అమ్మకి పిల్లల ‘ప్రేమలేఖలు’
అమ్మకి ఉత్తరం రాస్తున్నపుడు ఉద్వేగం ఉప్పొంగడం గమనించారా?;
లోకమంతా స్వర్గాన్ని వెతుకుతూ
తిరుగుతున్న ఈ మూర్ఖ జనానికి
చెప్పండి... అమ్మ ఇంట్లోనే ఉందని !-గుల్జార్
అమ్మకు ప్రేమతో....
భిన్నమైన సాహిత్య రూపాల్లో కథ, కథానిక, నవల, నవలిక, కవిత్వం, వ్యాసం, నాటకం, పద్యం, నానీలు, మినీ కవితలతో పాటు లేఖా సాహిత్యాన్ని కూడా చెప్పుకోవాలి. ఇదొక భిన్నమైన సాహిత్య ప్రక్రియ. అయితే ఈ లేఖా సాహిత్య రూపంలో చాలా తక్కువ సాహిత్యం వచ్చింది. మొత్తం భారతీయ సాహిత్యంలో లేఖా సాహిత్యాన్ని చూసుకుంటే... అభిజ్ఞాన శాకుంతలం, ప్రభావతి ప్రద్యుమ్నంలో ప్రస్తానన ఉంటే గుడిపాటి చలం ఏకంగా ప్రేమ లేఖలతో పుస్తకమే తీసుకువచ్చారు. శారద లేఖలు పేరుతో కనుపర్తి వరలక్ష్మమ్మ రాశారు. నెహ్రూ లేఖలు, బెంగాలీ రచయిత శరత్ చంద్ర లేఖలు, బోయిభీమన జానపదుని రాతలు. త్రిపురనేనీ గోపీచంద్ పోస్ట్ చేయని ఉత్తరాలు, ఉభయకుశలోపరి, డా.. సంజీవ్ లేఖలు, ఆమె - అతడు డైరీ రూపం ఉప్పల లక్ష్మణరావు రాసిన నవల. ఈ మధ్య కొడుకుకు అమ్మ రాసిన లేఖలు కూడా వచ్చింది. అట్లానే లేఖల కాళిదాసు మేఘ సందేశం తర్వాతనే నిలిచిపోయాయి ఉదాహరణకి రా.రా ఖలీల్ జిబ్రాన్ గురించి కాళోజీకి రాసిన లేఖ. ఈ మధ్య ప్రముఖ జర్నలిస్ట్ ఆలూరు రాఘవగారు తన అమ్మ జ్ఞాపకాలను అమ్మ ముచ్చట్లు అని సంకలనం వేశారు. అందులో మాతృ దినోత్సవం సందర్భంగా ఆయన “అడవి నుంచి అమ్మకి బహిరంగ లేఖ” అనే అద్భుతమైన లేఖ రాశారు.
మిగతా సాహిత్యరూపాల కంటే లేఖా సాహిత్యం భిన్నమైన ప్రక్రియ. సాహిత్య వస్తువుని లేఖల్లో రాస్తున్నప్పుడు చాలాసార్లు మనుషుల అంతర్లోకాల్లోని లేదా అంత:చేతనలోని పైకి రాని, దాక్కున్న, అణిచివేయబడ్డ అనేక జ్ఞాపకాలు, ఆలోచనలు భావోద్వేగాలు బయటకు వచ్చేస్తాయి. అదీ నిజాయితీగా రాస్తేనే. ఆ రకంగా దానికదే లేఖా సాహిత్యానికి ఒక సున్నితత్వం, నిజాయితీ అనే లక్షణాలు వచ్చేస్తాయి. లేఖా సాహిత్యానికి ఆ రకంగా చదివించే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. వరంగల్కి చెందిన కవి, రచయిత, ఉపాధ్యాయులు మడత భాస్కర్గారు లేఖా సాహిత్యంతో “అమ్మకి ప్రేమతో” అనే లేఖా సంకలనాన్ని తీసుకువచ్చారు. వందకు పైగా రచయితలు, రచయితలు కాని వారితో జీవించి ఉన్న, మరణించిన అమ్మలకి లేఖలు రాయించి పోస్ట్ చేయించారు. వస్తువు ఎన్నికకి సంబంధించి ఇదొక అద్భుతమైన సాహిత్య ప్రక్రియ కూడా.ఈ లేఖల్లో అమ్మలను ఆత్మీయంగా ఆర్తిగా, సంతోషంగా, దుఃఖంగా, కన్నీళ్లతో, పశ్చాత్తాపాంతో తలుచుకున్నారు.
కొడుకులూ, కూతుళ్లు. లేఖలు... అచ్చం బాల్య లేఖల్లాగే అమాయకంగా, స్వచ్చంగా ఉన్నాయి. చాలాసార్లు మనం బాల్యంలో తరగతి గదుల్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో లేఖలు రాయడం అనేది వ్యాకరణంలో (గ్రామర్) భాగంగా రాయించేవారు. అమ్మకో, నాన్నకో, స్నేహితుడికో, సెలవు కోరుతూ టీచర్ కి లేఖలు రాయడం సాధన చేయించేవారు.
‘అమ్మకి ప్రేమతో’ సంకలనం కోసం లేఖలు ఇంతమందితో భాస్కర్ గారు అచ్చం మన చిన్నప్పటి బడిలోని గురువులాగా రాయించారు హోం వర్క్ లాగా. భలే ముచ్చటగా అనిపించింది. చదువుతుంటే తెలీకుండానే బాల్యానందంలోకి వెళ్లి పోతుంటాము. ఇందులో అందరూ రచయితలు, కవులు కారు. బహుశా భాస్కర్ గారి ఉపాధ్యాయ సర్కిల్లో తోటి ఉపాధ్యాయులు, స్నేహితులు కావచ్చు. కొద్దిమంది కవులున్నారు. రచయితలున్నారు. వీరంతా భాస్కర్ గారి పుణ్యమా అని దొరికిందే అపురూపమైన అవకాశంగా అమ్మను వీడి సంవత్సరాలైన తర్వాత అమ్మని తలుచుకుంటూ లేఖలు రాసి పరవశించిపోయారు.
