విప్లవాక్షర తేజం విరసం-యాభై నాలుగేళ్ల ప్రస్థానం

రాఘవ: దేశంలో అవినీతి, అసమానతలు, ఆశ్రిత పక్షపాతం, దోపిడీ పీడనలు పెరిగిన సమయంలో పుట్టిన విరసం.. ఇప్పుడు మళ్ళీ వికసిస్తుంది. అసలు విరసం పుట్టుక ఎలా జరిగిందో తెలుసా..

Update: 2024-07-02 06:01 GMT
ఆపరేషన్ గ్రీన్ హంటు కు వ్యతిరేకంగా విరసం నిర్వహించిన సదస్సులో ప్రసంగిస్తున్న అరుంధతి రాయ్ ( ఫైల్ ఫోటో )

-రాఘవశర్మ

తెలుగు నాట విప్లవాక్షర తేజంగా కొనసాగుతున్న విప్లవ రచయితల సంఘం(విరసం) 54వ ఆవిర్భావ సభ జులై 4న హైదరాబాదులో జరగనుంది. గత పదేళ్ళుగా దేశంలో పెరుగుతున్న హిందూత్వీకరణ, కార్పొరేటీకరణ, సైనికీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటాలకు బాసటగా ఈ ఆవిర్భావ దినం నిర్వహించనున్నారు. కార్పొరేటీకరణ, హిందుత్వీకరణ, సైనికీకరణను అంగీకరించబోమని ప్రజల పక్షాన విరసం చాటుతోంది. దారుణమైన నిర్బంధం, అణచివేత, దోపిడీ పీడనలను, హత్యా కాండను ప్రతిఘటించాలని పిలుపునిస్తోంది. చుట్టూ ఉన్న ప్రపంచం తప్పకుండా ఆశావహంగానే మారుతుందని భరోసా కల్పిస్తోంది.

ఫాసిజానికి ఉన్న సమ్మతిని ఎలా బద్దలు కొట్టాలో, జీవన రంగాలన్నిట్లో మరింత సృజనాత్మకంగా, విశాల ప్రాతిపదికగా ఎలా పోరాటాలను నిర్మించాలో ఆలోచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం చెప్పుకోదగ్గ మార్పు జరగకపోయినా, దేశం ఒక కొత్త దశలోకి ప్రయాణిస్తున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న విరసం ఆవిర్భావ సభ సందర్భంగా దాని స్థాపన, సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న నిర్బంధాలపై ఒక విహంగ వీక్షణం.

దేశంలో అవినీతి, అసమానతలు, ఆశ్రిత పక్షపాతం, దోపిడీ పీడనలు 60వ దశకంలో ఎక్కువయ్యాయి. వీటికి వ్యతిరేకంగా అప్పటి వరకు సాగిన రాజకీయ, సాహిత్య ఉద్యమాలు అలిసిపోయాయి. బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం, ఆంధ్ర దేశంలో శ్రీకాకుళ రైతాంగ ఉద్యమం మొదలైంది. ఆ ప్రభావంతో సమాజంలోని కుళ్ళును ఆగ్రహావేశాలతో ప్రశ్నిస్తూ యువకులయిన ఆరుగురు దిగంబర కవులు విరుచుకుపడ్డారు. వరంగల్ నుంచి తిరగబడు కవులు, గుంటూరు నుంచి పైగంబర కవులు, తిరుపతి నుంచి ‘లే’ కవులొచ్చారు. వీరంతా తెలుగు సాహిత్యంలో నెలకొన్న స్తబ్దతను బద్దలు కొడుతున్నారు. 1970 ఫిబ్రవరి 1న విశాఖపట్నంలో శ్రీ శ్రీ షష్టిపూర్తి సభ జరిగింది. అలసిపోయి, పాలకుల పంచన చేరిన కవులపై ‘సిల్కు లాల్చీలో కూర్చున్న సిగ్గులేని బృహన్నల’లంటూ జ్వాలాముఖి ఆ సభలోనే ఆవేశంగా మాట్లాడారు.

విరసం ఆవిర్భావం

1970 జూలై 4వ తేదీన శ్రీ శ్రీ, కేవియార్, రావి శాస్త్రి, వరవరరావు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, రంగనాథం, శ్రీ పతి, నగ్నముని, ఉమామహేశ్వరరావు, కేశవరావు, శ్రీ నివాసరావు, హరిపురుషోత్తమరావు, పినాకపాణి, చలనాని ప్రసాద్ లతో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. అదే ఏడాది అక్టోబర్ లో ఖమ్మంలో విరసం తొలి మహాసభ జరిగింది. తొలి మహాసభలో శ్రీశ్రీని అధ్యక్షులుగా, కేవియార్‌ను కార్యదర్శిగా, కుటుంబరావు, రావిశాస్త్రిలను ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు.


