విజ్ఞాన యుగం ద్వారాలు తెరిచింది బౌద్ధమే....
2025 జనవరి 26న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సోషల్ ఫిలాసఫీ జాతీయ సెమినార్ ముగింపు సమావేశంలో తత్వవేత్త బిఎస్ రాములు చేసిన ప్రసంగ పాఠం;
- బి ఎస్ రాములు
1
మనిషి సంఘజీవి. ఆకలి తీరడం మనిషి ప్రాథమిక అవసరం. ఆకలి తీరిన తర్వాత జీవించే జీవితం అదనపు జీవితం, ఆకలి తీర్చుకోవడం కోసమే జీవించడం జంతువు స్థాయి జీవితం. ఆకలి తీరిన తర్వాత జీవించే అదనపు జీవితాన్ని, సుఖాలు అని, భోగభాగ్యాలు, పరోపకారం అని వర్గీకరిస్తారు. ఆకలి తీర్చుకునే క్రమం నుంచి మానవ నాగరికత పుట్టుక మొదలైంది. ఏది దొరుకుతుందో ఏది అరుగుతుందో, ఏది అరుగక, ఏది విషంగా శరీరానికి నష్టం చేస్తుందో గ్రహించి వాటిని వదిలేస్తూ రావడం ద్వారా ఆహారపు అలవాట్లు రూపొందాయి.
మనిషికి అష్టాంగాల ద్వారా, అష్టేంద్రియాల ద్వారా జ్ఞానం అందుతుంది. అవి కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం, కాళ్ళు, చేతులు, మర్మావయవాలు, తెలియని విషయాలను తెల్సుకోవడం జ్ఞానం, కంటితో చూసి, చెవితో విని, చర్మంతో స్పర్శించి, నాలుకతో రుచి చూసి, ముక్కుతో వాసన చూసి అవయవాలతో, నరాల స్పందనతో గ్రహించి విషయాలను తెల్సుకొంటాయి. నాలుక ముక్కులాగే కాళ్ళు, చేతులు, మర్మావయవాలు వాటికి ప్రత్యేకించిన పనులు చేస్తాయి. చేతి వృత్తులు, హస్తకళలు, డప్పు, వీణ, టైపు, చిత్రలేఖనం, లిపి మొదలైన వాటితో చేతులు ప్రత్యేకమైన నైపుణ్యంతో పని చేస్తాయి. మానవ సమాజంలో కాళ్ళు, చేతులు, మర్మావయవాలు నిర్వహించే పాత్ర అమోఘ మైనది. అందువల్ల పంచేంద్రియాలు అని చెప్పడం కన్నా అష్టేంద్రియాలు అని చెప్పడం సముచితం, ఈ ఎనిమిది ఇంద్రియాల ద్వారా మనిషి తన వెలుపలి ప్రపంచాన్ని తెల్చుకొంటాడు. ఈ ఎనిమిది ఇంద్రియాల ద్వారా మనిషి ప్రకృతి, సమాజాలతో సంబంధంలోకి వస్తాడు, వీటి ద్వారా స్వయంగా ప్రత్యక్షంగా తెల్సుకొన్న వాటినుండి రూపొందిన జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే యితరులు స్వయంగా ప్రత్యక్షంగా తెల్సుకొన్న వాటినుండి రూపొందిన జ్ఞానం. మనకు ప్రత్యక్ష అనుభవం లేకపోయినా పొందగలిగేదంతా పరోక్ష జ్ఞానం. స్కూల్లు, కాలేజీలు, శిక్షణా తరగతులు, శిక్షణ, సాధన, పాఠ్య పుస్తకాలు, గ్రంథాలు, పద్ధతులు, కథలు, కళలు మొదలైనవి మానవ సమాజం యింత దాకా సాధించిన జ్ఞానాన్ని ‘పరోక్ష జ్ఞానం’గా పొందటానికి రూపొందించుకున్న వ్యవస్థలు, పద్ధతులు.
ఆలోచన విస్తరించి తత్వశాస్త్రంగా రూపుదిద్దుకున్నది. హరప్పా, సింథు నాగరికత కాలంనాటికే గొప్ప గొప్ప తాత్విక ఆలోచనలు స్థిరపడ్డాయని, ఆనాటి శిథిలాల తొవ్వకంలో తెలుస్తున్నది. అక్కడ దొరికిన కళాత్మక వస్తువులు, పింగాణి పాత్రలు, ఆనాటి సైన్స్ టెక్నాలజీ, నగర నిర్మాణం, స్నానవాటికలు, డ్రైనేజి, మంచినీటి కాలువలు ఇవన్నీ హరప్పన్, సింథు ప్రజలు ఐదు వేల యేళ్ళ నాడే ఎంత గొప్పగా ఎదిగారో సాక్ష్యం యిస్తున్నాయి.
ఆనాటి ఆలోచనలు, తత్వశాస్త్రం ఎలా ఉండిరదో రాతప్రతులు లేవు. కానీ వారి నగర నిర్మాణం, కళాకృతులు, బొమ్మలు, బొమ్మలతో రాసిన భాష మనకు పురావస్తు ఆధారాలుగా లభించాయి. బొమ్మల భాష మనం యిప్పటికీ చదవలేకపోతున్నాము. బొమ్మల నుండే అక్షరాలు రూపుదిద్దుకున్నాయి. భావానికి అక్షరం ఒక ఆధారమైంది. ఒక ఆకారమైంది. ధ్వనికి ఒక సంకేతంగా కొన్ని గీతలను, బొమ్మలను సృష్టించుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ ఆనాటి ప్రజలు తనకు తోచిన, తమకు లభ్యమైన సంకేతాలను భాషగా వినియోగించారు. అలా ఆయా ప్రాంతాల్లో రాసే రాత అక్షరాలు ఎక్కడికక్కడ ప్రత్యేకంగా లిపిగా రూపుదిద్దుకున్నాయి. లిపిగా రూపుదిద్దుకున్న తర్వాత ఆలోచనలు తత్వశాస్త్రంగా పేర్కొనడం జరుగుతున్నది. లిపికి వెలుపల జనపద, జానపద కళారూపాల్లో శ్రవ్య, మౌఖిక సాహిత్యంలో పాటగానో, మాటగానో, సామెతగానో, నూడికారంగానో, సంస్కృతి గానో కొనసాగుతూ వచ్చాయి. నేటికీ ఈ విధానంలో తాత్విక అంశాలు ప్రజల్లో నిత్య జీవిత వాడకంలో కనపడతాయి.
భారతీయ తత్వశాస్త్రాలు అత్యంత ప్రాచీనమైనవి. విస్తారమైనవి. హరప్పన్, సింథు ప్రజల తర్వాత ఆ ప్రాంతాలకు వలస ప్రస్థానాలు సాగించిన ఆర్యులని పిలువబడే గణతెగలు తమదైన జానపద సాహిత్యాన్ని పాడుకుంటూ తరం నుంచి తరానికి అందిస్తూ వచ్చారు. ఒక దశలో అవి వేదాలుగా వైదిక వాంగ్మయంగా స్థిరపడ్డాయి. అయినప్పటికీ లిపి లేకుండానే శతాబ్దాల తరబడి ఒకరి నోటి నుంచి మరొకరి నోటికి అందించ బడుతూ వచ్చాయి. జనపదాలు, ఆదివాసీ తెగలు, వారి భాష, సంస్కృతి, పాట, భావాలు, ఆచారాలు, ఆలోచనలు కూడా అలాగే తరం నుంచి తరానికి కొనసాగుతూ వస్తున్నాయి. నేటికీ ఆయా ఆదివాసుల సంస్కృతి, భాషలో, నమ్మకాల్లో వేల యేళ్ళనాటి ఆలోచనలు, జీవన విధానాలు గమనించవచ్చు.
