Kukatpally Murder |హతమార్చి...చక్కగా స్నానం చేసిన పరారైన నిందితులు.
యజమాని ‘రేణు’ను దుండగులు అతి కిరాతకంగా హింసించారు..;
కూకట్‌పల్లిలో జరిగిన రేణు అనే మహిళ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితులు ఆమెను నేరుగా హతమార్చలేదని, చనిపోయే ముందు ఆమెను చిత్రహింసలు పెట్టారని పోలీసులు గుర్తించారు. డబ్బులు, నగలు సహా ఇతర విలువైన వస్తువులు ఎక్కడున్నాయో చెప్పాలని వారు బాధిత మహిళను చిత్రహింసలకు గురిచేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా యజమాని స్కూటీ పైనే నిందితులు పరారయినట్లు గుర్తించిన పోలీసులు.. పలు బృందాలుగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఝార్ఖండ్‌కు చెందిన వారిగా తెలుసుకున్న అధికారులు.. ఝార్ఖండ్ పోలీసులకు కూమా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న యువకుడే తన స్నేహితుడితో కలిసి రేణును హతమార్చారు. కాళ్లుచేతులు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెడుతూ ప్రెజర్ కుక్కర్‌తో తలపై కొట్టి హత్య చేశారు. అనంతరం సూట్‌కేసుల్లో దోచుకున్న సొమ్ము పెట్టుకుని పరారయ్యారు.
అసలెవరీ రేణు..
రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్(50) దంపతులు కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. వారికి ఫతేనగర్‌లో ఓ స్టీలు షాప్ ఉంది. వారికి ఒక కుమార్తె తమన్నా, కుమారుడు శుభం ఉన్నారు. వారి కూతురు చదువు నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉండగా.. కుమారుడు శుభం మాత్రం ఇక్కడే తన తండ్రితో కలిసి షాపు పనులు చూసుకుంటున్నారు. అదే కమ్యూటీలో రేణు వాళ్లు బంధువులు కూడా నివాసం ఉంటున్నారు. ఆ బంధువుల ఇంట్లో ఝార్ఖండ్‌కు చెందిన రోషన్ అనే అతను తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అతను తన గ్రామానికి చెందిన హర్ష్ అనే యువకుడిని 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంటమనిషిగా పెట్టించాడు.
రక్తపు మడుగులో రేణు..
ఎప్పటిలానే రాకేష్, శుభం కలిసి ఉదయాన్నే తమ దుకాణానికి వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో శుభం తన తల్లి రేణుకు ఫోన్ చేశాడు. కానీ రేణు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తండ్రి రాకేష్, కొడుకు శుభం ఇంటికి చేరుకున్నారు. ఎంత పిలిచినా ఎవరూ తలుపు తీయకపోవడంతో.. ప్లంబర్‌ను పిలిచి వెనక నుంచి లోపలికి పంపి తలుపు తీయించారు. కాగా రేణు అప్పటికే రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయి. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
హత్య ఎలా జరిగిందంటే..
రాకేష్, శుభం.. దుకాణానికి వెళ్లిన తర్వాత ఈ దారుణం చోటుచేసుకుంది. రేణు ఒక్కరే ఇంట్లో ఉండటాన్ని నిందితులు హర్ష్, రోషన్‌లు అదునుగా తీసుకున్నారు. అదే సరైన సమయం అనుకుని ఆమెపై దాడి చేశారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి.. డబ్బులు, నగలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని అడిగారు. ఆ క్రమంలోనే రేణును చిత్ర హింసలు పెట్టారు. కూరగాయలు కోసే కత్తులతో గొంతు కోశారు. అంతేకాకుండా ఆమెను తీవ్రంగా కొట్టారు. ప్రెజర్ కుక్కర్‌తో తలపై గట్టిగా కొట్టడంతో రేణు మరణించారు.
అక్కడే స్నానం చేసిన నిందితులు..
రేణును హతమార్చిన నిందితులు ఇంట్లోని లాకర్లు మొత్తం పగలగొట్టి అందినకాడికి నగదు, నగలు మొత్తం దోచుకున్నారు. రేణు ఇంట్లోని సూట్‌కేసుల్లోనే మొత్తం సర్దుకున్నారు. ఆ తర్వాత ఆ ఇంట్లోనే చక్కగా స్నానం చేసి సూట్‌కేసులు తీసుకుని ఇంటి నుంచి బయలకు వచ్చారు. రక్తపు మరకలు ఉన్న దుస్తులను ఇంట్లోనే వదిలేశారు. ఆ తర్వాత సూట్‌కేసుతో బయటకు వచ్చిన నిందితులు ఇంటికి తాళం వేసి రేణు కుటుంబానికి చెందిన స్కూటీపైనే పరారయ్యారు. అయితే వారు బయటకు రావడం, స్కూటీ తీసుకుని వెళ్లడం అంతా కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. వాటి సహాయంతోనే పోలీసులు దర్యాప్తును ముందుకు నడిపిస్తున్నారు. అయితే రేణు శరీర భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఆమె గొంతును కోసి, చిత్ర హింసలకు గురి చేసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు.
ముమ్మరంగా దర్యాప్తు..
ఈ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరంగా ముందుసాగిస్తున్నారు. డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీమ్స్ సహయాంతో ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, వేలి ముద్రలను సేకరిస్తున్నారు. అన్న సాక్ష్యాలను పరిశీలించిన తర్వాతే హత్య జరిగిన తీరుపై ఒక నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో.. వేలిముద్రలో సరిపోలడంతో రోషన్, హర్షలే రేణు అగర్వాల్‌ను హతమార్చినట్లు తేలింది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి తలపై కుక్కర్‌తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేశారు. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె శరీరంపై ఉన్న నగలను కూడా దోచుకున్నారని చెప్పారు. ప్రస్తుతం స్కూటీ ఎక్కడ ఉంది, వారు ఏ మార్గంలో పరారయ్యే ప్రయత్నాలు చేశారు వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే రాష్ట్రం దాటారా? ఇంకా తెలంగాణలోనే ఎక్కడైనా తలదాచుకున్నారా? అని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.