వెంకటకృష్ణ కవిత్వం - పరామర్శ
రైతుల, శ్రామికుల దుఃఖాలు ఈయన కవిత్వంలో వస్తువులు
ఇటీవల ‘హోరు’ ప్రచురణలు వారు పుప్పాల శ్రీరాం, అనిల్ డ్యానీ ల సంపాదకత్వంలో కవి, కథకులు, విమర్శకులు అయిన జి. వెంకటకృష్ణ గారు రాసిన కవితల్లో కొన్నింటిని ఎంపిక చేసి “వెంకటకృష్ణ కవిత్వం” పేరుతో ఒక కవితా సంపుటిని వెలువరించారు. ఈ సంపుటిలోని “దున్నేకొద్ది దుఃఖం” అనే శీర్షికన ఉన్న పదహారు కవితలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.
జి.వెంకటకృష్ణ కథకులు, కవి, విమర్శకులుగా ప్రసిద్ధులు. ఏది రాసినా మనసు పెట్టి రాస్తారు. నిజాయితీ నిక్కచ్చితనం ఆయన సొంతం. రాయలసీమ రచయితగా బహుజనుడిగా ఆయన రచనకు మాటకు ఎంతో విలువుంది. అనంతపురంజిల్లాలో బూడిదగడ్డపల్లె (గోరంట్ల మండలం) లో పుట్టారు. హైస్కూల్, (బెస్తరపల్లి కంబదూరు మండలం) ఇంటర్, కళ్యాణదుర్గంలోనూ చదివారు. డిగ్రీ బెంగళూరులో బెంగళూరు యూనివర్సిటీ, ఎం.ఏ. ఎం.ఫిల్ (చరిత్రలో) శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురంలో చదివారు.
నాలుగు అంశాల ప్రాతిపదికగా “దున్నేకొద్దీ దుఃఖం” కవిత్వాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. అవి
- మార్క్సిస్ట్ దృక్పథం
- ఎకోక్రిటికల్ దృక్పథం
- పోస్ట్ కలోనియల్ దృక్పథం
- ఫార్మలిస్ట్ దృక్పథం
- మార్క్సిస్ట్ దృక్పథం:
మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రకారం, సాహిత్యం సామాజిక వర్గాల మధ్య సంఘర్షణను ప్రతిబింబించాలి. లూయీస్ అల్తూసర్ , టెర్రీ ఇగిల్టన్ లు ఆధునిక మార్క్సిస్టు తత్వవేత్తలు. లూయీస్ అల్తూసర్ (1918–1990) – ఫ్రెంచ్ మార్క్సిస్టు తాత్త్వికుడు. ఆల్తూసర్ ముఖ్యంగా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆధునిక తాత్త్విక దృక్పథంలో నిర్వచించాడు. ప్రభుత్వం కేవలం బలప్రయోగం (Repressive State Apparatus – పోలీస్,ఆర్మీ) ద్వారానే కాకుండా, పాఠశాలలు, మతం, కుటుంబం, మీడియా, సాంస్కృతిక వ్యవస్థల ద్వారా ఆలోచనా విధానం (Ideology) ను వ్యాప్తి చేస్తుందని వివరించాడు. సమాజంలో ఆర్థిక నిర్మాణమే కాదు, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలు కూడా చరిత్రలో విప్లవాలకు కారణమవుతాయని చెప్పాడు.
