి చదవులకు ఉపయోగించుకుంటున్నారు. విద్యార్థులకు పొదుపు మంత్రాన్ని అలవాటు చేయడంతో పాటు చదువుకునేందుకు ఈ డబ్బు ఉపయోగపడుతోంది.

పోషకాహార మాసోత్సవం
ప్రతీ సంవత్సరం సెప్టెంబరు నెలను పోషకాహార మాసోత్సవంగా ప్రకటించి, ఈ పాఠశాలలో విద్యార్థులకు దాతల సహాయంతో పండ్లు, డ్రై ఫ్రూట్స్ అందిస్తున్నారు. న్యూట్రిషన్ నెలను ప్రతి ఏటా అమలు చేసి పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపం లేకుండా చూస్తున్నారు.

పోస్టుకార్డు రాద్దాం రండి
పాఠశాల విద్యార్థులతో ప్రతి ఏటా పోస్టు కార్డులు రాయిస్తున్నారు. ప్రధానమంత్రి, గవర్నర్, రాష్ట్రపతికి విద్యార్థులతో ప్రతి ఏటా పోస్టు కార్డులు రాయించడం ద్వారా వారికి లేఖ ఎలా రాయాలనేది నేర్పిస్తున్నారు.

విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్
పాఠశాల విద్యార్థులను దీపావళి, సంక్రాంతి, దసరా ఇలా పండుగల సందర్భంగా పాఠశాలలో వేడుకలు నిర్వహిస్తూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల గురించి విద్యార్థులకు వివరించి చెబుతున్నారు. దీంతో పాటు మండల రెవెన్యూ కార్యాలయం, ఎంపీడీఓ, పోలీసుస్టేషన్, పోస్టు ఆఫీస్, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్, ఆసుపత్రి ఇలా అన్నీ కార్యాలయాలకు విద్యార్థులను తీసుకువెళ్లి వాటి పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు
దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేర విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం గురించి పిల్లలకు హెడ్మాసర్ రమేష్ వివరించి చెప్పారు.

పాఠశాల విద్యార్థులతో చేయూత బుక్ స్టాల్
నర్సింహుల గూడెం కుగ్రామం కావడంతో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఇతర విద్యా సామాగ్రి అందుబాటులో ఉండదు. దీంతో విద్యార్థులు కలిసి కొంత డబ్బు వేసుకొని దాంతో హోల్ సేల్ గా పెన్నులు, పుస్తకాలను కొని వాటిని పాఠశాలలో ఏర్పాటు చేసిన చేయూత బుక్ స్టాల్ ద్వారా విక్రయిస్తుంటారు.లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు స్టేషనరీని తక్కువ ధరలకు విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న బుక్ స్టాల్ లో విక్రయిస్తూ ఆదర్శంగా నిలిచారు.

అవార్డులెన్నో...
నర్సింహులగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కొడిపాక రమేష్ కు తెలంగాణలో 2023వసంవత్సరంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరు నుంచి ప్రత్యేక అవార్డు రమేష్ కు అందించారు. దీంతో పాటు గిరిజన విద్యార్థులకు టీచర్ రమేష్ చేస్తున్న సేవలకు గుర్తింపు 50కి పైగా స్వచ్ఛంద సంస్థలు ఆయన్ను సన్మానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మీ లక్ష్మీ ఎవరు అని ప్రశ్నించారు. అయితే నా తండ్రి మరణిస్తే కూలీ పనిచేసి, మా అయిదురు అన్నదమ్ములను చదివించి అందరినీ ప్రయోజకులను చేసిన మా అమ్మ అరుణే మా ఇంటి లక్ష్మీ అని రమేష్ ప్రధానికి చెప్పారు. దీన్ని మోదీ 2019 57వ మన్ కీబాత్ కార్యక్రమంలో ప్రస్థావించి అభినందించారు.

ఉత్తమ ఉపాధ్యాయుడిగా రమేష్ కు సత్కారం

అమ్మే మా ఇంటి లక్ష్మీ
మేం అయిదుగురు అన్నాదమ్ములం...మా నాన్న సామ్రాజ్యం కండక్టరుగా పనిచేస్తూ మరణించడంతో మా అమ్మ అరుణ కూలీ పనిచేస్తూ మా అయిదుగురు అన్నదమ్ములను చదివించి ప్రయోజకులకు చేసిందని టీచర్ రమేష్ చెప్పారు.తాను టీచరు కాగా పెద్దన్నయ్య ఆర్టీసీలో గ్రేడ్ వన్ మెకానిక్ గా, మూడో తమ్ముడు సీఐఎస్ఎఫ్ ఎస్ఐగా, సీఏ ఆడిటరుగా, సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా స్థిరపడ్డారు.
కలిసి కదిలాం...విజయాలు సాధించాం

తండ్రి మరణం తర్వాత తల్లి అరుణ కూలీ పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలిచారు. తాము అయిదుగురు సోదరులు సెలవు రోజుల్లో చాక్లెట్లు తయారు చేసి విక్రయిస్తూ చదవుకున్నామని రమేష్ చెప్పారు. ఒకరికి మరొకరం తోడై పనిచేస్తూనే చదువుకొని ప్రయోజకులుగా మారామని చెబుతారు రమేష్.

నర్సింహులగూడెం ప్రాథమిక పాఠశాల : ఆదర్శంనర్సింహులగూడెం ప్రాథమిక పాఠశాల : ఆదర్శం

మర్చిపోలేని మధుర స్మృతులు
సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019 వ సంవత్సరంలో జరిగిన 57 వ మన్ కీ బాత్ కార్యక్రమంలో తన గురించి చెప్పడం మర్చిపోలేని మధుర స్మృతిగా నిలిచిందంటారు టీచర్ రమేష్. 2007వ సంవత్సరంలో 108 విభాగంలో పనిచేస్తున్నపుడు తాను అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంను కలిసి మాట్లాడటం మర్చిపోలేనంటారు. ఈ ఏడాది జనవరి 26వతేదీన ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధానమంత్రి ఆహ్వానం మేర పాల్గొన్నానని, మళ్లీ తాజాగా మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో పాలుపంచుకున్నానని ఉత్తమ ఉపాధ్యాయుడు రమేష్ చెప్పారు.
అందరికీ మంచి చేస్తే అదే మాకు రిటన్ వస్తోంది...
అందరికీ మంచి చేస్తే అదే మనకు రిటన్ వస్తుందని నమ్మే రమేష్ గిరిజన విద్యార్థులకు విద్యాబుద్దులు చెబుతూ వారిని సత్ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.భవిష్యత్ లో విద్యార్థులకు వినూత్నంగా సేవలందిస్తూ  జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నానంటారు రమేష్. 


Tags:    

Similar News