మామూలుగా అమ్మలతో ఫోనుల్లో మాట్లాడినా... వ్యక్తిగతంగా మాట్లాడినా మామూలు ముచ్చట్లుంటాయి. తిన్నావా.. మందులు వేస్కున్నావా లాంటి మాటలు. కానీ లేఖ రాసినప్పుడు మాత్రం అమ్మ మీద మమతల వెల్లువలా పొంగి పొర్లుతుంది. ఎన్నో జ్ఞాపకాలు బయటకు వచ్చేస్తాయి వరదలా ! లేఖల్లో తీరిగ్గా అమ్మతో జీవితం మీద, తమని బాధల్లోకి తోసి వేదనలో ముంచేసిన బంధువులు,స్నేహితుల మీద అలకలు,కోపాలు, అవమానాలు, అసంతృప్తులు, ఆరోపణలు,కొన్ని ఆనందాలు,పడుతున్న ఘర్షణ. చేస్తున్న యుద్ధాలు, గెలుపోటములు, అమ్మా నాన్నల పట్ల తమ బాధ్యతా రాహిత్యాలు, ప్రేమ రాహిత్యాలు, స్వార్థాలు అన్నీ కన్నీళ్లతో పంచుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ అమ్మలకీ, నాన్నలకీ లేఖలు రాయాలి. ఈ లేఖలు ఒక రకంగా ఆత్మాశ్రయ థెరపీలాంటిది.
ఒక బహిరంగ పశ్చాత్తాప ప్రకటన... అమ్మ మీద ప్రేమను, వియోగ దుఃఖాలను ప్రకటించే ప్రేమ లేఖ! అమ్మని మిస్ అవుతున్న బిడ్డలందరికీ ఈ అవకాశాన్ని భాస్కర్ గారు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈ ప్రక్రియను ఎన్నుకోవడంలోనే భాస్కర్ గారికి తన తల్లి మీద ఉన్న ప్రేమ అర్థం అవుతుంది. అమ్మకి రాసిన లేఖల్లో దాదాపు అందరు రచయితలూ అమ్మ మీద ఆమె బతికున్నప్పుడో పుట్టింట్లో ఉన్నప్పుడో చూపించుకోలేని ప్రేమని లేఖల్లో వ్యక్తిపరుచుకున్నారు. ఈ లేఖలు చదువుతుంటే అసలు అందరితో అమ్మలకు ప్రేమ లేఖలు రాయించాలన్న ఆలోచన భాస్కర్ గారికి ఎలా వచ్చిందో అన్న ఆసక్తి కలిగి ఆయన్నూ చిన్న ఇంటర్వ్యూ చేశాను.
తన గురువు స్నేహితుడైన దోరవేటి చెన్నయ్యా. తానూ తరచూ లేఖలు రాసుకునేవాళ్లమని.. ఆ లేఖలు తన జీవన దృక్పథంలో చాలా మార్పులు తీసుకొచ్చాయని అదంతా ఆయనకీ, తనకీ మధ్య సాగిన లేఖల గొప్పతనమనీ, పైగా ఆ లేఖల్లో ఎవరికీ చెప్పుకోనివి చెప్పుకోవచ్చనీ కల్పితాలు, అబద్ధాలూ ఉండవనీ అంటారు . భాస్కర్. కానీ ఇది కేవలం గొప్ప ఆత్మీయమైన నిజాయితీ ఉన్న స్నేహాల్లో.. బంధుత్వాల్లో మాత్రమే సాధ్యమవుతుందేమో? ఇక అమ్మతో అయితే నాన్న దగ్గర కంటే కూడా చాలా దగ్గరతనం, స్నేహం, చనువూ అనుభూతి చెందుతామనీ అన్నీ స్వేచ్చగా చెప్పుకోగలుగుతామనీ... నాన్నంటే గౌరవంతో భయంతో కూడిన దూరాలుంటాయనీ, నాన్న అర్థం కావడం కష్టమనీ అన్నారు.
అమ్మ పిల్లలు, భర్తా, అత్త తరపు బంధువులకు సేవలు చేస్తూ జీవితం త్యాగం చేసే అమ్మనే ఎక్కువగ దగ్గరినుండి చూస్తూ పెరగడం వలన అమ్మనే మనసుకు దగ్గర. అందుకే నివాళిగా మా అమ్మ గురించి రాస్కోవాలనిపించింది. అందరితో రాయించాలనిపించింది. పైగా ఇతర సాహిత్య ప్రక్రియల కంటే, ఇతర సాహిత్య ప్రక్రియల కంటే లేఖా సాహిత్య ప్రక్రియ చాలా తక్కువగా ఉంది. దాదాపు మరుగున పడిపోతున్నదని అన్నారు భాస్కర్. అవును అనిపించింది. నేను మొదటి పేరాలో రాసినట్లు తెలుగు సాహిత్య చరిత్రలో లేఖా సాహిత్యం అతి తక్కువగా ఉంది. రావాల్సింది చాలా ఉంది.
ఇక ఈ లేఖా సంకలనంలో అమ్మను చాలా ఆర్తిగా అనేక కోణాల్లో తలుచుకుంటూ రాశారు. అవకాశం వస్తే ఎంతగా ఓపెన్ అయి రాస్తారు కదా అనిపించింది. అయితే చాలామంది రచయితలు అమ్మ త్యాగాల కోణం అనే ఒకే కోణంలో రాస్తే కొద్దిమంది కొంత భిన్నంగా రాశారు. అనేక జ్ఞాపకాలు, అనేక వలపోతలు, అమ్మల పాదాలకు కన్నీటి అభిషేకాలు, అలకలు పశ్చాత్తాపాలు, ఆరోపణలతో సాగాయి ఈ లేఖలన్నీ. ప్రతి ఒక్కరూ తమ లేఖల్లో భౌతికంగా కోల్పో కోల్పోయిన, దూరాన ఉన్న అమ్మల్ని కన్నీళ్లతో తలుచుకుంటూ ఏమీ చేయలేని నిస్సహాయతలతో ముగిస్తారు. నిజానికి తండ్రితో కాకుండా చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు తమ కష్టాలు అమ్మకి చెప్పుకోవడానికి అలవాటుపడతారు. ఆ దగ్గరితనం తల్లిదగ్గరే ఉంటుంది. అత్తింటకెళ్లాక కూడా ఇదే కొనసాగుతుంది. కానీ ఆ తల్లే అకస్మాత్తుగా చనిపోతే ఒక్కసారిగా ఒక మంచి స్నేహితురాలు, గైడ్ని పోగొట్టుకున్నంత బాధ ఆవేదన కలుగుతుకుంది. అలా దూరమైన అమ్మకు తప్ప ఇక ముందు కష్టాలు బాధలెవరికి చెప్పుకోవాలన్న ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖలు సాగాయి.
