జెన్నీ - అపర్ణ తోట- ప్రేమ!
Hyderabad Book Fair Special : అపర్ణ తోట ‘జెన్నీ’ గీతాంజలి పరిచయం
ఇద్దరూ ఒకటే.. One Soul.
జెన్నీ, అపర్ణ ఆల్టర్ ఈగో
అపర్ణ కన్నీళ్లను, విషాదానందాలను... నిరాశ,కోపం...ఆమె చేసే తప్పొప్పులను గైడ్ చేస్తూ..అప్పుడప్పుడు శిక్షిస్తూ..మళ్ళీ అక్కున చేర్చుకుని లాలించి ప్రేమించే అపర్ణలోని మరో అపర్ణ...జెన్నీ ఆపర్ణలోని అంతః చేతన..స్నేహితురాలు,టీచర్! ఏకాంతపు కన్నీళ్లను వెచ్చని చీర కొంగుతో తుడిచే అమ్మ కూడా.
జెన్నీ అపర్ణ ఇద్దరూ చాలా సార్లు ఒకరే... కొన్ని సార్లు మాత్రమే వేరు, వేరు.
అపర్ణ అంటే జెన్నీ కి చాలా ప్రేమ.
జెన్నీ ..అపర్ణ అంతర్లోకాల్లో నిశ్శబ్దంగా పెరుగుతూ పోయింది..అపర్ణని చూస్తూ,అనుభూతి చెందుతూ..ఏడుస్తూ,నవ్వుతూ..చివరాఖరికి అపర్ణలో ఐక్యమై పోయింది. అపర్ణ జెన్నీగా పూర్తిగా metamorphosis చెంది ఏడు రంగుల సీతాకోక చిలుక లా తనదైన అందమైన పూలతోటకి రారాణి అయిపోయి పూల రెక్కలతో లోకం మీద..లోకంలో ఉన్న అన్ని రకాల మాలిన్యాల, బహుముఖాల్ మనుషుల అంతర్లోకాల్లోని దొంగల మీద... భూగోళాన్ని ఆవరించుకుని ఉన్న ఒక మహత్సౌందర్యం మీద... అందమైన, కఠినమైన, వ్యంగ్యాత్మక మైన , దుఃఖమైన, సంతోషకరమైన వ్యాఖ్యానాల్ని... కవిత్వంగా గొప్ప విరుపుతో... తన లోపలి జెన్నీ అనే కొరడాతో చెళ్ళు మని మనుషులు అనుకుంటున్న వాళ్ళు ఉలిక్కి బడేలా రాస్తున్నది.
అపర్ణా..నువ్వు బాగున్నావు..జెన్నీ ఎంత అందమైనదొ... మృదువైనదొ,కఠినమైనదొ
నువ్వూ అంతే..!
జెన్నీ..అపర్ణతో నువ్వు రాయించిన ఈ సాహసో పేతమైన,నిర్భయ కవిత్వం
మీరిద్దరూ పురుడుపోసుకున్న మాంత్రిక పుష్పాల అమృతతుల్యమైన పరిమళాలను వెదజల్లుతున్న ది
లవ్ యు డియర్ జెన్నీ...
అపర్ణా..నీ జెన్నీని ఇలాగే కాపాడుకో. నీహృదయపు తోటలో నుంచి బయటకు వెళ్ళనీయకు.ఎందుకంటే..జెన్నీ నీదే కాదు..మాది కూడా !
***
జెన్నీ ఇయర్ ఫోన్స్ తీసెయ్యరాదు..
చివరగా, ఈ రహస్యాన్ని చెప్పి పోతాను.
నువ్వో ఎడారివి...
నేనో సముద్రాన్ని...
అరె నవ్వుతావేంటి??
చెప్పక పోయినా... మనిద్దరికీ తెలుసు!
ఇప్పటి నుంచీ నెమ్మదిగా ఒకరికొకరం నిద్రపట్టని రాత్రుల నుంచి వెలిసిపోయిన జ్ఞాపకంగా మిగిలిపోతాము!
***
ఈ రాత్రి చిరు చలిలో బేబీ నాకోసం రా !
