అమెరికాలో డెత్ వ్యాలీ పర్యటన

ఫాజిల్ ఫాల్స్. హైవే నుంచి ఒక మైలు ట్రెక్కింగ్. 44 లక్షల సం. క్రితం లావా ప్రజ్వలన జరిగి, పర్వతాల మంచు నీటితో కలిసి సహజంగా భౌగోళికంగా ఏర్పడిన ప్రదేశం ఇది.

Update: 2024-05-26 02:55 GMT
డాంటేస్ వ్యూ పాయింట్, డెత్ వ్యాలీ, యుఎస్

అమెరికాలోని ఐదు పెద్ద నేషనల్ పార్కులలో డెత్ వ్యాలీ ఒకటి. ఇది కాలిఫోర్నియా రాష్ట్రంలోని లోన్ పైన్ సిటీకి సమీపంలో 13650 కి మీ విస్తరించి ఉన్నది. 1920లో రిసార్టుల నిర్మాణం జరిగాక 1933లో ఫిబ్రవరి పదకొండో తేదీన నేషనల్ మాన్యుమెంటుగా ప్రభుత్వం గుర్తించింది. 1994 అక్టోబర్ 31 వ తేదీన నేషనల్ పార్కుగా రూపాంతరం చెందింది.




 

1849 లో కొంత మంది ఒక బృందంగా ఏర్పడి బంగారం, వెండి గనుల తవ్వకానికి ఇక్కడికి వచ్చారట. అప్పుడు వాళ్లు అక్కడ నివసించిన ఆనవాళ్లు అక్కడ ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి చని పోయాడు. బోరాక్స్ అనే ముడి పదార్థం ఎక్కువగా దొరికింది. ముందు రెండు గుర్రాలు, వాటి వెనుక పద్దెనిమిది కంచర గాడిదలతో ఒక వాహనం రూపొందించి దొరికిన బోరాక్స్ ను లోయ వెలుపలకు కూడా రవాణా చేశారట. తరువాత కాలంలో 20 మ్యూల్ టీమ్ (Mule Team) గా ఆ లోయకు చాలా ప్రచారం వచ్చింది.

వాతావరణ తీవ్రత వల్లనే డెత్ వ్యాలీ పేరు వచ్చింది. ఎండాకాలంలో అరవై డిగ్రీల ఎండ నమోదు అవుతుందట. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు డెత్ వ్యాలీ ని సందర్శించడానికి అనుకూల సమయం. మేము డిశంబరు లో వెళ్లాము కాబట్టి వాతావరణం అనుకూలంగానే ఉన్నది. అక్కడ ఖచ్చితంగా చూడవలసినవి :

డాంటే వ్యూ పాయింట్

గోల్డ్ కెనియాన్

బ్యాడ్ వాటర్ బేసిన్

ఆర్టిస్ట్ డ్రైవ్

డెవిల్ గోల్ఫ్ కోర్స్ :

సాండ్ డూన్స్

***

డిసెంబర్ నెలలో ఎక్కడికి వెళ్లాలన్నా చలి బాగా పెరిగిపోయింది. నేను ఇండియాకి వెళ్లే రోజులు దగ్గరపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్లాలని ప్లాను. ఎంతో ఆలోచించి వాతావరణ రీత్యా డెత్ వ్యాలీ అయితే బాగుంటుందనే నిర్ణయం జరిగింది. ఇది కాలిఫోర్నియా రాష్ట్రంలోని పైన్ సిటీకి దగ్గరలో ఉన్నది. 19 నుంచి 25 వరకు తేదీల నిర్ణయం కూడా జరిగింది. ముందు రోజు చివరి రోజు ప్రయాణానికి కేటాయించాము. మిగతా ఐదు రోజులలో మూడు రోజులు డెత్ వ్యాలీ తరువాత రెండు రోజులు లాస్ ఏంజిల్స్ చూడాలని ప్లాను.

19వ తేదీ ఉదయం హేస్ నుంచి డెన్వర్ కు బయలుదేరాము. ఐదు గంటల ప్రయాణం. ముందు రోజు మంచు కురవడం వలన దారికి ఇరువైపులా మం చు కనువిందు చేసింది. మా కారును పార్కింగ్ లో పెట్టి విమానంలో లాస్ ఏంజిల్స్ చేరుకున్నాము. అక్కడ కారు అద్దెకు తీసుకొని డెత్ వ్యాలీ కి నాలుగు గంటల ప్రయాణం. కానీ మార్గమధ్యంలో ఉన్న ప్రదేశాలను ఆగి చూస్తూ వెళ్లాము. అందుకే డెత్ వ్యాలీ చేరేసరికి రాత్రి తొమ్మిది అయింది.

