Hyderabad High Court | ‘రాత్రి 11 తర్వాత పిల్లలను సినిమాలకు పంపవద్దు’
మైనర్లు వాహనాలు నడపరాదన్న ఆదేశాలు అమలుకావడంలేదని హైకోర్టు అసంతృప్తి;
By : The Federal
Update: 2025-01-28 10:29 GMT
ఇవీ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు...
- మైనర్లు వాహనాలు నడిపి, రోడ్డు ప్రమాదాలకు పాల్పడితే వారి తల్లిదండ్రులకు, వాహనాల యజమానులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు హెచ్చరించింది.తల్లిదండ్రులుు పిల్లకు వాహనాలు ఇవ్వవద్దని కోర్టు సూచించింది.
- ఉదయం 11 గంటల లోపు, రాత్రి 11 గంటల తర్వాత పదహారేళ్ల పిల్లలను సినిమా థియేటర్లలోకి అనుమతించరాదని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల గేమ్ ఛేంజర్ సినిమా అదనపు షోలకు అనుమతించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాత్రివేళల్లో పిల్లలను సినిమాలకు అనుమతిస్తే వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కోర్టు జడ్జి జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు హైదరాబాద్ పాత నగరంలో అమలు కావడం లేదు. రాత్రివేళ మైనర్లు యదేచ్ఛగా వాహనాలు నడుపుతున్నారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన పోలీసులు, రవాణ శాఖ చోద్యం చూస్తుండగా పాత బస్తీలో మైనర్లే అత్యంత వేగంగా బైకులపై షికార్లు చేస్తుండటం నిత్యకృత్యంగా మారింది.
మైనర్ల మితిమీరిన వేగం, ట్రిపుల్ రైడింగ్
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేయడం వల్ల తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఆరాంఘడ్ ఫ్లై ఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మంగళవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్ సమీపంలోని ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదంలో ముగ్గురు మైనర్ బాలురు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు.ముగ్గురు బహదూర్‌పుర నుండి ఆరాంఘర్ వైపు వెళుతుండగా మోటార్‌సైకిల్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఫ్లైఓవర్ మీడియంను ఢీకొట్టారు.మైనర బాలురు మితిమీరిన వేగంతో ట్రిపుల్ రైడింగ్ చేయడం విషాదాన్ని నింపింది.
పిల్లల ఆరోగ్యంపై హైకోర్టు ఆందోళన
తెలంగాణ హైకోర్టు రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్లలోపు పిల్లలు సినిమా థియేటర్లలోకి ప్రవేశించకూడదని ఆదేశించినా, ఇది అమలు కావడం లేదు. రాత్రివేళ మైనర్లు సినిమాలకు వెళితే , వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చైల్డ్ సైకాలజిస్టులు చెబుతున్నారు. అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున పిల్లలను బయటకు వెళ్లి సినిమాలు చూడటానికి అనుమతించడం వారి శారీరక, మానసిక శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హైకోర్టు కూడా పేర్కొంది. పిల్లలు అర్థరాత్రి స్క్రీన్ వాడకం వల్ల కలిగే ప్రభావాల గురించి కూడా న్యాయమూర్తి ఆందోళన చెందారు.