జగన్‌పై రేవంత్ సెటైర్: వైఎస్ వారసుడు కాదంటూ పరోక్ష వ్యాఖ్యలు

రాహుల్‌ను ప్రధానిగా చేయటానికి కృషి చేసేవారే వైఎస్ వారసులు అవుతారని రేవంత్ అన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేయటమే తన లక్ష్యమని వైఎస్ చెప్పేవారని గుర్తుచేసుకున్నారు.

Update: 2024-07-08 10:35 GMT

రాహుల్ గాంధి నాయకత్వాన్ని వ్యతిరేకించేవారు వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులు కాబోరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో వైఎస్ 75 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనబడుతోంది. జగన్ ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుకూడా జాతీయ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

రాహుల్ గాంధిని ప్రధానిగా చేయటానికి కృషి చేసేవారే వైఎస్ వారసులు అవుతారని రేవంత్ అన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేయటమే తన లక్ష్యమని వైఎస్ ఎప్పుడూ చెప్పేవారని రేవంత్ గుర్తుచేసుకున్నారు. రాహుల్ పాదయాత్రకు కూడా వైఎస్ పాదయాత్రే స్ఫూర్తి అన్నారు. ఆయన ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తున్నారని, ప్రధాని పదవికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారని చెప్పారు. రాహుల్ ప్రధాని కావటం నేటి చారిత్రక అవసరం అన్నారు.

పేదల గుండెల్లో వైఎస్ ముద్ర చాలా బలంగా ఉందని, తాము ప్రారంభించిన ఆరు గ్యారెంటీలకు ఆయనే స్ఫూర్తి అని చెప్పారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఇవాళ 35 మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చామని చెప్పారు.

Tags:    

Similar News