అరటిపండు మర్డర్ కేసు: బసిల్ జోసెఫ్ ‘మరణమాస్’ రివ్యూ
సొసైటీ మీద ఎపుడూ తొందరపాటుతో తీర్పులిచ్చే మన సోషల్ జడ్జిమెంట్ మీద చక్కటి కామెంటరీ ‘Maranamass’ ఓటిటి మూవీ;
Update: 2025-05-16 03:36 GMT
‘బ్లాక్ కామెడీ’ (భయం + నవ్వు) జానర్ ప్రయోగాలు తెలుగులో పెద్దగా జరగవు. ఒకవేళ అప్పుడప్పుడూ ఎవరైనా ప్రయత్నించినా అవి బ్లాక్ కామెడీ అని గుర్తించకుండానే వచ్చి వెళ్లిపోతూంటాయి. కానీ మలయాళం పరిశ్రమ మాత్రం ఆ జానర్ ని అప్పుడప్పుడూ ముందుకు తీసుకొస్తోంది. తాజాగా ‘మరణమాస్’ అనే సినిమాని దింపింది. అందులో బసిల్ జోసెఫ్ ఉండటంతో ఇక్కడ మనవాళ్లు కనెక్ట్ అవుతున్నారు. ఓటిటిల పుణ్యమా అని ఇక్కడ తెలుగులోనూ బసిల్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు . ఇంతకీ ‘మరణమాస్’ అనే భీకరమైన టైటిల్ పెట్టిన ఈ సినిమా కథేంటి, ఎలా ఉంది, చూడదగినదేనా?
స్టోరీ లైన్
కేరళలలో ఓ పచ్చని పల్లె. అక్కడ వృద్ధులు ఒకొకరుగా చనిపోతున్నారు... కాకపోతే, ఇవి సహజ మరణాలు కాదు. ఓ సీరియల్ కిల్లర్ శ్రీకుమార్ (రాజేశ్ మాధవన్) వారి నోట్లో అరటిపండు పెట్టి మరీ మర్డర్ చేస్తున్నాడు. ఆ అరటిపండు ఇది అతడి ముద్ర, అతడి సంతకం, అతడి సైకో స్టైల్. ట్రేడ్‌మార్క్! ఆ సైకో కిల్లర్ ని పట్టుకోవాలంటూ పోలీస్ ల మీద ప్రెజర్ పెరిగిపోతూంటుంది. దాంతో వాళ్లు ఎవర్ని లేపల వేసేసి ఈ కేసు క్లోజ్ చేసేద్దామా అని ఊరికే టెన్షన్ పడిపోతూంటారు.
ఇక అదే ఊరిలో ఉండే ల్యూక్ (బసిల్ జోసెఫ్) ప్రవర్తన కొంచెం తేడాగా ఉంటుంది. ల్యూక్ – వింత ప్రవర్తన, వింత చూపు, వింత హావభావాలు. ఈ గ్రామంలో ‘సాధారణం’ కంటే ‘సందేహాస్పదం’గా కనిపించటం అతని దురదృష్టం. దాంతో పనిపాటా లేని ప్రజలు, పని తప్పించుకోవాలనుకునే పోలీస్ లు అతడినే హంతకుడని ఫిక్స్ అయిపోతారు. మరో ప్రక్ ల్యూక్ ప్రేయసి జెస్సీ (అనిష్మ) కూడా ఆ మాటలు విని అనుమానిస్తుంది. బ్రేకప్ చెప్పేస్తుంది.
ఆ తర్వాత ఓ రోజు జెస్సీ బస్సులో తనను అసభ్యంగా వేధిస్తున్న వృద్ధుడిపై పెప్పర్ స్ప్రే వాడుతుంది. కానీ అది అనుకోని మలుపు తిప్పుతుంది. వృద్ధుడు అక్కడికక్కడే చనిపోతాడు. అంతే అసలు టెన్షన్ మొదలవుతుంది. ఈ మరణాన్ని కప్పిపుచ్చాలని,శవాన్ని మాయం చేయాలని డ్రైవర్, కండక్టర్, తోటి ప్రయాణికుడుగా సైకో కిల్లర్ శ్రీకుమార్ ప్రయత్నాలు మొదలెడతారు. ఈ లోగా ఈ టెన్షన్ లోకి ల్యూక్ బస్సులోకి తన బ్రేకప్ స్టోరీకి క్లారిటీ కోరుకుంటూ ఎంట్రీ...ఇస్తాడు.
అప్పుడు ఏమైంది? వాళ్లందరు అసలు ఆ శవాన్ని ఎందుకు మాయం చేయాలనుకుంటున్నారు. సైకో కిల్లర్ ఎందుకు ఈ బస్సులో ఉన్నాడు, అతను ఎందుకు హత్యలు చేస్తున్నాడు.చేసి అరటి పళ్లు ఎందుకు వాళ్ల నోట్లో పెడుతున్నాడు. ఈ కేసు సాల్వ్ చేయాలనుకున్న డీఎస్పీ అజయ్ రామచంద్రన్ (బాబూ ఆంటోనీ) అసలు ఇంటెన్షన్ ఏమిటి ..చివరకు ఏమైందనేది మిగతా కథ.
