ఒమాక్స్ మీడియా (Ormax Media) అనే మీడియా కన్సల్టెన్సీ విడుదల చేసిన లెక్కలు ప్రకారం ప్రస్తుతం ఇండియన్ ఓటిటి ఆడియన్స్ సంఖ్య 48.11 కోట్లు. భారతీయ వినోద పరిశ్రమలో ఓవర్-ది-టాప్ (ఓటీటీ) మార్కెట్ రోజురోజుకూ పెరుగుతూనే ఉందనేది నిజం. పెద్ద పెద్ద డీల్స్ జరుగుతున్న ఈ టైమ్ లో పెయిడ్ యూజర్ల సంఖ్య కూడా రెట్టింపు అయ్యింది.
ఈ రిపోర్టు ప్రకారం... ఒరిజినల్ కంటెంట్‌లో భారీ పెట్టుబడి, ధరల్లో తగ్గుదల, తక్కువ డేటా ఖర్చులు షార్ట్-ఫారమ్ కంటెంట్ పెరుగుదల వల్ల ఓటీటీ ఇండస్ట్రీ గ్రోత్ సాధిస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు 2023లో కంటెంట్ కోసం భారీ పెట్టుబడి పెట్టాయి.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో డిస్నీ+ హాట్‌స్టార్ లు మొదటి మూడుస్థానాల్లో ఉన్నాయి. అంతా బాగానే ఉంది...అల్లుడు నోట్లో శని అన్నట్లు..ఇంత మార్కెట్ నడుస్తున్నా తెలుగులో సినిమాలకు ఓటిటి అమ్మకాలు మాత్రం జరగటం లేదు. ముఖ్యంగా పెద్ద సినిమాలకు అసలు బిజినెస్ జరగటం లేదు.
ఎక్కడైనా పెద్ద హీరోల క్రేజీ సినిమాలంటే బిజినెస్ స్పీడుగా జరిగిపోవాలి. ముఖ్యంగా ఓటిటి (OTT) బిజినెస్ అయితే పోటీపడి జరుగాలి. అలా లేదు పరిస్థితి. పెద్ద సినిమాలను ఓటిటి సంస్దలు ప్రక్కన పెట్టేస్తున్నాయా... అనిపిస్తోంది కదా. అయితే అది ఇండస్ట్రీ నుంచి వచ్చిన అంతర్గత సమస్యే .
మొన్నటిదాకా రవితేజ చిత్రం 'ఈగల్' కు కూడా బిజినెస్ అవ్వకపోవటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. ప్యామిలీ స్టార్ వంటి దిల్ రాజు ..విజయదేవరకొండ సినిమా ఓటిటి బిజినెస్ జరగక సంక్రాంతి రిలీజ్ ఆగిందని వినిపించింది. చిన్న సినిమాలను ఓటిటి సంస్దలు కొనటం లేదు అంటే ఓకే ..మరి పెద్ద సినిమాలకు ఈ సమస్యలేంటి... ఎక్కడుంది ఈ సమస్య అంటే...
పెద్ద సినిమాలకు భారీ రేట్లు కోట్ చేయటం ఓటిటి సంస్దలు వెనకడగు వేయటానికి ప్రధాన కారణంగా కనపడుతోంది. అదేమిటంటే...ఓటిటి బిజినెస్ ని నమ్ముకుని బడ్జెట్ లు మన దర్శక,నిర్మాతలు పెంచేస్తున్నారు. హీరోలు రెమ్యునరేషన్స్ పెంచేస్తున్నాయి. అయితే సీన్ లోకి వెళ్లి చూస్తే ఊహించినట్లుగా బిజినెస్ కావటం లేదు. ఓటిటి సంస్దలు నాలుగైదు ఎదురుదెబ్బలు తగిలి బొప్పి కట్టడంతో ఆచి,తూచి అడుగులు వేస్తున్నాయి.
