టీడీపీకి పవన్ కల్యాణ్ ఈ షాక్ ఎందుకిచ్చినట్టు?
పవన్ కల్యాణ్ మొహం చాటేశారా
Byline : G.P Venkateswarlu
Update: 2023-12-16 14:56 GMT
పవన్ కల్యాణ్ మొహం చాటేశారా, నిజంగానే ఏదైనా పనుందా.. లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభపై ఎందుకు నీళ్లు చల్లినట్టు.. లోకేశ్ సభకు పోయేంత చిన్నస్థాయి తనది కాదనుకుంటున్నాడా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా సాగుతున్నచర్చ ఇది.
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట పాదయాత్ర చేపట్టి సుమారు 3,300 కిలోమీటర్లకు పైగా నడిచారు. నిజానికి ఆ పాదయాత్ర ఈపాటికే ముగియాల్సింది. కానీ చంద్రబాబు అరెస్ట్, కోర్టు కేసులు, వానలు, వరదలతో జాప్యమైంది. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఈనెల 20న విజయనగరం జిల్లాలో ముగించాలని నిర్ణయించారు. ఈ ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించాలని టీడీపీ తలపెట్టింది. చంద్రబాబు మొన్నీమధ్య పార్టీ నేతలతో కూడా చర్చించారు. ప్రణాళిక ఖరారు చేశారు. తన మిత్రుడు, ఎన్నికల భాగస్వామి అయిన జనసేనాని పవన్ కల్యాణ్ ముందుంటారని కూడా చంద్రబాబు ఊహించారు. పవన్ వస్తాడని కూడా గట్టిగానే అంచనా వేశారు. అది ఒక్కసారిగా ఢమాల్ మనడంతో టీడీపీ వర్గాలు డీలా పడ్డట్టు సమాచారం. టీడీపీ కార్యక్రమానికి జనసేన వాళ్లు వెళ్లాలన్న చర్చ పవన్ పార్టీలో సాగినట్టు, అది రాంగ్ సిగ్నల్స్ ఇస్తుందని భావించినట్టు పేరు రాయడానికి ఇష్టపడని జనసేన పశ్చిమ గోదావరి జిల్లా నాయకుడొకరు చెప్పడం గమనార్హం.
4 రోజుల్లో ముగియనున్న యువగళం పాదయాత్ర..
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర నాలుగు రోజుల్లో ముగియనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భూమాత లేఅవుట్స్‌లో ఈనెల 20న భారీ ముగింపు సభ జరుగుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. జనసేన, టీడీపీ నాయకులు కలిసి యువగళం పాదయాత్ర ముగింపు సభలో పాల్గొంటారని ఊహాగానాలు వినిపించాయి. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖరారైనందున ఇక నుంచి జరగబోయే భారీ సభల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని టీడీపీ వాళ్లు అంచనా వేశారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. ‘యువగళం ముగింపు సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదని’ టీడీపీ అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఉమ్మడి మ్యానిఫెస్టో ఖరారు కానందున పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదన్నారు.
నిజానికి మ్యానిఫెస్టో ఖరారైనా కాకపోయినా పవన్‌కళ్యాణ్ హాజరైతే లాభమే తప్ప నష్టమేమీ ఉండదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సభ ముగింపులో పవన్ కళ్యాణ్‌ను పిలిచి ఉమ్మడి కార్యక్రమం అనిపించుకోవడం కంటే టీడీపీ నాయకులు మాత్రమే పాల్గొంటే టీడీపీ కార్యక్రమం అనేది ప్రజల్లోకి వెళుతుందనే భావన తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లు తెలిసింది. యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని, వివిధ వత్తుల వారు లోకేష్‌ను కలిసి సమస్యలు వివరిస్తున్నారని టీడీపీ వారు చెబుతున్నారు. దాదాపు యాత్రలోనే చాలా వరకు హామీలు ఇచ్చినందున ఆ హామీలనే ఎన్నికల మ్యానిఫెస్టోగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. రైతులు, మత్స్యకారులు, కార్మికులు, వివిధ వత్తుల వారు నిత్యం పాదయాత్రలో కలుస్తున్నారు. వేల సంఖ్యలో పాదయాత్రలో ప్రజలు పాల్గొంటున్నారు.
సమయంలేనందునే విజయనగరం జిల్లాలో పాదయాత్ర ముగింపు
ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేందుకు తగినంత సమయం లేనందున పాదయాత్రను ఇచ్చాపురం వరకు కొనసాగించకుండా విజయనగరం జిల్లాలో ముగిస్తున్నట్లు టీడీపీ వారు చెప్పారు.
భారీగా జనం తరలింపుకు ఏర్పాట్లు
యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయవతం చేసేందుకు టీడీపీ వారు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. కనీసం ఆరు లక్షల మందికి తక్కువ కాకుండా జనం హాజరయ్యేలా చర్యలు చేపట్టినట్లు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికే ప్రకటించారు. బస్‌లు, ట్రై న్స్ ద్వారా జన సమీకరణ చేస్తున్నట్లు తెలిసింది.