తెలంగాణలో ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించడం ఎలా?

పెన్షన్, గ్రాచ్యుటీ ఇవాల్సి వస్తుందని రిటైర్ మెంట్ వయోపరిమితిని 61 యేళ్లకు పెంచడం తప్పు. ఇది నిరుద్యోగులను నిరాశకు గురించి చేసింది. దీనిని తక్షణం సరి చేయాలి

Update: 2023-12-10 11:33 GMT
తెలంగాణ నిరుద్యోగుల ధర్నా (సోర్స్: X)

 గత ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్  మెంట్ మీద తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం చాలా అనర్థాలకు దారి తీసిందని, దానిని తక్షణం సరిచేసి ఎక్కువ మంది యువకులకు  ఉద్యోగాలు చూపి, ఉపాధి అవకాశాలు కల్పించడం ఎలాగో చెబుతున్నారు తెలంగాణ మొదటి బిసి కమిషన్ చెయిర్మన్ బిఎస్ రాములు

-బి. ఎస్. రాములు

తెలంగాణలో రెండు లక్షల చిల్లర ఖాళీలు ఉన్నాయని 2021 లో మాజీ ఐఎఎస్ అధికారి  సిఆర్ బిస్వాల్ అధ్యక్షత ఏర్పాటయిన కమిటీ ప్రకటించింది. ఈ ఉద్యోగాలను వెంటనే నియమించడం అవసరం. గ్రూప్ 1, గ్రూప్ 2 తప్ప మిగతా ఉద్యోగాలన్నిటినీ జిల్లా సెలక్షన్ కమిటీ (డిఎస్) ద్వారా నియమించడం సులభం. కాంట్రుక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి కొత్త స్కేలు రూపొందించడం అవసరం. 1996 నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, విద్యావంతులు, నిరుద్యోగులు 40 లక్షల మంది ఉన్నారు. వీరిలో కనీసం ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం సాధ్యమే. మరో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పన కోసం ఆర్థిక సాయం అందించడం అవసరం.

వయో పరిమితిని పూర్వస్థితికి తేవాలి

58 సంవత్సరాల ఉద్యోగ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచడం వల్ల ఉద్యోగులు వయోభారంతో బాధపడుతున్నారు. వారి ఆరోగ్యం దెబ్బతింటున్నది. తిరిగి వయోపరిమితిని 58 సంవత్సరాలకు మార్చడం అవసరం. తద్వారా 50 వేల ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఉద్యోగాల్లో మన యువతరం విద్యావంతులే ఎన్నికవుతారు. యువతరం విద్యావంతులకు ఉపాధి కల్పించడానికి సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు 58 యేళ్ళకు రిటైర్ కావడాన్ని సంతోషంగా అంగీకరిస్తారు. వారి పిల్లలు కూడా పోటీలో ఎదిగి కొత్త ఉద్యోగాలు సంపాదించుకుంటారు. వీరు రిటైర్ కావడం వల్ల జరిగే అనేక లాభాల్లో ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. ఒక జీతం ఖర్చులో ముగ్గురిని నియమించవచ్చు.

తొలుత కాన్సాలిడేటెడ్ జీతంతో నియామకాలు

తొలుత మూడేళ్ళు కనీస వేతనంతో నియమించి క్రమంగా పే స్కేల్స్ వర్తింపజేసే పద్దతిని పునరుద్ధరించాలి. గతంలో 1973లో తెలంగాణ ఉద్యమకారుల్లో 125 రూపాయలు, డిగ్రీ పూర్తి చేసినవారికి 150 రూపాయలు ఇచ్చి ఐదేళ్ళకు పే స్కేల్స్ ఇచ్చారు. ఆ తర్వాత 398 రూపాయలకు నియామకాలు చేశారు. తర్వాత పే స్కేల్ ఇచ్చారు. ఆ తర్వాత 1200 రూపాయలకు నియమించి మూడేళ్ళ తర్వాత పే స్కేల్స్ అమలు జరిపారు. ఇప్పుడు కూడా ఇదే విధానంలో తొలుత 15 వేల రూపాయలు ఫిక్స్డ్ పై యేటా మూడు వేలు పెంచుతూ మూడేళ్ళ తర్వాత కొత్త పే స్కేల్స్ అమలు జరిపే విధంగా నియమించడం వల్ల ప్రభుత్వం మీద పెద్దగా భారం పడదు. సీనియర్ ఉద్యోగులకు లక్ష రూపాయలు జీతం ఉంటే 50 వేలు పెన్షన్ ఉంటుంది. మిగతా 50 వేలతో ఇలా ముగ్గురి విద్యావంతులను, నిరుద్యోగులను నియామకాలు చేపట్టవచ్చు.



పెన్షనర్లకు ప్రభుత్వ బాండ్ల జారీ

ఉద్యోగులు రిటైరయితే పెన్షన్తో పాటు ఇవ్వాల్సిన గ్రాచ్యుటీ మొదలైన నగదు ఒక్కొక్క పెన్షనర్కు ముప్పై లక్షల నుండి 50 లక్షల దాకా యివ్వాల్సి వస్తుందని బడ్జెట్ చాలదని మూడేళ్ళు వయో పరిమితిని పెంచి 61 యేళ్ళు చేయడం జరిగింది. ఇది ఒక తప్పుడు నిర్ణయం. నిరుద్యోగులను నిరాశకు గురి చేసిన నిర్ణయం. ఒక ఉద్యోగి రిటైర్డ్ అయితే నలుగురికి ప్రమోషన్లు వస్తాయి.

