తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండులో ఘనంగా కార్యక్రమం చేపడుతుండగా, మరో వైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ భవన్‌లో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నాయి. దశాబ్ది ఉత్సవాల శోభతో తెలంగాణ రాష్ట్రం కళకళలాడనుంది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్సులో...
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్సులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ఉద్యమకారులను సైతం సన్మానించాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పరేడ్ మైదానంలో సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమం నిర్వహించనున్న పరేడ్ గ్రౌడ్స్‌ను సందర్శించిన శాంతికుమారి అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ చిహ్నంలో చార్మినార్
తెలంగాణ రాష్ట్ర నూతన అధికార చిహ్నంలో పురాతన చార్మినార్, కాకతీయ కళా తోరణం హైలైట్ చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చిహ్నం రూపకర్తలకు సూచించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో చిహ్న రూపకర్త రుద్రం రాజేశంతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజేశం బృందం 12 ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అందించింది. రేవంత్ రెడ్డి ఒక చిహ్నాన్ని ఖరారు చేసి సవరణలు చేయాలని కోరారు. జూన్ 2వతేదీన పరేడ్ గ్రౌండ్‌లో జరిగే అధికారిక రాష్ట్రావతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి అధికారిక చిహ్నాన్ని, గీతాన్ని విడుదల చేయనున్నారు.
జయజయహే తెలంగాణ గీతం ఖరారు
రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ నిడివి దాదాపు ఖరారైంది. ప్రభుత్వం సూత్రప్రాయంగా 2 నిమిషాల 30 సెకన్ల నిడివికి ఓకే చేసింది. ఇందులో నాలుగు చరణాలు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర గీతంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగీత దర్శకుడు కీరవాణితో ఆయన స్టూడియోలో భేటి అయ్యారు.ఈ గేయానికి సంబంధించి మూడు వెర్షన్లను కీరవాణి సిద్ధం చేసి సీఎంకు వినిపించారు. వాటిలో 2.30 నిమిషాల నిడివి ఉండే గీతాన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో పాడుకోవడానికి ఖరారు చేసినట్టు సమాచారం. కవి అందెశ్రీ రాసిన మొత్తం గేయాన్ని 13 నిమిషాల నిడివితో రికార్డు చేసినట్లు సమాచారం. 3.30 నిమిషాలపాటు ఉండే మరో వెర్షన్‌ను కూడా రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తున్న చీఫ్ సెక్రటరీ శాంతికుమారి
సోనియా చేతుల మీదుగా రాష్ట్ర గీతం విడుదల
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా చేతులమీదుగా జూన్ 2వతేదీన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విడుదల చేయించాలని నిర్ణయించారు. సోనియాను రాష్ట్ర దశాబ్ది వేడుకకు ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆధ్వర్యంలో...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జూన్ 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ దశాబ్ద వేడుకలు జరుగనున్నాయి. తెలంగాణ కోసం పోరాడి, ఉద్యమాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని కేసీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న తెలంగాణభవన్‌లో నిర్వహించే ముఖ్య కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులను స్మరించుకోనున్నారు.
మూడు రోజుల పాటు ఉత్సవాలు
జూన్ 1వతేదీన గన్‌పార్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్‌పై ఉన్న అమరజ్యోతి వరకు రాత్రి 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.జూన్ 2వతేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించి దశాబ్ది కాలం గడుస్తున్న నేపథ్యంలో జూన్ 2న దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తారు. అదేరోజు హైదరాబాద్‌లో పలు దవాఖానాలు, అనాథ శరణాలయాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేయనున్నారు. జూన్ 3 రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.
మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్
మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ.. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం అని మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం ఎక్స్ లో పోస్టు పెట్టారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటన జరిగి నేటికి 14ఏళ్లు అని ఆయన గుర్తు చేశారు.