 


తొలి రోజుల్లో జరిగిన విరసం సభలో ప్రసంగిస్తున్న కొడవటి గంటి కుటుంబరావు, పక్కన జ్వాలాముఖి, శ్రీ శ్రీ

విరసం అధికారిక సాహితీ సాంస్కృతిక త్రైమాసిక పత్రికగా ‘అరుణతార’ 1977లో ఆవిర్భవించినా , 1980 నుంచి అది మాసపత్రికగా మారింది. వివిధ సాహిత్య కార్యక్రమాలే కాకుండా, సాహిత్య ప్రక్రియలపైన, సాహిత్య సామాజిక పరిణామాలపైన, సాంస్కృతిక కార్యక్రమాలపైన అధ్యయన తరగతులు, సభలు, సమావేశాలు నిర్వహించింది. తెలుగులో వచన కవిత్వాన్ని విరసం తన సొంతం చేసుకుంది.

నిర్బంధాల పర్వం

ఈ యాభై నాలుగేళ్ల కాలంలో విరసం ప్రయాణం సాఫీగా సాగలేదు. శ్రీ శ్రీ సంపాదకత్వంలో వెలువడిన ‘ఝంఝ’ ను ప్రభుత్వం 1970లోనే నిషేధించింది. వరవరరావు ‘భవిష్యత్ చిత్రపటం’ను కూడా నిషేధించింది. విరసం సభ్యులైన ఎం.వి. రమణారెడ్డి, జ్వాలాముఖి, నిఖేలేశ్వర్, చెరబండరాజులను పీడీ యాక్ట్ కింద ప్రభుత్వం నిర్బంధించింది. మీసా కింద వరవరరావు, చెరబండరాజు, ఎంటి ఖాన్ లను అరెస్టు చేసింది. సికింద్రాబాద్ కుట్ర కేసు పెట్టి కె.వి. రమణా రెడ్డి, త్రిపురనేని మధుసూదన రావు, చెరబండరాజు, ఎం.టి. ఖాన్, రంగనాథంలను అరెస్టు చేసింది. త్రిపురనేని మధుసూదన రావు, జ్యోతి, సంవర్తలపై 1979లో చిత్తూరు కుట్రకేసు మోపి అరెస్టు చేసింది.

వరవరరావు సహా అనేక మందిపై రామ్ నగర్ కుట్ర కేసు మోపి ఎంతో మందిని అరెస్టు చేసింది. ఈ కేసులో 17 సంవత్సరాలు విచారణ జరిపి చివరికి కొట్టేశారు. ఎన్. వేణుగోపాల్, పాణి, చెంచయ్య, రవికుమార్‌లను 2005లో అరెస్టు చేసి ఔరంగాబాద్ కుట్రకేసు మోపింది. అదే సంవత్సరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం విరసాన్ని నిషేధించింది. వరవర రావు పైన భీమా కోరేగాన్ కేసు పెట్టి ఐదేళ్లు జైల్లో నిర్బంధించి , అనేక ఆంక్షలతో ఇటీవల బెయిల్ ఇచ్చింది.

ఇటీవల కాలంలో విరసం సభ్యులైన పాణి, వరలక్ష్మి, అరసవెల్లి కృష్ణ, రివెరా, సాగర్ క్రాంతి తదితరుల ఇళ్ళపై ఎన్ఐఏ దాడులు చేసి పుస్తకాలను, కంప్యూటర్ వంటి ఆధునిక పరికరాలను పోలీసులు ఎత్తుకుపోయారు. ఇలాంటి అనేక నిర్బంధాలను విరసం సభ్యులు ఎదుర్కొంటున్నారు. ఇక చాలా మంది విరసం సభ్యులు ఎమర్జెన్సీ కాలంలో జైళ్లలోనే మగ్గిపోయారు.

విరసం మహా సభల ప్రారంభంలో విరసం జెండా ఆవిష్కరించిన వరవ ర రావు( ఫైల్ ఫోటో )

 

విరసంలో కొత్త రక్తం

ఒకరిద్దరు తప్ప విరసం తొలితరం సారథులంతా జీవితం నుంచి నిష్క్రమించారు. పాతతరం అనుభవాలతో నూతన తరం వచ్చింది. అరుణతార మాసపత్రికతో పాటు ‘వసంత మేఘం’ అన్ లైన్ పక్షపత్రికను కూడా విరసం నిర్వహిస్తోంది.