ఒక రిటైర్మెంట్తో ఐదుగురికి ప్రమోషన్లు

ఉదాహరణకు పదివేలమంది రిటైర్డ్ అయితే 40 వేల మందికి ప్రమోషన్లు వస్తాయి. పది వేల మందికి కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. జూనియర్ అసిసెంట్ సీనియర్ అసిస్టెంట్గా, సీనియర్ అసిస్టెంట్ సూపరిండెంట్గా, సూపరిండెంట్ గెజిటెడ్ అధికారిగా, తాహసిల్దార్ ఆర్డీవోగా, ఆర్డీవో డిఆర్వోగా ఇలా నాలుగు అంచల్లో ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. రికార్డ్ అసిస్టెంట్, అటెండర్లు అర్హత సాధించిన వారు జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందుతారు. ఈ నిచ్చెన మెట్ల ప్రక్రియ ఆగిపోయింది. దాన్ని పునరుద్దరించడం అవసరం. ప్రభుత్వానికి పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక భారం ఇతర రూపాల్లో భర్తీ చేసుకోవచ్చు. ప్రభుత్వం బాండ్లు జారీ చేసి పెన్షనర్లకు ఇవ్వవచ్చు. ఆ బాండ్లను బ్యాంకుల్లో కుదువబెట్టి పెన్షనర్లు లోన్ తీసుకోవచ్చు.

పెన్షనర్లకు భద్రత, ప్రయోజనాలు

బ్యాంకులకు ఆ బాండ్లు గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం లేఖ అందించవచ్చు. ఇలా ఒకేసారి భారం పడకుండా క్రమక్రమంగా ఆ అప్పులు తీర్చవచ్చు. దీనివల్ల పెన్షనర్లకు కూడా గొప్ప సౌలభ్యం ఉ ంటుంది. పెద్ద మొత్తం నగదు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు యేవేవో చెప్పి గుంజుకోకుండా వారి డబ్బు బ్యాంకులో భద్రంగా ఉంటుంది. వెంటనే నగదుగా మార్చడానికి వీలుండదు. అవసరమైనవాళ్ళు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు ఇవ్వవచ్చు. పెళ్ళిళ్ళు చేయవచ్చు. పిల్లలను చదివించుకోవచ్చు. ఇలా రిజర్వు బ్యాంకు అనుమతితో పెన్షనర్లకు ప్రభుత్వ బాండ్లను విడుదల చేయవచ్చు.

నిరుద్యోగ యువకులకు లోన్లు

నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పన కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లకు కనీసం ఐదు వేల కోట్ల రూపాయలు చొప్పున ప్రతి శాఖకు వెంటనే బడ్జెట్లు కేటాయించడం అవసరం. తద్వారా ఐదు, పది లక్షల మంది నిరుద్యోగులకు, నిపుణులకు చేయూతనిచ్చి సంపద పెంచడంలో కృషి చేయవచ్చు.

ఉద్యమకారుల సేవలు వినియోగించుకోవాలి

తెలంగాణ ఉద్యమకారుల సేవలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ఉద్యమకారుల నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తున్నదనే ఒక గొప్ప స్ఫూర్తిని ప్రజలకు అందించాల్సి ఉంది. అందువల్ల ఉద్యమకారులను వివిధ రంగాల్లో నామినేటెడ్ పదవులలో నియమించడం అవసరం. ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలు పోటీచేసి ఎన్నిక కాలేకపోయారు. నామినేటెడ్ పదవులలో వారిని నియమించి ఆ లోటును బర్తీ చేసి, అన్ని సామాజిక వర్గాలకు తగు ప్రాధాన్యత ఇవ్వబడింది అనే విశ్వాసం ప్రజల్లో కలిగించడం అవసరం. ముఖ్యంగా ముదిరాజ్, గంగపుత్ర, రజక, నాయీబ్రాహ్మణ, పద్మశాలి, విశ్వకర్మ, యాదవ, కురుమ వంటి అధిక జనాభా గల సామాజిక వర్గాలతో పాటు ఎంబీసీ కులాల వారిని వివిధ స్థాయిల్లో నియామకాలు చేపట్టి సామాజిక న్యాయం అందించడం అవసరం. జిల్లా స్థాయి గ్రంథాలయ సంస్థలు వంటి జిల్లాస్థాయి నియామకాలు కూడా ఎన్నో రంగాలలో నియామకపు అవకాశాలు ఉన్నాయి. చాలాకాలంగా గ్రంథాలయాలు, పుస్తకాలు కొనడం లేదు. గత ఐదేళ్ళ నుండి అచ్చయిన రచయితల పుస్తకాలను ఐదు వందల కాపీలు చొప్పున ఫిబ్రవరి చివరి వారంలోగా కొని రచయితలకు ప్రోత్సాహం అందించడం అవసరం.

(తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ కల్పన తో పాటు మహిళల సాధికారీకరణ, ఉద్యమకారుల ఉపాధి వంటి అంశాల మీద ఆ అంశాల మీద పోరాటం చేస్తూ వచ్చిన ప్రొ. కోదండరామ్ ఒక నివేదిక సమర్పించినప్పటికి ఫోటో)


(బి. ఎస్. రాములు, బీసీ కమిషన్ తొలి ఛైర్మన్, సామాజిక తత్వవేత్త. తెలంగాణ)

Tags:    

Similar News