వేదాల తర్వాత భారతీయ ఉపఖండంలో మరెన్నో భావాలు, ఆలోచనలు స్థిరపడుతూ వచ్చాయి. కథల రూపంలో, కావ్యాల రూపంలో, సామెతల రూపంలో కొనసాగుతూ వచ్చాయి. లయాత్మకంగా, రాగయుక్తంగా ఉన్నప్పుడు జ్ఞాపకశక్తికి సులువు. అందువల్ల మానవ సమాజం తొలి నుంచి ఇలా లయాత్మకమీద, గానం మీద, రాగంమీద ఆధారపడి తమ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, ఆలోచనలను, తత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అలా కాలక్రమంలో రామాయణం, మహాభారతం, గాథాసప్తశతి, బృహత్‌కథ తొలి రూపాలు తరం నుంచి తరానికి అనేక మలుపులు, మార్పులు తీసుకుంటూ విస్తరిస్తూ వచ్చాయి. ఉపనిషత్తులు, బుద్ధుని బోధనలు, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, సాంఖ్య దర్శనం, కపిలుడు మొదలైన రచనలు నేటికీ అందుబాటులో ఉన్నాయి. బౌద్ధం విస్తరిస్తూ ఆసియా దేశాలన్నిటా వ్యాపించిన క్రమంలో, బౌద్ధ విశ్వవిద్యాలయాలు స్థిరంగా శతాబ్దాల తరబడి వేలాదిమంది విద్యార్థులతో కొనసాగిన క్రమంలో భారత ఉపఖండం నుండి చైనా, జపాన్, గ్రీకు, రోమ్ తదితర దేశాలకు, ప్రాంతాలకు విస్తరించాయి. అటు నుండి యిటు ప్రవహించాయి. అలా పరస్పరం భావాలు మార్పిడి చేసుకున్నారు. స్వీకరించారు. బుద్ధుడు కాలానికి గ్రీకులో సోక్రటీస్ తాత్వికత వెల్లివిరిసింది.
మాటలకందని భావాలుంటాయి
మాటలకందని భావాలుంటాయి. ఆచరణకందని భావాలుంటాయి. స్పందించగలిగే ప్రతి హృదయానికి ఈ విషయం తెలుసు. తర్కం వ్యక్తీకరించే భావాలతో చర్చిస్తుంది. చాలా మంది తమ భావాల్ని పూర్తిగా వ్యక్తం చేయలేరు. ఒక్కోసారి వ్యక్తం కన్నా అవ్యక్తమే ఎక్కువగా ఉంటుంది. కళ్ళు చెప్పే భావాలు భాషకందకపోవచ్చు.
2
సోషలిజం
సోషలిజం అంటే సంఘవాదం. సామాజిక శాస్త్రాలు అంటే సంఘవాదాలు మాత్రమే వీటి పరిధిలోకి వస్తాయి. సామాజిక వాదం, సామ్యవాదం. బుద్ధుడు (క్రీ.పూ. 563`480) సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి అని ప్రవచించాడు. బాబాసాహెబ్ డా॥ బి.ఆర్. అంబేడ్కర్ ప్రజాస్వామ్యానికి, సోషలిజానికి నిర్వచనంగా చెప్పే స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలను తాను ఫ్రెంచ్ రెవెల్యూషన్ నుంచి కాకుండా, బుద్ధుడు నుంచి స్వీకరించానని చెప్పాడు. అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యానికి ఇచ్చిన ‘ప్రజలకొరకు, ప్రజలయొక్క, ప్రజలచేత’ అనే నిర్వచనాన్ని విస్తరించి అందరికి అభివృద్ధి, విజ్ఞాన ఫలాలు అందించే సామాజిక న్యాయం, సామాజిక మార్పు, శాంతియుత పరివర్తన ప్రజస్వామ్య మౌలిక లక్ష్యంగా ఉండాలని చెప్పాడు. అంబేడ్కర్ ఇచ్చిన నిర్వచనం ద్వారా ప్రజాస్వామ్య లక్ష్యం సోషలిజంగా పరివర్తన చెందింది. దీన్ని బుద్ధిస్టు సోషలిజంగా నిర్వచించవచ్చు.
నేటికీ బౌద్ధ సోషలిజం ఆచరణీయమైనది. ప్రాతఃస్మరణీయమైనది. శిరోధార్యమైనది. సంఘం శరణం గచ్ఛామితో ఆగిపోకుండా, బుద్ధుడు ధర్మం శరణం గచ్ఛామి అనడం ద్వారా సామాజిక న్యాయాన్ని, సాంఘిక జీవనాన్ని, దాని ప్రాధాన్యతను నొక్కి చెప్పాడు. బుద్ధం శరణం గచ్ఛామి అనడం ద్వారా జ్ఞానానికి, విజ్ఞానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే బౌద్ధం విలసిల్లిన కాలంలో విజ్ఞాన యుగం కొనసాగుతూ వచ్చింది. నేటికీ బౌద్ధం విజ్ఞాన యుగంగానే కొనసాగు తున్నది. బౌద్ధాన్ని స్వీకరించిన డా॥ బి.ఆర్. అంబేడ్కర్ జన్మదినాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించడం గమనించవచ్చు.
బౌద్ధం విద్యకు, విజ్ఞానానికి, వైద్యానికి, సామాజిక సహజీవనానికి, జీవన విలువలు, సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చింది. వీటినుండి స్ఫూర్తి పొందినవారు బౌద్ధ విశ్వవిద్యాలయాలను, విహారాలను స్థాపించారు. వేలాదిమంది శతాబ్దాలుగా ఆయా విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించారు. ప్రసిద్ధిచెందిన విజ్ఞాన శాస్త్రవేత్తలు బౌద్ధ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేశారు. బౌద్ధ విశ్వవిద్యాలయాల్లో అనేక శాఖలుండేవి. వాటిని ద్వారాలు అని పిలిచేవారు.
3
మహిళావాదం
మానవాళిలో మహిళలు సగం జనాభా. పితృస్వామిక పురుషాధిపత్య గణతెగల, కుల వ్యవస్థలలో మహిళ రెండవశ్రేణి పౌరురాలుగా అణచివేయబడుతూ వస్తున్నది. వేల యేళ్ళ తర్వాత మానవ సంపదలో సగభాగమైన మహిలలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన గౌరవం, సమాన ఓటు హక్కు అన్ని రంగాల్లో సమానత్వం, ప్రాతినిధ్యం అనేవి ముందుకు వచ్చాయి. నూతన సంస్కృతి, విలువలు, మహిళా సమస్య కుటుంబ వ్యవస్థతో ముడిపడి ఉన్నది. అందువల్ల కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య, ప్రేమ పెళ్లి, లైంగిక సంబంధాలు, మానవ సంబంధాల మధ్య ఉన్న వివక్షను, ఆధిపత్యాన్ని, అణచివేతను అణువణువునా కొనసాగుతున్న అంశాలను నిర్ధిష్టంగా వెలికి తెచ్చారని నిరూపించారు. నిరూపిస్తున్నారు. పురుషులు మారాలని డిమాండ్ చేస్తున్నారు. మారకపోతే అవసరమైనప్పుడు కుటుంబం నుంచి విడిపోయి సింగిల్ పేరెంట్‌గా కుటుంబ వ్యవస్థను ఏర్పర్చుకుంటున్నారు. ఈ క్రమం సోవియట్ రష్యా విప్లవానంతరం రష్యాలో వేగం పుంజుకుంది. అదే సమయంలో యూరప్, అమెరికాలో కూడా వేగం పుంజుకుంది. అనగా మొదటి ప్రపంచ యుద్ధం తెచ్చిన అనేక పరిణామాల్లో కుటుంబం, కుటుంబ వ్యవస్థ ప్రజాస్వామికం కావడం మొదలైంది అని అర్థం.
