శ్రమజీవుల ఐక్యతే లక్ష్యంగా సీపీఐ ఏపీ రాష్ట్ర మహాసభలు

భూమి కోసం, భుక్తి కోసం, శ్రమజీవుల అభ్యున్నతే లక్ష్యంగా ఆగస్టు 23 నుంచి 3 రోజుల పాటు సభలు జరుగనున్నాయి. సీపీఐ శత వార్షికోత్సవాలు ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయి;

Update: 2025-08-22 13:21 GMT
సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలకు ఒంగోలు ముస్తాబైంది. సీపీఐ వందేళ్ల చరిత్ర నేపథ్యంలో జరుగుతున్న ఈ మహాసభలవి. ఈ వందేళ్ల చరిత్రలో రాష్ట్ర పార్టీ నిర్వహించిన పోరాటాలను ప్రతిబింబించేలా మహాసభలను నిర్వహిస్తున్నారు. శతవార్షికోత్సవాలను ఒంగోలు నుంచే ప్రారంభించనున్నారు. ఆగస్టు 23 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలను పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రారంభించనున్నారు. పార్టీ మహాసభల ప్రారంభం సందర్భంగా ఒంగోలు మహాప్రదర్శనను నిర్వహిస్తున్నారు.

మహాసభల ప్రారంభోత్సవ సభలో రాష్ట్రపార్టీ కార్యదర్శి కె.రామకృష్ణతో పాటు సీపీఎం రాష్ట్ర పార్టీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఇతర వామపక్షపార్టీల నాయకులు సందేశాలు ఇస్తారు. అనంతరం పార్టీ కార్యకలాపాలపై కార్యదర్శి పెట్టే నివేదికపై చర్చ, మూడో రోజున నూతన కార్యవర్గం ఎంపిక ఉంటుంది. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, సత్యనారాయణ మూర్తి, ఈశ్వరయ్య, కేవీవీ ప్రసాద్, ఆర్.రవీంద్రనాధ్, రావుల వెంకయ్య తదితరులు ఈ సభల జయప్రదం కోసం పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుల్లో ఒకరైన నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీసంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఈ ప్రారంభ సభలోనూ, పార్టీ బహిరంగసభలో తన బృందంతో విప్లవగీతాలను ఆలాపిస్తారు.

ఈ సందర్భంగా 'కమ్యూనిజం' పత్రిక సంపాదకులు చలసాని వెంకట రామారావు రాసిన వ్యాసం ఇది..
స్వాతంత్ర్యం, సమ భావం, సౌభ్రాతృత్వం, సౌహార్థం పునాదిగా 1925 డిసెంబరు 26న భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. 1917 అక్టోబరు విప్లవ ప్రభావం, వివిధ దేశాల జాతీయ విముక్తి పోరాటాల ప్రభావం, స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా వివిధ విప్లవ గ్రూపుల కార్యాచరణ నేపథ్యం, ప్రపంచ వ్యాప్తంగా కొమింటర్న్ (కమ్యూనిస్టు ఇంటర్నేషనల్) ప్రభావంతో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది.
కమ్యూనిస్టు పార్టీ తొలి నుండి వనిలో, గనిలో, కార్ఖానాలలో పనిచేసే కష్టజీవులను సమీకరించి శ్రామిక స్వర్గాన్ని ప్రబోధించింది. పతితులు, భ్రష్టులు, దీనులు, హీనులు, కూడులేని, గూడులేని బడుగుల చేతి ఆయుధంగా ఎర్రజెండా నిలిచింది. కార్మిక, కర్షక ఉద్యమాలలో ప్రచండ ఝంఝాప్రభంజనంలా విప్లవ శంఖం పూరించింది. నూరేళ్ళ సమరశీల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఎన్నో విజయాలను సాధించింది. దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ప్రగతిలో అనిర్వచనీయమైన పాత్ర పోషించింది.
ఈ నేపథ్యంలోనే ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమం 1930వ దశకం ప్రారంభంలోనే వేళ్ళూనుకుంది. మీరట్ కుట్రకేసులో ముద్దాయిగా ఉండి అరెస్టు నుండి తప్పించుకుని మద్రాసులో -రహస్య జీవితం గడుపుతున్న అమీర్ హైదర్ ఖాన్ పరిచయంతో కంభంపాటి సత్యనారాయణ, పుచ్చలపల్లి సుందరయ్యలు కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. వీరే ఆంధ్ర రాష్ట్రంలో -తొలి కమ్యూనిస్టులు. తరువాత చండ్ర రాజేశ్వరరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు తదితరులు కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో అంకిత భావంతో పనిచేశారు.
జమిందారీ విధానానికి వ్యతిరేకంగా 'దున్నేవాడికే భూమి' నినాదంతో ఫ్యూడల్, భూస్వామ్య విధానంపై సమరశంఖం పూరించి -ఎర్రజెండా నేతృత్వంలో ఎన్నో చారిత్రక పోరాటాలను కమ్యూనిస్టు పార్టీ నిర్వహించింది. భూమి కోసం, భుక్తి కోసం, శ్రమజీవుల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటాలు కమ్యూనిస్టు పార్టీ సాగించింది.
తొలి తరం కమ్యూనిస్టులు స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా అడుగడుగునా -నిషేధాలతో, పోలీసు నిఘా నీడలో, ప్రాణాలకు తెగించి రక్తతర్పణకు వెరవక ఉద్యమాలు -నిర్వహించారు. 4 వేల మంది ప్రాణత్యాగం చేసిన తెలంగాణా సాయుధ పోరాటానికి ఆంధ్ర -రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ అండగా నిలిచింది. తరతరాల బూజు నిజాం రాచరికాన్ని కూల్చడంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టుల పాత్ర మరిచిపోలేనిది.
స్వాతంత్య్రానంతరం ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదంతో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో పెనుమార్పులకు ఉద్యమించింది.

దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం, తెలుగు ప్రజల ఐక్యత, సర్వతోముఖాభివృద్ధికి అడుగడుగునా కృషి చేసింది. 1934 విజయవాడ సమావేశంతో ప్రారంభించి 1936 జనవరి 29 కాకినాడ ప్రథమ మహాసభనుండి నేడు ఒంగోలులో జరుగబోతున్న 28వ రాష్ట్ర మహాసభ వరకు సుదీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీ ఎన్నో అనుభవాలను, విజయాలను మూటకట్టుకున్నది.
నేటి సంక్షిప్త రాష్ట్ర రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల స్వార్థ రాజకీయాలను, కుట్రలను, కుహకాలను ఎదిరించి 9 దశాబ్దాలకు పైగా వర్గ పోరాట మార్గంలో కష్టజీవులకు, కర్మవీరులకు కమ్యూనిస్టు పార్టీ, ఎర్రజెండా అండగా నిలిచాయి. కార్మికలోకపు కళ్యాణానికి, శ్రామికలోకపు సౌభాగ్యానికి లక్షలాదిమంది కమ్యూనిస్టులు అగ్నిధారలు కురిపించారు.
2025 ఆగస్టు 23-25 తేదీలలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి 28వ రాష్ట్ర మహాసభ భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్ష ఉద్యమాన్ని ముందుకు నడిపించే క్రమంలో పలు కీలక నిర్ణయాలు చేయనుంది. భవిష్యత్ రాష్ట్ర రాజకీయ యవనికపై ఐక్య కమ్యూనిస్టు ఉద్యమం పట్టు సాధించే దిశగా యావత్ కమ్యూనిస్టు శ్రేణులకు మార్గ నిర్దేశం చేసే ఒంగోలు మహాసభను విజయవంతం చేయటం మన కర్తవ్యం.
శ్రమజీవుల కేతనమా..! ఓ.. అరుణ పతాకమా..!!
నీకు రెడ్ శాల్యూట్...!
(చలసాని వెంకట రామారావు)
Tags:    

Similar News