ఆధునికతను అందిపుచ్చకోవడంలో భాగంగా విరసం యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తోంది. ఈ ఛానల్‌ను ఏడాదికి పది లక్షల మంది చూస్తున్నారు.

విరసం సభ్యులతో పాటు ఇతర అభ్యుదయ కాముకులైన రచయితలతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. స్త్రీవాద, మైనారిటీ, ముస్లిం వాద సాహిత్యాన్ని కూడా స్వాగతిస్తున్నారు. సాహిత్య లోకం నుంచి అనేక మంది విరసాన్ని అభిమానిస్తున్నారు. కథల వర్క్ షాపులను 1980 నుంచి నిర్వహిస్తోంది. ఈ వర్క్ షాపులకు విరసం సభ్యులనే కాకుండా ఇతరులను కూడా ఆహ్వానిస్తోంది.

విరసం ప్రచురణలు

ప్రస్తుతం ఒక ఏడాది విరసం మహాసభలు నిర్వహిస్తే, మరొక ఏడాది సాహిత్య పాఠశాల నిర్వహిస్తోంది. విరసం ప్రతి ఏడాది పది నుంచి పదిహేను పుస్తకాలను ప్రచురిస్తోంది. ఇవి కాకుండా విరసం సభ్యులు కాని ఇతర అభ్యుదయ కాముకులైన వారి రచనలను కూడా ఈ విరసం సభల్లో, సాహిత్యపాఠశాలల్లో ఆవిష్కరిస్తున్నారు. ఇటీవల అలా వచ్చిందే ‘వియ్యుక్క’ కథా సంకలనాలు. సాహిత్య పాఠశాలల్లో సాహిత్యంలోని వివిధ ప్రక్రియలపైన చర్చలు జరుగుతున్నాయి.

ముంచుకొస్తున్న ఫాసిజం

హిందూత్వ ఫాసిజం ముప్పు ముంచుకొస్తోంది. దీనికి ‘వికసిత్ భారత్’ అని పేరుపెట్టారు. దీన్నే ‘న్యూ ఇండియా’ అంటున్నారు. ఇది సంఘ్ పరివార్ ఆలోచన మాత్రమే కాదు, దాని రాజకీయాంగమైన బీజేపీ లక్ష్యం కూడా. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన పార్టీలన్నీ మోడీ వికసిత భారత్ మాటకు మురిసిపోతున్నాయి.

వికసిత్ భారత్ కోసమే కగార్ యుద్ధం నడుపుతూ, గడిచిన జనవరి ఒకటి నాటికి 130 మందిని దారుణంగా చంపేశారు. ఇందులో సాధారణ ఆదివాసీలతో పాటు, విప్లవకారులు కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మోడీని ప్రధానిని చేస్తే రెండేళ్ళలో విప్లవకారులందరినీ(నక్సలైట్లందరిని) చంపేస్తామంటున్నారు. హిందూ భావజాలం కల బీజేపీ సహజంగానే మావోయిస్టు, ముస్లిం వ్యతిరేక భావజాలంతో యుద్ధానికి దిగింది. ఈ మొత్తం నిర్మూలన పేరే వికసిత భారత్ కొనసాగుతోంది.

విరసం ఆవిర్భావ సభ

పాలక వర్గాల ధోరణులకు వ్యతిరేకంగా, అందుకోవలసిన పోరాటాలకు మద్దతుగా ప్రజలను భావజాల సాంస్కృతిక రంగాల్లో సమాయత్తం చేయడం కోసం విరసం కృషి చేస్తోంది. ఈ లక్ష్యంతో విరసం ఈ ఆవిర్భావ సభను ఈనెల 4న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన భవన్ లో నిర్వహించనున్నది. ఈ సభలో ‘న్యూ ఇండియా- అభివృద్ధి నమూనా’ అన్న అంశంపైన కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక కమిటీకి చెందిన హెత్మామ్, వికసిత్ భారత్ గురించి వరలక్ష్మి, హిందూత్వ కార్పొరేట్ కగార్ యుద్ధంపైన పాణి ఫాసిస్టు వ్యతిరేక భవిష్యత్ రాజకీయ సాంస్కృతిక పోరాటాలపైన రివేరా ప్రసంగిస్తారు.

Tags:    

Similar News

ఆమె ఒక తోట