పితృస్వామిక, పురుషాధిపత్య వ్యవస్థలో భాగంగా ఉమ్మడి కుటుంబం ఏర్పడిరది. గ్రామీణ స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకున్నది. వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థ కుదురు నుండి కొనసాగుతున్నాయి. స్త్రీల పట్ల వివక్ష కూడా అప్పుడే ప్రారంభమైంది. అనగా వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, మహిళా వివక్ష అనేవి ఏక కాలంలో కుటంబ వ్యవస్థ కుదురులో రూపుదిద్దుకొని కొనసాగుతున్నాయి. వీటి మూలం ఒక్కటే.
ఈ మూలాన్ని మార్చకుండా మహిళావాదం, బహుజనవాదం, సోషలిస్టు సమాజ నిర్మాణ వాదం ద్వారా నూతన సామాజిక, ప్రజాస్వామిక, సోషలిస్టు వ్యవస్థలు, నిర్మాణాలు కాజాలవు. అందువల్ల వర్గ, కుల, లింగ సమస్యలు ఒకే కుదురు కలిగి ఉన్న విషయం ఈ మూడు వర్గాలు గుర్తు పెట్టుకుని, కలుపుకుని, సమన్వయించుకుంటూ ముందుకు సాగడం అవసరం.
పితృస్వామిక ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం మన దేశంలో వర్ణ, కుల వ్యవస్థ సిద్ధాంతాలను, తాత్విక ప్రాతిపధికలను, దానికి సంబంధించిన మత సంస్కృతిని, భావాలను నిర్మూలించడం. దానికి చాలా ఓపికగా సైద్ధాంతిక అవగాహన కలిగించడం.
భారత రాజ్యాంగ లక్ష్యాలను స్ఫూర్తిని ఆచరిస్తే భావజాల చైతన్యం ద్వారా, ప్రచార, ప్రసార సాధనాల ద్వారా, సినిమాలు, టీవీల ద్వారా, పాఠ్య పుస్తకాల ద్వారా సమాజంలో మార్పును తీసుకురావడం సాధ్యమే.
ఇవేవీ చేయకుండా నాకు నేను బాగుపడతాను చాలు అనుకుంటే స్త్రీ సమస్య పరిష్కారం కాదు. స్త్రీల సమానత్వం రాదు. కుల వివక్ష పోదు. కులాంతరాలు తగ్గవు. వర్ణ వ్యవస్థ పోదు. అందువల్ల కుల, వర్ణ, లింగ దృక్పథాల సమన్వయంతో ప్రజాస్వామిక విప్లవాలు, నూతన ప్రజాస్వామిక విప్లవాలు, జాతుల విముక్తి విప్లవాలు, సోషలిస్టు విప్లవాలు... మొత్తంగా మానవాళి విముక్తి విప్లవాలు సాగాల్సి ఉంటుంది. అవి సాయుధ పోరాటాలే కానవసరం లేదు.
కేవలం కుటుంబానికి పరిమితమై, కుటుంబ సంబంధాలకు పరిమితమై చిత్రించే కథలు, నవలలు ఏదో ఒక కులానికి చెందినవి అయి ఉంటాయి. అది మొత్తం సమాజాన్ని చిత్రించినట్టు కాదు. ఆ కుటుంబం సంస్కృతి, మానవ సంబంధాలు మాత్రమే అందులో చిత్రించబడతాయి. అందువల్ల కుటుంబం పరిధిలో చిత్రించే మానవ సంబంధాలు, సంస్కృతి, విలువలు, స్త్రీ వివక్ష, ఆయా కులాల పరిధి, పరిమితికి లోబడి ఉంటాయి. ఆయా కులాల్లో రకరకాల వ్యత్యాసాలతో కుల వివక్ష, స్త్రీ వివక్ష ఎన్నో రకాలుగా, ఎన్నో దశల్లో ఉంటుంది. అందువల్ల కేవలం కుటుంబం ప్రాతిపధికగా, కుటుంబానికి పరిమితమై కుటుంబంలోపలి స్త్రీ పురుషుల అసమానతలకు, వివక్షతలకు పరిమితమై చిత్రిస్తే అది అసమగ్రం. అసమగ్రమే కాకుండా, మొత్తం సమాజాన్ని పరిశీలించకపోవడం. కులాల మధ్య ఉండే సంబంధాలను, సంస్కృతిని చిత్రించడం ద్వారానే కుల వివక్ష, లింగ వివక్ష కూడా వెలికివస్తుంది. రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు ఈ విషయాన్ని ఆకళింపు చేసుకొని ప్రత్యేక పరిశీలనతో చిత్రించినప్పుడే అవి సమాజానికి మార్గదర్శనం చేస్తాయి. సమాజం ఎలా మారాలో సూచిస్తాయి.
4
సామాజిక జీవితంలో ‘నేను’ రూపొందే తీరు
‘నేను’ ఎవరు? అనే ప్రశ్న తత్వశాస్త్రాల్లో మౌలికమైనది. ఆలోచన, స్పందన, ఎరుక, వివేచన, అన్వేషణ, సాహసం, కోరిక, భయం, ఆనందం, కరుణ, దుఃఖం అనేవి నేను నుండి ప్రారంభమవుతాయి. ‘నేను’ లేకుండా ఈ ప్రపంచం లేదు. సమాజం లేదు. ఈ ప్రకృతి లేదు. నేను ప్రకృతి సమాజ సంబంధాల్లో రూపుదిద్దుకుంటూ వస్తున్నది.
ఎరుక క్రమంలో ‘నేను’ అది అనేవి ముఖ్యాంశాలు. ‘నేను’గా దేన్ని చూసినా అవన్నీ అదిలో భాగం. నేను అదిలో మధ్య సాగే క్రమమే ఎరుక. ఎరుక క్రమం విస్తరించి స్థిరపడి జ్ఞానక్రమం, జ్ఞానం అవుతుంది. జ్ఞానం ఎరుక క్రమం విస్తరించిన కొద్దీ నేను సుసంపన్నం అవుతుంది. విస్తరిస్తుంది. నేడు నేనులో ఏమేమి ఉన్నాయి? తెలుసుకోవడం అవసరం. ఇది తత్వశాస్త్ర మౌలికాంశం.
‘నేను’ అనే భావంలో ఉండేది ఎవరు?
1. అహం ` అహంకారం
2. పుట్టి పెరిగిన స్థల కాలాల్లో కలిగే భావాలు అనుభవాలు
3. కోరిక, ప్రతి జీవి కోరుకునే రక్షణ, ఆకలి తీరడం
4. ఆత్మ విశ్వాసం
5. ఆత్మగౌరవం
6. స్వార్థం, ఈర్ష్య
7. వ్యక్తిత్వం
8. ఆచరణ, అనుభవాలు
9. చైతన్యం, సాహసం
10. సంస్కృతి, అలవాట్లు
11. కోరికలు
12. ధ్యేయం లక్ష్యం
13. అనుకరణ, అనుసరణ, తులనాత్మకత, ఆరాధన.