కొన్ని లేఖలు బాల్యవివాహాలు చేసుకున్న కొమార వయసులో గంపేడు పిల్లలకు తల్లులై పిల్లల పెంపకానికి, ఇంటి దాకిరీకి బలైన తల్లులు, తల్లులవ్వాలన్న అత్తింటివారి టార్గెట్ దాటినా తల్లులు కాలేని ఆడ పిల్లలు పదహారు -ఇరవై ఏళ్లలోపే గొడ్రాలు అనే నిందని మోయాల్సి రావటం.. వేధింపుల ఆందోళన, ఒత్తిడికి గురవుతూ మానసిక, శారీరక అనారోగ్యాలకు గురైన తల్లులు, వైద్య సహాయం అందకుండా బాలింత రోగాలతో హాస్పిటల్లో కాకుండా ఇళ్లలోనే చనిపోయిన అమ్మలు పిల్లల్ని అనాథల్ని చేసిన బాధాకర చెడు బాల్య జ్ఞాపకాలు కొంతమంది రాశారు. మరికొంతమంది పాత పుచ్చిపోయిన ఫ్యూడల్ సాంప్రదాయం అయిన భర్త తిన్నాక అతని ఎంగిలి కంచాలలో, అరిటాకులలో ఇష్టంగానో అయిష్టంగానో భోజనం చేసే అమ్మల గురించి రాశారు లేఖల్లో.
ఒక లేఖలో రచయిత తన భార్య చాడీలు చెప్పడం మూలాన్న అమ్మతో కొట్లాదవాల్సి వచ్చిందని , భార్యనే కారణమని దానికి క్షమించమని అడుగుతాడు. చూడండి.. కుటుంబ వ్యవస్థలో వేళ్లూనుకుని ఉన్న పితృస్వామ్యం స్త్రీలను ఎలా పరస్పరం శతృస్థానాల్లో నిలబెట్టి, పురుషుణ్ణి హీరోని చేస్తుందో.. భార్యనీ చెడ్డదాన్ని చేస్తాడిక్కడ కొడుకు. ఫ్యూడల్ భావజాలపు ఆధిపత్యంలోఅత్తమామల, భర్త, ఆడబిడ్డల పెత్తనాల్లో నలిగిపోయే స్త్రీ తన మీది ఆధిపత్యాన్ని అరాచకాల్ని చెప్పుకోవాలనో, ప్రశ్నించాలనో చూసినప్పుడు ఆ ప్రతిఘటన ఆమెని చెడ్డదిగా కబ్జాకోరు, చాడీకోరు గుణంతో కుటుంబాన్ని వీడదీసీ గయ్యాళిదానిగా, అసూయాపరురాలిగా అహంభావిగా, కుట్రదారుగా నిలబెడుతుంది. పురుషుడు న్యాయమూర్తిగా, అటు ఇటు చెప్పలేక నలిగిపోయే అమాయకుడైన దు:ఖితుడిగా చూపబడతాడు. కోడలు, స్త్రీలు ఆస్తికోసం కుటుంబాలని విడదీసే కుట్రదారులుగా, చెడ్డవాళ్లుగా చూపించబడతారు.
పితృస్వామ్యపు కనుసన్నల్లో నడిచే కుటుంబ వ్యవస్థ పురుషుడ్ని బాధ్యతల్నించి తప్పించి పాప విముక్తుడిని చేస్తుంది. కుటుంబంలో ఎన్నో అనారోగ్యాలను భరిస్తూ రాత్రింబగళ్ళు సేవలు, త్యాగాలు చేసే ఆడవాళ్ళే పాపం అన్ని పాపాలూ చేస్తుంటారు మనువు ప్రకారం. అత్తమామల సేవలతో, కుటుంబ భారాన్ని మోసే బాధ్యత కోడలు మీద ఉంటుంది. ఆమెని విశ్రాంతి తీస్కోనివ్వకుండా.. ఆరోపణలు చేస్తూ, వేధిస్తూ, అసంతృప్తులు వెళ్లగక్కుతూ.. ఆమె అశాంతిపాలవుతుంటే ఆమె కనీసం ఒక్క మాట మాట్లాడకూడదు. అలా బలైపోయిన అమ్మలు, కోడళ్లు ఈ సంకలనంలో ఉన్నారు. అలానే ఉమ్మడి కుటుంబాల్లో పెరిగి పెద్దయ్యాక, రచయిత్రులు అయ్యాక కుటుంబ సంబంధాలు, అనుబంధాల మీద రచనలు చేస్తున్న రచయిత్రులున్నారు. అమ్మ నేరపిన విద్యనే వాళ్లకి పనికి వచ్చింది.
ఎనభై ఏళ్ల అమ్మ రచయిత్రి కథలకు తొలి పాఠకురాలు, సలహాదారు అవుతుంది. బడికెళ్లి చదువుకోకపోయినా పనంతా అయ్యాక, మనుషులంతా ఇంట్లోంచి వెళ్లిపోయాక పేపర్లు నవలలు చదివి ప్రపంచ గ్నానాన్ని పెంచుకుని కుటుంబాన్ని సమాజ రాజకీయాల్ని అర్థం చేస్కుని కుటుంబాల్ని గొప్పగా నడిపిన సమర్థులైన అమ్మలున్నారీ సంకలనంలో. అమ్మలు చేసిన సాహిత్య పఠనం, వారిలో పెంచిన సౌజన్య సంస్కారాలు కన్న పిల్లల్ని ... సమాజాన్ని ఇరుగుపొరుగు వారిని మానవత్వంతో, సహఅనుభూతితో ఆదరించడం చూస్తూ పెరిగారు చాలామంది పిల్లలు ఈ సంకలనంలో అమ్మలే ఆదర్శం వీరందరికీ.ఇంకా తరతరాల సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలను, కులాచారాలను మడి, మైలను పండుగలు, నోములు, వ్రతాలు, ఉపవాసాల రూపంలో ముందు తరాలకి మోసిన అమ్మలున్నారు.
నోముల, వ్రతాల ఉపవాసాలే కాదు, బీదరికంలో పిల్లలకు భర్తకీ పెట్టి ఆకలితో ఉపవాసాలు చేస్తూ పోషకాహార లోపంతో క్యాన్సర్ బారిన పడి చనిపోయిన తల్లులున్నారు ఈ లేఖలలో . ఉపవాసాలు చేస్తూ అసిడిటీలు, రక్తహీనతలతో (అనీమియాలతో) నీరసపడిపోయే తల్లులున్నారీ లేఖలలో. వాళ్ల బిడ్డలే చిన్నప్పుడు పెరిగే వయస్సులో గమనించిన అమ్మల త్యాగాల ఫలితంగా వచ్చిన అనారోగ్యాలను, అకాల మరణాలను ప్రత్యక్ష డాక్యుమెంట్ చేశారు. ఇదొక రకంగా డాక్టర్స్ కాకుండా ఇళ్ళల్లో అమ్మల శారీరిక అనారోగ్యాలని, మానసిక వొత్తిళ్లను సజీవంగా చూస్తూ పెరిగిన పిల్లలు రాసిన వాస్తవ డాక్యుమెంట్స్.