టెర్రీ ఇగిల్టన్ బ్రిటిష్ మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు. ఈగిల్టన్ సాహిత్యం, సిద్ధాంతం, మార్క్సిజం సంబంధిత విశ్లేషణలకు ప్రసిద్ధి చెందాడు. సాహిత్య విమర్శలో ప్రధాన సిద్ధాంతాలను (Formalist, Structuralist, Post-structuralist, Psychoanalytic, Marxist మొదలైనవి) సమీక్షించి, మార్క్సిస్టు దృష్టితో సాహిత్య విశ్లేషణ అవసరమని చెప్పాడు. సాహిత్యం అనేది సామాజిక ఉత్పత్తిలో భాగమని, దానిని వర్గపోరాటం, ఆర్థిక-సాంస్కృతిక పరిస్థితుల దృష్టితో చూడాలని వాదించాడు. సాహిత్య రూపాలు కూడా సమాజపు వర్గ నిర్మాణాన్ని ప్రతిబింబిస్తాయని చూపించాడు. పోస్ట్‌మోడర్నిజం సమాజంలోని వాస్తవ సమస్యల నుండి దృష్టి మళ్ళించే సిద్ధాంతమని, అది capitalism కు అనుకూలంగా పనిచేస్తుందని విమర్శించాడు. వెంకటకృష్ణ కవిత్వం మార్క్సిస్ట్ కోణంతో సామాన్య ప్రజల జీవితాలను వర్తమాన సమాజానికి పరిచయం చేస్తుంది, సామాజిక ప్రయోజనాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. రైతుల శ్రామికుల దుఃఖాలు ఈయన కవిత్వం లో వస్తువులు
“నాట్లు” అనే కవితలో “అలుపుతీర్చని పాటల
అప్పులు తీరని చింతల
మృత్యుగీతాలనాలపిస్తారు వాళ్ళు”
“కారణం పత్తిది” కవితలో పత్తిపంటను మెటఫర్ గా ఉపయోగించారు. పత్తి ఒక వాణిజ్య వస్తువుగా మారి రైతును రైతును హాలాహరి దారిని చేసిందని చూపుతారు.
“ధాన్యపు సృష్టికర్తను దుంపనాశనం చేస్తున్న
వ్యాపారపు మాయ పత్తిది”
దున్నెకొద్దీ దుఖం కవితలో అన్నదాతల శాశ్వత దుఖం గురించి చెబుతారు. ఈ కవిత మార్క్స్ Alienation సిద్ధాంతాన్ని గురుతుకు తెస్తుంది. Alienation సిద్ధాంతం అంటే – కాపిటలిస్టు సమాజంలో మనిషి తన శ్రమను కోల్పోయి, వస్తువుగా మారిపోవడం. అతను తన కృషి ఫలితం, ప్రక్రియ, తన మానవత్వం, ఇతరులతో సంబంధం – అన్నిటి నుండి వేరుపడతాడు. ‘రైతు కూలీ’ కవితలో గ్రామం నుండి నగరాలకు వెళ్ళే వలసల గురించి చెబుతారు. ‘రాత్రి’, ‘ప్రకృతిపాట’, ‘బ్రతుకు గోడు’ కవితలు రైతుల వ్యధలు, వర్గ అసమానతల గురించి ఉద్వేగపూరితంగా చెబుతాయి.
“రాత్రి” కవితలో “ అశాంతి నిండిన
ఆఖరిఘడియ కలత నిద్రలో
ప్రశాంతినిచ్చిన కల
సుఖాంతమైన
ఒక కరువుదాడి”
కొన్ని చోట్ల ఈ భావోద్వేగం అధికంగా ఉండడం వలన ఆబ్జెక్టివ్ విశ్లేషణ తక్కువ అవుతోంది.
- ఎకోక్రిటికల్ దృక్పథం
Cheryll Glotfelty ప్రతిపాదించిన ఎకోక్రిటిసిజం సిద్ధాంతం సాహిత్యం పర్యావరణ సమస్యలను, మానవ-ప్రకృతి మధ్య సంఘర్షణను విశ్లేషిస్తుంది. సాహిత్యం మరియు పర్యావరణం మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే సిద్ధాంతం ఇది. మానవుడు–ప్రకృతి మధ్య సంబంధం ఎలా సాహిత్యంలో ప్రతిఫలిస్తుందో విశ్లేషిస్తుంది. ప్రకృతిని కేవలం “నేపథ్యం” (background)గా కాకుండా, కేంద్ర అంశంగా చూడాలని వాదిస్తుంది. Ecocriticism is the study of the relationship between literature and the physical environment.”
