మన్యం చెరువులోమరో బుద్ధుడు!
హైదరాబాద్ హుసేన్ సాగర్ బుద్ధుడి స్ఫూర్తితో ఒక మన్యం చెరువు మధ్యలోవెలసిన బుద్ధుడు
బుద్ధవిగ్రహం అంటే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లోని గుర్తుకు వస్తుంది!
కానీ ఇలాంటి మరో బుద్ధ విశేషం ఆంధ్రప్రదేశ్ మన్యం ప్రాంతంలో ఉంది. దాని వెనుక ఉన్న అరుదైన విశేషాలు చదవండి.
ఇక్కడ కనిపించేది బుద్ధ విగ్రహం, దూరం నుంచి చూస్తే హుసేన్ సాగర్ బుద్ధుడిని గుర్తుకు తెస్తుంది.
ఇది పార్వతీపురం మన్యం జిల్లా లోని గౌరమ్మ పేట చెరువు లో వెలసిన బుద్ధుడు.
హుస్సేన్ సాగర్ మీద బుద్ధుడిని ఎన్టీ రామారావు నెల కొల్పితే, మన్యంలో విగ్రహాన్ని ఆయన అభిమాని, ఒక సామాన్యుడు వ్యయ ప్రయాసలతో ఏర్పాటు చేశాడు.
హుస్సేన్ సాగర్‌లో విగ్రహం పెట్టేటపుడు సమస్యలు ఎదురైనట్టే , ఈ మినీట్యాంక్ బండ్ మీద బుద్ధవిగ్రహం పెట్టాలనకున్నపుడు కూడా ఆలాంటి కష్టాలే పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలంలో గౌరమ్మ పేట రోడ్ మలుపులో ఉంది ఒక చెరువు. అటు వైపు వెళ్లేవారిని కనువిందు చేసే దృశ్యం చెరువు మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహం. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను స్ధానిక యువకుడు కోమటిపల్లి చంద్రశేఖర్ ఇలా వివరించారు.
అడుగడుగునా ఆటంకాలు
‘‘ మాకు గౌరమ్మ పేట, ఎరుకల పేట అనే రెండు గ్రామాల మధ్య గౌరమ్మ కోనేరు ఉండేది. బస్సులు ఆక్కడ ఆగుతున్నపుడు కండక్టర్ జంటనగరాలు వచ్చాయి దిగండి అని సరదాగా అరిచేవాడు. అప్పుడు నేను 7వతరగతి చదువుతున్నాను. అదే చెరువుగట్టు మీద తిరుగుతున్న నాకు ఆరోజుల్లో ఎన్టీఆర్ హుస్సేన్ సాగర్ పై బుద్ధవిగ్రహం పెట్టడం గుర్తుకు వచ్చి , ఆలాంటి బుద్ధుడు మా రెండు ఊర్ల మధ్య చెరువులో ఉంటే బాగుండు అని అనుకున్నాను. కానీ భవిష్యత్‌లో నేనే ఆ పని చేస్తానని అస్సలు ఊహించలేదు!
ఆ తరువాత పై చదువుల కోసం పట్నం వెళ్లడం, చదువు పూర్తయ్యాక జాబ్ చేద్దామనుకున్నాను కానీ ఇంటి పరిస్ధితులు బాగాలేక స్వగ్రామం వచ్చేశాను. అప్పటికే వివాహం జరిగింది. 2011లో నా భార్య ఏకగ్రీవంగా గౌరమ్మపేటకు సర్పంచ్ అయింది. అదే సమయంలో నేను నీటిసంఘం అధ్యక్షుడిగా పనిచేశాను.
గతంలో ఎప్పుడూ లేని విధంగా 2009లో గౌరమ్మ కోనేరు ఎండిపోయింది. ఆ సమయంలో ఎందుకో నా చిన్నప్పుడు అనుకున్నది మదిలో మెదిలింది. బుద్ధ విగ్రహం పెడితే ఎలా ఉంటుందనిపించింది.
ఊరి పెద్దలతో చర్చించాను కానీ ఎవరూ ఆసక్తి చూపించలేదు. దేవుడి విగ్రహాలు పెట్టమని సలహా ఇచ్చారు. అలా కాదని నా సొంత నిధులతోనే పని మొదలు పెట్టాను కానీ ఏదో ఒక ఆటంకం వల్ల పని మాత్రం ఎంతకూ పూర్తయ్యేది కాదు. మా కుటుంబ సభ్యులు కూడా నన్ను నిరాశ పరిచారు. గతంలో ఆదే చెరువు పూడిక తీస్తున్నపుడు మా తాతగారు ప్రమాదవశాత్తు చనిపోయారనే విషయాన్ని గుర్తు చేసి, నన్ను ఆ ప్రయత్నం విరమించుకో మన్నారు. అయినప్పటికీ వెనకడుగు వేయక చెరువు మధ్యలో దిమ్మ నిర్మించి పనులు మొదలు పెట్టాం. నా దగ్గర డబ్బు సరిపోక పోతే స్నేహితులు చందాలు వేసుకుని సాయం చేశారు కానీ తీవ్రమైన వానల వల్ల పని అయితే పూర్తి అయ్యేది కాదు. బుద్ధుడి తల వరకు శిల్పం అయ్యాక నిధుల కొరత వల్ల ఆగిపోయింది.
ఇంట్లో కూడా సెంటి మెంటల్‌గా ఒత్తిడి మొదలైంది. త్వరగా పూర్తిచేయక పోతే కీడు జరుగుతుంది అని హితులు హెచ్చరించారు. బుద్ధవిగ్రహం హుస్సేన్ సాగర్‌లో పెట్టినపుడు ఎదురైన పెద్ద కష్టాలే మాకు రాక పోయినా, మొత్తం మీద అనుకున్న సమయానికి మాత్రం పూర్తిచేయలేక పోయాం. చివరికి అతి కష్టం మీద 2016 లో చెరువు ఎండినప్పుడు పని పూర్తి చేశాం. అపుడు స్థానిక రాజకీయ నాయకులు కూడా సహకరించడంతో ఊరందరికీ భోజనాలు పెట్టి విగ్రహాన్ని ప్రతిష్టించాము. ’’ అని క్లుప్తంగా వివరించాడు చంద్రశేఖర్.
ఇపుడు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు చుట్టు పచ్చని గార్డెన్‌తో సుందరీకరణ చేసి, కోనేరులో నుండి బుద్ధుడి విగ్రహం దగ్గరకు వెళ్లి రావడానికి ఒక వంతెన కూడా నిర్మించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి తన మిత్రులతో కలిసి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖర్.