భారమంతా చేవెళ్ళ చెల్లెమ్మదేనా ?

చేవెళ్ళ చెల్లమ్మగా బాగా పాపులరైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరపతి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధికి వర్కవుటవుతుందా ?

Update: 2024-04-13 08:49 GMT
Sabhitha Indra Reddy (source Twitter)

చేవెళ్ళ చెల్లమ్మగా బాగా పాపులరైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరపతి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధికి వర్కవుటవుతుందా ? ఇపుడిదే అంశంపై విస్తృంతగా చర్చ జరుగుతోంది. కారణం ఏమిటంటే సాయంత్రం చేవెళ్ళల్లో కేసీయార్ బహిరంగసభ ఉండటమే. చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో కారుపార్టీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపుకోసం కేసీయార్ బహిరంగసభలో పాల్గొంటున్నారు. కేసీయార్ బహిరంగసభలో పాల్గొంటున్నా, ఓవరాలుగా కేటీయార్ పర్యవేక్షిస్తున్నా గెలుపుభారాన్ని మాత్రం సబితా ఇంద్రారెడ్డి మీదే అధినేత మోపారని పార్టీవర్గాల సమాచారం. దీనికి కారణం ఏమిటంటే సబిత మీద ఉన్న నమ్మకం, ఆమెకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టే. సబితా ఇంద్రారెడ్డి అంటే ఒకపుడు రంగారెడ్డి జిల్లాలో తిరుగులేని నేతనిపించుకున్న పట్టోళ్ళ ఇంద్రారెడ్డి భార్య.

ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు ఇంద్రారెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరారు. 1985లో టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచారు. అక్కడి నుండి వరుసగా 1989, 1994లో టీడీపీ అభ్యర్ధిగా గెలిచారు. తర్వాత పార్టీమారిన ఇంద్రారెడ్డి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలిచారు. అయితే గెలిచిన కొద్దిరోజుల్లోనే రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆయన భార్య సబితాఇంద్రారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఉపఎన్నికలో పోటీచేయించింది. ఆ ఉపఎన్నికలో గెలిచిన సబిత తర్వాత వెనక్కు చూసుకోవాల్సిన అవసరంలేకపోయింది. ఎందుకంటే 2000 ఉపఎన్నికలో గెలవటమే కాకుండా 2004లో కూడా గెలిచారు. తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ళ ఎస్సీ నియోజకవర్గంగా మారిపోవటంతో ఆమె 2009 ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో పోటీచేసి గెలిచారు.

తర్వాత 2014 ఎన్నికల్లో ఓడిపోయినా మళ్ళీ 2018 ఎన్నికల్లో గెలిచారు. ఆ ఎన్నికలో గెలిచిన తర్వాత సబిత బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. 2023 ఎన్నికల్లో కారుపార్టీ అభ్యర్ధి తరపున గెలిచారు. అంటే పోటీచేసిన ఆరుఎన్నికల్లో ఐదుసార్లు గెలిచారంటేనే ఆమెకు నియోజకవర్గంలో ఉన్న పట్టు అర్ధమవుతోంది. చేవెళ్ళ, మహేశ్వరమే కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా సబితకు గట్టి మద్దతుదారులున్నారు. అందుకనే సబిత మీద అధినేత కేసీయార్ కు అంతటి నమ్మకం. కాబట్టే చేవెళ్ళ పార్లమెంటులో పార్టీ గెలుపును సబిత మీద మోపినట్లు పార్టీ నేతలంటున్నారు. 2009లో ఏర్పడిన పార్లమెంటు నియోజకవర్గం మొదటి ఎన్నికలో టీఆర్ఎస్ పోటీచేయలేదు. తర్వాత రెండు ఎన్నికలు 2014, 2019లో బీఆర్ఎస్ గెలిచింది. 2014లో సబిత కొడుకు పట్టోళ్ళ కార్తీక్ రెడ్డి పోటీచేసి బీఆర్ఎస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి చేతిలో ఓడిపోయారు.

తర్వాత 2019 ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ లో ఉన్న సబిత పార్టీ అభ్యర్ధి రంజిత్ రెడ్డి గెలుపులో కీలకపాత్ర పోషించారు. రేపటి కాసాని గెలుపులో కూడా సబితే కీలకపాత్ర పోషించాల్సుంటుంది. ఇదే విషయమై సబితకు దగ్గర బంధువు, పార్టీలో యాక్టివ్ నేత పోలీసుపటేల్ శ్రీనివాసులరెడ్డి ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు చేవెళ్ళ, మహేశ్వరం నియోజకవర్గాల్లోనే కాకుండా సబితకు జిల్లా వ్యాప్తంగా మంచిపట్టుందన్నారు. కాసాని గెలుపుకు సబిత పార్లమెంటు నియోజకవర్గంలోని అన్నీఅసెంబ్లీల్లో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు చెప్పారు. పార్టీలోని సీనియర్ నేతలంతా సబితకు సహకరిస్తే కాసాని గెలుపు గ్యారెంటీ అని పోలీసుపటేల్ చెప్పారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ళ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎంఎల్ఏలున్నారు. అలాగే పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎంఎల్ఏలున్నారు.

అయితే రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ టీ ప్రకాష్ గౌడ్ ఈమధ్యనే రేవంత్ రెడ్డిని కలిశారు. వాళ్ళమధ్య ఏమి చర్చలు జరిగాయో తెలీదు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ప్రకాష్ గౌడ్ ఇంటికి వెళ్ళి చాలాసేపు భేటీ అయ్యారు. దాంతో తొందరలోనే ప్రకాష్ కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే పార్లమెంటు ఎన్నికల్లో కాసాని గెలుపుకు ప్రకాష్ ఏమాత్రం సహకారం అందిస్తారనేది ఆసక్తిగా మారింది. సాయంత్రం జరిగే బహిరంగసభలో తాము ముదిరాజ్ సామాజికవర్గానికి ఇచ్చిన ప్రాధాన్యతను కేసీయార్ వివరించబోతున్నారు. అంటే ముదిరాజ్ ఓట్లకోసం కేసీయార్ సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారని అర్ధమవుతోంది.

అయితే 26.25 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ లకు కేసీయార్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా ఇవ్వలేదు. ముదిరాజ్ సామాజికవర్గంలోని కోపాన్ని గమనించిన కేసీయార్ చేవెళ్ళ పార్లమెంటు సీటిచ్చారు. మరి ముదిరాజులు ఏమిచేస్తారో, సబిత ఏమిచేస్తారో చూడాలి.

Tags:    

Similar News