"ప్రకృతి పాట", "పచ్చని వ్యథ", లలో ప్రకృతిని మానవ జీవితంతో ముడిపెట్టారు. "పచ్చని వ్యథ"లో చెట్టును "శతహస్తాలకు మొలిచిన శతసహస్ర సహ హస్తాలు"గా చిత్రించి, అభివృద్ధి పేరుతో నాశనాన్ని విమర్శిస్తారు. ఇది ఆంత్రోపోసీన్ (మానవ-కేంద్రీకృత పర్యావరణ నాశనం)ను ప్రతిబింబిస్తుంది. "ప్రకృతి పాట"లో "పంట పేరు కరువు" అని, మట్టి, వానలు, బోర్లు వంటి ఎలిమెంట్స్‌తో పర్యావరణ-సామాజిక సంఘర్షణ చూపారు. అయితే ఇందులో శాస్త్రీయ పరిష్కారాలు సూచించక పోవడం ఒక లోటు అనిపిస్తుంది.
ఆఖరి దాహం కవితలో సహజ వనరుల అసహజ పంపిణీ గురించి చెబుతారు.
- పోస్ట్ కలోనియల్ దృక్పథం
Post-colonial Criticism అనగా వలస పాలన & సామ్రాజ్యవాదం సాహిత్యం, సంస్కృతి, గుర్తింపు మీద చూపిన ప్రభావాలను అధ్యయనం చేసే సిద్ధాంతం. ఇది ప్రతిఘటన, గుర్తింపు, సంస్కృతి, భాష, దృష్టి పెడుతుంది. Post-colonial criticism అనేది సాహిత్యం, సంస్కృతి, చరిత్రలో వలస పాలన (Colonialism) మరియు సామ్రాజ్యవాదం (Imperialism) వల్ల వచ్చిన ప్రభావాలను విశ్లేషించే విమర్శా సిద్ధాంతం.
‘ గ్లోబల్ వైరస్’ “డాలర్ పాఠాలు” కవితలను ఈ దృష్టితో చూడవచ్చు. గ్లోబలైజేషన్‌ను "వైరస్"గా, "పిడుగులా" చిత్రించారు. "గ్లోబల్ వైరస్"లో అమెరికా ఆధిపత్యం, పేటెంట్లు, ప్రైవేటైజేషన్‌ను విమర్శిస్తూ, రాయలసీమ, తెలంగాణ బాధలను లింక్ చేశారు.
“నా పల్లె పల్లె మీదా కనిపించని మేఘమొకటి
నగరాల ఎదపై వ్యాపించిన మేఘమొకటి.
కురిసే మేఘం కాదది
నా పొలాలనూ కర్మాగారాలనూ
నా సమస్త సంబంధాలనూ
మట్టివేళ్ళ పునాదులనూ విధ్వంసం చేసే
పిడుగులా అది
మెరిసి మైమరపించే కుతంత్రమది”
ఈ కవితలో అభివృద్ధి వెలుగు నీడలు గురించి చెబుతారు. ఇందులో
“మట్టిపిడికిలి విచ్చుకోవటమే నివారణ” అంటారు. "డాలర్ పాఠాలు"లో యుద్ధం, మార్కెట్‌ను "డాలరు రెండు తలుపులు"గా చూపి, ఆయిల్ వ్యాపారం, ఆయుధాల అమ్మకాలను విమర్శిస్తారు. ఇది సామ్రాజ్యవాద ఆర్థిక వ్యవస్థను ఎత్తిచూపుతుంది.
“తూర్పున కన్నీరు సుడులు తిరుగుతోంది
ఏకధృవాన్ని ముంచెత్తే వుప్పెన వ్యూహం రచిస్తోంది
మట్టికాళ్ళను కరిగించే
గాలివాన రూపుదిద్దుకుంటుంది.”