14. ఇంద్రియ సంవేదనలు స్పందనలు
15. జ్ఞాపక శక్తి
16. చర్య ప్రతి చర్య, శక్తి మార్పిడి
17. చర్య ప్రతి చర్యలకు అతీతంగా...
18. ఇది నాది, ఇది నాది కాదు అనే భావం
19. మనస్సు శరీరాల ఏకత్వం, యోగా, ధ్యానం.
20. తాదాత్మ్యం, ఆరాధన, సంలీనం, ఏకత్వం, భక్తి, భక్తితత్వం.
ఇంకా..? నేను ఎవరు?
నీవు అంటే
21. నీ శరీరం నీ మనస్సు నీ హృదయం నీ ఇంద్రియ స్పందనలు నీ జ్ఞానం నీ ఆనందం నీ బాధ నీ ఆసక్తులు అభిరుచులు నీఆచరణ నీవు నేర్చుకున్నది నీ లక్ష్యం.
22. నీ మీద నీకున్న నమ్మకమే నీవు
ఇంకా?
23. ఆకలి గురించి చర్చించని వారు తత్వవేత్తలు కారు. అలాంటివి ఆకలి తీరినవారి చర్చలు.
24. కూడు, గుడ్డ, నీడ, బట్ట, పొట్ట, ఇల్లు గురించి చర్చించని వారు తత్వవేత్తలు కారు. సామాజిక శాస్త్రవేత్తలు కారు. రాజనీతి శాస్త్రవేత్తలు కారు. వాటి గురించి పట్టించుకోని వారు మౌలికంగా మనుషులే కారు. ‘నేను’ నాది అనేది వదులు కోవాలని చాలా మంది చెప్పారు.
దాని అర్థం ఏమిటి? కొందరు ఇలా అన్నారు
25. నిష్కామ కర్మ
26. స్వార్థత్యాగం
27. నీ గుర్తింపును కోల్పోవడం.
28. పరోపకారం
29. ఏదీ నీది కానప్పుడు అన్నీ నీవవుతాయి
ఇంకా.?
30. నీవు ఎవరు?
31. నీవు ఎలా ఉంటున్నావో అదే నీవు
32. ఇతరులకు నీవు ఎలా కనిపిస్తున్నావో అదే నీవు
33. శరీరం ఒక్కటే నీవు కాదు. కాని నీమనస్సు నీ శరీరాన్ని విడిచి ఉండలేదు. విడిగా లేదు.
34. నీ గురించి నీవు ఏమనుకుంటున్నావో అదే నీవు.
35. శరీరం యొక్క , వ్యక్తిత్వం యొక్క
36. బ్రాండ్ ఇమేజ్ యొక్క నేను యొక్క భావ చిత్రమే ఆత్మ ఆత్మీయత ఆరా తేజో (ఆరా) వలయం. ఆత్మ విశ్వాసం ఆత్మ గౌరవం ఆత్మ కథ ఆత్మీయత ఇలా... ఆత్మ అనేది నేను యొక్క ఆబ్‌స్ట్రాక్ట్ నౌన్ వంటిది. ఆత్మ అంటే రూపానికి అందని స్వభావం.
ఇవన్నీ కలిసి ‘నేను’. ‘నేను’త్వంలో (I చీవంం) ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ‘నేను’ అవుతుంది, నేనుత్వం అవుతుంది.
5
తత్వశాస్త్ర శాఖలు
కాలక్రమంలో చారిత్రక, సామాజిక పరిణామ క్రమంలో అనేక శాస్త్రాలు రూపొందాయి. వాటిలో తత్వశాస్త్రం తన పరిధిని, పరిమితిని ఇలా నిర్ణయించు కుంది. ప్రస్తుతం తత్వశాస్త్ర శాఖలు ఈ కింది విధంగా కొనసాగుతున్నాయి.
1) ఎపిస్టమాలజీ ` జ్ఞాన శాస్త్రం
2) మెటా ఫిజిక్స్ ` అధిభౌతిక శాస్త్రం
3) లాజిక్ ` తర్కం
4) ఈస్థటిక్స్ ` అలంకార శాస్త్రం
5) పొలిటికల్ ఫిలాసఫీ ` రాజకీయ తత్వశాస్త్రం
6) సోషల్ ఫిలాసఫీ ` సామాజిక తత్వశాస్త్రం
7) ఆక్సియాలజీ/ఎథిక్స్ ` విలువల శాస్త్రం, నీతి శాస్త్రం
8) హ్యూమన్ సైకాలజీ ` మానవ మనస్తత్వ శాస్త్రం
9) ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ` విద్యాతత్వశాస్త్రం
మరికొందరు ఇంకా కొన్ని శాస్త్రాలను తత్వశాస్త్రాల పరిధిలోకి చేర్చి చర్చిస్తారు. విశ్వశిస్తారు.
ఈస్థటిక్స్/అలంకార శాస్త్రాలు
సాహిత్యం, కళలు, మరియు వాటికి సంబంధించిన ఈస్థటిక్స్/అలంకార శాస్త్రాలు ప్రత్యేకంగా విస్తారంగా అభివృద్ధి చెందాయి. పంచేంద్రియాలు అని ప్రాచుర్యం పొందిన అష్ఠేంద్రియాల ద్వారా సంవేదనలు, స్పందనలు, ప్రేమ, కరుణ, ద్వేషం, విషాదం, ఆనందం, హాస్యం, వ్యంగ్యం వంటి రసాలతో వివేచన, ఎరుక క్రమం సాగుతుంది. అందువల్ల జ్ఞాన శాస్త్రంలో ఈస్థటిక్స్/అలంకార శాస్త్రాలు మౌలికమైనవి. సామాజిక విలువలు, సంస్కృతి, నీతి నియమాలు, రక్త సంబంధాలు, మానవ సంబంధాలు మొదలైనవాటిని అలంకార శాస్త్రాలు, సాహిత్యం, కళలు ప్రభావితం చేస్తాయి. నిర్దేశిస్తాయి. ఈ రసాలు, స్పందనలు లేని ఆలోచనల ద్వారా అందుకునేవి తత్వశాస్త్రంలో ఎక్కువ చర్చనీయాంశం అవుతాయి.
వాటికి ఒక రూపం ఇచ్చినప్పుడు ఉదాహరణలను జోడిరచినప్పుడు అవి మానవ సంబంధాల రూపంలోకి, కథలు, నవలలు, పాటలు, సాహిత్యం, కళారూపాలు, ప్రదర్శన కళారూపాలు మొదలైన ప్రక్రియల్లోకి మలుపు తీసుకుంటాయి. వేమన పద్యాలు, సుమతీ పద్యాలు మొదలైనవి ఒక చిన్న ఉదాహరణతో జోడిరచి తత్వాన్ని విడమరచి చెప్తాయి. రామాయణం, మహాభారతం, పురాణాలు, ఇతిహాసాలు, గ్రీకు పురాణాలు, ఇతిహాసాలు, తాత్వికతను, మానవ సంబంధాలు, సంఘటనలు, సంఘర్షణలు, సన్నివేశాలు, మానవ స్వభావాలు, మానసిక స్థితిగతుల రూపంలో తత్వాన్ని, తాత్వికతను చెప్తుంటాయి.
జ్ఞానం పుట్టుక
ప్రకృతి మానవ సంబంధాలు స్వభావాలనుండి, ఆచరణ నుండి, అనుకరణనుండి జ్ఞానం పుడుతూ ఎదుగుతూ విస్తరిస్తూ వస్తున్నది. ఈ క్రమాన్ని జ్ఞానశాస్త్రం చర్చిస్తుంది. దోపిడివర్గాలకు సమాన పంపిణీ, అందరికీ అందించడం అనే అంశాల పట్ల ఆసక్తి లేదు. వారికి గెలుపు ఓటముల ప్రసక్తి ముఖ్యమైంది. వారు తమకన్నా వెనుకబడిపోయిన వారిని ఎదిగించడం కన్నా వారు ఎందుకు ఎదగలేక పోతున్నారో విమర్శించడమే ముఖ్యమైనదిగా కనపడుతుంది.
