ఒక మంచి పుస్తకం, ఒక మాంచి రివ్యూ...

పుస్తకాలు మనల్ని ఎలా సేద తీరుస్తాయో, ఎలా సంతోషపెడతాయె, ఎలా కొత్త తెలివిడిని అందిస్తాయో చక్కగా చెబుతున్నారు నాదెళ్ల అనూరాధ

Update: 2024-11-12 01:50 GMT

-నాదెళ్ళ అనూరాధ



అక్షరానికున్న గొప్పదనం నిర్వచించలేనిది. వాటిని పొదువుకున్న పుస్తకాలు చేసే మేలు గురించి చెప్పటం అంత సులువు కాదు. పేరుకి తగినట్టే అక్షరం తన ప్రభావాన్ని చదువరి మీద గాఢంగా వేస్తూ మనసుల్లో నిలబడిపోతుంది. చదివిన విషయాలు సందర్భానుసారంగా మనల్ని ఆలోచించేలా చేసి సరైన దిశా నిర్దేశం చేస్తూండటం అనుభవంలోకి వచ్చే విషయమే.

పుస్తకాలు మనల్ని సేద తీరుస్తాయి, సంతోషపెడతాయి, కొత్త తెలివిడిని అందిస్తాయి. మన చుట్టూ ఉన్న సమాజాన్ని, జీవితాల్ని కళ్ళముందుకు తీసుకొస్తాయి. గొప్ప వ్యక్తులను, విషయాలను పరిచయం చేస్తూ, సుదూర ప్రాంతాలను తెలియచెప్తూ ఎల్లలు లేని ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మనకందిస్తాయి. వాటికి మనం ఎప్పుడూ ఋణపడే ఉంటాం. పుస్తకాలను మించిన బంధువులు, స్నేహితులు లేరన్నది నిస్సందేహం.

పుస్తకాల్ని ప్రేమించేవాళ్ళు తమ అభిరుచికి తగినదా కాదా అన్న నిబంధన పెట్టుకోకుండా కనపడిన పుస్తకాన్నల్లా చదివేస్తుంటారు. అలా చదువుతూ తమకు తెలియని, అంతవరకూ తోచని కొత్త విషయాల్ని, కొత్త కోణాల్ని తెలుసుకుంటూ ఫలానా పుస్తకాన్ని చదివినందుకు తమను తామే అభినందించుకుంటుంటారు. పుస్తకప్రియు(book lovers)  లకు కొంచెమైనా కొత్తదనాన్ని చూపించే పుస్తకాలు సహజంగానే కొంచెం ఎక్కువ నచ్చుతాయి. ఇప్పుడు పరిచయం చేసుకుంటున్న పుస్తకం అందించే అనుభవం ఇప్పటికాలానికి సరికొత్తది!

అనగనగా ఒక అమ్మ. ఆమె ఒఠ్ఠి అమ్మే కాదు ప్రజల ఆరోగ్యాల్ని, ప్రాణాల్ని కాపాడే డాక్టరమ్మ. చిత్రంగా తను రచయిత్రిని కాననే అంటూంటుంది ఏదోక సందర్భాన్ని పురస్కరించుకుని అందమైన, ఆలోచనాత్మకమైన వ్యాసాల్ని అందిస్తూ కూడా. ప్రపంచం పట్ల, చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల అమితమైన ప్రేమ ఆమె సొత్తు. ఆమె సహచరుడు కూడా అలాటి వ్యక్తే. వాళ్ళిద్దరి బాల్యం, పెరిగిన నేపథ్యాలు వాళ్ళను సమాజం పట్ల నిస్వార్థమైన చూపుతో సేవ చెయ్యాలన్నదే నేర్పాయి. నమ్మినదాన్ని నిజాయితీగా అమలు చేసేందుకు వాళ్ళకున్న ప్రాథమిక బాధ్యతతో పాటు నిరంతరంగా అలుపు అన్నది లేనట్టు పనిచేసే వారిద్దరికి ముందుగా శుభాకాంక్షలు.