మధ్యలో మేము ఫాజిల్ ఫాల్స్ దగ్గర ఆగాము. హైవే నుంచి ఒక మైలు ట్రెక్కింగ్. 44,00,000 సంవత్సరాల క్రితం పర్వత శ్రేణులలో లావా ప్రజ్వలన జరిగి, పర్వతాలలో మంచు నీటితో కలిసి సహజంగా భౌగోళికంగా ఏర్పడిన ప్రదేశం ఇది. ప్రస్తుతం అక్కడ జలధారలు లేకపోయినప్పటికీ ఒకప్పుడు ఉండేవి అనడానికి ఆనవాళ్లు......... నునుపుదేలి, కొన్ని చోట్ల రంధ్రాలు ఏర్పడిన నల్లని శిలలు అక్కడ ఉన్నాయి.


ఫాజిల్ ఫాల్స్


 

750 ఎకరాలలో విస్తరించి ఉన్న అక్కడ మరొక చోట కొంతమేర నెలంతా నునుపుదేలి సూర్యకాంతి పడి మెరుస్తూ ఉన్నది. ఇన్స్టా కెమెరాతో నేను 360 డిగ్రీల కోణం లో ఫోటోలు తీసి ఎంజాయ్ చేశాను. చుట్టూ కొండలు......మధ్యలో మెరుస్తున్న ఖాళీ స్థలం......అక్కడికి ఒక మైలు దూరంలో ఉన్న లిటిల్ ఓవర్ లేక్ ను కూడా చూసి మళ్ళీ ప్రయాణం మొదలు. పెట్టాము. దాదాపు డెత్ వ్యాలీ చేరేవరకూ వోవెన్ నది కొద్దిపాటి నీళ్లతో......తెల్లటి ఇసుక తో మమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నది. అంత పెద్ద నదిలో నీళ్ళు లేకపోవడానికి కారణం........లాస్ ఏంజిల్స్ నగరానికి నీటి సరఫరా ఈ నది నుంచే జరుగుతుందట. ఏ దేశంలో అయినా మానవ మనుగడ కొరకు ప్రకృతిని ధ్వంసం చేయడం బాధ కలిగించింది.





 మళ్లీ ఉదయమే బయలుదేరి మేము డాంటే వ్యూ పాయింట్ కు చేరుకున్నాము. సముద్ర మట్టానికి ఐదు వేల నాలుగు వందల నలభై అయిదు అడుగుల ఎత్తు నుంచి సముద్ర మట్టానికి రెండు వందల అడుగున ఉన్న చూసే ప్రదేశం. కారు పార్కింగ్ నుంచి అర మైలు హైకింగ్ చేసి పైకి చేరుకున్నాము. శివ మాధురి ఎప్పటి లాగానే వాళ్ల కెమెరాలకు పనిచెప్పడంలో నిమగ్నమయ్యారు. చుట్టూ కొండలు మధ్యలో లోయ . ... లోయలో అక్కడక్కడా తెల్లగా మెరిస్తోంది. అది మంచు అని నేను భ్రమపడ్డాను. కాదని తరువాత తెలిసింది. తనివి తీరా ఆ ప్రకృతి అందాలను వీక్షించి వెనుదిరిగాము. అక్కడి నుంచి గోల్డ్ కెనియాన్ కు చేరుకున్నాము. దాదాపు మూడు మైళ్లు ట్రెక్కింగ్. బంగారు రంగులో మెరిసిపోతున్న ఆ కొండల మధ్యలో నడుస్తూ ..... మధ్యలో ఫోటోలు తీసుకుంటూ ముందుకు సాగాము. కొన్ని ప్రకృతి దృశ్యాలను అక్షరాలలోగాని కెమెరాలోగానీ బంధించడం సాధ్యం పడదు. ఆకలి గుర్తుకు రానంత తన్మయత్వం లో మునిగిపోయాను.

