విశాఖపట్నం ‘ఆకాశవాణి’నుంచి ఊడిపడ్డ ‘ఇంద్రధనస్సు’
-డా. గూటం స్వామి పరామర్శ;
By : The Federal
Update: 2025-02-09 02:57 GMT
-డా.గూటం స్వామి
ఏం చేస్తున్నామో అదే జీవితం. జీవాత్మగా ఉన్నప్పుడు చేసే పనులే మన తదననంతర జీవితాన్ని కొనసాగిస్తాయి. మనిషి పుట్టుకకు, మరణానికి మధ్య ఉండే సమయమే జీవితం. ఆ సమయంలో కూడా కొంత నిద్రకూ, కొంత వృధాగా, ఖర్చయిపోగా మిగిలినది చాలా విలువైనది. ఆ సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా జీవితాన్ని సార్థకం చేసుకునేవారు కొందరు ఉంటారు. అలా నాకు కనిపించిన వారిలో డాక్టర్ బండి సత్యనారాయణ గారు ఒకరు. ఈయన ఆల్ ఇండియా ‘రేడియో విశాఖపట్నం కేంద్రంలో సీనియర్ అనౌన్సర్ గా 33 సంవత్సరాలు సేవలు అందించి జనవరి 31, 2025న ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన "ఇష్టపది" పేరుతో ఆయన రాసిన పుస్తకాలపై పలువురు రాసిన సమీక్షలను సంపుటిగా తీసుకొచ్చి పాఠకులకు అందించారు. ఒక్కో వ్యాసం చదువుతున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం, మానవీయత, మంచితనం, ప్రతిభ, పాఠకుల ముందు పరుచుకుంటాయి.
ఈ సంపుట్లో ఆయన వ్యక్తిత్వం గురించి రాసిన వ్యాసాలు కొన్ని అయితే కొన్ని ఆయన రచనలపై చేసిన సమీక్షలు, మరికొన్ని ఆకాశవాణితో తనకున్న బంధాన్ని తెలుపుతూ బండి వారి రాసిన వ్యాసాలు, గేయాలు. ఇందులో ప్రతి వ్యాసం చాలా విలువైనది. భావితరాలకు ఎంతో అవసరమైనది కూడా. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆశీర్వచనాలతో ఈ సంపుటి ప్రారంభమవుతుంది. తన ఊరువాడైన సీనియర్ జర్నలిస్ట్ కుసుమ తిరుమల శేఖర్ "చిగురాకు సన్నాయి" ఆసక్తికర వ్యాసంతో మనలను ఇష్టపది ఇష్టంగా లోపలికి నడిపిస్తుంది. జర్నలిస్టుగా తాను మారడానికి డాక్టర్ బండి సత్యనారాయణ ఏవిధంగా ఆదర్శప్రాయుడయ్యాడో వివరించిన తీరు స్ఫూర్తివంతంగా ఉంటుంది. చదువరులను మంత్రముగ్ధులను చేస్తుంది. బండి వారి సహృదయతను వెల్లడి పరుస్తుంది.
ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయిన కాకరపర్తి సత్యనారాయణమూర్తి "అక్షర సత్యం" పేరుతో డాక్టర్ బండి వారి గురించి వ్యాసం రాశారు. ఇది డాక్టర్ సత్యనారాయణకు ఒక కాండాక్ట్ సర్టిఫికెట్ లాంటిది. ఎందుకంటే తన కింద పనిచేసిన ఉద్యోగి గురించి ఎంతో ఉదాత్తంగా చెప్పారంటే అంతకంటే ఆ ఉద్యోగికి ఆనందం ఏముంటుంది?