అమ్మ తన కొడుకుని హాస్టల్ లో పెట్టి చదివించవలసి వచ్చింది. కాదేమో, తరం, కాలం మారినా తాననుభవించిన అందమైన బాల్యాన్ని కొడుకు కూడా చూడాలనుకుందేమో! ఇంట్లో అయితే వాడొక్కడే కనుక వాడు పదుగురి మధ్యా ఉండేలాటి విశాలమైన ప్రపంచంలోకి పంపించింది. వాడూ అమ్మకు దీటైనవాడే. ఆమె కలల్లోని విలువని అర్థంచేసుకుంటూ పెరుగుతున్నాడు. ఆ సంగతి పూర్తిగా కౌమారప్రాయం వదలని వాడిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

ఇంతకీ హాస్టల్ లో ఉన్న పిల్లవాడితో ఏదో తనకు తీరికైన సమయం చూసుకుని హలో అంటూ ఫోన్ చేసి బావున్నావా? భోజనం సరిగా తిన్నావా? రాత్రుళ్ళు సరిగా నిద్రపోతున్నావా? వారం వారం తలంటు స్నానం చేస్తున్నావా? హోం వర్క్ సరిగా చేస్తున్నావా? తరగతి గదిలోనూ, బడిలోనూ ఎవరితోనైనా గొడవలు పడుతున్నావా? ఫస్టు మార్కులు వస్తున్నాయా? టీచర్లు సరిగా చెపుతున్నారా? పనిష్మెంట్లిస్తున్నారా? అంటూ పలకరించెయ్యాలనుకోలేదు. తాపీగా వాడిలో తాను ఏమేం విషయాలు పంచుకోవాలనుకుందో రాస్తూ, చదువుతో పాటు మానవసంబంధాలు, సైన్స్, కళలు, ఆటలు లాటి అనేక అంశాల గురించి విలువైన విషయాల్ని పిల్లవాడికి చెప్పింది. ఇంకా పిల్లల కోసం జరిగే ఎన్నో రకాల వేసవి శిబిరాలకి, పిల్లల పండుగలకి తీసుకెళ్ళింది. అలాటి వాతావరణాన్ని, అనుభవాన్ని కొడుకుతో పాటు తానుండే జహీరాబాద్, చుట్టుపక్కలున్న అనేక బడుల్లోని పిల్లలకి అందించటం ఆనవాయితీ చేసుకుంది. ఆ మహా యజ్ఞంలో ఎందరెందరో పిల్లల ప్రేమికుల్ని కలుపుకుంది. 2014 నుంచి 2019 వరకు చిన్నోడికి (కొడుకును ముద్దుగా పిలుచుకునే పేరు. ఈ పేరు మన అందరిళ్ళల్లోనూ వింటూనే ఉంటాం కనుక ఆ చిన్నోడు మన పిల్లలే కావచ్చు, అసలు మనమే కావచ్చు కూడా.) వాళ్ళ అమ్మ రాసిన లేఖలే ఈ పుస్తకం.

“చిన్నోడికి ప్రేమతో…”

ఈ పుస్తకం రాసినవారు ప్రత్యేకించి ఒక రచయితో, రచయిత్రో మాత్రమే కాదు. పుస్తకాల్ని ప్రేమించి, అనుభూతించే వ్యక్తి. ఆమె డా. విజయలక్ష్మి ఒక డాక్టర్. మనకి డాక్టర్ రచయితలు, రచయిత్రులు ఉన్నారు. ఈమె తాను రచయిత్రినని ఒప్పుకోదు. కానీ ఈ పుస్తకం చదివాక పాఠకులు ఆమె ఒప్పుకోలును పట్టించుకోరు.

ఈ పుస్తకం ఒక లేఖా సాహిత్యం (epistle)! ఒక అమ్మ తన పిల్లవాడికి రాసిన లేఖలు. హాస్టల్ లో ఉన్న పిల్లవాడికి రాసిన నూట ఇరవై లేఖలు. అవన్నీ మానవ జీవితంలో ఎదురయ్యే వివిధ అంశాలను గురించి రాసినవే. పది సంవత్సరాలైనా లేని వాడు అవన్నీ అర్థం చేసుకోగలడా అని అనుమానం అక్కర్లేదు. ఆ వయసు పిల్లవాడికి తగిన భాషను, క్లుప్తతను ఎంచుకుంది.

పిల్లవాడికి చదువు నేర్పటమంటే బడిలో పాఠాలు చెప్పటమే కాదు, అనుభవాల్నివ్వటం అని నమ్మిన తల్లిదండ్రుల పెంపకంలో అమ్మ రాసిన అన్ని విషయాల పట్ల ఆ చిన్నోడికి తగిన అవగాహన ఏర్పడుతూ వచ్చింది. వాడికి అందించిన అనుభవాలను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ వాటిలోని సాంద్రతను వాడి మనసుకు పట్టించింది. తమ కొడుకు ఒక్కడే నేర్చుకోవాలని కాక మరి కొందరు పిల్లల్ని దగ్గరకు తీసి వాళ్ళందరికి సమాన అవకాశాల్నిచ్చి కొత్త కొత్త విషయాలను నేర్చుకునేందుకు ప్రోత్సహించింది. వ్యక్తి లోంచి సమిష్టి జీవనం వైపుకి ఆ పిల్లవాడిని బాల్యం నుంచే సంసిద్ధం చేసింది అమ్మ. ఆమె వెనుకే పిల్లవాడి తండ్రి.