ఈ ఏటీఎం మెట్ల పైన కూర్చుని,
సగం నువ్వూ...సగం నేనూ
పగలంతా ఎంగిలి చేసిన కబుర్లను చెప్పుకుని,
రాత్రికి వీడికొలినిద్దాం!
***
నిదుర రాని రాత్రులలో..
చెమట కోసం స్పర్శ కోసం
వెతుకులాట..పెనుగులాట.
ఆకలి,దాహం
దేహం రాజుకున్న కుంపటి.
నిశ్శబ్దపు ఆక్రందనల గానం
తరుముతున్న గతం
ఇరుక్కుపోయిన నొప్పి
ఏ భాగంలోనో తెలీదు
ఈ రాత్రికి మందు దొరకదు.
***
నువ్వు వస్థావని తెలిసి
నేను రావధ్ధన్నప్పుడు ప్రశ్నలు కొన్నిందాచుకుంటాను
చూపులు కలవని సమయాలలో..
సమాధానాలు అందుతాయని ఎదురుచూస్తాను.
కన్నా.. కలలో నవ్వింది నువ్వేనా?
జ్ఞాపకాల దారుల్లో చీకటి ముసిరిన వేళ ..
నా చేతుల కంటిచిన పెదవుల చప్పుడుని
మొన్న నిద్ర పట్టని రాత్రి
కీచురాయిగా మార్చి
నీ మంచం కోడుకి కట్టాను.
రాత్రుళ్లు..దాని అరుపు,నా ఉపిరి..
ఈ జుగల్బందీ విన్నావా?
***
నగ్న శరీరాలు,ఊచకోతలు
శీలాల రథయాత్రలు,
హర్మోన్ల ధిక్కరిం పులు
నాల్కలు సాచి పోచమ్మ ఆడినా..
మొగుడి కాళ్లుపడుతూ వీణలు మోగించమా?
* జోగినీ మాతంగి, రఖెల్, చుడెల్!
చోరబడినప్పుడు అందరూ ఒకటే!
దిక్కులు పిక్కటిల్లే నిశ్శబ్దం
దేవతలే అమ్మలందరూ..
దేవిడీలో ఆట వస్తువులే !
***
నా ప్రేమికుడు
నా భర్త
నా దైవం
నా భీతి!
సర్వం నీవై నా పై స్ఖలించు!
ఇట్లు...
సదా నీ ప్రేమలో పరిఢవిల్లే
నీ అనుంగు నాయకి!
**
అంతా కుట్ర రా! పాపం మగవాళ్లు రా
పిచ్చి నా కొడుకులురా!
చిన్ని తండ్రులు రా
దయ చూపండిరా
బేల అంటే స్త్రీ లింగం మాత్రమే కాదని చెప్పండిరా
***
What did I do?
Where have I come?
Where do I stand now?
ఆకాశమేమో..శూన్యం.
ముందున్నదంతా దెయ్యాల లోకం!
**
జెన్నీ నువ్వు ఎక్కడ నిలబడాలో అక్కడే నిలబడ్డావు.. దెయ్యాలను తన్ని తరిమే సింహాసనం మీద కూర్చున్న మహారాణి లా ! నీ ఆకాశం శూన్యంగా ఎక్కడుంది
జెన్నీ నువ్వు అక్కడ నక్షత్రాల విత్తనాలు నాటాక..వెన్నెల తాగించాక... చూడు తలెత్తి నీ ఆకాశపు తోటలో ఎన్ని చంద్రోదయాలో జెన్నీ..రోజోక చందమామతో కబుర్లు చెప్పే నువ్వు వొంటరిదానవి ఎట్లా అవుతావు. Jenny, you are a moon..you are an entire sky now!
నీ కవిత్వం చదివాక నా జెన్నీ... నాకు ఇంకా ప్రియమైన దానివి అయిపోయావు...ఈ కవిత్వం రాసిన నీ చేతి వేళ్ళని ముద్దాడనీ..ఒక్కసారి నిన్ను కలవనీ..నిన్ను నా కళ్ళల్లో మళ్ళీ మళ్ళీ నింపుకొనీ...డియర్ జెన్నీ..డియర్ అపర్ణా I love you!
('జెన్నీ' కోసం స్టాల్ల్స్158, 280 281, 248, 287, 282-285 Hyderabad Book Fair లో చూడండి)