చేనేతకు ప్రభుత్వ చేయూత
ఆగస్టు 7న చేనేత దినోత్సవ సందర్భముగా....;
నాగరికత ప్రయాణంలో చేనేత ఒక ప్రముఖ పాత్ర కలిగి ఉన్నది. భారతదేశం గ్రామాలలో నివసిస్తున్నది. ఆ గ్రామాలలో ఎక్కువ శాతం ప ప్రజలు వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నారు. అ తర్వాత చేనేత పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. చేనేత పై పద్మశాలీయులు ఆధారపడి పొట్ట పోసుకుంటున్నారు . ఈ విషయాన్ని వివిధ సందర్భాలలో చేపట్టిన సర్వే గణాంకాల రుజువు పరుస్తున్నాయి.
ప్రతి సంవత్సరం ఆగస్టు 7న చేనేత దినోత్సవం గా మన దేశం జరుపుకుంటున్నది. మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలో భాగంగా స్వదేశీ ఉద్యమాన్ని గీటురాయిగా తీసుకొని ఏటేటా చేనేత సంరంభంగా జరుపుకోవాలని ప్రకటించుకున్నది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనంలోకి తీసుకోవాలి. అది ఆధునికత ప్రారంభంలో మానవ శ్రమను వీలైనంత తగ్గించడంలో భాగంగా ప్రారంభమైనది. కానీ క్రమంగా ఆధునికత అన్ని రంగాలలో యంత్రాలను ప్రవేశ పెట్టడం వలన కుటీర పరిశ్రమల మీద ఆధారపడిన జీవితాలు ఏ మానవ ఉన్నతి కోసం మెరుగైన సమాజం కోసం ప్రారంభమైన యాంత్రీకరణ ఆయా వృత్తులమీద ఆధారపడీన జీవితాలు సుధుర్ఘకాలంలో కకావికలమైనవి.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల , గర్శకుర్తి ,కొత్తపల్లి లో 25000 మరియు భువనగిరి తదితర ప్రాంతాలలో పదివేల కలుపుకొని మొత్తం సుమారు 35 వేల వరకు మరముగ్గాలు నడుస్తున్నవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 వేల వరకు పవర్లూమ్స్ నడుస్తున్నాయి. ప్రధానంగా సిరిసిల్ల పట్టణ కేంద్రంలో మెజారిటీ ప్రజలు పద్మశాలి వర్గాలు నివసిస్తున్నాయి.
"పెట్టుబడి ఎక్కడ కేంద్రీకృతమైతే వలసలు అక్కడికి నిరంతరంగా కొనసాగుతాయి". అనే ఆర్థిక నిర్వచనానికి తగ్గట్టుగా వరంగల్ జనగామ హుస్నాబాద్ హుజూరాబాద్ తదితర గ్రామీణ ప్రాంతాలలో మెల్ల మెల్లగా చేనేత కుటీర పరిశ్రమ కునారిల్లిపోవడం వలన ఆ రంగంలో పనిచేస్తున్న కార్మికులు బతుకుతెరువును వెతుక్కుంటూ అప్పటికే చేనేత పరిశ్రమ మహోజ్వలంగా సిరిసిల్లలో వర్ధిల్లుతుండంవలన ఈ ప్రాంతానికి ఓం ప్రధమంగా చేనేత కార్మికులు పలస వచ్చారు.
ఇదిలా ఉండగా, మరోవైపు పుండు మీద కారం చల్లినట్టు నిజాం వ్యతిరేక పోరాట కాలం లో రజాకర్ల నిర్బంధాలకు అణచివేతలకు జడిసిపోయి 1930 దశకంలో ప తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని చేనేత కార్మికులతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కూడా కూలీలుగా పెద్ద మొత్తంలో సిరిసిల్ల తో పాటు బొంబాయి, షోలాపూర్, అహ్మద్నగర్,భీవండికి ఊహించని స్థాయిలో ప్రజలు వలసలు సాగించారు .
మన్నికైన మిల్లు వస్త్రం దేశమంతా విస్తరించడంతో, మగ్గంపై నేసిన బట్టకు క్రమక్రమంగా గిరాకీ తగ్గిపోయింది. ఆధారపడిన కార్మికులు వారి కుటుంబాలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయాయి. 1990 దశాబ్దం వచ్చే వరకు చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభ రూపం దాల్చింది. తత్పలితంగా 1996 నుండి 2003 వరకు సిరిసిల్ల పట్టణంలో వందలాదిమంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిరిసిల్ల పట్టణాన్ని సందర్శించి తక్షణ చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే 5 హెచ్పి ల వరకు కుటీర పరిశ్రమగా పరిగణిస్తూ పవర్లూమ్స్ నియోగించుకునే విద్యుత్తులో 50% రాయితీని ప్రకటించారు. దానికి తోడు ఆయా బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం క్రింద లక్ష రూపాయల వరకు అందించారు. అంతే కాకుండా చేనేత కార్మిక కుటుంబాలకు నెల నెలా కుటుంబానికి 35 కిలోల బియ్యం ఉచితంగా అందేలా అన్నపూర్ణ రేషన్ కార్డులను జారీ చేశారు. సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమకు ప్రభుత్వం తీసుకున్న సత్వర సంక్షేమ వివిధ కార్యక్రమాల వలన పరిశ్రమ వేడినీళ్లకు చన్నీళ్లు తోడైనట్టుగా ఊపిరి తీసుకున్నది .
