Medchal Murder | మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది...
మేడ్చల్లో మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. కండోమ్ కొని మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి, ఆమెతో గొడవ పడి హతమార్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.;
By : The Federal
Update: 2025-01-27 12:45 GMT
మునీరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు కల్వర్టు వద్ద దిశ తరహాలో ఓ మహిళను హత్య చేసి, మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించి దహనం చేశారు. మృతదేహం ఆనవాళ్లు దొరకకుండా చేసేందుకు హంతకుడు పెట్రోలు పోసి దహనం చేశాడు. ఈ ఘటన ఈ నెల 24వతేదీన జరిగింది.
భర్తను వదిలి వచ్చిన మహిళ
పోలీసులు సంఘటన స్థలంలో కాలిన మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించి కేసును నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన శివానంద అనే వివాహితకు ముగ్గురు పిల్లలున్నారు. భర్తను వదిలిన శివానంద హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఇమామ్ అనే వ్యక్తితో కలిసి మేడ్చల్ కు వచ్చిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
కండోమ్స్ తీసుకొని...
షేక్ ఇమామ్ అనే యువకుడు శివానందను తీసుకొని మునీరాబాద్ లోని ఓ మెడికల్ స్టోరులో కండోమ్స్ కొన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు ఇమామ్ వివాహితతో కలిసి మునీరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు కల్వర్టు వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి వచ్చాడు. వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో నిందితుడు మహిళను బండరాళ్లతో మోది హతమార్చాడని పోలీసులు చెప్పారు.
క్లూస్ దొరకకుండా తగులబెట్టాడు...
మహిళను హతమార్చిన నిందితుడు ఇమామ్ పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకుండా మృతదేహంపై పెట్రోలు చల్లి తగులబెట్టాడని మేడ్చల్ పోలీసులు చెప్పారు. మహిళ శివానంద చేతిపై శ్రీకాంత్, నరేందర్ అని టాటూ ఉండటంతో దీని సహాయంతో పోలీసులు దర్యాప్తు చేయగా మహిళను గుర్తించారు. నిందితుడు షేక్ ఇమామ్ ను పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.