తెలుసుకోవడం, కనుక్కోవడం జ్ఞానక్రమం
జ్ఞానం అనుకరణనుంచి పుడ్తుంది. అనుకరణ నుంచి అది సొంత అనుభవమవుతుంది. సొంత అనుభవం సొంత అనుభూతులను, సొంత ఆలోచనలను కలుగజేస్తాయి. సొంత ఆలోచనల నుండి కొత్త ఆలోచనలను పుట్టి అవి జ్ఞానాన్ని అభివృద్ధి పరుస్తాయి. ఇప్పటిదాకా మానవ సమాజం సాధించిన జ్ఞానాన్ని నేర్చుకోవడం అనుకరణ మాతృభాష తల్లినుండి కుటుంబం, పరిసరాలనుండి అభ్యాసమవుతుంది. కులమత, వర్గ ప్రాంత భావాలు, సంస్కృతులు అనుకరణ ద్వారానే అబ్బుతాయి. ఇది నాది, నా వాళ్ళది అనే సొంతం చేసికొనే స్పందనలు, జ్ఞానం నుండి కులమత వర్గ, ప్రాంత, భాషా సంస్కృతులు, విద్య, వైద్య, విజ్ఞానం, సైన్సులో ఫలానావి నావి, ఫలానావి నావి కాదు అనుకుంటారు.
ఈ కులం నాది, ఆ కులం నాది కాదు, ఈ మతం నాది, ఆ మతం నాటి కాదు అనే ఆలోచన వల్లే పొరుగునే సహజీవనం చేస్తున్నప్పటికీ అతని కులం నీకులం కాదని, నీ కులానికి సంబంధించిన సంస్కృతి, సాంఘిక హోదా, వ్యక్తిత్వ నిర్మాణాన్ని సొంతం చేసుకోవడం జరుగుతుంది. నేను స్త్రీని నేను మగవాన్ని కాదు అనుకోవడం నుంచి ఒకే యింట్లో, మగవాళ్ళున్నప్పటికి వాళ్ళ హావభావాల్ని, భాషను, అలవాట్లను అనుకరించకుండా స్త్రీలనే కాదు అనుకోవడంనుంచి ఒకే యింట్లో తల్లి, అక్క, చెల్లి వంటి స్త్రీలున్నప్పటికి వారిని అనుకరించకుండా మగవాళ్ళను అనుకరించడం ద్వారా మగవాళ్ళుగా మారుతారు. ఇలా మారడమే సహజం అనుకోవడం సమాజం యిలానే కొనసాగాలి అనుకోవడానికి సంబంధించిన చైతన్యమే తప్ప సహజంగా అబ్బేది కాదు. ఏదీ సహజంగా (పుట్టుకతో) అబ్బదు, పెంపకంతో, ఇది నాది, అది నాది కాదు అనే మనస్సును అనుసరించి, ఆలోచనను అనుసరించి ‘‘సహజం’’ లాగా అభ్యాసమౌతుంది.
6
డైలెక్టిక్స్ గురించి
హెగెల్ తన లాజిక్‌లో చెప్పిన నెగేషన్‌తోపాటు సబ్‌లేషన్ గురించి ఆలోచించి మార్క్స్, ఎంగెల్స్‌లు జీవితంలోంచి వాస్తవాలను స్వీకరించడం, ప్రతిపాదించడం చేసి ఉంటే ఆ సూత్రీకరణలు, కార్యక్రమాలు వేరుగా ఉండేవి.
మార్క్స్, ఎంగెల్స్‌లు జీవిత వాస్తవికతను, ప్రకృతి, సమాజ పరిణామాలను, మానవ సంబంధాల పరిణామాలను, రక్త సంబంధాల పరిణామాలను స్వయంగా పరిశీలించి ఉంటే వారి తత్వశాస్త్రం, సిద్ధాంతాలు, వారి గ్రంథాలు సమగ్రంగా రూపొంది ఉండేవి. తర్కం మీద ఆధారపడడం వల్ల ఇతరుల రచనలపై ఆధారపడి చర్చలు చేసి తమ వాదనను, ప్రతిపాదనలను నెలకొల్పడం జరిగింది. అలా ఆంటీడ్యూరింగ్, డైలిక్టిక్స్ ఆఫ్ నేచర్, పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ, ప్యూర్‌భా జర్మన్ తత్వశాస్త్ర పరిసమాప్తి, కుటుంబం, రాజ్యం, వ్యక్తిగత ఆస్థి పుట్టుక, ప్యారిస్ కమ్యూన్ గుణపాఠాలు వంటి రచనలను పరాశ్రితంగా చేయడం జరిగింది. ప్రకృతి పరిణామాలను డార్విన్ కళ్ళతో చూశారు. మానవ సమాజ పరిణామాన్ని మోర్గాన్ కళ్ళతో చూశారు. పావర్టీ ఆఫ్ ఫిలాసఫీని ప్రౌదాన్‌కు వ్యతిరేకంగా రాయడం ద్వారా నిరాశ్రితులయ్యారు. ఇలా హెగెల్ లాజిక్‌ను మొదలుకొని మోర్గాన్, ప్యారిస్ కమ్యూన్ గుణపాఠాల దాకా ఇతరుల పై ఆధారపడి తమ సూత్రీకరణలను వెలువరించారు. స్వయంగా తత్వశాస్త్రంలో భాగంగా తమ సూత్రీకరణలను చేయలేకపోయారు. తత్వశాస్త్రం జ్ఞానాన్ని తెలుసుకోవడం, కనుక్కోవడం, ప్రయోగం, అనుభవం, గుణపాఠాలు, ప్రతిపాదనలు అనే క్రమంలో సాగుతుంది.
సోషలిస్టు సమాజం అంటూ లేదు. అది వస్తుంది. తేవచ్చు అనేది ఒక తార్కిక సిద్ధాంతం. తర్కంతో అది వస్తుందని ప్రతిపాదిస్తారు. దాన్ని విశ్వసించినవారు సోషలిజం, కమ్యూనిజం కోసం ఆచరణ ప్రారంభిస్తారు. వారి ఆచరణ ద్వారా అది వాస్తవంగా మారే అవకాశం ఉంటుంది. అంతే తప్ప అది ప్రతిపాదించినప్పుడు సత్యం కాదు. వాస్తవం కాదు. కేవలం తార్కికంగా నిరూపించబడిన సత్యం మాత్రమే. ఇలాంటివాటిని తార్కిక సత్యాలు అంటారు. మార్క్స్, ఎంగెల్స్‌లు తార్కిక సత్యాలను, శాస్త్రీయ సత్యాలు అని చెప్పుకున్నారు. అందుకు కృషి చేయాలని కూడా కార్యక్రమాలను సూచించారు. ఆ తార్కిక సత్యాలు సాధించడంలో ఉపయోగించిన అంశాలను తిరిగి చర్చించినప్పుడే ఆ తార్కిక సత్యాలను మార్చడం, తప్పని చెప్పడం సాధ్యపడుతుంది. వారు ఎక్కడ ఎలా పొరపాట్లు చేశారో అన్వేషించాల్సి ఉంటుంది. అందుకు వారు అధ్యయనం చేసిన యూరప్ తత్వ శాస్త్రాలను పరిశీలించాల్సి ఉంటుంది.