అనేకానేర కారణాల మూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలుగా 2014 జూన్ 2 నాడు విడిపోయినది. అయితే సిరిసిల్ల చేనేత పరిశ్రమ పరిణామ క్రమంలో మరింత మర మగ్గాల పరిశ్రమ అభివృద్ధి చెందినది. కానీ చేనేత కార్మిక కుటుంబాలలో పరోక్షంగా చాప కింద నీరులా సంక్షోభం కొనసాగుతూ వస్తున్నది. దీనికి విరుగుడుగా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరున 2018 నుండి సంవత్సరానికి 300 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చింది. దీనివలన సంవత్సరానికి జిల్లాలోని నేత కార్మికులకు సరియైన కూలీ అందేలా రూపకల్పన చేయడం వలన వీరికి సంవత్సరానికి సుమారు 6 నెలల పని కల్పించబడినది. అంతవరకూ సేట్లు, ఆసాములు కార్మికులు గా మూడు అంచెలుగా మనుగడ సాగిస్తున్న పరిశ్రమ లో పనిచేస్తున్న కార్మికులకు నేరుగా మేలు జరగడానికి 2022-23 వరకు ఏడు సంవత్సరాల లో సుమారు 2100 కోట్ల ఆర్డర్లు జారీ చేసి మరమగ్గాల నేత పరిశ్రమను ఆదుకునే ప్రయత్నం చేసినది.
టెస్కో విభాగం ద్వారా నేత పరిశ్రమలోని మూడంచెల వ్యవస్థ స్థానంలో కార్మికులతో కూడిన 127 మ్యాక్స్ సొసైటీలను స్వయం సహాయకంగా అభివృద్ధి చెందడానికి ఏర్పాటు చేసినది. అయితే ఈ సొసైటీలకు తగిన ఆర్థిక వనరులు స్తోమత లేకపోవడం వలన తిరిగి మాస్టర్ వీవర్స్ చేతుల్లోకే నేత పరిశ్రమ పాక్షికంగా వెళ్లిపోయినట్లు అయినది.
దీనికి తోడు సిరిసిల్ల జిల్లాలో 1970 నుండి కొనసాగుతున్న సహకార విద్యుత్ సరఫరా సంఘం కుటీర పరిశ్రమ కనెక్షన్లను 5 హె.చ్పీ లకు పైగా ఉన్న వాటిని 50% సబ్సిడీ ఎత్తి వేసి పారిశ్రామిక రంగం గా గుర్తించి యూనిట్ విద్యుత్తుకు 8 రూపాయల టారీఫ్ తో 2016 నుండి విద్యుత్ బిల్లింగ్ చేయడంవలన సుమారు 34 కోట్ల రూపాయల విద్యుత్తు బకాయలు పేరుకుపోయాయి. మరొకవైపు 2022-2023 సంవత్సరం బతుకమ్మ చీరలు సరఫరా చేసిన బకాయ300 కోట్లు ప్రభుత్వం నుండి రావాల్సి ఉన్నది. అయితే అనంతరం ఏర్పడిన ప్రభుత్వం ఇట్టి రూపాయల బకాయిని చెల్లించడమే కాకుండా సిరిసిల్ల నేత పరిశ్రమకు ఇందిరమ్మ స్వయం సహాయక చీరల ఆర్డర్లను ఇచ్చి పునరుత్తేజం కలిగించే ప్రయత్నం చేస్తున్నది .
అంతేకాక 5 హెచ్ పి ల వరకు ఉన్న కుటీర పరిశ్రమ గుర్తింపును 25 హెచ్పీ లకు వరకు పెంచి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. అయితే సెస్ సంస్థ పాత బకాయిలు చెల్లిస్తేనే ఇటీవల 25 హెచ్పి ల వరకు కుటీర పరిశ్రమగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం శోచనీయమైన అంశం. ఈ విషయంలో సంస్థ పాలకవర్గమూ, ప్రభుత్వము సరి అయిన నిర్ణయం తీసుకోవలసివున్నది. ఈ పరిశ్రమపై ఆధారపడిన మొత్తం 8000 మంది కార్మికులు వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తును ప్రభుత్వం సరియైన నిర్ణయం తీసుకొని తీర్చిదిద్దాల్సిన అవసరం అయితే ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తూ పరిశ్రమకు ఎప్పటికప్పుడు తగిన సహాయం అందిస్తున్నది. కర్ణాటక రాష్ట్రంలో 10 హెచ్పీల వరకు పూర్తిగా ఉచితంగా కరెంటును నేత పరిశ్రమకు అందజేస్తున్నది. ఈ పరిశ్రమ మొత్తాన్ని ఒకే గాటున కట్టేసి కేంద్ర ప్రభుత్వం 12% జీఎస్టీ విధించడం వలన నేత కార్మిక కుటుంబాలు మళ్లీ మళ్లీ సంక్షోభంలో కూరుకుపోతున్నది. వాస్తవంగా పర్లూమ్ పరిశ్రమ స్థితి ఇలా ఉంటే, సిరిసిల్లలో మూడు మాత్రమే సహకార చేనేత సంఘాలు పనిచేస్తూ ఉండడం గమనించవలసిన విషయం.