- ఫార్మలిస్ట్ దృక్పథం :
తెలుగులో రూపవాద విమర్శ అంటాం. ఇందులో రచయిత జీవితం, చరిత్ర, సామాజిక పరిస్థితులు, పాఠకుని భావాలు వంటి బయటి అంశాలను పక్కన పెట్టి, కేవలం పాఠ్యంలోని నిర్మాణం, భాష, రూపం (form)ను మాత్రమే పరిశీలిస్తారు. Formalist Criticism = సాహిత్య రచనను స్వతంత్ర కళారూపంగా చూసి, దాని భాష, రూపం, నిర్మాణం, శైలిపై దృష్టి పెట్టే విమర్శా పద్ధతి. పాఠ్యం వెలుపల ఉన్న రచయిత జీవితం లేదా చరిత్రకంటే, పాఠ్యంలో ఉన్న రూపకాలు, ప్రతీకలు, కవితా సాంకేతికతలు ముఖ్యమని చెప్పడం. పాఠ్యమే ప్రధాన అంశం.బయటి ప్రభావాలు (రచయిత ఉద్దేశ్యం, చారిత్రక నేపథ్యం, పాఠకుడి ప్రతిస్పందన)ను పక్కన పెడతారు. పద ప్రయోగం, ఉపమానాలు, ప్రతీకలు, వాక్య నిర్మాణం, ఛందస్సు వంటి అంశాలను సూక్ష్మంగా విశ్లేషించడం. రచనలో ఏమి చెప్పబడింది కంటే ఎలా చెప్పబడింది అనేదే ముఖ్యమని భావించడం.
వెంకటకృష్ణ గారి భాష సరళమైనా ఘాటుగా ఉంటుంది, కానీ కొన్ని చోట్ల దీర్ఘత (long-windedness) ఉండటం వల్ల పాఠకుడి ఏకాగ్రత తగ్గవచ్చు. విషాదం (pathos), ఆక్రోశం (outrage) మరియు పరివర్తన (transformation) అనేవి ఈ కవితల్లో ముఖ్య వస్తువులుగా మనకు కనిపిస్తాయి. "దీపంలో వత్తి పత్తిది" – సాధారణ వస్తువును (cotton) అసాధారణ రూపకంగా మారుస్తుంది (defamiliarization).
మాండలిక పదాలు: దున్నడం, ఉల్లిగాడ్డ్డ, ఊరిమిండి, పున్డుగూరా, సెలకోలా ...
“పాడుబడ్డ చాకిరేవులా
బీడుబడ్డ మాగాణిలా
నిప్పురాజుకోని కమ్మరికొలిమిలా
కుమ్మరివామిలా
అటకెక్కి బూజుపట్టిన మగ్గంలా
కసువుపడని పశువుల కొట్టంలా”
“ పండని నేలా
ఎండిన బతుకూ
పొగలేవని పొయ్యి
పైసాలేనిచేయీ”
ఈయన కవిత్వంలో సరళత, విశ్వవ్యాపిత విలువలు, స్థానికత ముఖ్య అంశాలు. భాషను "ప్రజాస్వామికం" చేయడం. ఉదా: "నలిగి నలిగి" భాషలో పునరుక్తి ఒక కీలక సాధనం, ఇది రిథమ్ సృష్టిస్తుంది. ఉదా: “కారణం పత్తిది” కవితలో "పత్తిది" పదం 10 సార్లు పునరావృతం అవుతుంది. "పచ్చని వ్యథ" "పచ్చని" పదం రంగు ఇమేజరీ ద్వారా భాషను దృశ్యాత్మకంగా చేస్తుంది. కొన్ని చోట్ల పునరుక్తి మరియు సంక్లిష్టతలు లోపాలు.
జి. వెంకటకృష్ణ గారి కవిత్వాన్ని ఒకచోతుకు తెచ్చిన ‘హోరు ప్రచురణలు’ వారికి , శ్రీరాం పుప్పాల గారికి, అనిల్ డ్యానీ గారికి అభినందనలు.