ఉర్దూ అకాడమీలో అంతులేని అక్రమాలు
19 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్‌పై రచ్చ!;
తెలంగాణా ఉర్దూ అకాడమీలో నిబంధనలకు విరుద్ధంగా 19 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి 5 లక్షల రూపాయల చొప్పున తీసుకుని పర్మినెంట్ చేశారని అకాడమీ రిటైర్డ్ ఉద్యోగి, అడ్వకేట్ మొహ్మద్ ఉమర్ ఆరోపిస్తున్నారు. ఉర్దూ అకాడమీకి ఇంఛార్జ్ డైరెక్టర్‌గా వచ్చిన సజ్జాద్ అలీ 14 రోజుల తరువాత రిటైర్డ్ అయ్యారు. వెళుతూ వెళుతూ ఈ స్కాం చేశాడనేది ప్రధాన ఆరోపణ.
బ్యాంక్ అకౌంట్‌ల మాయాజాలం
జనరల్‌గా బ్యాంక్ అకౌంట్ ఒకటే ఉంటుంది. ఆ అకౌంట్‌లోకే ప్రభుత్వ నిధులు జమ అవుతాయి. అదనంగా మరో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతించాలి. అయితే ఉర్దూ అకాడమీకి నిబంధనలకు విరుద్ధంగా వివిధ బ్యాంకుల్లో ఐదు అకౌంట్లు ఓపెన్ చేసి పెట్టుకున్నారు. సెంట్రల్ బ్యాంక్‌లో వున్న అకౌంట్‌లో మూడు కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. అందులో 70 లక్షలు డ్రా చేశారు. అయితే మిగతా డబ్బు ఏమైందో ఎవరికీ తెలియదు.
నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది మూడు రకాల అడిట్‌లు జరగాలి. ఏ.జి. ఆడిట్, లోకల్ ఆడిట్, థార్డ్‌పార్టీ ప్రైవేట్ ఆడిట్. అయితే 2016 నుంచి ఉర్దూ అకాడమీలో ఇంత వరకు ఆడిట్ జరగలేదు. ప్రతి ఏడాది ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేస్తోంది. కోట్ల రూపాయలు గల్లంతైయ్యాయని ఆరోపణలున్నా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ మొద్దు నిద్దుర నటిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉర్దూ ఘర్, షాదీఖానాలు నిర్మాణం చేయకుండానే డబ్బు ఇతర అకౌంట్స్‌కు మళ్ళించి నొక్కాశారని ఆరోపణలు వున్నాయి. ఎంత బడ్జెట్ ఖర్చు చూపిస్తున్నారు. ఎన్ని నిర్మాణాలు పూర్తి అయ్యాయి.ఒకపక్క నిధుల కొరతతో రేవంత్ సర్కార్ అల్లాడుతుంటే, ఉర్దూ అకాడమీ బడ్జెట్‌ను కొంత మంది పంచుకుతింటున్నారని రిటైర్డ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.