సలా

సాల్ట్ లేక్, డెత్ వ్యాలీ


 మరుసటి ఉదయమే వెళ్లి ఆ అందమైన కొండలలో సూర్యోదయాన్ని చూసాము. అద్భుతం ..... ఒకవైపు మైనస్ డిగ్రీలలో చలి మరోవైపు నుంని లేలేత రవి కిరణాల వెచ్చదనం ..... ఎంత చూసినా తనివి తీరని ప్రకృతి దృశ్యం ... ... సూర్యుడు పైకి వచ్చాక మేము రూం కు వచ్చి, రెడీ అయి బ్రేక్ ఫాస్ట్ చేసి ఆర్టిస్ట్ డ్రైవ్ బయలుదేరాము. పార్కింగ్ లో కారు పెట్టి ఒక మైలు నడిస్తే నేను ఊహించని అద్భుత దృశ్యం నా కళ్ల ముందు ఆవిష్కృతమైంది. ప్రకృతి అనే చిత్రకారుడు చిత్రించిన భిన్న వర్ణ పర్వత చిత్రమది. అలా పర్వతాలు రంగులు మారడానికి శాస్త్రీయమైన కారణాలున్నా అవన్నీ పక్కకుపెట్టి ఒక చేయిదిరిగిన అదృశ్య చిత్రకారుడు చిత్రించాడనే అనిపించింది. అక్కడనుంచి మేము బ్యాడ్ వాటర్ బేసిన్ కు వెళ్ళాలి. కానీ మధ్యాహ్నం వెళ్లడం తగిన సమయం కాదు. అందుకే మేము లంచ్ చేసి , గదికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుని నాలుగు గంటలకు బయలుదేరి అక్కడకు వెళ్లాము .ముందు రోజు పైనుంచి చూసింది ఈరోజు లోయలోకి వెళ్లిచూడడం. సముద్రమట్టానికి 282అడుగుల లోతులో వున్నాను అనే భావన నన్ను ఉద్వేగానికి గురిచేసింది. సముద్రమట్టానికి ఇంత లోతులో వున్న లోయలోకి దిగి నేను ఇప్పటివరకూ చూడలేదు లోయలను పైనుంచి చూడడమే తప్ప అందులోకి దిగి చూడడం ఇదే మొదటిసారి. పైనుంచి చూసినప్పుడు చిన్నగా తెల్లగా కనిపించిన ప్రదేశం అంతా ఉప్పు పొలాలు. తెల్లగా మిరుమిట్లు గొలుపుతున్న ఉప్పు పొలాలు ..... చాలా పెద్దవి. మధ్యాహ్నం ఎండలో ఈ తెల్లటి మెరుపును తట్టుకోవడం సాధ్యమయ్యేది కాదు. చుట్టూ ఎత్తైన కొండలు ......పైన నిర్మలమైన నీలాకాశం........ నేను దానిని ఆస్వాదిస్తూ ఉండగానే ...... ఆకాశంలో రంగులు మారుతున్నాయి. బ్రహ్మండమైన చిత్ర మొకటి భూమ్యాంతరాళంలో ఆవిష్కృతమైంది. భాష చాలడం లేదు ఆ దృశ్యాన్నివర్ణించడానికి.


ఈ రోజు మేము డెవిల్ గోల్ఫ్ కోర్స్ కు వెళ్ళాము. ఇందులో జాగ్రత్తగా నడవాలి. లేకపోతే పదునైన కత్తి కొనలాగా పైకి పొడుచుకొని వచ్చిన ఉప్పు మొనలు గుచ్చుకొని గాయాలు అయ్యే ప్రమాదం ఉన్నది. ప్రమాదం లేనిచోట కాసేపు నడిచి, ఫోటోలు తీసుకొని ఇసుక తిన్నెలు( Sand dunes) బయలుదేరాము.


గోల్డ్ కేన్యాన్


 ఈ దారంతా ఎడారి మొక్కలు కనిపించాయి.ఏప్రిల్ నెలలో రంగు రంగుల పుష్పాలతో పూల లోయను(valley of flowers)తలపిస్తూ ఉంటదట. అక్కడ నుంచి ఇసుక దిన్నెలకు చేరుకున్నాము. బూట్లతో అయినా లేకుండా అయినా ఇసుక తిన్నెల పైకి ఎక్కడం కష్టమైన పనే. పైకి ఎక్కుతున్నప్పుడు చల్లటి, మెత్తటి ఇసుక కాళ్ల కింద నుంచి జారిపోతా ఉంటుంది. దానికి తోడు బలంగా వీస్తున్న గాలి. పట్టుదలతో పైకి ఎక్కాను. కొన్ని ప్రదేశాలు మన ప్రమేయం లేకుండా మనను చిన్న పిల్లలను చేస్తాయి. వాటిలో ఇసుక తిన్నెలు ఒకటి. తనివి తీరా ఇసుకలో ఆడుకొని లాస్ ఏంజిల్స్ కు ప్రయాణమయ్యాము. అక్కడి వింతలు, విశేషాలు లాస్ ఏంజిల్స్ పోస్ట్ లో రాస్తాను.



Tags:    

Similar News