ఎక్కడో హనుమాన్ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాని తక్కువ రేటుకు కొనుక్కుని మిగుల్చుకున్నట్లుగా ప్రతీసారి వ్యూయర్ షిప్ రావటం లేదు. దీనికి తోడు పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ ఎప్పుడు అనేది క్లియర్ గా చెప్పలేకపోతున్నాయి. స్టార్ డైరక్టర్స్, హీరోలతో తమ సినిమా ఎప్పుడో మొదలైనా ఎప్పటికి సినిమా పూర్తవుతుంది అనేది చెప్పలేని పరిస్దితి . అలాగే పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లాక్ చెయ్యాలంటే ముందు వెనకా వేరే పెద్ద సినిమాలు రిలీజ్ లు లేకుండా చూడాలి. అది శెలవుల సీజన్ అవ్వాలి ఇన్ని సవాలక్ష లెక్కలతో రిలీజ్ డేట్ లాక్ చేస్తున్నాయి. ఏదైనా ఒక కారణంతో ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ తేడా కొట్టి మారిస్తే మిగతా రిలీజ్ డేట్స్ అందరివీ మార్చుకోవాల్సిన సిట్యువేషన్. ఆ మధ్యన ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ మారగానే చాలా సినిమాల రిలీజ్ డేట్స్ అస్దవ్యస్దం అయ్యాయి. దాంతో ఓటిటి సంస్దలకు తమ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చెప్పటం లేదు నిర్మాతలు.
అలాంటప్పుడు అంతంత భారీ పెట్టుబడి పెట్టి సినిమాని కొనుక్కుని తమ దగ్గర పెట్టుకోవటం,వడ్డీలు దండగ చేసుకోవటం ఓటిటి సంస్దలకు ఇష్టం లేక కొనుగోళ్లు వాయిదా వేస్తున్నాయి. దాంతో ముందు రిలీజ్ డేట్ లాక్ చేయండి తర్వాత ఓటిటి డీల్ మాట్లాడుకుందాం అనే కండీషన్ పెడుతున్నాయి. అయితే నిర్మాతలు పాపం తమ దర్శకులను ఎప్పటికి సినిమా పూర్తి చేసి ఫస్ట్ కాపీ చేతిలో పెడతారు అని అడగలేకపోతున్నారు. అందుకు స్టార్ డైరక్టర్స్, స్టార్ హీరోలు,రకరకాల వేర్వేరు కారణాలు. ఓటిటి ప్లాట్ ఫామ్ లు ఇప్పుడు వచ్చే సంవత్సరానికి తమ ఫైనాన్సియల్ ఇయర్ ని ఓపెన్ చేసి పెట్టుకుని బడ్జెట్ కేటాయించామని చెప్తున్నా నిర్మాతలు రిలీజ్ డేట్స్ చెప్పి డీల్ చేసుకోలేక గాల్లోకి చూస్తున్నారు.
ఏదైమైనా దేశం మొత్తం మీద సౌత్ ఇండియా సినిమాలు అత్యధిక ఆదాయాన్ని సృష్టిస్తున్నాయన్నది నిజం. గతేడాది దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఆదాయంలో దక్షిణాది సినిమాల వాటాయే 50 శాతంగా ఉండడం గమనార్హం. అలాగే 2023 లో మనదేశంలో ఓటీటీ మార్కెట్ 2.5 బిలియన్ డాలర్లకి చేరుకుంటే, ఇది 2029 కల్లా 5.81 బిలియన్ డాలర్లకి చేరుకోగలదని అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో విలీనాలు, అమ్మకాలు, కొత్త బ్రాండ్ ల ఆగమనాలూ కలుపుకుని పురోగతి దిశగానే మార్కెట్ పయనిస్తోందనే చెప్పాలి. జియో సినిమా- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విలీనం కొలిక్కి వస్తే, మరోవైపు అల్లు అరవింద్ ఆధ్వర్యంలోని ఆహా అమ్మకానికి పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. అలాగే జనాలు సినిమాల కోసం థియేటర్లకి వెళ్ళడం తగ్గించి ఓటీటీల్ని పోషించడం మొదలెట్టారు.
వారం వారం వందల కొద్దీ సినిమాలు, సిరీస్ లు, షోలు, డాక్యుమెంటరీలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఈ వారం ఇంగ్లీషు, హిందీ, కొరియన్, ఫ్రెంచి, పోలిష్, టర్కిష్, మాండరిన్, థాయ్ భాషల్లో కంటెంట్ ని మార్కెట్లో వదిలారు. ఓటీటీలు 19 సినిమాలు, 17 వెబ్ సిరీస్ లు వచ్చాయి. కానీ ఓటిటి బిజినెస్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. చిన్న సినిమాని కొనేై నాధుడు లేడు. పెద్ద సినిమాకు మరో విధమైన సమస్య .
ఏతా వాతా పైకి కనిపించనంత అందంగా అయితే ఓటిటి మార్కెట్ కళకళ్ళాడటం లేదు.