ఒక అడవి ఒక రాఘవ అనే పరుసవేది"!

శేషాచలం కొండల్లో..'(తిరుమల దృశ్య కావ్యం-2)కి గీతాంజలి రాసిన ముందుమాట మొదటి భాగం)

Update: 2024-12-25 02:30 GMT

తిరుమల దృశ్య కావ్యం రెండవ భాగం 'శేషాచలం కొండల్లో..' చదవడం పూర్తయ్యేసరికి ట్రెక్కింగ్ వలన మనుషుల్లో.. వాళ్ళ స్వభావాల్లో ఇంత మార్పు వస్తుందా అని ఆశ్చర్యం వేస్తుంది. పచ్చని అడవిలో జలపాతాలు, సెలఏళ్ళ మధ్య కొండకోనల్లో ట్రెక్కింగ్ చేయడం ఇంత అద్భుతమైన ఆనందానుభవాన్నిస్తుందా అనిపించింది.

'శేషాచలం కొండల్లో ..` పుస్తకానికి రచయిత రాఘవగారు ముందు మాట రాయమన్నప్పుడు, ట్రెక్కింగ్ గురించి కనీస అవగాహన లేని నేను రాయలేనేమో అన్న సందేహాన్ని వెలిబుచ్చాను. “మీరు రాయగలరు. మీ మీద నాకు నమ్మకం ఉంది.” అన్నారు రాఘవ గారు.

పుస్తకం చదువుతూ ఉంటే రచయితతో పాటు నేనూ నా పంచేంద్రి యాలతో అనుభూతి చెందుతూ, ప్రతీ ఎత్తైన కొండా భయంగా ఎక్కాను. ప్రతి గుహలోకి ఆశ్చర్యంగా నడిచాను. ప్రతీ లోయలోకి పాదాలు తడబడుతుంటే దిగుతూ పోయాను. అనేక జలపాతాల ముత్యాలధారల జల్లుల్లో నిలువెల్లా తడిసిపోయాను. కళ్ళెత్తి ఆ జలపాతాల ఉధృతాన్ని ఆకాశం నుంచి చూశాను. అద్భుతమైన, మార్మికమైన ఆ ఆకుపచ్చని రంగుతో మెరిసే నీటి గుండాల్లో చల్లని, వెచ్చని నీటి స్పర్శ అనుభవిస్తూ.. చర్మంలో ఇంకించుకుంటూ ఈదులాడాను.

ఈ నీటి గుండాల్లో సూర్యకాంతి పడే ఆకుపచ్చ నీళ్ళ రంగు తళతళ మెరుపుల్ని మనసు కాన్వాసు మీద చిత్రిస్తూ పోయాను. ఆ జలపాతాల కొండల్లో గుహల్లో వాటి సంగీతధ్వనిని తన్మయంగా వింటుండి పోయాను. నీటి అడుగులోని రాళ్ళ రంగుల్ని, వాటి జారుడుతనాన్ని, కొండలెక్కినప్పుడు తడిసిన మట్టిమీద పాదాలు మోపుతూ నేనూ జారబోయి, ఏ కొమ్మనో పట్టుకుని సంభాళించుకుంటూ, చీలిన రాతి కొండల్లోని సౌందర్యాన్ని దర్శించాను.

రెండు కొండల నడుమ గాలి చేసే శబ్ద సంగీతం కొండ కొండకీ మధ్య మారడాన్ని, అంతెత్తు నుంచి కిందికి దుంకే జలపాత నవ్వడుల్ని ఆయనతో పాటు నేను విన్నాను. దారికడ్డంగా వచ్చే ఎలుగుబంటు, అడవి జింకలు, నెమళ్ళు, అడవి కోళ్ళని చూసి నేనూ సంబరపడ్డాను. ఇంతగా రాఘవగారి రచనా శైలిలో పాఠకులని అనుభూతి మాధుర్యంలో ముంచే శక్తి ఉంది. ఆయన కళ్ళతో మనం కూడా ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ పరవశించిపోతాం. అనుభూతి ఐక్యతలోకి లోనవుతాం. అంతే కాదు, ఎంతగా ఆయన ట్రెక్కింగ్ సాహిత్యంతో ప్రభావితమవుతం అంటే, వెంటనే ట్రెక్కింగ్ కి బయలుదేరాలనిపిస్తుంది. అంతలా ఈ పుస్తకం పాఠకుల్లో, ట్రెక్కింగ్ ప్రియుల్లో స్ఫూర్తిని నింపుతుంది.