స్త్రీల ఆరోగ్య సమస్యల, అకాల మరణాల వెనకాల మూల కారణాలుగా ఉన్న క్రూరమై పితృస్వామ్య వ్యవస్థ స్త్రీలు పట్ల విధించిన విధి నిషేధాలు, నియమాలు కట్టుబాట్ల స్త్రీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగలేక పోవడానికి., నిత్యం అనారోగ్యాల పాలు కావడానికి కారణాలు. ఒక లేఖలో రచయిత్రి అమ్మల జీవితాల్లో ఈ వేదనల్నీ చూస్తూ., నిస్సహాయ తల్లులు తండ్రుల చేతుల్లో పడే భౌతిక హింస, తాగుబోతు తండ్రులతో అనుభవించే దారిద్య్రం ఆకలి, అణచివేతలు తిట్లు తన్నులు తింటూ కూడా తమ పిల్లల కోసం ఓర్పు, సహనం, అమాయకత్వంతో ఎదిరించ లేనితనంతో ఉండే అమ్మల గురించి ప్రస్తావిస్తూ.. "క్షమాగుణం ఉన్నతల్లి గడుసుదానిగా గయ్యాళిగా కూడా ఉంటే ఎంత బాగుంటుంది? కుళ్లు, కుతంత్రం, లౌక్యం తెలీని అమ్మఅన్నింటిలో వెనకబడిపోతుంది" అంటూ బాధ పడతారు.
కొంతమంది రచయితలు తండ్రి అకస్మాత్తుగా మరణిస్తే.. మరణ దుఃఖాన్ని, తండ్రి వియోగాల్ని తట్టుకుని ఆర్థిక భారాన్ని రాత్రింబగళ్లు శ్రమ చేస్తూ మోసి పిల్లల్ని చదివించిన మహా తల్లులని తల్చుకుని దు:ఖపడతారు. ఆర్థికభారాన్ని ఎత్తుకునే క్రమంలో అర్థం చేసుకోని కుటుంబ సభ్యులు, స్వంత పిల్లలు, బయట సమాజం నుంచి వచ్చే వ్యతిరేకత ఆరోపణలు వేధింపులు, వీటినన్నింటినీ ధైర్యంగా ఎదిరిస్తూ ఆత్మ గౌరవంతో నిలబడ్డ తల్లులని ప్రేమగా, గౌరవంగా తలుచుకున్నారు. తమ శ్రామిక తల్లులు "ఊర్లో మాట పడకుండా ఒకర్ని నొప్పియకుండా బతకాలె బిడ్డా.. మనుషుల నమ్మకాల్ని కోల్పోవద్దు" అని బిడ్డలకు ఇచ్చే సంస్కారాల్ని తలుచుకుని మొక్కుతారు.
పైన చెప్పుకున్నట్లు ఇందులో అమ్మల మరణాల వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంది కుటుంబ, సామాజిక, ఆర్థిక, వైద్యపరమైన కారణాలు లేఖల్లో చెప్పారు. అయితే వీటికి భిన్నంగా ఒక లేఖలో కొడుకు తన స్వంత అక్క తన తల్లి అకాల మరణానికి ఎలా కారణం అవుతుందో చెబుతూ దు:ఖిస్తాడు. పుట్టింటికి వచ్చిన కూతురు సొమ్ములు, కానుకలు ఇవ్వమని, ఈ విషయం తండ్రికి చెప్పమని తల్లిని నెలరోజు పాటు వేధిస్తే భరించలేని ఆ బీదతల్లి తీవ్రమైన ఆందోళనా, ఒత్తిడికి గురై మెదడు నరాలు చిట్లి రక్తస్రావమై రాత్రికి రాత్రి ఎలా చనిపోతుందో" రాస్తూ విచలితుడైపోతాడు. మనసు వికలమవుతుంది. వరకట్నం.. వస్తు వ్యామోహం వ్యవస్థలోని క్రూరమైన దుష్ప్రచారాలైతే అంతిమంగా వాటికి స్త్రీలే బలవడం ఒక వ్యవస్థీకృత పీడ.
ఎన్నెన్ని రకాల మరణాలు స్త్రీలకీ.. అమ్మలకీ వ్యవస్థలో.. వ్యవస్థ డిజైన్ చేస్తుందీ అమ్మల మరణాలను.
ఇక మరో లేఖలో నిరంతరం అన్ని రకాల పనులు చేస్తూ కుటుంబ శ్రమలో నలిగిపోయే అమ్మ గురించి రాస్తూ "పాఠ్య పుస్తకాల్లో చాతుర్వర్ణ వ్యవస్థ గురించి తెలియజేయాలంటే.. అమ్మని ఉదాహరణగా చూపితే చాలనీ, ఎందుంటే అమ్మ బిడ్డని కనిపించే క్రమంలో శూద్ర క్షత్ర, వైశ్య, బ్రాహ్మణ పాత్రలన్నీ పోషిస్తున్నది కదా" అంటాడు అమాయకంగా... శూద్రుని పని మురికిని ఎత్తిపోయడం అని చెప్పకనే చెబుతాడిక్కడ.
అబ్బాయిలలో అమ్మాయిలు స్నేహంగా మాట్లాడకూడదు, ఆడుకోకూడదు అని కూతుళ్లని కంట్రోల్లో నెట్టిన తల్లుల్ని తలుచుకుంటూ ఒక రచయిత్రి అదెలా తనకి మంచిదైందో తను స్నేహం చేసిన మగ ఫ్రెండ్ ఎంత దుర్లక్షణాలతో బయటపడ్డాడో చెబుతూ అమ్మ దూరదృష్టిని మెచ్చుకుంటుంది.