ఉద్యోగ విరమణ అనంతరం హాయిగా ఆనందంగా జీవించేయొచ్చు. బండి వారితో కాకరపర్తి గారికి ఉన్న మంచి జ్ఞాపకాలను ఈ వ్యాసంలో పంచుకున్నారు. బండి సత్యనారాయణ గారు ఆకాశవాణి కేంద్రానికి రాసిన లోక బాంధవులు రూపకం నేపథ్యాన్ని, దానికి శ్రోతల నుంచి వచ్చిన స్పందనలను, వివరించారు. అంతేకాదు బండి వారి సరళ సుందర శైలిని చక్కగా వివరించారు. అలాగే సమకాలిన జీవన వైరుధ్యానికి, సంఘర్షణలకు అద్దం పడుతూ బండి వారు రాసిన "అనామిక" కుటుంబ నాటిక ధారావాహిక గురించి, ఆ నాటకంలో ఆయన వాడిన భాష, పదజాలం, గురించి, సామాజిక స్పృహతో ఆయన రాసిన గేయాల గురించి, ఆహుతుల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహించిన తీరు గురించి, తోటి ఉద్యోగుల పట్ల ప్రవర్తించిన స్నేహశీలత గురించి, జాతీయస్థాయిలో ప్రధమ బహుమతి అందుకున్న బండి వారి రచన "దరిచేరే దారి" రూపకం గురించి ఇలా ఎన్నో జ్ఞాపకాలను ఈ వ్యాసంలో కాకరపర్తి వారు పంచుకున్నారు.
బండి వారి గురించి కాకరపర్తి గారు రాసిన ప్రతి మాటలో ఎంతో ఆప్యాయత కనిపిస్తుంది. ఒక చిన్న మచ్చ కూడా ఆయన చూపించలేకపోయారు. ప్రతిభావంతుడైన కవిగా, రచయితగా వక్తగా సంఘంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా కీర్తించిన విధం చదివినప్పుడు బండి వారి పట్ల మరింత గౌరవం ద్విగిణీ కృతమవుతుంది.
అనుబంధం 1 లో "30 ఇయర్స్ ఇండస్ట్రీ" అంటూ ఆయన తన నేపథ్యాన్ని, ఉద్యోగం పొందిన విధానాన్ని, వ్యాసంగా అందించారు. 1991 నుంచి 2021 వరకు అంటే 30 ఏళ్ల ఉద్యోగ ప్రస్తానాన్ని ఈ వ్యాసంలో చూడొచ్చు. మొదటి పోస్టింగ్ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ఎలా జాయిన్ అయింది, అక్కడ తనకు పరిచయమైన స్టేషన్ డైరెక్టర్ వివి శాస్త్రి గారు, అకౌంటెంట్ గంగిరెడ్డి గారు, స్టేషన్ ఇంజనీర్ సెల్వరాజుగారు గురించి, తన రూమ్మేట్ మల్లాది చంద్రశేఖర్ గారి గురించి, ఆయన ఇందులో గుర్తు చేసుకున్నారు. రెండేళ్లు తిరుపతిలో పనిచేశాక కొత్తగూడెం బదిలీ, అక్కడ పైడి శ్రీ, మద్దూరి నగేష్ బాబు, రాంపట్ల నృశింహశర్మ,లతో పరిచయం, కొత్తగూడెంలో తమ ప్రతిభ పాటవాల ప్రదర్శన విధానాన్ని వివరించిన తీరు ఆకట్టుకుంటుంది . పాఠకులను ఆ కథనంతో నడిపిస్తుంది.
అలాగే విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం స్వర్ణోత్సవాల సందర్భంగా రాసిన వ్యాసంలో రేడియో శ్రోతగా తన ప్రస్తానాన్ని, ఉద్యోగ జీవితంలో తాను చూసిన రకరకాల శ్రోతల్ని, అనౌన్సర్ గా శ్రోతలతో తనకున్న అనుబంధాలను, "ఫోన్ ఇన్ లైన్" కార్యక్రమం ద్వారా శ్రోతలకు దగ్గరైన విధానాన్ని వివరిస్తూనే ఇందులో కొంతమంది శ్రోతల అభిప్రాయాలను కూడా ముద్రించడం బాగుంది. అలాగే ఆరుపదుల ఆకాశవాణి ప్రస్థానాన్ని కూడా ఒక సుదీర్ఘ వ్యాసం ద్వారా బండి వారు పాఠకులకు అందించారు. భారతదేశంలో రేడియో ప్రవేశించింది మొదలు ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా రేడియో కేంద్రాల స్థాపన జరిగిందో ఆ వివరాల గురించి, రేడియో కేంద్రాల్లో ఫ్రీక్వెన్సీ గురించి, టెక్నికల్ విషయాలు ఈ వ్యాసంలో ఎన్నో రాశారు. చాలా గొప్ప వ్యాసం ఇది. పరిశోధకులకు ఎంతో ఉపయుక్త మైనది కూడా. 8 పేజీల ఈ వ్యాసం ఎక్కడ బోర్ కొట్టదు. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అంత రీడబులిటీ ఉన్న వ్యాసం ఇది. ఇలా రాయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.