ఆ తల్లిదండ్రులు డా. శివబాబు, డా. విజయలక్ష్మి. వీళ్ళు అందమైన బాల్యాన్ని స్వంతం చేసుకున్నవాళ్ళు. దాని విలువని గ్రహించినవాళ్ళు. ఒక బిడ్డకు సంపూర్ణంగా ఎదిగేందుకు ఏమివ్వాలో, ఎలా ఇవ్వాలో తెలిసినవాళ్ళు. చుట్టూ అనేకమందికి ఒక మోడల్ గా నిలిచి, కొత్త దారుల్ని పరుస్తున్నవాళ్ళు. ఇది నిజమేనని పుస్తకం చదివిన ప్రతి ఒక్కరు చెపుతారు.

అసలు ఈ పుస్తకంలో ఏముంది? దూరంగా చదువుకుంటున్న పిల్లలకు ఉత్తరాలు రాయటం ఇదివరకటి రోజుల్లో అయితే కొత్త విషయం కాదు. కానీ ఇప్పటి సాంకేతికత అందించే సౌకర్యాల మధ్య కూడా పిల్లవాడిని ఉత్తరాల ద్వారా పలకరించటమనే ప్రయత్నం ప్రశంసనీయం. అదీ ప్రతివారం క్రమం తప్పకుండా ఒక ఉత్తరం రాయాలంటే వైద్యురాలిగా ఉన్న అమ్మ పని ఒత్తిడిలోనూ కనబరచిన నిబద్ధత ఎంత బావుంది!

ఈ లేఖల్లో ఏముంది?

ప్రకృతితో సహజీవనం ఎలా చెయ్యచ్చో, ఎందుకు చెయ్యాలో, అసలు ప్రకృతిలో ఉన్న ఇన్నిన్ని వైరుధ్యాలు ఏమిటో, ఎందుకో…ఇవన్నీ పిల్లవాడికి చెప్పటం మొదలుపెట్టింది అమ్మ మొదటి ఉత్తరం రాస్తూ. మనిషి సంఘజీవి అంటూ మొదలెట్టలేదు. ప్రకృతినే ఎంచుకుంది సహజీవనానికి ఆదర్శంగా. అలా మొదలై వాడు తరగతి పుస్తకాలు కాకుండా ఇంకేం పుస్తకాలు చదువుతున్నాడో అడిగింది. తను చదివిన పుస్తకాల గురించి చెప్పింది. బారిష్టరు పార్వతీశాన్ని పరిచయం చేసేసింది. పుస్తకాల ద్వారా వినోద, విజ్ఞానాల్ని ఎలా పొందచ్చో చెప్పింది. ఆటలు ఆడటం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలేంటో చెప్తూ ఆటలాడమని ప్రోత్సహించింది. ఆటల ప్రాముఖ్యత చెపుతూ అక్కడ ఉండవలసిన క్రీడా స్ఫూర్తి గురించి కూడా అంత చిన్న వయసులోనే అమ్మ చెప్పింది. ఆటల్లోంచి ఐన్ స్టీన్ గురించి చెప్పింది. చదువంటే మనోధైర్యం, విజ్ఞత పెరగాలన్న వివేకానందుణ్ణి పరిచయం చేసింది.

పరిశుభ్రత గురించి, స్వచ్ఛ భారత్ గురించి, దాని అవసరం గురించి చెపుతూ ప్రకృతిలో సమతుల్యతను కాపాడేందుకు 3r సూత్రం చెప్పింది. Reduce అంటూ అవసరమైనంత మేరకే వస్తువుల్ని వినియోగించమంది. Reuse అంటూ వస్తువుల్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవాలని, ఒకసారి వాడి పారెయ్యరాదని చెప్పింది. Recycle అంటూ వ్యర్థాలతో ఉపయోగపడే వస్తువుల్ని చెయ్యచ్చంటూ చెప్పింది. ఇది ఎంత గొప్ప విషయమో కదా! ఇప్పటి నాగరిక సమాజం వస్తు వినిమయానికి ఎంతగా అలవాటు పడిందో అంతగా వృధా చెయ్యటం కనపడుతోంది. ప్రకృతిని, అది ఇచ్చిన వనరుల్ని జాగ్రత్తగా ఉపయోగిస్తూ రాబోయే తరాల అవసరాలకు జాగ్రత్త చెయ్యాలంటూ అతి విలువైన పాఠాన్ని చెప్పిందో లేఖ.