ఇంకో అమ్మ తన కొడుకుతోపాటు కూతురికి కూడా పొలం ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ కావాల్సిందేనని పట్టుబట్టి భర్తతో కొట్లాడి, కూతురికి ఆస్తి రాయించి స్త్రీలు తమ ఆస్తి హక్కుని ఎలా వాడుకోవాలో కూతురికి... ఎలా ఇవ్వాలో భర్తకీ.. కొడుకికీ చెప్పే సామాజిక కార్యకర్త అవుతుంది. తరువాత అదే కొడుకు తన ఆస్తిని అచ్చం నాన్నలా కాకుండా అమ్మలా తన కొడుకుతో పాటు కూతురికీ పంచివ్వడం చూస్తాం. ఇదంతా తనకు అమ్మ నేర్పిన ప్రీపురుష సమానత్వపు విలువల జ్ఞానం, ఆచరణ, సామాజిక బాధ్యత, సంస్కారం అని మరొక కొడుకు తల్లిని తలుచుకుని గర్వపడతాడు. మరో కూతురు తన అమ్మ ఇంట్లోతనని ఇంట్లో ఒక్క పని చెయ్యనియ్యకుండా తనకు మంచి పోషకాహారం ఇస్తూ సమయాన్ని, స్థలాన్ని ఇస్తూ" నువ్వు మంచిగా చదవాలె బిడ్డా.. ఎట్లైనా జాబ్ తెచ్చుకోవాలె" అని ప్రోత్సహించి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చేలా ప్రోత్సహించిన తెన తల్లిని జ్ఞాపకం చేసుకుని పరవశురాలవుతుంది. ఆర్థికంగా తను ఈ రోజు ఇలా స్థిరంగా నిలబడ్డానికి తన తల్లి చేసిన త్యాగమే ఉంది అని తలుచుకుని కన్నీటి పర్యంతం అవుతుందీ కూతురు.
మరొక అమ్మ తన స్వంత పిల్లలతోపాటు ఊర్లో చాలామందికి పెంచిన అమ్మ అయ్యింది. ఊరంతా దానధర్మాలు చేసింది. అగ్ని హోత్రుడులాంటి భర్త కోపాల్ని భరించి ఏడుగురు పిల్లల్ని కనిపెంచింది. ఊర్లో వర్షాలు పడకపోతే అమ్మతో గంగా వివాహం పాట పాడించుకునే వాళ్ళు గ్రామస్తులు. పొలాల్లో వేసే విత్తనాలను మొదట అమ్మ చేత్తో ముట్టించుకుని మరీ పొలంలో చల్లేవారు రైతులు. అన్నింటికి మించి ఈ అమ్మ పల్లె ప్రజలకు వైద్యం చేసేది. పసిపిల్లలకు పశువులకి.. మూలికలు పెంచి మరీ. అలాంటి అమ్మ పోతే ఊరంతా నాలుగు ఊర్ల జనం తో నిండిపోయి జనసముద్రమై పోయింది. అంతటి ప్రేమని పొందిన అమ్మ ఊరికి ఏం సేవ చేసిందో ఏ చరిత్ర పుస్తకాలలో కూడా రికార్డు కాదు. స్త్రీ కదా మరి చరిత్ర కారుల్లో కూడా ఆ వివక్ష ఉంటుంది. ఇక మరో అమ్మ ఓర్పు, సహనంతో పిల్లలకు టీచర్గా ఉంటూ పాఠాలు చెప్పేది.
టీవీల్లో మునిగిపోకుండా వెంట ఉండి చదివిస్తూ ఆడిస్తూ పెంచింది. కుటుంబ బాంధవ్యాలు ఎంత జాగ్రత్తగా నెరపాలో పెద్దయ్యాక కూడా అన్నా చెల్లెళ్ల అక్కా చెల్లెళ్ల బంధాలు పట్ల ఎంత మామకారంతో ఉండాలో నేర్పించే బాంధవి అయింది. అల్లరి చేసే పిల్లలకే పనులప్పగిస్తే అల్లరి తగ్గి బాధ్యత నేరుస్తారని అమ్మ ద్వారానే రచయిత్రి గుడ్ పేరెంటింగ్ను నేర్చుకుంది. ఇంకో అమ్మ ఉంది.,తాగుబోతు భర్త డబ్బుల కోసం చిన్న కొడుకుని అమ్మబోతే ప్రాణాలకు తెగించి కాపాడుకుని మరో ఊరుకి పారిపోయి, అక్కడి టిఫిన్ షాప్లో పనిచేస్తూ దయ లేని జీవితం పట్ల కూతురిలో భయం పోగొట్టి ధైర్యం నింపింది. పిల్లల కోసం తాగుబోతు భర్త చేతిలో చావుదెబ్బలు తిన్న ఆ తల్లి ఇంటి నించి బయటకు వచ్చే సాహసాలని పిల్లల కోసమే చేసింది. అమ్మ తనను తాను ప్రేమించుకోలేదు. కాబట్టి ఇంత హింసావమానాలు అనుభవించింది . లేక పోతే కొత్తగా ఆలోచించి నరకం నుంచి విముక్తి రాలై పోయి ఉండేది కానీ అమ్మ తన కంటే ఎక్కువగా తన పిల్లలమైన మమ్మల్ని ప్రేమించింది" అంటూ అమ్మల చుట్టూ వ్యవస్థ బంధించిన సంకెళ్లను తెంచుకోలేని చూస్తుంది కూతురు. నిస్సహాయతను తన అమ్మలో చూస్తుంది కూతురు.
అదే అమ్మతను రోజూ చదివే బైబిల్ అట్ట మీద “ఈ దేహాన్ని వదిలి వెళ్లిపోతే ఈ అక్షరాల్లో నన్ను చూస్కోండి” అని రాస్తుంది. అమ్మ మరో గొప్ప మాట బైబిల్ మీద రాస్తుంది. “మనుషుల మధ్య మతాలు ఉండాలి కానీ మతాల మధ్య మనుషులు ఉండొద్దు” అంటే మనుషులకి మత మౌఢ్యం ఉండొద్దని ఈ అమ్మ కోరిక.
మరో కొడుకు కూలీచేసి తనను చదివించిన తల్లి రుణాన్ని ఆమె ఆఖరి క్యాన్సర్ గడియల్లో.. మలమూత్రాలు ఎత్తి, అమ్మ బట్టలు ఉతికి తీర్చుకోవడమే కాదు అమ్మపైన అపురూపంగా కవిత్వం కూడా రాస్తాడు.
అమ్మా సారమ్మ - చిలువేరు పారమ్మ
నీ రెక్కాడితే నిండినవి మా డొక్కలు
నీ కూలితోనే తీరినవి ఆకలిదప్పులు
నీ చెమటే చేయూతనిచ్చినది
మా చదువుకి నీ దీవెనే ఆధారమైంది
నీ కృపతో ఇంటిని కాపాడినవమ్మ
నీ ఒడియే మా విద్యకు తొలిబడి
అయినదమ్మ
అంటూ ఆర్తిగా రాస్తారు.. కవి అయిన కొడుకు చిలువేరు శ్రీనివాసులు.
ఇలాంటి అమ్మలను తమ బాల్య యవ్వన కాలాల్లో, వృద్ధాప్యంలో టేకిట్ గ్రాంటెడ్ (Take it Granted) గా తీస్కోవడం గురించి అమ్మ శ్రమని ఆ ఏముందిలే అందరూ కష్టపడినట్లే ఈమె కష్టపడుతున్నది ఏముంది గొప్ప దీంట్లో అని తీసి పడేసి ఇప్పుడు పెరిగి అమ్మలైనాక పశ్చాత్తాప్పడడం చూస్తాం.