సబ్‌లేషన్ అనే సూత్రీకరణను మార్క్సు, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో తదితరులు అభివృద్ధి చేసిన డైలెక్టిక్సు పరిశీలన పరిశోధన సూత్రీకరణలలో లోపించింది. అందువల్ల అవి అసమగ్రమైనవి, సాపేప్షికమైనవి. మార్క్సిస్టు పరిశీలనలు, సూత్రీకరణలు, సత్యాన్వేషణ, అర్థ సత్యాలుగా సత్యాన్వేషణ పర్యవసించింది.
ప్రతీత్య సముత్పాద పరిశీలన కాస్త సమగ్ర మైనది. అది ఎలా చేయాలో స్టేర్ బాట్ స్కీ బుద్దిస్టు లాజిక్ గ్రంథంలో చేసి చూపారు.
డైలెక్టిక్సు కన్నా ప్రతీత్య సముత్పాద పరిశీలన, దానికన్నా తిరిగి దినుసులను, ప్రకృతిని, సంబంధాలను, పరిణామాలను, క్రమాలను పరిశీలిస్తే తత్వశాస్త్రంలో భాగమవుతుంది. అది నూతన ఆలోచన, పరిశీలన కనక తత్వం, తత్వశాస్త్రం. అది లాజిక్ నుండి తిరిగి ఆలోచనల్లోకి ఆలోచన పరిశీలన విస్తరించడం. తద్వారా నూతన విషయాలు క్రమాలు వెలికి వస్తాయి. అవి వివరంగా రాస్తే నూతన తత్వశాస్త్రం అవుతుంది. లాజిక్ నుండి తిరిగి తత్వ శాస్త్రంలోకి విస్తరిస్తే వారొక నూతన తత్వశాస్త్రవేత్త. అలా ఎప్పటికప్పుడు నూతన తాత్వీకరణలు, సూత్రీకరణలు, తత్వశాస్త్రాలు ఆవిర్భవిస్తుంటాయి.
7
సత్యం తత్వం దృక్పథం విశ్వాసాలుగా...
తర్కం, తత్వం సత్యం నిర్ధారించినప్పటికీ సమాజంలో చాలామంది పాత విశ్వాసాలనే ఆచరిస్తుంటారు. ఉదాహరణకు దైవం, దేవుడు లేడు అని నిరూపించబడినప్పటికీ ప్రజలు దేవుడున్నాడని విశ్వాసాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అలా తర్కంతో ఓడిరచబడినప్పటికీ చాలా విషయాలు ప్రజలు సత్యాన్ని అనుసరించకుండా విశ్వాసాలమీద ఆధారపడుతుంటారు.
గెలుపు ఓటముల చర్చ తీరు మానవ సమాజాన్ని విజేతలుగా, పరాజితులుగా, పాలక వర్గాలుగా, పీడిత వర్గాలుగా రెండుగా చీల్చింది. శుష్క తర్క విద్య సామాజిక శాస్త్రాల్లో ప్రవేశించి సైన్సు సాధించిన ప్రయోజనాలు అందరికి అందకుండా కర్మ, పునర్జన్మ, వాదాలు కుల తారతమ్యాలు, ఉచ్ఛనీచాలు, చర్చలు చేసి అందకుండా చేసారు. సమస్త సరుకుల్ని, కళల్ని, శాస్త్రాల్ని సృష్టించిన బహుజనులు ఈ వాదనలో ఓడిపోయి కష్టార్జితం ఇతరుల పాలయింది. దాన్ని సరిదిద్దే భావజాలం ప్రజాస్వామ్యాన్ని ముందుకు తెచ్చింది. అది మనిషి బతకును ప్రాథమికం చేసే ప్రజాస్వామ్య, సోషలిస్టు దృక్పథంతో ప్రారంభ మయింది. అది బుద్ధుడిలో పరాకాష్టకు చేరుకుంది.
ప్రకృతి మానవ సంబంధాలు స్వభావాలనుండి, ఆచరణ నుండి, అనుకరణనుండి జ్ఞానం పుడుతూ ఎదుగుతూ విస్తరిస్తూ వస్తున్నది. ఈ క్రమాన్ని జ్ఞానశాస్త్రం చర్చిస్తుంది. దోపిడివర్గాలకు సమాన పంపిణీ, అందరికీ అందించడం అనే అంశాల పట్ల ఆసక్తి లేదు. వారికి గెలుపు ఓటముల ప్రసక్తి ముఖ్యమైంది. వారు తమకన్నా వెనుకబడిపోయిన వారిని ఎదిగించడం కన్నా వారు ఎందుకు ఎదగలేక పోతున్నారో విమర్శించడమే ముఖ్యమైనదిగా కనపడుతుంది.
మానవ జ్ఞాన క్రమం ఒక ఉత్పత్తి క్రమం. పరోక్ష జ్ఞానం కూడా ఎవరో ఒకరి ప్రత్యక్ష జ్ఞానమే, జ్ఞాన క్రమం ఎకౌంటెన్సీ అయితే తర్కం కొంతమేరకి ఆడిట్‌లాంటిది. అయితే దైవభావన కూడా హేతు, ప్రమాణ వివేచనం నుండే పుట్టింది.
పువ్వుగా పూసే స్వభావం
ఎవరో మెచ్చాలని ఏ పూవు, ఏ భావం పూయదు. పువ్వుకు పువ్వుగా పూసే స్వభావం ఉంది. అది చెట్టు నుండి సంక్రమించింది. ఆలోచనల పూవులను పూయ వద్దు అని అడ్డగించడం కోసం తర్కాన్ని వినియోగించడం అర్థరహితం. అనుభవాల నుండి ఆలోచనలు, కొత్త సిద్ధాంతాలు పుట్టుకొస్తాయి. స్పందన, భావం, అనుభవం, కొత్త, ఎరుక జీవిత వృక్షం నిరంతరం పూసే పూవులు, గతంలో పూసిన పువ్వుకన్నా నువ్వెందులో మిన్న? నీ ప్రత్యేకత ఏమిటి అంటూ పాత భావజాల తర్కవాద మూసలత్తో , సిద్ధాంతాల్తో కొలిచి ప్ఛ్! అని అనడం వెనకచూపు, పాత పూవుకన్నా గొప్పగా, కొత్తగా
ఉంటే నీవు పూయాలి అని ఆలోచనలను, కొత్త సిద్ధాంతాలను పాతవాడిలో వేసి దంచడం దోపిడి వర్గాలు, దోపిడి కులాలు చేసేపని. పాతదాన్ని పూర్వపక్షం చేయకుండానే కొత్తది రావచ్చు.
సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కాగ్నిషన్ / అది నేను ఎరుక క్రమం
నీ అనుమతి లేకుండా ఏ భావమూ, ఏ రోగమూ నీ శరీరంలోకి ప్రవేశించలేదు. గాలి ద్వారా, నీరు ద్వారా, ఆహారం ద్వారా అష్ఠేంద్రియాల ద్వారా భావాలు, రోగాలు నీలో ప్రవేశిస్తాయి. నీవు స్వీకరించడం ద్వారానే ఆయా భావాలు, రోగాలు నీలో ప్రవేశిస్తాయి. కులం అనే ఒక భావం నీవు స్వీకరించినప్పుడే దానికి అనువుగా నీ స్వభావం, భాష పరివర్తన చెందుతుంది. నా మతం, నా కులం, నా ప్రాంతం, నా పిల్లలు, నా కుటుంబం, నా ఆస్థి, నా కీర్తి, నా రచన, నా కవిత్వం అనే భావాలన్నీ నీవు స్వీకరించడం ద్వారానే నీవిగా మారుతున్నాయి. నీవే అదిగా మారుతున్నావు. ఉదాహరణకు ఒక పోలీసు అధికారి ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత పోలీసు అధికారిగా స్వభావం మారుతుంది. అలాగే ముఖ్యమంత్రి అయ్యాక, ప్రధానమంత్రి అయ్యాక ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా స్వభావం, భాష, వ్యక్తిత్వం మలుపు తిరుగుతుంది. ఒకరిని గూండా అని ముద్ర వేస్తే దాన్ని స్వీకరిస్తే, వారు గూండాగా స్వభావాన్ని, భాషను అలవర్చుకుంటారు. అందువల్ల వారిని మార్చాలనుకుంటే గూండా అని విమర్శించకుండా వారిలోని మంచిని వెలికితీసి అభివృద్ధి పరిస్తే ఎదుగుతారు. బుద్ధుడు 999 మందిని చంపిన అంగులీమాలుడుని అలా మార్చాడు. గొప్ప శిష్యుడుగా ఎదిగాడు.
8
భారత రాజ్యాంగం విశిష్ఠత
చాలా తత్వశాస్త్రాలు, తర్కశాస్త్రాలు భారత రాజ్యాంగం వలె ప్రతి మనిషికి ఒకే విలువ, ఒకే ఓటు అనే తత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేవు. దీన్ని అంగీకరిస్తే ఆ శాస్త్రాలు ఆ శాస్త్రాలుగా ఉనికిని కోల్పోతాయి. ఎందువల్లనంటే తత్వశాస్త్రం ఆలోచనను, తర్కశాస్త్రం చర్చను ప్రాథమికం చేస్తుంది. ప్రతి మనిషికి ఒకే విలువ, ఒకే ఓటు అనే సూత్రీకరణ ఆలోచనను కాకుండా మనిషి ఆచరణను, మనిషిని, మనిషి విలువను, ప్రాథమికం చేస్తుంది. భావంతో పాటు మనిషిని ప్రాథమికం చేయడం ప్రతి మనిషికి ఒకే విలువ, ఒకే ఓటు అనే తత్వంలో ఉంది. మనిషి మనిషి కోసమే మనిషి ఆచరణలో భాగంగా పుట్టిన భావాల ద్వారా కొందరు మనిషిపై చేసే పెత్తనానికి ఒక అడ్డూ అదుపు ఉంచి తిరిగి మనిషిని, సమాజాన్ని ఉన్నతంగా నిలబెట్టే ప్రజాస్వామ్య తత్వం ఎదుగుతున్నది. ఇలా వేల ఏళ్ళ తర్వాత తత్వశాస్త్రంలో, తర్కశాస్త్రంలో భావాలు, చర్చలు, తర్కబోధకులు, ప్రమాణ వివేచనలు వాటి అధిపతులు ఆక్రమించిన స్థానాన్ని తిరిగి మనిషి, సమాజం ఆక్రమించేదిగా సమాజం పరిణతి చెందుతున్నది.
జ్ఞానం కొందరి వ్యక్తిగత ఆస్తిగా మారుతూ సమాజం నుండి పొంది సమాజాన్నే శాసించేదిగా ఒక రాజ్యంగా పరాయీకరణగా ఉనికిని ప్రారంభించినప్పటినుండి ప్రజలు ఈ జ్ఞానులకు బలి అవుతూనే ఉన్నారు. ఏమంటే ఎక్కువ మోసం చేయగలడు. ప్రజలు మానవులుగా జ్ఞానులందరితో సమానంగా జీవించే హక్కుతో బతికే రాజ్యాంగబద్ధ హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఏర్పడిరది. ఇది విశ్వమానవాళి వేల ఏళ్ళ కృషి పరిణామంలో సాధించుకున్న ఫలం తత్వశాస్త్రాలు కొన్ని వర్గాల, గ్రూపుల, మతాల, దృక్పథాల వ్యక్తిగత ఆస్థిగా కొనసాగే మేరకు అవి మొత్తం మానవాళి సాధించిన ఫలాలకు వెనకబడి పోతున్నాయి.
కొందరికే చెందితే జ్ఞానం ` అందరికి అందితే సమాచారం
జ్ఞానం కొందరి వ్యక్తిగత ఆస్తిగా, ‘‘రాజ్యం’’గా మారడంతో పాటు మానవ సమాజ ఆచరణలో భాగంగా జైన్సు సమాజ శాస్త్రాలు, కళలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. సమాజ శాస్త్రాలు అభివృద్ధిక్రమాన్ని అనుసరించి సమాజ శాస్త్రాలు పరిణామం చెందుతూ వచ్చాయి. సమాజ శాస్త్రాలు సైన్సు అభివృద్ధికి, అడ్డంకికీ రెంటికీ తోడ్పడ్డాయి. తత్వశాస్త్రాల, తర్కశాస్త్రాల కేవల చర్చ సైన్సును, ఆచరణను అప్రధానం చేస్తూ అడ్డగిస్తాయి. వాద ప్రతివాదాల్లో దేన్నో ఒకదాన్ని సమర్ధించాలి అనే అర్థం తర్క శాస్త్రాల్లో ఇమిడి ఉన్నది. దీని వల్ల ఇరు పక్షాల్లో ఎవరో ఒకరిని గెలిపించండి అనే భావం కొనసాగుతుంది. సైన్సు రీత్యా వాళ్ళిద్దరి వాదాలు పైన చేసిన సూర్యుని చర్చలో లాగా తప్పు కావచ్చు. ఇలాంటి వాద ప్రతివాదాల తర్క శాస్త్ర చర్చా పద్ధతి వల్ల మానవ సమాజం జ్ఞానం ఆచరణ ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఓటేసే ఓటర్లుగా మిగిలి పోవాల్సి వస్తుంది. తద్వారా ఈ రెండు పక్షాల్లో దేనికో ఒకదానికి అనుకూలంగా ఉండేది మాత్రమే తర్క బద్ధంగా ప్రకరణ సహితంగా కనబడి కొత్తది లేదా వారిద్దరిని వ్యతిరేకించే వివేచన ప్రకరణ భంగంగా తర్క భంగంగా, టెక్ భంగంగా, నిర్మాణ భంగంగా, ప్రజా ద్రోహంగా వారికి కనపడుతుంది. సత్యం అసత్యంగా నిరూపించబడుతుంది. కొత్తది నిరాకరించబడుతుంది.
దృక్పథాలన్నీ విశ్వాసాలే
దృక్పథాలన్నీ విశ్వాసాలే. ఎవరికి వారు తర్కాన్ని నిర్మించుకున్న విశ్వాసాలనే దృక్పథం అంటున్నాము. విశ్వాసం సాక్షి స్థాయినుండి సామాజిక స్థాయిలోకి మారినప్పుడు వ్యవస్థీకృతం అయిందంటారు. వ్యవస్థీకృతమయ్యేది మతంగా మారుతుందని అంటుంటారు. అయితే ఏ దృక్పథమైనా ఈ అర్థంలోనే విశ్వాసంగానే కొనసాగుతుంది. మతం, సంస్కృతి, ఫ్యాషన్ ఒకే విషయం యొక్క మూడు స్థాయీ దశలు. హృదయం స్పందించి ఒక విషయాన్ని స్వయంగా ఆచరించడం ఫ్యాషన్ అనుకుంటే దాన్ని ఒక సంప్రదాయంగా ఆచరింపజేసే స్థిరీకృత రూపమే సంస్కృతి దానికి తార్కిక తాత్విక మద్దతు తెలిపేది మతం, లేదా దృక్పథం లేదా విశ్వాసం. ఉదాహరణకు ధోతి ఒకప్పుడు ఫ్యాషన్. ఇప్పుడు కొందరికది సంప్రదాయం, మతం, ప్యాంటు, షర్టు ఒకప్పుడు తేలిక, సంస్కృతిగా మారినప్పుడు విశ్వాసంగా మారినపుడు మార్చుకోవడం కష్టం. ఇలా మతాన్ని, దృక్పథాన్ని, విశ్వాసాన్ని మార్చుకోవడం ఇంకా కష్టం. తార్కిక సత్యాన్ని వాస్తవిక సత్యంతో సంబంధం లేకుండా, విడదీసి నమ్మినపుడు ఆ విశ్వాసాన్ని మార్చడం కష్టమౌతుంది.
