అంటరాని బతుకమ్మ

ఎప్పటికైనా ఒకే మట్టిని కప్పుకోవాల్సినోళ్ళం మన బతుకమ్మలకు ఒకే చోటెందుకు లేదు? జర చెప్పరాదు ??

Update: 2024-10-10 03:26 GMT



-- ఒంటెపాక మల్లయ్య



టేకు,గునుగు పూగుత్తులు
బంతి,చామంతి పూగమ్మత్తులు
సీత జడ తంగేడు వనాలు
రంగురంగుల జాతుల పూలు
రకరకాల ఆకారాలు
అందమైన బతుకమ్మగా ముస్తాబవుతాయి
ఒక్క కంచంలో ఒదిగి
ఒక్క కుటుంబంలా కలిసిపోతాయి.
ఒక్కోపువ్వు ఒక్కోబతుకమ్మగా
రూపుదిద్దుకునే
తీరొక్కపువ్వుల తిరుణాల కదా బతుకమ్మ అంటే

ఒకే ఊరిలో ఉన్న మనుషులు
అంతోఇంతో చదువుకున్న మనుషులు
ఊరు నుండి అంతరిక్షానికి దారులు వేసి
జ్ఞాన యాత్రలు సాగిస్తున్న మనుషులు
ఒకే పాటను పాడలేక పోతున్నారు
ఒకే గొంతును కలపలేకపోతున్నారు
ఒకరి అడుగులో ఒకరు అడుగులేసి
ఒకే బతుకమ్మను పేర్చలేకపోతున్నారు

పొలాలకు పారుతున్న చెరువు నీరు ఒకటే
ఒంట్లో పారుతున్న నెత్తురు రంగు ఒకటే
నడుస్తున్న నేల ఒకటే
నెత్తిమీద ఆకాశం ఒకటే
ఎప్పటికైనా ఒకే మట్టిని కప్పుకోవాల్సినోళ్ళం
మన బతుకమ్మలకు ఒకే చోటెందుకు లేదు?
జర చెప్పరాదు ??

చెట్టుచెట్టు తిరిగి
అడవి నుంచి తెచ్చిన పూరేకులతో
అందాల బతుకమ్మను సింగారించే మనం
అందరమొకటిగా ఎందుకు ఆడలేకున్నాం?

వేల పరిమళాలు వెదజల్లు
పువ్వుల నడుమ
మీ బుర్రల నుండి వీచే కులం కంపు మాత్రం
భరించరాని కంపుగా వుంది

అదిగో
అవమానల అగ్గిమంటల్ని
అంగిట్లో దాచుకుని నడుస్తున్న
మా బతుకమ్మను చూడు
అంటరాని బతుకమ్మ అందాలు చూడు
వెలివాడల బతుకమ్మ వెలుగులు చూడు

అక్కడ భక్తి పాటలు ఉంటాయేమో కానీ
ఇక్కడ బ్రతుకు పాఠాలు కూడా ఉంటాయి
పిడికెడు ఆత్మగౌరవం కోసం
గొంతెత్తి పాడే పోరు పాటలూ ఉంటాయి.

*



Tags:    

Similar News