రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం..!

Update: 2024-12-17 12:51 GMT

శ్రీవారి హుండీ ఆలయంలోని తిరుమామణి మంటపంలో ఉంది. రాగి గంగాళాన్ని శంఖుచక్రాలు, తిరునామాలు ముద్రించిన వస్త్రం లోపల ఉంచుతారు. ఆ గంగాళాన్ని హుండీ లేదా కొప్పెర అంటారు. ఈస్టిండియా కంపెనీ పాలన కాలంలో 1821 జూలై 25న ఈ హుండీని ఏర్పాటు చేసినట్లు ఆలయ పరిపాలనా విధానాలను నిర్దేశించే చట్టం బ్రూస్ కోడ్‒12 లో పేర్కొన్నారు. 1958 నవంబర్ 28న, శ్రీవారి ఒక రోజు ఆదాయం మొట్టమొదటిసారిగా లక్ష రూపాయలు దాటింది. ఇప్పుడైతే రోజువారీ హుండీ ఆదాయం నాలుగున్నర కోటి దాటుతోంది. తిరుమలేశుడి హుండీ ఆదాయం ప్రతి నెల రూ. వంద కోట్లకు తగ్గకుండా వస్తోంది. వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది మొదటి 10 నెలల్లో రూ 1142.43 కోట్లకు చేరింది. తిరుమల వెంకన్న ఆదాయం నవంబర్ నెలలో రూ 111.30 కోట్లు వచ్చింది. దీంతో తిరుమల శ్రీవారికి 11 నెలల ఆదాయం కాస్తా రూ.1253.73 కోట్లకు చేరుకుంది. ఈ మధ్య కాలంలో ఘననీయంగా పెరిగిన భక్తుల రద్దీ తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. శ్రీవారికి కానుకలు సమర్పించే భక్తులు తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతున్నారు. వెల కట్టలేని వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం. కాగా ఈ ఏడాది మొదటి 6 నెలల హుండీ ఆదాయం రూ 670.21 కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమైంది.శ్రీవారి ఆదాయం రికార్డులను చూస్తే.1954 జూన్ నెలలో రికార్డుస్థాయిలో రూ.5,35,703 ఆదాయం వచ్చిది. ఇదే అప్పటికి అత్యధికం. తర్వాత రికార్డుల గురించి చెబితే. 2015-2016లో ఏకంగా రూ.1,010 కోట్ల సంవత్సర ఆదాయం లభించింది. కరోనాకు ముందు భాగానే ఉన్న ఆదాయం ఆ తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఆదాయం కూడా ఊహించని స్థాయికి చేరింది.ఈ ఏడాది జనవరి నెలలో రూ 116.46 కోట్లు, ఫిబ్రవరిలో రూ 111.71 కోట్లు, మార్చి నెలలో రూ 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ 101. 63 కోట్లు, మే నెలలో రూ 108.28 కోట్లు, జూన్ నెలలో రూ 113.64 కోట్లు, జులై నెలలో రూ 125.35 కోట్లు, ఆగష్టు నెలలో రూ 125.67 కోట్లు, సెప్టెంబర్ నెలలో రూ 114.11 కోట్లు, అక్టోబర్ నెలలో రూ 107.30 కోట్లు, నవంబర్ నెలలో రూ 111.30 కోట్లు హుండీ కానుకల రూపంలో శ్రీవారి ఆదాయం టీటీడీ ఖాతాకు చేరింది. ప్రతి నెలా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, భక్తులు సమర్పించిన కానుకల వివరాలను డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ ఏడాదిలో అత్యధిక ఆదాయం ఆగస్టు నెలలోనే వచ్చినట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. ఆగస్టు నెలలో శ్రీవారికి ఏకంగా 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 125.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. ఆగస్టు నెలలో 1.06 లక్షల లడ్డూలను విక్రయించిన టీటీడీ 24.33 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించినట్లు ప్రకటించింది. గత 33 నెలలుగా తిరుమల వెంకన్న ఆదాయం రూ. 100 కోట్ల మార్పును దాటుతోంది. 2022 మార్చి నెల నుంచి తిరుమలేశుడి హుండీ ఆదాయం ప్రతినెల రూ.100 కోట్లకు తగ్గకుండా టీటీడీ ఖాతాకు జమ అవుతూనే ఉంది. సామాన్య భక్తుల నుండి సంపన్నుడి దాకా హుండీలో సమర్పిస్తున్న కానుకల విలువ వెల్లువలా కొనసాగుతుండడంతో 2024 ఏడాది పూర్తి అయ్యే సరికి హుండీ ఆదాయం రూ. 1360 కోట్లకు పైగానే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తోంది.


Tags:    

Similar News