రాఘవ అనే ఒక నిత్య ప్రకృతి సంచారిలో, బాటసారిలో తన తోటి మనుషుల్ని భౌతికంగానే కాదు, తన రచనలతో కూడా అద్భుతమైన అరణ్య సంచారం ఊహల్లో చేయించగల మాంత్రిక శక్తి ఉంది. చెట్లను, పుట్టలను, పిట్టలను పలకరించడం, వెన్నెల్లో నిద్రించడం, అడవి మల్లెల గుబాళింపుని, సెలయేటి సంగీతాన్ని, జలపాత హెూరుని వినడం..

అవును మీరిది చూశారా? ఆకుల పచ్చదనంలో, గరిక గరుకుదనంలో కూడా అమ్మని ఒక అలాపనగా తులుచుకుంటూ ఈ అరణ్య ప్రయాణం చేశారా? నేనైతే ఊహల్లోనే చేశాను. అకాంక్ష ఉన్నా అడవికి వెళ్ళలేకపోయాను. కానీ, రాఘవగారు ముప్పై ఏళ్ళుగా అరణ్య ప్రయాణం చేస్తూనే ఉన్నారు.

ఆయనొక అరణ్య ప్రేమికుడు. నిత్యం జలపాతాలు, సెల ఏర్లు, నీటి గుండాలు, కొండలూ, గుహలు లోయల్ని అన్వేషిస్తూ.. దొరికిన ప్రతి జల సౌందర్య ఝరిలో దుముకుతూ, ఈదులాడుతూ, జలపాతాల నీటి ధారల్లో తడుస్తూ గుండాల్లో దుంకి మునకలేస్తూ, వాటి లోతుల అద్భుత సౌందర్యాన్ని, ప్రతి రాతిలో.. ముత్యపు చిప్పల్లో.. పచ్చటి జారుడు నాచుల్లో కనుక్కొంటూ తానే ఒక జలపాతం అయిపోవడం, తానే ఒక నీటి గుండం అయిపోవడం, తానే ఒక అడవిగా.. అడవిలోని వెలుగు నీడల మార్మిక సౌందర్యంగా అయిపోవ డం..

ఈ ప్రపంచాన్ని మరిచిపోయి ఒక 'అలౌకిక ఆనందాన్ని' పొందడం, మనుషులకు దూరంగా.. అడవులు, ఎడారులు, ఒయాసిస్సులు వేలవేల కిలోమీటర్ల 'దూరాలు 'నడిచి చివరాఖరికి బంగారాన్ని కనుక్కొన్న పరుసవేదిలా రాఘవ గారిని ఈ అరణ్య యాత్రలో దర్శించాను. పరుసవేదిలా ఆయన చివరాఖరికి అడవిలో కనుక్కున్న సూత్రం మానవ ప్రేమ, సమానత్వం, సమిష్టితత్వం, సంతోషం, సంతృప్తి, స్వీయ సందర్శనం. ఇవి ఎక్కడో లేవు, ప్రకృతిని, మనిషిని ప్రేమించే మనలోనే ఉందని రాఘవగారు ఈ సుదీర్ఘమైన ట్రెక్కింగ్ యాత్రలో కనుక్కున్నది.

ముప్పై ఏళ్ళ బట్టి రాఘవ గారు తిరుమల కొండకోనల్లో చేస్తున్న ట్రెక్కింగ్ యాత్రలు చూస్తుంటే ఆయనొక పరుసవేదిలా అనిపిస్తారు. అంటే, లోహాల నుంచి విలువైన బంగారాన్ని తయారు చేయడం. అందరూ పరుసవేదులు కాలేరు. తనను తాను నిత్యం ఆత్మపరిశీలన చేసుకుంటూ, తన లోపల ఉన్న ఏ కొద్ది లోపాలను శుద్ధి చేసుకుంటూ, కొత్త మనుషులుగా తయారయ్యే మనుషులే పరుసవేదులు అవుతారు.

రాఘవగారి సుదీర్ఘ యాత్ర జీవితం చూస్తుంటే పరుసవేది (The alchemist )అని పాలో కోయిలో రాసిన అద్భుతమై పుస్తకం గుర్తుకు వస్తుంది. ఈ నవలలో కథానాయకుడు గొర్రెల కాపరి శాంటియోగో గుర్తుకు వస్తాడు. స్పైన్ ప్రాంతంలో శాంటియాగో అనే యువకుడు గొర్రెల కాపరిగా తన ప్రయాణం ప్రారంభిస్తాడు. మధ్య మార్గంలో నిధి అన్వేషణలో పడతాడు. ఆ అన్వేషణలో భాగంగా అతని ప్రయాణం స్పైన్ నుంచి ఈజిప్ట్ ఎడారుల దాకా నిరవధికంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రయాణంలో అతను అనేక కష్టాలు, అడ్డంకులు ఎదుర్కుంటూ ముందుకి సాగిపోతూనే ఉంటాడు. ఎక్కడా నిధి దొరకదు. ప్రయాణం ముగింపు దశలో తనెక్కడి నుంచయితే మొదలైనాడో అక్కడే నిధి ఉందని తెలుసుకుంటాడు.

ఈ నవల సారాంశం ఏంటంటే మనిషి శాంతి కోసం, సంతోషం అనే నిధి లేదా సంపద కోసం మనిషి ఎక్కడెక్కడో అన్వేషిస్తూ అశాంతిగా సంచరిస్తూ ఉంటాడు. ఒక చోట దొరక్క మజిలీలు మారుస్తూనే ఉంటాడు. అయితే అది ఎక్కడో భౌతిక విషయాల్లో దొరకదు. మనలోపలే ఉంటుంది. దాన్ని అందుకోవాలి, తెలుసుకోవాలి. అదే అలౌకికమైన ఏకాంతం solitude. ఈ ప్రయాణంలో శాంటియాగో ప్రకృతిని, ప్రపంచాన్ని అర్థం చేసుకున్న రసవాదిలా ఒక గుణాత్మక పరిణామం చెందుతాడు.

ప్రపంచంలో ఏ లోహాన్నైనా బంగారంగా మార్చేదాన్నే పరుసవేది అని అంటారు. అనేక సంవత్సరాలు లోహాలను అగ్నికి చాలా దగ్గరగా ఉంచుతూ శుద్ధి చేయవలసి ఉంటుంది. ఆ శుద్ధిచేసే క్రమంలో వారి దేహమూ రంగూ భౌతిక ప్రపంచానికి దూరంగా ఉండడం వల్ల వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటాయి. లోహాలను శుద్ధి చేస్తూ తాము కూడా శుద్ధి అవుతున్నట్టు ఈ రసవాదులు/ పరుసవేదులు కనుక్కుంటారు, లేదా గ్రహిస్తారు.

ఆ గొర్రెల కాపరి తను కన్న కలలో చూసిన నిధిని అన్వేషించే ప్రయాణంలో తాను గొర్రెల నుంచి ఏం నేర్చుకున్నాడు, నీటి నుంచి, గాలి నుంచి ఏం నేర్చుకున్నాడు, ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు ఏం నేర్చుకున్నాడు, ప్రకృతి నుంచి ఏం నేర్చుకున్నాడు, తోటి మనుషుల నుంచి, జంతువుల నుంచి.. ముఖ్యంగా తన ఆత్మ నుంచి ఏం నేర్చుకున్నాడు అనేదే ఈ పరుసవేది నవల ముఖ్య సారాంశం.

