హేమంతపు చామంతిలా తొలిపొద్దు
మంచు ముత్యమయ్యింది మన్యం
చలిగాలిని చీల్చుకుంటూ
పూల తేనియకై దూసుకుపోతుంది తేనెటీగ
రివ్వున వీస్తున్న శీతల పవనమొకటి విద్యుత్ తరంగమై
మేనుని నులిపెడుతుంటే...
మిల మిల మెరుస్తున్న ముత్య ప్రవాహంలా
లతలు రాలుస్తున్న తుషార బిందువులు !
అడవి జవ్వని శీతల స్నానాన్ని ఓరగా చూస్తున్న చిలిపి కళ్ళ సూరీడు
అంతలోనే భానుని బిగి కౌగిలిలో అడివంతా...
విహారానికై దిగిన మబ్బుల పావురాలను చూస్తూ...
దేవతలు దిగొచ్చారు రండహో.. అన్నట్టుగా కాకుల క్రీంకారాలు
లోయంతటా ఎగిరే పళ్ళెంలా ఏదో పుప్పొడి పాట!
సౌరభాలన్నీ ఏకమై గజ్జె కడుతుంటే అష్టమ వర్ణ మయ్యింది అడవి!!