హైదరాబాద్‌లో పోలింగ్ శాతం ఈ సారైనా పెరిగేనా?

హైదరాబాద్ లో ప్రతీ ఎన్నికల్లోనూ అతి తక్కువ పోలింగ్ సాగుతోంది.పోలింగ్ శాతం 50 శాతానికి మించడం లేదు.ఈ సారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ కసరత్తు ప్రారంభించింది.

Update: 2024-05-03 00:34 GMT
VOTERS

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం 90శాతం దాకా ఉండగా నగరాల్లో 50 శాతానికి మించడం లేదు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా, ఇప్పటివరకు 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినా నగరాల ఓటర్లలో మాత్రం చైతన్యం రాలేదు. దీంతో నగర ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఉన్నత విద్యావంతులు సైతం ఓట్లు వేయడం లేదు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో పోలింగ్ శాతం ఎందుకు తక్కువగా ఉంటోంది.

- ప్రతీ ఏటా జనవరి 26వతేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పలు కార్యక్రమాలు చేపడుతున్నా, నగరాల్లో పోలింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. ఓటర్లకు సహకరించేందుకు ఎన్నికలకమిషన్ ఓటరు సహాయమిత్రను ప్రవేశపెట్టింది. కొత్త ఓటర్లకు, దివ్యాంగులకు, సర్వీస్ ఓటర్ల అనుమానాలను సహాయ మిత్ర తీర్చి, వారికి సహకరిస్తున్నా... నగరాల్లో పోలింగ్ శాతం మాత్రం పెరగడం లేదు.
- అసెంబ్లీ ఎన్నికలపై
ఆసక్తి చూపిస్తున్న నగర ఓటర్లు పార్లమెంట్ ఎన్నికలంటే నిరాసక్తత నెలకొంది. వేసవికాలంలో ఎండల తీవ్రత దృష్ట్యా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం లేదు. దీంతో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించిన నేపథ్యంలో పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల కమిషన్ అధికారులు భావిస్తున్నారు.
- ఈ సారి హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రచారోద్యమాన్ని చేపట్టాయి. ఎలాగైనా పోలింగ్ పెంచేందుకు ఈసీ అధికారులు కసరత్తు ఆరంభించారు.

5వేల పోలింగ్ కేంద్రాల్లో అతి తక్కువ ఓట్ల పోలింగ్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాల్లోని 5,000 పోలింగ్ కేంద్రాల్లో తక్కువ ఓట్ల పోలింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్ గుర్తించింది. హైదరాబాద్ లోని 2,284 పోలింగ్ కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో 1,166,మల్కాజిగిరిలో 633 పోలింగ్ కేంద్రాల్లో అతి తక్కువ ఓట్ల పోలింగ్ జరిగింది. శేరిలింగంపల్లి, ఎల్ బి నగర్, యాకుత్ పురా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో అతి తక్కువ పోలింగ్ నమోదైంది. ఐటీ జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి ప్రాంతంలోని 388 పోలింగ్ కేంద్రాల్లో అతి తక్కువ మంది ఓట్లు వేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పోలింగ్ శాతం తగ్గింది.

నగరాల్లో తగ్గుతున్న పోలింగ్ శాతం
నగరాల్లో ఎన్నికలు ఏవైనా పోలింగ్ శాతం తగ్గుతూనే ఉంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2015 ఎన్నికల్లో 53. 27 శాతం ఓట్లు పోల్ కాగా 2019 ఎన్నికల్లో 39.49 శాతానికి తగ్గింది. తెలంగాణలో పోలింగ్ శాతం 60.57 శాతం నమోదు కాగా హైదరాబాద్ నగరంలో అతి తక్కువగా ఓట్లు పోలయ్యాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనూ 2014 ఎన్నికల్లో 53.06 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటులో పోలింగ్ శాతం 44.99కి తగ్గింది.

మల్కాజిగిరిలోనూ తగ్గుముఖం
- 2014 ఎన్నికల్లో మల్కాజిగిరిలో 51.05 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం 49.11 శాతానికి తగ్గింది. చేవెళ్లలో 2014 పార్లమెంట్ ఎన్నికల్లో 60.51 శాతం ఓటింగు జరగ్గా 2019వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం 53.80 శాతానికి తగ్గింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో 2014 పార్లమెంట్ ఎన్నికల్లో సగటు పోలింగ్ శాతం 72 శాతం కాగా, 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి 60.57 శాతానికి తగ్గింది.

పోలింగుకు ముందు వరుస సెలవులు
తెలంగాణ రాష్ట్రంలో మే 13వతేదీన సోమవారం పోలింగ్ జరగనుంది. పోలింగ్ సందర్భంగా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు అధికారికంగా సెలవు ప్రకటించింది. పోలింగ్ డేకు ముందు రెండు రోజుల పాటు అంటే మే 11,12తేదీల్లో శని, ఆదివారాలు వచ్చాయి. అయితే వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో ఐటీ ఉద్యోగులు విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

పోలింగ్ శాతం పెంచేందుకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచనలు
మే 13వతేదీ పోలింగ్ డే సెలవును షరతులతో ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ ఎన్నికల కమిషన్ ముఖ్య అధికారి వికాస్ రాజ్ కు సూచించింది. ఓటు వేసేందుకు వీలుగా పెయిడ్ హాలిడే ప్రకటించగా కొందరు ఉద్యోగులు ఇంట్లో కూర్చొడానికి లేదా విహారయాత్రలకు వెళ్లడానికి వినియోగించుకుంటున్నారు. అందుకే ఓటు వేస్తేనే పెయిడ్ హాలిడే ఇవ్వాలని, ఓటు వేయని వారికి లాస్ ఆఫ్ పే కింద పరిగణించేలా చూడాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి సూచించారు. ఈ విషయాన్ని సంబంధిత యాజమాన్యాలు ఒక సర్కులర్ ద్వారా ఉద్యోగులకు తెలియజేయాలని ఆయన కోరారు. ఓటింగ్ జరిగిన మరునాడు అంటే మే 14వతేదీన ప్రతీ ఉద్యోగి తన చూపుడు వేలుపై సిరా మార్కు చూపించినప్పుడే మే 13వతేదీని సెలవు దినంగా పరిగణించాలని, ఓటు వేయని వారికి లాస్ ఆఫ్ పే కింద పరిగణించాలని ఆయన కోరారు.

ఓటు వేస్తే రిబేటు ఇవ్వండి : ఫోరం పర్ గుడ్ గవర్నెన్స్
- పోలింగ్ తర్వాత 14,15 తేదీల్లో ఓటు వేసినట్లు వేలిపై సిరా గుర్తు చూపిస్తే రెండు రోజులపాటు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు పెట్రోల్, డీజిల్ పై రిబేట్ ఇస్తే పోలింగ్ శాతం పెరుగుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈసీకి సూచించింది. అలాగే మే 14,15తేదీల్లో అన్నీ షాపింగ్ మాల్స్, హోటళ్లు, సినిమాహాళ్లు, వైన్ షాపుల్లో ఓటు వేసిన వారికి సిరా గుర్తు చూపిస్తే వారికి బిల్లుపై రాయితీ ఇస్తే బాగుంటుందని ఫోరం పేర్కొంది. తాము చేసిన సూచనలపై తెలంగాణ ఎన్నికల అధికారి సంబంధిత యాజమాన్యాలకు అప్పీలు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచించింది. ఈ మేర ఓ వినతిపత్రాన్ని ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు అందజేసింది.


Tags:    

Similar News