రాఘవగారు కూడ అచ్చం పరుసవేదిలా తిరుమల కొండలలో ప్రయాణిస్తూ ప్రకృతితో, గాలి, నీరు, కొండలు, జలపాతాలు, జంతువులు, మంచు, ఆకులు, తోటి మనుషులు, పువ్వులు అన్నిటితో సంభాషిస్తూ, పరిశీలిస్తూ ముందుకు సాగిపోతూ చేసిన ప్రయాణంలో కొత్త విషయాలు నేర్చుకుంటూ, తోటి మనుషులకి నేర్పించారు కూడా. ఈ ముప్పై ఏళ్ళుగా రాఘవగారు చేసిన ట్రెక్కింగ్ యాత్రలో ఆయన ప్రకృతిలోని సౌందర్యాన్ని, ప్రకృతిలోని బీభత్సాన్నే కాదు, యాత్రలు చేసినప్పటి మనుషుల స్వభావాల్లోని నలుపు తెలుపు రంగుల్ని కూడా జల్లెడ పట్టారు.

అందరికీ సాయం చేసే మధు లోని అంతఃసౌందర్యాన్ని, వెటర్నరీ డాక్టర్ ప్రసాద్ సౌజన్యాన్ని, అడవిలో దారి చూపిస్తూ, మోగించని మురళిని చేతపట్టుకుని తిరిగే అనాథ సాధువైన బాలాజీలోని చిరునవ్వులోని ఏకాంత దుఃఖాన్ని ఆయన ఎంతో సునిశితంగా గమనించారు. చాలా సార్లు బాహ్య ప్రపంచంలో కలవరపెట్టే వేదన, బాధకు గురిచేసే భౌతిక పరిస్థితులకు దూరంగా ప్రకృతిలో సాంత్వనని, శాంతిని పొందాలని బయలుదేరితే.. వివిధ సమూహాల, భిన్న ప్రాంతాల, మతాల, వర్గాలకి, కులాలకి సంబంధించిన వ్యక్తుల, స్త్రీల, పురుషుల(జెండర్) వ్యక్తిత్వాల అసలైన రంగులు బయటపడి గాయపరుస్తాయి. లేదా వాళ్ళ సౌజన్య, సంస్కారాలు అబ్బురపరుస్తాయి.

నేను చేసిన మూడు యాత్రల్లో జరిగిన సంఘటనలు నన్ను ఊపిరి ఆడనివ్వలేదు. ఆ యాత్రల్లో కులపట్టింపులు, (ఒక పీడిత కులానికి చెందిన రైటర్కి మరో ఆధిపత్యకులానికి చెందిన ప్రోగ్రెసివ్ రచయిత తన గ్లాసు ఇవ్వకపోవడం.. ఒక యాత్రలో కళ్ళారా చూసి నేను చాలా మనోవేదనకు గురి అయ్యాను). భోజనాల దగ్గర, టీల దగ్గర పడుకునే స్థలాల దగ్గర గొడవలు మంద్ర, తీవ్ర స్థాయిలో కఠినమైన, క్రూరమైన రూపాలు తీసుకుని, నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని అరుచుకునే మనుషులు మనకు యాత్రల్లో కనిపిస్తారు.

ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితిలో ఉండే వారికి మందులు అందించకుండా, సాయం చేసే స్థితిలో ఉంటూ కూడా తమ స్వార్థం చూసుకునే మనుషులు కూడా యాత్రల్లో గాయపరుస్తారు. సాధారణ మనుషులు ఇలా ఉంటే మామూలే కదా అనుకోవచ్చు. కానీ, ప్రొగ్రెసివ్ భావజాలం ఉన్న కవులు, కళాకారులు, రచయితలు, మేధో సృజనకారులు రంగంలో ఉన్న వాళ్ళను కూడా ఈ పాత్రల్లో చూస్తున్నప్పుడు హృదయంలో నొప్పి సుడులు తిరుగుతుంది. వెలుగు కాస్తా చీకటిగా కనిపించినప్పుడు దుఃఖం వస్తుంది. అయోమయం అవహిస్తుంది. దిక్కు కనపడదు. కానీ నిజం ఇలాగే ఉంది.

ఊర్లలో పీడిత కులానికి చెందిన ఒక ప్రగతిశీల రచయిత్రి విషయంలో నా కళ్ళ ముందు జరిగిన క్రూరమైన అవమానం జీవన పర్యంతమూ మరవను. కానీ, ఇది ఇక్కడ కూడా అడవిలోని క్రూరమైన జంతువుల్ని, మనుషుల్ని కాటేసే పాముల్ని, ముంచెత్తే జలధారలను, తోసేసే లోయలను, ముంచేసే లోతైన నీటి గుండాలను క్షమించి తనలో ఇముడ్చుకున్న ఈ అడవి ఈ మనుషుల మాలిన్యాలనూ అర్థం చేసుకుంటుంది.

అడవి, కొండలు, కోనలు, జలపాతాలు, మైదానాలు, జంతువులు అన్నీ మనిషిని క్షమిస్తాయి కాబోలు. అందుకే అడవి నిశ్శబ్దంగా మనుషుల్ని ఆహ్వానిస్తుంది. జంతువులు హుందాగా పక్కకు తప్పుకుని దారి ఇస్తాయి. రాఘవగారు తన ముప్పై ఏళ్ళ ట్రెక్కింగ్ ప్రయాణపు చరిత్రలో ఒక పరుసవేదిలా ఒక అడవి నుంచి మరో అడవికి, ఒక జలపాతాలు, నీటి గుండాల నుంచి మరో జలపాతాలకు ప్రయాణించి.. ప్రయాణించి, ఈది ఈది ఆయన కూడా అన్ని రకాల స్వభావాలున్న మనుషుల్ని చూసిన అనుభవం వల్ల ఆయనలో మనుషుల్లోని మంచితనం పట్ల నమ్మకం పెంచిన వ్యక్తులు, గాయపరిచిన మనుషులూ తారసపడే ఉంటారు.

రాఘవగారి వ్యాసాలు చదివాక అర్థం అయిన మరో ముఖ్యమైన విషయం, ట్రెక్కింగ్ వల్ల వొనగూడే మానసిక, శారీరక ఉపయోగాలు. ఎప్పుడూ వివిధ ప్రాంతాలకు తరుచూ ప్రయాణం చేయడం అన్నది జీవితంపై పాజిటివ్ ప్రభావితం చేయడంతో పాటుగా మనిషి వ్యక్తిత్వాన్ని కూడా రకరకాలుగా ప్రభావితం చేస్తుందని ఆయన అనుభవంలో తేలింది. అందుకే ట్రెక్కింగ్ జీవితంలో ముఖ్యమైన భాగం అవ్వాలి. నెలలో ఒక్క సారైనా ట్రెక్కింగ్ చేయాలని సూచిస్తారు. ఆయన పరిశీలనలో తేలిన అంశాలు.. లేదా ఆయన చెప్పాలనుకున్న అంశాలు వరుసగా..ప్రయాణాలు/ట్రెక్కింగ్ ప్రపంచంమ్మీద మనిషి దృక్పథాన్ని మార్చేసి కొత్త సవాళ్ళను ఎదుర్కొనేలా చేస్తుంది.

