రేవంత్ హైడ్రాకి, యోగి బుల్‌డోజర్‌కు మధ్య తేడా ఏమిటి?

కొద్ది సంవత్సరాలుగా ఉత్తరాదిన బుల్‌డోజర్ పాలిటిక్స్ హల్‌చల్ చేస్తున్నాయి. యూపీలో మొదలైన ఈ పాలిటిక్స్ మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, రాష్ట్రాలలో కూడా నడిచాయి.

Update: 2024-08-28 13:17 GMT

తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతల పర్వం చూస్తుంటే, జాతీయ రాజకీయాలు గమనిస్తున్నవారికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనుసరించే బుల్‌డోజర్ పాలిటిక్స్ గుర్తురాకుండా ఉండదు. బుల్‌డోజర్ పాలిటిక్స్ అంటే మరేమీకాదు… తక్షణ న్యాయం. యోగి ముఖ్యమంత్రి అవగానే యూపీలో నేరస్థుల ఎన్‌కౌంటర్‌లు, కూల్చివేతలు జోరుగా సాగాయి. ఆ తర్వాత 2022లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయనకే జనం మద్దతు ఇవ్వటంతో రెండో విడతలో కూడా యోగి ఆ బుల్‌డోజర్ పాలిటిక్స్ కొనసాగిస్తున్నారు. అయితే అక్కడ కూల్చివేతలకు, ఇక్కడ కూల్చివేతలకు వెనక నేపథ్యంలో ఏ మాత్రం పోలిక లేదన్నది గుర్తుంచుకోవాలి.

గత కొద్ది సంవత్సరాలుగా ఉత్తరాదిన బుల్‌డోజర్ పాలిటిక్స్ హల్‌చల్ చేస్తున్నాయి. యూపీలో మొదలైన ఈ పాలిటిక్స్ మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాలలో కూడా జోరుగా నడిచాయి. ఎంతగా నడిచాయి అంటే, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బుల్‌డోజర్ బాబాగానూ, నాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ను బుల్‌డోజర్ మామగానీ పిలిచేటంతగా.

యోగి ఆదిత్యనాథ్ 2017లో యూపీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టగానే రాష్ట్రంలో శాంతిభద్రతల నియంత్రణకు ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చారు. ఆ క్రమంలో మాఫియా అధీనంలోని ప్రభుత్వ భూమిలో ఉన్న పలు నిర్మాణాలను బుల్‌డోజర్‌తో కూలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 వేల ఎకరాల ప్రభుత్వభూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఆదిత్యనాథ్ 2021 ఫిబ్రవరిలో ప్రకటించారు. తర్వాత 2022లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షనాయకుడు అఖిలేష్ యాదవ్ ఆదిత్యనాథ్‌ను విమర్శిస్తూ, వ్యంగ్యంగా బుల్‌డోజర్ బాబా అంటూ ఎగతాళి చేయబోయారు. కానీ ఆదిత్యనాథ్ అదే బుల్‌డోజర్‌ను తన విజయాలలో ఒకటిగా ప్రచారం చేసుకుని ఆ ఎన్నికల్లో గెలిచి ప్రత్యర్థులు అవాక్కయ్యేలా చేశారు. ఫలితాల సందర్భంగా జరిగిన ఊరేగింపులో యూపీ బీజేపీ కార్యకర్తలు బుల్‌డోజర్లతో ఊరేగింపులు నిర్వహించారు. మొత్తంమీద నాటి ఫలితాలు చూస్తే, పేరుమోసిన నేరస్థులను ఎన్‌కౌంటర్‌లలో హతమార్చటం, మాఫియా చేతుల్లోని ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవటం వంటి తక్షణ న్యాయం సూత్రాన్ని యోగి ఆదిత్యనాథ్ అమలుచేయటాన్ని ప్రజలు హర్షించినట్లే ఉంది. ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బుల్‌డోజర్ పాలిటిక్స్ కొనసాగించారు.

యోగి ఆదిత్యనాథ్ స్ఫూర్తితో బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో నాటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా బుల్‌‌డోజర్‌తో తక్షణ న్యాయం ఫార్ములాను అనుసరించారు. నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన మాఫియా నేతలు, నేరస్థుల భవనాలను కూలగొట్టమని ఆదేశాలు జారీ చేశారు. దీనితో చౌహాన్‌కు బుల్‌డోజర్ మామ అనే పేరు వచ్చింది. యూపీ, ఎంపీలతో పాటు బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా బుల్‌డోజర్ పాలిటిక్స్ సాగాయి.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, బీజేపీ పాలిత రాష్ట్రాలలో బుల్‌డోజర్ కూల్చివేతలు ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని సాగాయి అనే ఆరోపణ బలంగా వినబడటం. మానవహక్కులపై పోరాడే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలచేసిన నివేదికలో - భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలో 2022 ఏప్రిల్ నుంచి జూన్ దాకా కూల్చివేసిన 128 అక్రమ నిర్మాణాలలో ఎక్కువగా ముస్లిమ్‌లవే ఉన్నాయి అని పేర్కొంది.

అయితే తెలంగాణలో కూల్చివేతలకు, బీజేపీ పాలిత రాష్ట్రాలలో బుల్‌డోజర్ పాలిటిక్స్‌కూ మధ్య నక్కకూ, నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. రేవంత్ అక్రమార్కులే లక్ష్యంగా దాడులు చేయిస్తున్నారు. తన-మన అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేయిస్తున్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో తన కుటుంబ సభ్యులు, బంధువుల నిర్మాణాలు ఉన్నా కూల్చివేయిస్తానని రేవంత్ స్వయంగా చెప్పారు. మరోవైపు, సామాన్య ప్రజల నిర్మాణాల జోలికి వెళ్ళబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించటంతో పలు చెరువుల్లో ఇళ్ళు కట్టుకున్న జనం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంమీద కొన్ని విమర్శలు వచ్చినా, ప్రశంసలే ఎక్కువగా వస్తున్నాయి. జనం రేవంత్‌కు జేజేలు పలుకుతున్నారు. రేవంత్ ఇమేజ్ ఉన్నట్టుండి అనూహ్యంగా చుక్కల్లోకి దూసుకుపోయింది. అయితే ఇది మూన్నాళ్ళ ముచ్చటేనా, ఈ దూకుడును కొనసాగించగలుగుతారా అనేదానిని బట్టి ఆయన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అందులోనూ ఇది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. కూల్చివేతల వెనక అనేక అంశాలు ముడిపడిఉంటాయి. వీటన్నింటినీ అధిగమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సాగించగలిగితే, హైదరాబాద్ నగరానికి ఆక్రమణల నుంచి విముక్తి కలగటమే కాకుండా, భారీ వర్షాలు కురిసినా తట్టుకోగలుగుతుంది. తద్వారా నగరంలోని కోటిమంది జనాభా మెప్పును రేవంత్ పొందగలుగుతారు, వచ్చే ఏడాది జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను మెరుగుపరుచుకోగలుగుతారు.

Tags:    

Similar News