పిచ్చి వాడిని కొట్టి ‘జైశ్రీరామ్‌’ అని పలికించిన జనం!

ఓ పిచ్చి వాడిని జైశ్రీరామ్‌ అంటూ కొందరు కొట్టారు. అతను కూడా జైశ్రీరామ్‌ అనటం మొదలు పెట్టాడు. ఇంకా చితక బాదారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా?

Update: 2024-11-02 13:02 GMT

జనం అడిగిన వాటికి సమాధనం చెప్పలేకపోయాడు. అంతే అతన్ని ఆలయాలు ధ్వంసం చేసేవాడిగా జమకట్టేశారు.. గెడ్డం ఉంది కదా అని తీవ్రవాదిని చేసేశారు.. వివరాలు తెలుసుకోకుండానే చావ చితక్కొట్టేశారు.. అసలేం జరిగిందంటే..

శుక్రవారం మిట్ట మధ్యాహ్నాం.. నడినెత్తిన సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు.. అదే సమయంలో భీమవరం సమీపంలోని రాయలం ఏరియా కోదండ రామాలయం వద్ద ఒక అపరిచితుడు అనుమానంగా తిరుగుతున్నాడు. అటుగా వెళ్తున్న ఇద్దరు స్థానికులు నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావని ప్రశ్నించారు. వారి ప్రశ్నకు అతను జవాబు చెప్పే స్థితిలో లేడు. ఏదో అర్థం కాని భాష మాట్లాడుతున్నాడు. వారి అనుమానం బలపడింది. ఇక్కడికి నువ్వెందుకు వచ్చావ్‌ అంటూ అపరిచితుడిపై కేకలు వేయసాగారు. అంతే నిముషాల్లోనే జనం పోగుపడిపోయారు.
Delete Edit
ఇతను రామాలయం వద్ద అనుమానంగా తిరుగుతున్నాడంటే విగ్రహాలు ధ్వంసం చేసేవాడేమో అని గుంపులో నుంచి ఒక వ్యక్తి మొదటిగా తేల్చేశాడు. గెడ్డం ఉన్న ఆ అపరిచితుడు తీవ్రవాది అయ్యుంటాడు అని మరొకరు కోరస్‌ అందుకున్నారు. హైదరాబాద్‌లో సరస్వతి విగ్రహం ధ్వంసం చేసిన వారితో వీడికి సంబంధం ఉండి ఉంటుందని ఇంకొకరు వంత పాడారు. పెద్ద ముఠా దిగిందండీ.. వీళ్లంతా కొన్ని ఆలయాలను ఎంచుకుని ధ్వంసం చేస్తున్నారండీ.. వీళ్లను ఊరికే వదలకూడ దండీ.. ఒక్కొక్కడిని కొడితే మన ఆలయాల జోలికి రావాలంటే భయపడాలి.. అంత గట్టిగా వీళ్లకు ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలండీ.. అంటూ తలో మాట అందుకున్నారు. అంతే అక్కడికి చేరిన జనానికి దేవుడిపై భక్తి కంటే ఆ అపరిచితుడిపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. చేతికి అందిన రాడ్లు, కర్రలతో అతన్ని చావ చితక బాదేశారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో క్షణాల్లోనే వైరల్‌ అయ్యింది.
Delete Edit
ఈ విషయమై సమాచారం అందుకున్న భీమవరం టూ టౌన్‌ పోలీసులు స్పాట్‌కు వచ్చారు. అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వాళ్ల స్టైల్‌లో విచారణ చేసి విషయం తెలుసుకుని విస్తుపోయారు. ఇంతకీ అతని పేరు దిలీప్‌.. ఊరు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం. మతి స్థిమితం కోల్పోయి ఊళ్లు తిరుగుతున్నాడు. మూడేళ్లుగా భీమవరం చుట్టు పక్కల తిరిగి రోడ్డు పక్కన కాగితాలు.. ఖాళీ వాటర్‌ బాటిల్స్‌ ఏరుకుంటున్నాడు. వివరాలు తాపీగా తెలుసుకున్న పోలీసులు అతనికి టిఫిన్‌ పెట్టి ఒరేయ్‌ బాబూ.. ఇటు పక్కకు రాకు అంటూ సున్నితంగా చెప్పేసి పంపేశారు. అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయని జనం మాత్రం తీవ్రవాది అని ముద్ర వేసేసి ‘జైశ్రీరామ్‌’ అంటూ చావ చితక్కొట్టేశారు. తను నిరపరాధిని అని చెప్పలేని స్థితిలో ఉన్న అతను కూడా జైశ్రీరామ్‌ అంటూ దెబ్బలను భరించాడు. ఈ ఘటన పూర్వాపరాలను నిశితంగా గమనిస్తే.. అసలు మితిలేనిది అతనికా.. మతి స్థిమితం కోల్పోయింది కొట్టిన జనానికా? అని ఆశ్చర్యపోవడం పోలీసుల వంతు అయ్యింది.
Tags:    

Similar News