- చిత్తలూరి
అతనెక్కడికీ వెళ్లలేదు
మన ఆశయాల అనంతాకాశంలోకి
వేగుచుక్కయి నిష్క్రమించి నిలిచిపోయాడంతే
మనమింకా నడవాల్సిన దారికి
మార్గనిర్దేశం చేయడానికి
ఈ నేలను సరిచేయటానికి
నేలమీది మనుషుల స్వేచ్ఛా స్వప్నాన్ని
నిజం చేయటానికి
ఆకాశమంత చీకటితో
అతను యుద్ధం చేస్తూ చేస్తూ
ఒకానొక భూగోళపు మలుపులో
అతని చక్రాల బండితో మాయమై
మన హృదయాల్లో ప్రత్యక్షమయ్యాడంతే
అతనెక్కడికీ వెళ్లలేదు
ఎంత పోరాటం
ఎంత అలసటలేని ప్రయాణం
ఎంతటి ఆదర్శ జీవితం
మృత్యువతని చక్రాలబండి కిందపడి
ఎన్నిసార్లు చచ్చి బతికిందో లెక్కేలేదు
విధించిన ఆంక్షలు
ఇబ్బంది పెట్టిన బతుకు క్షణాలు
అతని ఆశయాన్ని మరింత స్పష్టపరుస్తూ
మనచుట్టూ అలుముకున్న
చీకటిదారి మలుపులో
నెగడులా వెలిగిన మనిషి
అతనెక్కడికెళ్లగలడు?
అతనిలాంటి పోరాట వీరులెవరైనా
ఎక్కడికెళ్లగలరు?
మహా అయితే ప్రజల హృదయాల్లోకి తప్ప
మనుషులంతా
ఆకుపచ్చని వనాలై విస్తరించేదాకా
ఎర్రపూల పొద్దులై
తూర్పు వాకిట మళ్లీ మళ్లీ
ఉదయిస్తూనే వుంటారు
అతనెక్కడికీ వెళ్లలేదు
అతని చక్రాలబండి గీసిన దారి
మన హృదయాల్లోంచి సరాసరి
ఒకానొక పోరాట చరిత్రవైపు
మలుపు తిరిగిన రహదారిలా మారి
మనం చేయాల్సిన ప్రయాణానికి దిక్సూచిలా
మన ముందు పరుచుకుందంతే
అతనెక్కడికీ వెళ్లలేదు