విశ్లేషణ"నిజం బయిటపడేదాకా అందరూ కలిసి చెప్పే అబద్దమే రాజ్యం ఏలుతుంది"
పైకి ఓ సైకో కిల్లర్ కథలా కనిపించినా అంతర్గతంగా ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒక బస్సులో జరిగిన ఓ అనుకోని సంఘటన చుట్టూ కథ తిరుగుతుంది. ఆ సంఘటనకి అప్పటివరకు సంబంధం లేని చాలా పాత్రలు ఎలా లింక్ అవుతాయన్నదే అసలు మజా. నవ్విస్తూనే మిస్టరీలోకి లాగేయటం బాగుంటుంది. ఓ వృద్ధుడి హత్య... అతడి నోట్లో అరటిపండు పెట్టిన మర్డరర్. మొదటి ఫ్రేమ్ నుంచే టోన్ ఎస్టాబ్లిష్ చేయటం బాగుంది.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించిన నటుడు సిజు సన్నీ సోషల్ మీడియాలో తనదైన మినీ స్కిట్‌లతో పేరు తెచ్చుకున్నవాడు. అలాగే ఈ సినిమాలో ఓ కీ క్యారక్టర్ ని వేసాడు. ఇక ఆ సినిమాలోని అసంబద్ధమైన పాప్-కల్చర్ ఫన్ చూడటానికి ఖచ్చితంగా సరదాగానే ఉంటుంది. మరణమాస్ స్పెషాలిటీ ఏమిటంటే, ఇది ఫుల్ లెంగ్త్ కామెడీ కథ కాదు. అలాగని ఓ ప్రత్యేక పాత్రకు సంబంధించిన సినిమా కాదు. మల్టిపుల్ ట్రాక్‌లు, ఫన్నీ ఎలిమెంట్స్ తో కూడిన క్లిష్టమైన ప్లాట్ ఇది. సిట్యుయేషనల్ కామెడీ మీదే ఎక్కుడ డిపెండ్ అయ్యారు.
వాస్తవానికి, కథలో సైకో కిల్లర్ ని మొదట్లోనే ఓపెన్ చేసేసి, అతన్ని ఎలా పట్టుకుంటారా, అతను ఎందుకు అలా సీరియల్ కిల్లర్ గా మారాడా అనే ఆసక్తిని చివరిదాకా సస్టైన్ చేయటం చాలా కష్టం. దాన్ని ఈ టీమ్ సమర్దవంతంగానే డీల్ చేసింది.
క్యారక్టరైజేషన్స్ ఇంట్రస్టింగ్ డిజైన్:
డ్రైవర్ పెళ్లి విషయంలో టెన్షన్ పడుతూ ఉంటాడు. కండక్టర్ తండ్రి లేడని ఏళ్లు గడిచినా బాధపడుతుంటాడు. సైకో శ్రీకుమార్ అనేక డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్. పెద్దగా తెలివిలేని ల్యూక్, బోయప్రెండ్ పై పదే పదే అనుమానపడే ఓ అమ్మాయి వీళ్లందరూ కలిసి ఒక బాడీని ఎలా మేనేజ్ చేస్తారు అన్నదే థ్రిల్. అలాగే ప్రతీ పాత్రకూ ప్లాంటింగ్ , పే ఆఫ్ చేసారు.
ముఖ్యంగా సొసైటీగా మనం ఎలా, ఎంత త్వరగా తీర్పులిస్తామో (Luke Character) – సోషల్ జడ్జిమెంట్ (social judgement)మీద చక్కటి కామెంటరీ.
Screenplay-wise, బస్సులో ప్రయాణించిన ఐదుగురు వ్యక్తుల జీవితాలు ఒక్కసారిగా కలిసిపోతాయి – Edgar Wright movies లో చూపించే స్టైల్ గుర్తు చేస్తుంది. అయితే శ్మశాన ఎపిసోడ్ అనసరమనపిస్తుంది.
ఎవరెలా చేసారు.
నటీనటులందరి పెర్ఫార్మెన్స్, వాళ్ల ఎనర్జీ మరణమాస్ విషయంలో ఖచ్చితంగా కీలకాంశాలు. ఎక్కవ శాతం వేస్ట్ సీన్లు లేకుండా స్క్రీన్‌ప్లే డిజైన్ చేయటం ప్లస్ అయ్యింది. అయితే అక్కడక్కడా కథ, కామెడీ ఏమీ లేకుండా లాగటం విసుగిస్తుంది. ఈ సినిమాలో మనం చూసే ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ విషయం కేవలం ట్రెండ్‌ను ఎగతాళి చేయడం కోసం జోడించిన అర్ధంలేని కామెడీనే కావచ్చు.
ఫ్యామిలీతో చూడొచ్చా?
అవును! ఇది ఫ్యామిలీతో చూసే బ్లాక్ కామెడీ. అసభ్య సంభాషణలు లేవు, దారుణ రక్తపాత హత్యలు లేవు, చాలా చోట్ల బాగా నవ్విస్తుంది.
ఎక్కడుంది
సోనీ లివ్ ఓటిటిలో తెలుగులో ఉంది.