ఈ లేఖలు అమ్మకు, నాన్నకు దూరంగా ఉన్న పిల్లవాడికి బెంగతీర్చి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఇంకా జీవిత విలువల్నీ కూడా చెప్పాయి. ప్రతి లేఖా ఒక్క పేజీ మాత్రమే. పది సంవత్సరాల పిల్లవాడి అవగాహనకు అందేలాటి భాష, ఉదాహరణలు! చదువుతుంటే మరోసారి బాల్యావస్థను అనుభవించకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. స్వానుభవం!

తను చూసిన మంచి సినిమాలు గురించి చెప్తూ, అవి ఎందుకు నచ్చాయో చెప్పింది. పిల్లవాడికి మంచి సినిమా, చెడ్డ సినిమా పట్ల అప్పటికే కలిగిన అవగాహనకు ఆనందించింది. బడిలో పిల్లవాడికి అందుబాటులో ఉన్న రకరకాల సైన్స్ క్లబ్, మాథ్స్ క్లవబ్ లాగే కల్చరల్ క్లబ్ ఉందా అని ఆరా తీసింది. వాడు వేసవి సెలవుల్లో స్నేహితులతో ఇంటి దగ్గర తీసిన షార్ట్ ఫిల్మ్స్ గురించి ప్రస్తావించి విజ్ఞానదాయకం, వినోదాత్మకం సందేశాత్మకమైన బుల్లి డాక్యుమెంటరీలు తియ్యమంటూ ప్రోత్సహించింది.

అమ్మకి చిన్నోడంటే ఎంత ప్రేమో! అంతకు మించి నమ్మకం. వాడు తను చెప్పిన మంచి మాటల్ని ఆచరించి గొప్ప వ్యక్తిగా తయారవాలనీ, అందరికీ ఉపయోగకరమైన పనులు చేస్తూ అందరిలో ఒకడిగా ఉండాలని ఎంత ఆశో! ఇలాటి సమైక్య జీవితంలో ఉన్న సంతోషం, బలం ఎంతమంది తల్లులం పిల్లలకి నేర్పుతున్నాం. ఇప్పటి పిల్లలకి తెలిసినది తన అవసరాలు, తన చదువు, తన మార్కులు, తన విజయం. అంతే!

పిల్లల్ని ఆరోగ్యమైన సమాజంలోకి నడిచివెళ్ళే సంపూర్ణ వ్యక్తులుగా తయారు చేసేందుకు ఈ చిన్నోడి అమ్మకు తెలిసిన విషయాలు చాలామంది, అంటే నిజంగా చాలా మంది అమ్మానాన్నలకి తెలియదంటే దిగులేస్తుంది. అదీ చదువుకోలేకపోయిన తల్లిదండ్రులకి కాదు, చదువుకుని సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకున్న తల్లిదండ్రులక్కూడా తెలియదంటే నిజంగా బాధ. పిల్లల పెంపకాన్ని ఒక బాధ్యతగా కాక అందమైన అనుభవంగా, ఆదర్శంగా, ఇష్టంగా చేసే అమ్మానాన్నలెందరున్నారు. అలాటి వారందరికోసం చిన్నోడి అమ్మ ఈ పుస్తకాన్ని రాసిందనిపిస్తుంది. ఇంతకీ ఈ పుస్తకంలో అంతగొప్ప విషయాలేమున్నాయంటే ఒకటా రెండా, పుస్తకంలోని ప్రతి అక్షరం తూకం వేసి జాగ్రత్తగా చెప్పుకొచ్చిన వైనం ఎంతని చెప్పగలం?

భారతదేశం, గాంధీతాత గురించి చెప్పినట్టే క్యూబా గురించి కాస్ట్రో గురించి కూడా చెప్పింది. శ్రమైక జీవనం గురించి, గిరిజనుల గురించి, చేగువేరా వంటి విప్లవ వీరుల గురించి, అంతరిక్షం గురించి కూడా చెప్పింది. దేశభక్తి అంటే దేశభక్తి గీతాన్ని ఆలాపించటమే కాదని, ఏడు మంచి అలవాట్లంటూ వివరించింది. పిరమిడ్ కొలత ఎలా కొలవాలో చెపుతూ దైనందిన జీవితంలోని అనేక విషయాల్లో కామన్ సెన్స్, లాజిక్ సహాయం తీసుకుని సమస్యల్ని పరిష్కరించచ్చని ఉదాహరణలు చెప్పింది.