రెండవ అనుబంధంలో బండి వారు రాసిన గేయాలను ముద్రించారు. దేశభక్తి గీతాలు, విజయనగర కీర్తి గురించి రాసిన గీతం, బహుజన బాంధవుల రూపకం ప్రసారమైనప్పుడు రాసిన శీర్షిక గీతం, అలాగే లలిత గీతాలు, విశాఖ ఉత్సవ గీతం, పాఠకుల్లో ఆసక్తి రేపుతుంది. అందమైన పూల తోటలోకి నడిచిన అనుభూతి కలుగుతుంది.
ఈ సంపుట్లో బండి వారు రచించిన పుస్తకాలపై వివిధ రచయితలు రాసిన వ్యాసాల సమహారం పాఠకుల్ని ఆనందపారవశ్యంలో నడిపిస్తుంది. డాక్టర్ కేజి వేణు రాసిన "కవిత్వ నిబద్ధతకు సువర్ణ సంతకం -డాక్టర్ బండి సత్యనారాయణ" డాక్టర్ మాటూరు శ్రీనివాసరావు రాసిన" అసమానతలు, అణచివేతలు పట్ల ధిక్కారస్వరం డాక్టర్ బండి కవిత్వం" పునరపి జననం పుస్తకంపై స్వర్ణ శైలజ సమీక్ష, ఆకుపచ్చ లోకం పుస్తకం గురించి మాకినీడి సూర్య భాస్కర్ రాసిన వ్యాసం, రెప్పలేని లోకం కవిత సంపుటి పై సౌభాగ్య చేసిన సమీక్ష, యుద్ధకాండ, బహుజన బాంధవులు, నిర్వాణ లపై డాక్టర్ గూటం స్వామి చేసిన సమీక్షలు, వాన కురిసిన రాత్రి కవితా సంపుటిపై మందరపు హైమావతి, శైలజమిత్ర సమీక్షలు, నారింజరంగు సాయంత్రాలు కవిత సంపుటిపై డాక్టర్ ఎల్.కె సుధాకర్, దాట్ల దేవదానం రాజు, మానాపురం రాజా చంద్రశేఖర్ సమీక్షలు నిర్వాణ నవలపై బెందాళం కృష్ణారావు గారి సమీక్ష, ఒంటి కాలు పరుగు కవితా సంపుటిపై బొబ్బిలి రాధారాణి గారి సమీక్ష పాఠకులను ఆనంద డోలికల్లో ఊగిస్తుంది. బండి వారి కవిత్వాన్ని పట్టి చూపిస్తుంది. ఆలోచింప చేస్తుంది. పరిశోధకులకు మార్గదర్శకంగా ఉంటుంది.
ఇష్టపది పేరుకు తగినట్టుగానే అందరికీ ఇష్టమైన గ్రంథం. జయదేవుని అష్టపదులు లాగే డాక్టర్ బండి సత్యనారాయణ ఇష్టపది పది కాలాలపాటు నిలిచి ఉంటుంది. ఈయన ఆకాశవాణి ఉద్యోగి కావడం చేత, శ్రోతల నాడి బాగా తెలిసినవాడు అవ్వడం చేత, ఎక్కడా సుత్తి లేకుండా సూటిగా తను చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా, ఆకర్షణీయంగా అందించడం చేత ఈ ఇష్టపది అందరికీ ఇష్టమైన గ్రంథంగా భావిస్తున్నాను. ఇది చదివితే మీరు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారు. ప్రజ్ఞ శ్రీ, ధమ్మ విభూషణ్ బిరుదాంకితులు డాక్టర్ బండి సత్యనారాయణ రచనలు, పరామర్శగా వచ్చిన ఇష్టపది పాఠకులకు ఒక మధుర జ్ఞాపికగా ఉండిపోతుంది. తెలుగు తల్లి మెడలో కల్హారంగా భాషిల్లుతుంది. డాక్టర్ బండి సత్యనారాయణకు అభినందనలు. ఈ విశ్రాంతి జీవితంలో మరింత సాహిత్యాన్ని పాఠకులకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను