ఈ సీటు సుచరితకు ఎందుకిచ్చినట్లు
అమరావతిలో పట్టు బిగిస్తుందా?;
Byline : The Federal
Update: 2023-12-14 11:10 GMT
సుచరితను ఫిరంగిపురం మండలం పూర్తిగా ఆదరిస్తుందంటున్న ఆమె సన్నిహితులు
మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైఎస్‌ఆర్‌సీపీ వారు ఓడిపోయే సీటు ఇచ్చారనే టాక్ రాష్ట్రమంతా వచ్చింది. ఎందుకు ఈ టాక్ వచ్చిందంటే తాడికొండ (ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గం రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంది. తుళ్లూరు, తాడికొండ మండలాల ఓటర్లు పూర్తిగా వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే టాక్ నడుస్తోంది. ఈ టాక్‌ను పూర్తిగా ఎవ్వరూ నమ్మలేరు. ఎందుకంటే గత ఎన్నికల్లో డాక్టర్ శ్రీదేవి ఇక్కడి నుంచి పోటీ చేసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజధాని రైతుల ప్రభావం పూర్తి స్థాయిలో ఉంటే ఇక్కడ టీడీపీ ఖచ్చితంగా గెలవాల్సిందేకదా. అలా జరగలేదు. ఇక్కడి వారిలో కొంతమంది రాజధానికి భూములు ఇచ్చిన వారు. రాజధాని అమరావతే ఉండాలని ఉద్యమాన్ని నడుపుతున్న వారు ఉన్నారు.
తాడికొండే సుచరితకు అనుకూలమైందా..
ప్రత్తిపాడు కంటే తాడికొండ నియోకవర్గమే సుచరితకు అనుకూలమైన నియోజకవర్గం అని కూడా వైఎస్సార్‌సీపీ వర్గాలు అంటున్నాయి.
ఈ నియోజకవర్గంలోని పిరంగిపురం మండలం సుచరితకు పూర్తి అనుకూలంగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మేడి కొండూరు మండలంలో 50శాతం పైన ఓట్లు సుచరితకు వచ్చే అవకాశం ఉందని, ఇక తుళ్లూరు, తాడికొండ మండలాల్లో 35 శాతానికిపైనే ఓటర్లు సుచరితను ఆదరిస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజధానిలో గెలిచి సత్తా చాటితే సుచరితకు మంచి అవకాశం దక్కినట్లుగానే భావించాల్సి ఉంటుంది.
జడ్‌పీటీసీగా రాజకీయ ప్రస్తానం
పిరంగిపురం సుచరిత స్వస్థలం. ఆమె తండ్రి డాక్టర్ ఎన్ అంకారావు పిరంగిపురం మండలంలోని నుదురుపాడులో ప్రభుత్వ వైద్యునిగా పనిచేశారు. పిరంగిపురంలోనే నివాసం ఉండేవారు. అర్ధరాత్రి పూట ఎవరైనా వైద్యం కోసం వస్తే తప్పకుండా వారికి వైద్యం చేసి పంపించే వారు. దాంతో ఆయన మండలంలో మంచి పేరు సంపాదించారు. తండ్రికి ఉన్న ప్రజా బలంతో సుచరిత 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున పిరంగిపురం మండల జిల్లా పరిషత్ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. అప్పట్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 2009లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ తరపున ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేశారు. అప్పట్లో సుచరిత కూడా రాజీనామా చేసి తిరిగి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2012లో ప్రత్తిపాడు నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుచరిత టీడీపీ అభ్యర్థి రావెల కిశోర్‌బాబుపై ఓడిపోయారు. టీడీపీ ప్రభుత్వంలో రావెల కిశోర్‌బాబు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి బాగా కృషి చేసిందనే సుచరిత పేరు సంపాదించారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రధానమైన హోం మంత్రిత్వ శాఖను చేపట్టి శభాష్ అనిపించుకున్నారు. అయితే ఆ పదవి నుంచి రెండున్నర సంవత్సరాల తరువాత సీఎం వైఎస్ జగన్ తొలగించారు. ఇటీవల ఆమెను తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు. 11 నియోజకవర్గాల్లో ఈ మార్పులు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
సర్వేల ఆధారంగానే సుచరిత తాడికొండకు..
వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయకూడదనే ఆలోచనకు సుచరిత వచ్చినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సీఎంకు వచ్చిన సర్వే రిపోర్టుల ఆధారంగా ఆమెను తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ కుటుంబంలో అందరూ విద్యావంతులే. ఇన్‌కంట్యాక్స్ అధికారి దయాసాగర్‌ను సుచరిత వివాహం చేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకునేందుకు మచిలీపట్నం పోర్టు ఎండీగా నియమించింది. ఈమె సోదరుల్లో ఒకరు అశోక్‌వర్థన్ గుంటూరులో రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. మరొకరు డాక్టర్ హర్షవర్థన్ గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో వైద్యునిగా పనిచేస్తున్నారు.