ఇతరుల్లోని మంచిని గమనించే చిన్నోడికి వాడిలో అమ్మానాన్నలు గమనించిన మంచిని వివరంగా చెప్పింది. అది వాడిని వాడు మరింత మెరుగుపరుచుకుందుకు ఉత్సాహాన్నిస్తుంది కదా. చిన్నోడు అచ్చంగా అమ్మ కోరుకున్నట్టే పెరుగుతున్నాడని అమ్మకి తెలిసిపోయింది, ఎలానంటే బడిలో చాలామంది అమ్మాయిలు చిన్నోడు తమను బ్రదర్ లాగా చూసుకుంటాడని చెపితే వాళ్ళ మేడం వచ్చి చిన్నోడిని ‘’యూనివర్సల్ బ్రదర్’’ అని మెచ్చుకున్నారట. అమ్మాయిలతో హుందాగా, స్నేహంగా ప్రవర్తించటం చిన్నప్పుడే నేర్చేసుకున్నాడు చిన్నోడు.

చిన్నోడు చిన్నోడుగా ఉండగానే స్వంతంగా ఒక్కడే చేసిన ప్రయాణాలు, వాడిలోని చొరవ, ధైర్యం అమ్మకి పెద్ద మురిపెం. అమ్మ తన చిన్నప్పటి ఆటలు, జ్ఞాపకాలు చెపుతూ చిన్నోడి అనుభవాల్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసింది.

చిన్నోడికి ఒక బుద్ధుడి సూక్తి ఇలా చెప్పింది అమ్మ,

“చిన్నచిన్న నీటి బిందువులతో పాత్ర నిండుతుంది.” అలాగే చిన్నోడు ప్రతి అంశాన్ని బడిలో కొద్దికొద్దిగా మెరుగుపరుచుకుంటూ ఉండాలంటుంది. దానికోసం Plan – Do – Check – Analyze అంటూ సులువైన సూత్రం చెప్పింది. మొక్కలాగే ఒదిగి ఉండమని, చెడు అలవాట్లను ఎప్పటికప్పుడు తీసివేస్తూ మంచి వ్యక్తిగా ఎదగమంటూ కోరుకుంది.

పరీక్షలకు ఎలా తయారవాలో ఒక్కో సబ్జెట్ గురించి చెప్పింది. విలువైన జీవితం గడిపేందుకు బుద్ధుడి మార్గం అర్థం చేసుకుని ఆచరించమంది. చదువుతో పాటు ప్రవర్తన, శారీరక వ్యాయామం, ధ్యానం లాటి అన్ని విషయాల్ని చెప్పింది అమ్మ.

ఆఖరున చిన్నోడు అమ్మ రాసిన ఉత్తరాలు వారం వారం ఉత్సాహపరిచేవనీ, వాటిని చదవాలని వాడి స్నేహితులు కూడా ఉబలాటపడేవారని చెప్తూ ఇప్పుడు తనక్కూడా ఫోన్ లో విషయం చెప్పటం కంటే ఎవరికైనా ఉత్తరం రాయటం ఇష్టమంటాడు. పైగా అమ్మ ఉత్తరం అందగానే క్లాసు అయ్యేవరకు ఆగలేక రహస్యంగా క్లాసులోనే కూర్చుని డెస్క్ లో దాచుకుని చదివేవాడినంటూ తన అల్లరి పని చెప్పేసాడు. హాస్టల్లో తన దిండు కింద అమ్మ ఉత్తరాలు రెండైనా ఉండేవట ఎప్పుడూ. వీడు అమ్మకి సరైన వాడే. అమ్మ ఉత్తరాలు తనకెప్పటికీ మిగిలిఉండే మధురానుభూతుల్నిచ్చాయంటాడు ఇప్పుడీ యంగ్ అడల్ట్! ప్రపంచంలోని ఇలాటి అపురూపమైన అమ్మలకి, చిన్నూలకి శుభాకాంక్షలు!

ఇంతమంచి ఆలోచనాత్మకమైన, ఆచరణాత్మకమైన పుస్తకాన్ని మనందరికీ ఇచ్చిన విజయలక్ష్మి గారికి అభినందనలు.

ఈ పుస్తకం రెండు నెలల్లో రెండవ ముద్రణ పొందింది. ఇదేం చెపుతోందంటారు?!


@పుస్తకం.నెట్ నుండి సేకరణ
Tags:    

Similar News