వాస్తవం ఒక్కటే దృక్పథాలు, దారులు అనేకం. అది నేనుల పరస్పర సంబంధంలో ఒకే అది (సూర్యుడు) అనేక నేనుల్లో అనేక విధాల దృక్పథాలు, భావనలు, ముద్రలు, అనుభూతులు, ఆచరణలుగా కనపడడానికి, వాటికి భిన్న విలువలు కోణాలు ఏర్పడ్డానికి అది యొక్క విభిన్న పార్శ్వాలతో పాటు నేనుల్లోగల భిన్న స్వభావాలు, స్థల కాలాలు జీవిత క్రమాలు, విశ్వాసాలు ప్రియారిటీలు, విలువలు మొదలైనవి ప్రధాన కారణం. దీన్ని ప్రకృతి సమాజం పరిసరాలు అని పిలువవచ్చు. అందువల్ల చూసే కన్నును బట్టి, విశ్వాసాన్ని బట్టి అది యొక్క స్వభావం అది అయినా కాకపోయినా అది నేనులో అది సంబంధంతో రూపుదిద్దుకున్న కొత్తది కావచ్చు. అది రెంటి సంబంధంలో సృష్టి అయిన అదనపు విలువ అదనపు జ్ఞానం అవుతుంది.
మాటలకందని భావాలుంటాయి
మాటలకందని భావాలుంటాయి. ఆచరణకందని భావాలుంటాయి. స్పందించగలిగే ప్రతి హృదయానికి ఈ విషయం తెలుసు. తర్కం వ్యక్తీకరించే భావాలతో చర్చిస్తుంది. చాలా మంది తమ భావాల్ని పూర్తిగా వ్యక్తం చేయలేరు. ఒక్కోసారి వ్యక్తం కన్నా అవ్యక్తమే ఎక్కువగా ఉంటుంది. కళ్ళు చెప్పే భావాలు భాషకందకపోవచ్చు. సన్నిహితులు చనిపోయినప్పుడు ఏడ్చే ఏడ్పు ద్వారా మొత్తం బాధను వ్యక్తం చేయగలమా? ఎంత గొప్ప రచయితనైనా, కళాకారుడికైనా అది సాధ్యమా? అందువల్ల రాసే చేయి, మాట్లాడే నోరు, వ్యక్తీకరించే శక్తి, వ్యక్తీకరించాల్సిన అవసరం లేనంత మాత్రాన భావాలు లేనట్టు కాదు. తర్కం చర్చ అనేవి భావాలను మాటలకు పరిమితం చేసే అవ్యక్తాన్ని, మౌనాన్ని, నిశబ్దాన్ని నిరాకరిస్తుంది. తర్కంలోని మరో ప్రధాన లోపం ఇది.
ప్రజాస్వామ్యంలో నిర్ణయ స్వేచ్ఛ, ప్రతిమనిషికీ ఒకే విలువ, ఒకే ఓటు అనేది అత్యున్నత స్థాయికి ఎదిగిన మానవ తత్వ చింతన. సామాజిక శాస్త్రాల్లో, రాజకీయ రంగంలో, పరిపాలనలో, న్యాయ వ్యవస్థలో ఇది చట్టబద్దంగా అమలు చేయడమే ప్రస్థుతం చేయాల్సిన పని. స్వేచ్ఛా సమానత్వం, సౌబ్రాతృత్వం, ఆత్మ గౌరవం, అందరికీ సమాన అవకాశాలు, సమాన అవకాశాలు అందుకునే ప్రత్యేక ఏర్పాట్లు, విద్యా, వైద్యం, ఉపాధి, ఉద్యోగం, నైపుణ్యాలు, గృహ వసతి అందరికి సమానంగా అందడమే, అందించడమే, అందించడం కోసం కృషి చేయడమే నేటి తత్వశాస్త్రవేత్తల మౌలిక కర్తవ్యం. భారత రాజ్యాంగం ఈ విషయంలో అత్యున్నతమైనది. భారత రాజ్యాంగ లక్ష్యాలకు భిన్నంగా కొనసాగుతున్న పాత భావాలు, ఆలోచనలు, ఆచరణలు, విలువలు, సంస్కృతి, సాహిత్యం, కళలు సమూలంగా మార్చడం కోసం తాత్విక సామాజిక, సాహిత్య, కళ, సాంస్కృతిక రంగాల్లో కృషి చేయడమే నేటి తత్వవేత్తల, తత్వశాస్త్రాల కర్తవ్యం.
ఒక్క మాటలో చెప్పాలంటే సమస్థ, వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, ప్రాంత, భాష, దేశ విచక్షణలకు, అసమానతలకు, అణచివేతలను, దోపిడీని, అలాంటి సంస్కృతిని, నిర్మాణాలను, వ్యవస్థలను, అలాంటి పాత విశ్వాసాలను, దృక్పథాలను ప్రతి అంశంలో వెలికితీసి తొలగించే కృషి చేయడం నేటి తాత్వికుల కర్తవ్యం. అందువల్ల స్త్రీవాదం, బహుజనవాదం, వర్గవాదం, పీడిత, ప్రాంతీయవాదం మొదలైన రూపాల్లో కొనసాగుతున్న సామాజిక, తాత్విక చింతనలో గల లోపాలను సవరిస్తూ మరింత స్వేచ్ఛా సమానత్వం, సౌబ్రాతృత్వం, ఆత్మగౌరవం, అందరికీ సమాన అవకాశాలు, అవి అందుకునే ప్రత్యేక నిర్మాణాల గురించి నూతన తాత్వికతను వెలికి తీయడం, రూపొందించడం, ప్రతిపాదించడం, ఆచరించడం, ఉద్యమించడం అందరి కర్తవ్యం. 1985లో మొదలైన గ్లాస్‌నాస్త్, పెరిస్త్రోయికా, 1990లో మొదలైన గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ పరిణామాలు అనేక నూతన పరిణామాలను ముందుకు తెచ్చాయి. ప్రజాస్వామ్యం, ఫెమినిజం, పీడిత, శ్రామిక వర్గవాదాలు, నూతన కోణాల్లో విస్తరిస్తున్నాయి. వాటన్నిటిని విశ్లేషించడం రాబోయే పరిణామాలను, వ్యవస్థలను, మానవ సంబంధాలను, సంస్కృతిని, విలువలను, కళలు, సాహిత్యాన్ని, ఎథిక్స్‌న్ ఆదర్శవంతంగా రూపుదిద్దడం, ఆదర్శీకరించడం నేటి తత్వశాస్త్రాల, తత్వశాస్త్రవేత్తల మౌలిక కర్తవ్యం.
(బి ఎస్ రాములు, తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్, హైదరాబాద్)