మరో అమ్మ కుటుంబ బాధ్యతల్లో కొవ్వొత్తిలా కాలిపోతుంది. పగలు, రాత్రి వండివార్చం, పదిహేనేళ్లు మంచాన పడిన నానమ్మను చూస్కోవడం మామూలు చాకిరి కాదు. ఈ అమ్మ పిల్లలకు స్టోరి టెల్లర్ అయ్యింది. “ఎవరో చూస్తున్నారని మెప్పుకోసం మంచి చేయకూడదు. ఎవరూ చూడకపోయినా నీ అంత:సాక్షి కోసమే మంచి చేయాలి” అని తన ఆదర్శాన్ని కూతురుకి వారసత్వంగా ఇస్తుందీ అమ్మ. ఈ అమ్మ జీవితంలో ఏ పాత్రలో పోసినా ఆ పాత్రలో ఇమిడిపోయింది. అందుకే ఆడవాళ్లకి గంగా, కావేరి, యమునా లాంటి నదుల పేర్లు పెట్టారంటుంది రచయిత్రి ప్రేమను నదిలా పారించే తల్లిని తలుచుకుంటూ. కానీ ఈ అమ్మ తమ తినాల్సిన పోషకా పదార్థాలు పిల్లలకి పెట్టి సంవత్సరాలు అలా సరైన తిండి లేకుండా క్యాన్సర్ బారినపడి అర్ధాంతరంగా చనిపోతుంది. ఎలాంటి తల్లులు వీళ్లు.. పిల్లలకే కాదు. భర్తకే కాదు తను కూడా మంచి పోషకాహారం తన ఆరోగ్యం కోసం కూడా తినాలని ఈ పురుష కేంద్ర వ్యవస్థ ఎందుకు చెప్పలేదు అమ్మలకి .. ఈ కరుణా మూర్తులయిన అమ్మలకి? ఎంత విషాదామో చూడండి.. మామూలుగా స్రీలు ఎలా చనిపోతారు? స్త్రీలు గృహ హింసలో భర్తలు కొడితే, వరకట్నం కోసం కాల్చేస్తే.. అత్యాచారాలు చేస్తే, ఆత్మహత్యలకి ప్రేరేపిస్తే చనిపోతారు. హత్యలు చేస్తే చనిపోతారు. కానీ స్త్రీలు ఇలా ఆహారం త్యాగం చేస్తూ పోషకాహార లోపాలతో కూడా చనిపోతారని మూసిన తలుపుల వెనకాల.. ఎవరు ఈ చనిపోయే అమ్మల మరణాల వెనకాల అసలు కంటికే కనిపించని ఈ త్యాగాల కారణాలను రిసెర్చ్ దాక్యుమెంట్స్ ని అందిస్తారు చెప్పండి?
కొంతమంది ఊరుని, మూలాల్ని మరవని అమ్మలు ఉంటారు. అందుకే జీవితాంతం తోడుంటానన్న భర్త చనిపోతే అతని ఫోటోని చూస్తూ ఏకాంతంలో గడపడానికి, భర్త జ్ఞాపకాలలో ముడివడి ఉన్న ఊరుని, ఇంటిని వదిలి కొడుకు భాస్కర్ పట్నం పిలుస్తున్నా పోని అమ్మలున్నారు. భాస్కర్గారు తన లేఖలో గ్రామీణ సమాజంలో గర్భ గుడుల్లో పౌరోహిత్యాలకి సంబంధించిన ఒక మరుగున పడిన విషయాన్ని పంచుకున్నారు. తన బాపు అయ్యవారి వృత్తి గురించి చెబుతూ “గౌడ కులం అయినా బ్రాహ్మడిలా పౌరోహిత్యం, జ్యోతిష్యం చెబుతూ గ్రామంలో అయ్యవారిలా మెలిగాడు కదా అమ్మా మన బాపు” అని అమ్మతో చెబుతూ మురిసిపోతారు. కానీ వందేళ్ల క్రితం వరకూ తరతరాలుగా వంశపారంపర్యంగా ఊర్లలో గ్రామ దేవతలకు, కుల దేవతలకు అర్చకులుగా ఆయా కులాల వారే, బహుజన దళిత వర్గాల వారే ఉన్నారన్నది చారిత్రక సత్యం. తర్వాతంతా ఈ పౌరోహిత్యం బ్రాహ్మనైజ్ అయిపోయి తను గ్రామ దేవతలకు,అర్చకత్వానికి దూరమైపోయారు.
చివరగా.. నన్ను తీవ్రంగా కదిలించిన అమ్మకు రాసిన లేఖ ఎస్. విజయ (రోజారాణి) గారిది. చదవడం పూర్తయ్యే లోపల దుఃఖం ఆపుకోలేకపోయాను. వెంటనే భాస్కర్గారిని అడిగి రోజా గారి నెంబర్ తీస్కుని ఫోన్ చేసి మాట్లాడాను. రోజాగారు చాలా భావోద్వేగానికి, సంతోషానికి లోనై మాట్లాడారు.
పిల్లల్ని సమానంగా ప్రేమించే అమ్మలే., పిల్లల కోసం ప్రాణత్యాగం చేసే అమ్మలే ఎక్కువ సంఖ్యలో చూసాము. అయితే పితృస్వామ్యం స్త్రీలకి ప్రాతివ్యత్యం, త్యాగం, ఓర్పు, సహనంలాగా మాతృత్వం కూడా బలవంతంగా అంటగడుతుంది. అమ్మలు అందరి పిల్లల్ని సమానమైన ప్రేమతో ఉండాలి, పెంచాలి అంటుంది. కానీ అలా జరగదు. ఎన్నో కారణాల వల్ల, నిస్సహాయతలు, ఈగోల వల్ల, స్వీయ గాయాలు మిగుల్చే వొత్తిడి వల్ల, అవసరాల వలన తల్లులు పిల్లల్లో అందర్నీ సమానంగా చూడరు. రోజాగారి విషయంలో కన్నతల్లి నిర్దాక్షిణ్యంగా ఆమెను హాస్పిటల్లోనే వదిలి వెడితే, పెంచిన అత్తలు ఆమెను డబ్బుండీ చదివించకుండా సేవలు చేయించుకుంటూ దాసీల్లా ఊడిగం చేయించుకున్నారు. తల్లిదండ్రి బతికున్నారని చాలా ఆలస్యంగా తెలియడం రోజాలో తీరని ధుఖాన్ని, ఆగ్రహాన్ని కలిగించినా ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి కుటుంబంలో ఒక అన్నయ్య దయతో ఆమె చదువుకుంటారు. వివాహం అవుతుంది.