విసుగు పుట్టించే రోజువారి జీవితం నుంచి మనం చేసే ఈ ప్రయాణాలు ఒకింత సాంత్వనను, మార్పుని సంతోషాన్ని తృప్తిని కలిగిస్తాయి. అలా మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అంతే కాదు ప్రయాణం చేయడం వలన మెదడులోని రివార్డ్ సెంటర్ ఉద్వేగ ఆనందాలనీ, భావోద్వేగ అనుభూతులను ప్రేరేపించి, కొత్త అనుభవాన్ని అందుకునేలా చేస్తుంది. కొత్త ప్రాంతాలకి, మనకు వెరపు ఉన్న ప్రాంతాలకి ప్రయాణాలు చేయడం వలన లోపలి భయాలను పిరికితనాన్ని అధిగమించి, ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి.

జీవితంలో ఒత్తిడిని అధిగమించడానికి, లేదా ఒత్తిడికి నెగెటివ్, తీవ్రంగా ప్రతిస్పందించడాన్ని నిరోధించడానికి ఈ ట్రావెలింగ్ ట్రెక్కింగ్ అనుభవాలు సహాయపడతాయి. మనకి ఏది ముఖ్యమో ఎంత వరకు ముఖ్యమో తెలుసుకునే అవకాశాన్ని కూడా ఈ ప్రయాణాలు నేర్పిస్తాయి. అతి తక్కువ వస్తువులలో ప్రయాణించడం అనేది జీవితంలోని సింప్లిసిటీని పెంచుతుంది. జీవన విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ప్రయాణాలు ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడంతో అటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

ప్రయాణాల్లో సాటి మనుషుల పట్ల సహానుభూతి పెరగడం, తమ గురించి తాము తెలుసుకోవడంతో పాటు ప్రయాణీకుల మధ్య పరస్పర నమ్మకం పెరుగు తుంది. ఈ ప్రయాణంలోనే నిత్యం తోటి ప్రయాణీకుల గురించి అలోచిస్తూ, స్పందించి అదుకునే మధు, వెటర్నరీ డాక్టర్ ప్రసాద్, అనాథ స్వామి బాలాజీలను కనుక్కున్నారాయన పరుసవేది బంగారాన్ని కనుక్కున్నట్టు. తన వ్యాసాల్లో ఈ ట్రెక్కింగ్ వలన మనుషుల మధ్య మనుషుల్లోపల ఏమేం మార్పులు వస్తాయో కూడా ఆయన ప్రతీ వ్యాసంలో రాస్తారు, లేదా మనకి అర్థం అవుతుంది రాఘవగారి మాటల్లో.

తిరుపతికి నేను చాలా చిన్నప్పుడు వెళ్ళాను. నాన్న గారిది చిత్తూరు గిరింపేట. తిరుపతి, చిత్తూరు, కడప, అసలు రాయలసీమ అంతటా మా నాన్న వైపు వాళ్ళున్నారు. వాళ్ళంతా తమిళ తెలుగు మాట్లాడేవారు. తాతగారు కరణం వెంకటరాయ పిళ్ళై కాణిపాకం కో ఫౌండర్సులో ఒకరు. మా పెద్ద మామయ్య కుమార స్వామి బొటన వేలు పట్టుకుని నాకు పదేళ్ళు ఉంటాయేమో తిరుపతి కొండ ఎక్కాను. కొండ చుట్టూ ఉన్న పచ్చదనం అప్పుడే నన్నెంతగానో ఆకర్షించింది. కానీ, అప్పటి నించీ ఇప్పటి దాకా తిరుపతి పెద్దగా వెళ్ళ లేదు.

తిరుపతి కొండల్లోపల అడవుల్లో తిరుమల చుట్టూ ఇంత అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉందని వినడమే కానీ, రాఘవ గారి వ్యాసాలు చదివాక కళ్ళతో చూసినట్లే అయ్యింది.

