రియలైజేషన్: ఎట్టకేలకు ఈవీఎమ్‌లను వదిలి సరైన కారణాలు వెతుకుతున్నారు!

మొదటి పది-పదిహేను రోజులు ఈవీఎమ్‌ల పాట పాడిన వైసీపీ నాయకులు మెల్లమెల్లగా దానిని వదిలి వేరే కారణాలవైపు చూస్తున్నారు.

Update: 2024-07-16 11:25 GMT

మొత్తానికి జగన్ పార్టీ నేతలకు తత్వం బోధపడుతోంది. ఫలితాలు వచ్చిన మొదటి పది-పదిహేను రోజులు ఈవీఎమ్‌లలో ఏదో మతలబు జరిగిందంటూ పాట పాడిన వైసీపీ నాయకులు మెల్లమెల్లగా దానిని వదిలి వేరే కారణాలవైపు చూస్తున్నారు. ఒక్కొక్కరుగా తమవైన విశ్లేషణలను ఇస్తున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి జగన్‌వైపే వేలు చూపుతున్నారు.

ఫలితాలు వచ్చేదాకా జగన్ హవా మామూలుగా సాగలేదు. ఆయన అనుకున్నట్లుగానే ఆ పార్టీల నాయకులు కూడా జగనన్నకు 30 ఏళ్ళదాకా ఎదురులేదని అనుకున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో జగన్ అన్నీ తానై నడిపించారు. ఆయన మాటే శాసనం అన్నట్లుగా నడిచింది. ఫలితాలు జగన్‌ను, మిగిలిన వైసీపీ నేతలను దిమ్మ తిరిగేటట్లు చేశాయి.

అయితే అధినేత సంగతేమోగానీ పార్టీలోని పలువురు నేతలు మెల్లమెల్లగా ఫలితాలను జీర్ణించుకుంటున్నట్లున్నారు. ఒక్కొక్కరూ విశ్లేషణలను బయటపెడుతున్నారు. మొదటిగా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గొంతు విప్పారు. జగన్ చుట్టూ చేరిన కోటరీయే కొంప ముంచిందని ఆయన అన్నారు. జగన్ పక్కన ఉండే ధనుంజయరెడ్డి ఒక చెత్త అధికారి అని ఆరోపించారు.

తర్వాత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి కార్యాలయమే ప్రధాన కారణమని ఆరోపించారు. దానివలనే ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఏర్పడిందని అన్నారు. వైఎస్ విజయమ్మ చివరి నిమిషంలో వీడియో విడుదల చేయటంకూడా మరో ప్రధాన కారణమని చెప్పారు.

గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఓటమిపై మాట్లాడుతూ, నాసిరకం మద్యం, నోటికొచ్చినట్లు తిట్టటమే కారణాలని అన్నారు. రాష్ట్రంలో పాతికశాతం మంది మందుబాబులు ఉంటారని, వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారని చెప్పారు. టీడీపీనుంచి వైసీపీలోకి వచ్చిన కొందరు నేతలు నోటికొచ్చినట్లు బూతులు తిట్టటంకూడా మరో కారణమని అన్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగానే ఓడిపోయామని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విశ్లేషించారు. ముఖ్యంగా జగన్, అధికారులు తమ మాట వినిఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు వైసీపీ హయాంలో మరో కీలక ఎమ్మెల్యే పేర్ని నాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కార్యాలయమే కారణమని నిందించారు. సీఎమ్ఓను నడపటంలో అట్టర్ ఫ్లాప్ అని అన్నారు. పార్టీకి, ప్రజలకు మధ్య గ్యాప్ బాగా పెరిగిందని వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యకర్తలకు తీవ్ర నష్టం జరిగిందని నాని చెప్పారు.

మొత్తానికి వైసీపీలో ఆత్మ పరిశీలన మొదలవటం మంచి పరిణామం. ఇకనుంచయినా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తారేమో చూడాలి.

Tags:    

Similar News