రోజా తల్లి రోజా తర్వాత నలుగుర్ని కంటుంది. ప్రేమగా పెంచుతుంది. కానీ రోజాని ఒక్క రోజు కూడా తలవకపోవడం ఆశ్చర్యమే. కానీ జీవన చరమ దశలో ఆమె నలుగురు పిల్లలూ ఆమెను తీవ్రమైన నిర్లక్ష్యంతో, అనారోగ్యంతో వదిలేస్తారు. రోజాకి తెలిసి వెళ్లి తెచ్చుకుంటుంది. అప్పటికే రోజా పెళ్లి, కొడుకు ఉంటాడు. తల్లికి భర్తకి తెలీకుండా టీచరుద్యోగం చేసిన దాంట్లోంచి డబ్బు దాచి ప్రతీ నెలా ఇస్తుంది. ఎందుకమ్మా వడిలేశావ్.. నలుగుర్ని కన్నావుగా నా తర్వాత? నేనెలా భారమయ్యానని అడగాలనీ అడగలేకపోయింది. చనిపోయే ముందు ఒక్కసారి మాత్రమే ఆ తల్లి, ప్రేమ కోసం తపిస్తున్న కూతుర్ని కౌగిలించుకుని చెవిలో రహస్యంగా “నా నగలన్నీ చెల్లికివ్వు” అని చెప్పడం రోజాని తీవ్రమైన షాక్కి గరిచేస్తుంది. తట్టు కోలేని దుఃఖం కలిగి ఒక కరిమైన వాస్తవాన్ని మళ్ళీ పరిచయం చేస్తాయి. దురదృష్టవశాత్తు రోజా భర్త, కొడుకు ఇద్దరూ యాక్సిడెంట్లో మరణిస్తారు ఒకే రోజు. రోజాను దురదృష్టం వెన్నాడినా ధైర్యం కోల్పోకుండా పిల్లలకి పాఠాలు చెబుతూ బతుకుతున్నది. ఆ తల్లి అంత కఠినాత్మురాలుగా ఎందుకు మారింది? దాని వెనక ఉన్న సామాజిక, మానసిక, ఆర్థిక పరిస్థితులు కంటికి ప్రత్యక్ష్యంగా కనిపించని ఏ కుటుంబ రాజకీయాలున్నాయి అర్ధం చేస్కోవలసీ ఉంది. రోజా గారు అనుమతి ఇస్తే ఆమె జీవితాన్ని నవలగా రాయాలని ఉంది.
ఇక అమ్మకో లేఖలో అప్పటి అమ్మమ్మలు, అమ్మలు ఎలా తమ సంస్కృతీ సంప్రదాయాలను పండుగలు, ఆచారాలు, నోములు, వ్రతాల రూపంలో ముందు తరానికి మోసారో ప్రతీ ఒక్కరూ జ్ఞాపకం చేస్కోన్నారు. దీపావలి, దసరా, ఉగాది, సంక్రాంతి పండగల్లో ఇంట్లో, ఊర్లో జరిగే పండగ సంబరాలు ఉత్సవాలు, వేడుకలు, సంతలు, అమ్మమ్మలు చేసే రకరకాల చేతి పిండి వంటలు సద్దులు మలీద ముద్దలు, బెల్లంముద్దలు, చెగోడీలు, లడ్డూలు, అరిసెలు ఉమ్మడి కుటుంబాల్లో పండగల్లో బొడ్డెమ్మల అలంకరణ, రుద్రాక్ష,కట్లపూలు, బతుకమ్మలు, ఊరంతా మారు మ్రోగిపోయే బొడ్డెమ్మ పాటలు అన్ని గొప్పగా ఉత్సాహంగా ఒక మైకంలో ప్రతీ లేఖలో నెమరేసుకున్నారు.
ఇక చివరగా ఏ అమ్మ తన ఆత్మకథ రాసుకున్నా లేదా ఎవరైనా రాసినా కానీ వారు తె లీకుండానే తమ వైయుక్తిక జీవితంలోని అనేక అంశాలు రాస్తూనే తమను కుటుంబంలో, సమాజంలో తమ స్థితిని నిర్ణయించే సామాజిక చలన సూత్రాలను కొంచెంగానైనా జ్ఞాపకము, జ్ఞానము ఉన్నంత మేరకు వివరించే ప్రయత్నం చేస్తారు. అప్పటి కాలపు సామాజిక రాజకీయాలను, చరిత్రను, సంఘటనలను, ఉద్యమాలను స్థానికంగా జాతీయంగా, అంతర్జాతీయంగా అన్నీ రంగాలలో జరిగే సామాజిక మార్పులను గుర్తు చేసుకుంటూ రాస్తారు. ఇందులో తొంబై, ఎనబై ఏళ్లున్న అమ్మలున్నారు. వారి కాలాల్లో జరిగిన జాతీయ ఉద్యమ పూర్వం/అనంతరం జరిగిన సామాజిక, సాంఘికపరమైన మార్పులు గమనించే ఉంటారు.
జాతీయోద్యమం, అనేక సంఘ సంస్కరణలు, గాంధీ-నెహ్రూలలాంటి జాతీయ స్థాయి రాజకీయ నాయకులకి సంబంధించిన సంఘటనలు, రైతాంగ సాయుధ పోరాటాలు, నక్షల్బరీ,1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం లాంటివి ఎన్నో అమ్మలు గమనించే ఉంటారు. ఆ అంశాలన్నీ ఈ లేఖల్లో చేరి ఉంటే ఎంతో అద్భుతంగా ఉంది ఉండేది. ఒక్కో అమ్మది ఒక్కో జ్ఞాపకంగా .. ఎన్నో జ్ఞాపకాలు, సంఘటనలు ఈ లేఖా సంకలనం లో చోటు చేసుకుని, రకరకాల పువ్వుల గుల్ దస్తాగా పరిమళించి పోయేది ఈ “అమ్మకి.. ప్రేమతో” లేఖా సంకలనం .అలాగే చదువుకున్న అమ్మలు ఎంతో మందికి నవలలు, కథలు చదివే అలవాటుందని రాశారు ఎంతోమంది బిడ్డలు ఈ లేఖల్లో.