అసలింతకీ రాఘవ గారు ట్రెక్కింగ్ కు చెప్పిన నిర్వచనమే అనిర్వచనీయ మైంది, సౌందర్యవంతమైంది, సామాజిక మైనది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాల్ని కవిత్వంలా కావ్యంలా చెప్పడంలో తిరుమల దృశ్యకావ్యానికి ఒక పొయెటిక్ జస్టిస్ సమకూరినట్టయింది. తనని తాను మహత్ సౌందర్యంతో లొంగ దీసుకున్న గుంజన జలపాతంలో సాహసోపేతంగా దుంకి, ఆ సౌందర్యంలో తాదాత్మ్యం కావడమే కాదు, రాఘవగారిలోని కవి గుంజన మీద అద్భుతమైన కవిత కూడా రాశారు. ఆయనకు గుంజన ఒక నయాగరా.

రాఘవ గారికి ట్రెక్కింగ్ అంటే సన్నగా ప్రవహించే సెలయేటి మంద్రమైన సంగీతాన్ని అస్వాదించడం. ఉధృతంగా ప్రవహించే సెల ఏటికో, గుండాల్లోకో దుమికే జలపాతపు హెూరుని వినడం, అంతు పట్టని లోయల్లోకి సాహసోపేతంగా దిగడం, ఎత్తైన కొండల్ని నిర్భయంగా ఎక్కడం, లోతైన నీటి గుండాల్లోకి దుంకడం, తనివి తీరా ఈదడం. ట్రెక్కింగ్ అంటే రంగురంగుల, వివిధ రూపాల్లోకి మారిన చీలిన కొండల్లోని సౌందర్యాన్ని దర్శించడం, అడవిలోని చెట్లతో, పుట్టలతో, పిట్టలతో, జంతువులతో, తడిపేసే మంచుతో మాట్లాడడం. అడవిలోని మార్మిక నిశ్శబ్దంలో వెన్నెల్లో పడుకుని నిలువెత్తుగా పెరిగిన చెట్ల కొమ్మల నుంచి ఆకాశంలోని నక్షత్రాలను, చంద్రుణ్ణి, మేఘాలను చూస్తూ నిద్రపోవడం.

ఎత్తుగా కమ్మేసిన కొండ వల్ల తుంబురు సౌందర్యం చూసే అదృష్టం సూర్య చంద్రులకు లేదని వాపోవడం. అడవి తల్లి సౌందర్య సుగంధాన్ని.. పచ్చని ఆకుల మీద వెన్నెల పడ్డప్పుడో.. నీరెండ పరుచుకున్నప్పుడో, జలపాతం నీటి బిందువులు మెరిసినప్పుడో మారే ఆకుల, గడ్డిపరకల, రెల్లు పొదల పచ్చని సౌందర్యాన్ని కళ్ళ కెమెరాల్లోకి తీసుకోవడం.. అడవి మల్లెల మరిమళాల్ని ఆస్వాదించడం. మరిగుజ్జుగా మారి అడవికి మోకరిల్లడం. ప్రతీసారీ ట్రెక్కింగ్ ఆయనకు కొత్త అనుభవాన్నిస్తుంది. ఆ అడవి సౌందర్యం ఎన్నటికీ ఆయనకి మాసిపోదు. అడవిని ఎండగొట్టిన వేసవిలో కూడా ప్రేమిస్తారు.

రాఘవగారి ట్రెక్కింగ్ నిర్వచనం సామాజికం అని ఎందుకన్నానంటే.. ఆయన మాటల్లోనే ట్రెక్కింగ్ అంటే హిమాలయాలకో, అమరనాధ్ కో యాత్ర చేయడం కాదు.. అంటే ఎక్కడో మనకందనంత దూరాల్లో ఉండే కొండలను ఎక్కడం కాదు. మన చుట్టూ మన పరిసరాల్లో మనకందుబాటులో ఉండే కొండకోనల్లోకి జలపాతాలు సెలయేళ్ళలోకి ప్రవహించే ప్రకృతిలో యాత్రచేయడమే ట్రెక్కింగ్ అంటారాయన.

( చివరి భాగం ఉంది)

Tags:    

Similar News