ఏ రచయతల పుస్తకాలు చదివారు?అన్న విషయం కూడా ప్రస్తావించి - ఉంటే రచయతల, కవుల భిన్న సాహిత్య ధోరణులు, వస్తువులు, సాహిత్య రూపాలు తెలిసేవి. అలాగే చాలా బాగుండేది. ఆనాటి అమ్మలు చూసిన అప్పటి సినిమాల ప్రస్తావన కూడా ఉండి ఉంటే బాగుండేది. ఇలా అమ్మల ఆటో బయోగ్రఫీల్లో గత కాలపు చారిత్రక సంఘటనలు రికార్డ్ అవుతుంటాయి. అమ్మల జీవితాలతో సమాంతరంగా నడిచిన చారిత్రిక విషయాలు అవి. అందువల్ల అమ్మల ఆత్మ కథలు చారిత్రక గ్రంథాలుగా సాహిత్య చరిత్రలో నిలిచిపోతాయి. గత కాలపు చరిత్రను అధ్యయనం చేయడానికి, పరిశోధనకు పనికి వస్తాయి.
ఈ పుస్తకంలో ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది అమ్మలకు రాసిన అన్ని లేఖల్లో ఒక నాస్టాల్జిక్ నెమరువేత మాత్రమే కనిపిస్తుందితప్ప అప్పటి కాలపు చరిత్ర కనిపించలేదు. భాస్కర్ గారు ఈ విషయంలో రచయితలకు లీడ్ ఇవ్వాల్సింది అనిపించింది. అమ్మలు జీవించిన గతకాలపు స్థానిక రాజకీయ, సామాజిక చారిత్రక అంశాలని అమ్మల జ్ఞాపకాల్లో పొందుపరచాల్సి ఉండింది. అలా రాసి ఉంటే ఈ పుస్తకానికి ఒక చారిత్రక విలువ, సమగ్రత వచ్చి ఉండేది.
అయితే ఇందులో ఒక లేఖలో ఒక అమ్మ సౌజన్యం, ఔదార్యం చెబుతూ ఒక రచయిత్రి 1977లో దివి సీమ ఉప్పెన వచ్చినప్పుడు, ముస్లిమ్ అయిన సాహెబ్ ఇల్లు కూలిపోతే అమ్మ ఎలా వాళ్లందర్నీ తన ఇంట్లోకి పిలిచి పొడి బట్టిలిచ్చి రాత్రికి రాత్రి అన్నం వండి పెట్టిందో చెబుతూ ఆ కాలపు హిందూ, ముస్లింల పరమత సహనంతో, సంయమనంతో బతికడాన్ని చూపిస్తారు.
మొత్తానికి భాస్కర్గారూ ఇది మంచి ప్రయత్నం. అమ్మల జీవితాలను (UNSUNG MOTHERS) గొప్పగా, ఆర్తిగా రాసిన రచయితలందరికీ అభినందనలు. ఇక ఆ కాలపు అమ్మల జీవితాలతో ముడిపడిన అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయాలను రాయగలిగితే బాగుండు. అప్పటి అమ్మలు జాతీయోద్యమం సంఘ సంస్కరణలు, సాంఘిక దురాచారాలు,పూజలు, సాంప్రదాయాలు, దొరల ఇళ్ళల్లో బానిసత్వం, ప్రతిఘటనలు రాస్తే ఒక ముప్పై ఏళ్లయినాక ఇప్పటి పిల్లలను అమ్మలకు ప్రేమ లేఖలు రాయమంటే ఎలా రాస్తారో చూడాలి. సమకాలిన, వర్తమాన రాజకీయాలను స్త్రీల జీవితాలను అతలాకుతలం చేసిన నూతన ఆర్థిక సంస్కరణలను (LPG) లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటేషన్ ఎలా అమ్మలను శ్రమ దోపిడీకి గురి చేశాయో, సామ్రాజ్యవాద మార్కెట్ పెట్టుబడుల విస్తరణలో భాగంగా స్త్రీల జీవితాలను, శరీరాలు మీడియాలో ఎలా పెట్టుబడిగా మార్చి ప్రదేశాయో, పాలకవర్గం, పెట్టుబడీ దారుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పాలకవర్గ అనుకూల అభివృద్ధి నమూనాలను రైతుల, దళితుల, ఆదివాసీలపైన, స్త్రీల ఇతర అణగారిన వర్గాల పైన అమలు పరిచిందో దాని ఫలితం అంతిమంగా స్త్రీల పైన ఎలాంటి దుష్ప్రభావాలు పైన అమలు పరిచింది దాని ఫలితం అంతిమంగా స్త్రీల పైన ఎలాంటి దుష్ప్రభావాలు చూపించిందో.. స్త్రీలు ఎలా బలి పశువులైనారో రాస్తారా ?
గ్రామాల్లో బలవంతంగా అమలు పరిచిన ప్రత్యేక ఆర్థిక మండలాలు SEZలు రైతులను భూముల నుంచి బేధఖల్ చేసి, ఎలా వలసలను పెంచుతూ ఈ క్రమంలో అమ్మలు ఎంత దారుణంగా లైంగిక దోపిడీకి చివరి ఎయిడ్స్కు బలైనారో, అవాంఛిత గర్భాలు, అబార్షన్లు వాళ్ల నెలా చంపాయో..రాస్తారా లేఖల్లో? ఏ రకంగా ప్రపంచీకరణ, ఆధునిక సోషల్ మీడియా, ఆధునిక టెక్నాలజీ మనుషుల్ని వస్తు వ్యామోహంలో పడేసి అమ్మల్ని డబ్బులు సంపాదించే యంత్రాలుగా " మార్చి పడేసాయో.. విస్తరిస్తున్న పోర్న్ సంస్కృతి ఏ రకంగా ఆధునిక అమ్మల పడక గదుల్లో సెక్స్ హింసను పెంచుతూ పోతున్నదో రాస్తారా? పాత సమస్యలు కొత్త రూపాలతో వస్తే ఎలా ఎదుర్కొన్నారో రాస్తారా? అలాగే పెరిగిపోతున్న హిందూ మతోన్మాదం ఏ రకంగా స్త్రీల జీవితాలను భారంగా మార్చి పడేసిందో, మతం పేరుతో జరుగుతున్న ఆధునిక మనువాదం ఏ రకంగా ఫాసిజపు ఉరిని స్త్రీల చుట్టూ బిగదిస్తూ ఎన్నో దశాబ్దాలు పోరాడి సంపాదించుకున్న వారి పునరుత్పత్తి, లైంగిక హక్కుల్ని, అంతిమంగా మానవ హక్కులను హరిస్తుందో రాస్తారేమో చూద్దాం. చివరిగా నాకు ముందు మాట రాసే అవకాశాన్నిచ్చిన భాస్కర్ గారికి కృతజ్ఞతలు.
(పుస్తకం కాపీలకోసం డా.మడత భాస్కర్ ,ఫోన్ - 89193 28582,హనుమకొండ,వరంగల్ ని సంప్రదించాలి)