భారత క్రికెట్ జట్టుకు 'ఫైనల్ ఫోబియా' ఉందా?

భారత్ కు 'ఫైనల్ ఫోబియా' ఉందన్న విషయం నిజమేనా అనిపించేలా కంగారుగా ఆడి కంగారూల చేతిలోనే రెండోసారి ఓడిపోయి లక్షలాది మంది ప్రేక్షకులను నిరాశపరిచింది

Update: 2023-11-30 03:32 GMT

మరోసారి భారత జట్టు ఫైనల్ లో ఓడిపోయింది. అది కూడా క్రికెట్ కు సంబంధించిన అతి పెద్ద టోర్నమెంట్ అయిన 2023 ప్రపంచ కప్ ఫైనల్ లో. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం లో జరిగిన ఫైనల్ లో భారత్ (మూడో సారి) ఓడిపోయింది.

ఈ టోర్నమెంట్ మొదలైనప్పటి నుంచి సెమీఫైనల్ వరకు 9 జట్లను ఓడించి, అజేయ జట్టుగా, కప్పు గెలిచే సత్తా ఉన్న జట్టుగా మొదటి స్థానంలో నిలిచి, 2019లో సెమీస్ లో తమను ఓడించిన న్యూజిలాండ్ ను ఈ సెమీ ఫైనల్లో అలవోకగా ఓడించి, బదులు తీర్చుకున్న భారత జట్టు, నాలుగోసారి ఒక ప్రపంచ కప్ ఫైనల్ లోకి అడుగుపెట్టి అదే ఊపులో 2003 ప్రపంచ కప్ లో తమను ఓడించిన ఆస్ట్రేలియాపై పగ తీర్చుకుంటుందని కలలు కన్న అభిమానులను నిరాశపరిచింది.

భారత్ కు  "ఫైనల్ ఫోబియా" ఉందన్న విషయం నిజమేనా అనిపించేలా కంగారుగా ఆడి కంగారూల చేతిలోనే రెండోసారి ఓడిపోయి లక్షలాది మంది ప్రేక్షకులను నిరాశపరిచింది.అనేక చర్చలకు, విశ్లేషణలకు తెర తీసింది.. చివరికి సాధారణ ప్రేక్షకులు కూడా ఈ ఫైనల్ మ్యాచ్ ను తమ తమ స్థాయిలో విశ్లేషించే స్థాయికి వెళ్ళిపోయారు అంటే అర్థం చేసుకోవచ్చు.

ఫైనల్స్ ఫోబియా గురించి చర్చించే ముందు ఐసీసీ వరల్డ్ కప్ లో ఇండియా ప్రస్థానం ఒకసారి చూద్దాం . 8 సార్లు సెమీఫైనల్స్ చేరడం, నాలుగు సార్లు ఫైనల్స్ చేరడం, రెండు సార్లు ఫైనల్స్ లో ఓడిపోవడం, రెండుసార్లు గెలవడం. మొత్తం మీద ఒక పెద్ద టోర్నమెంట్ చివరి అడుగుల్లో ఇండియా తడబడింది. రెండుసార్లు చివరి వరకు వెళ్లి గెలిచింది. ఫైనల్లో గెలవడం అనేది 50 శాతం మాత్రమే.

ఇంతవరకు ఐసీసీ నిర్వహించిన మూడు ప్రధాన టోర్నమెంట్లలో భారత ప్రస్థానం ఒకసారి చూద్దాం. ఐసిసి వరల్డ్ కప్(13) ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(8) ఐసీసీ టీ20 ప్రపంచ కప్(8) కలిపి మొత్తం 29 టోర్నమెంట్లలో భారత జట్టు ప్రదర్శనలు చూస్తే కొంతవరకు భారత జట్టుకు ఫైనల్స్ ఫోబియా ఉందేమో అనిపిస్తుంది. భారత్ జట్టు మొత్తం 9 సార్లు ఫైనల్ చేరుకుంది .

4 సార్లు(రెండుసార్లు ఐసిసి వరల్డ్ కప్ లో, ఒకసారి ఐసీసీ చాంపియన్ ట్రోఫీ లో,ఒకసారి T20 వరల్డ్ కప్ లో) మాత్రమే ఫైనల్ లో విజయం సాధించింది. ఇందులో విశేషం ఏంటంటే మనదేశంలో నిర్వహించిన నాలుగు టోర్నమెంట్లలో భారత్ సెమి ఫైనల్ చేరింది. అందులో ఒకసారి మాత్రమే ఫైనల్ కు చేరింది. ఆ ఒకటి గెలిచింది.

అలాగే ఐసీసీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ప్రస్థానం ఒకసారి చూద్దాం.9 సార్లు సెమీఫైనల్స్ వెళ్లిన ఆస్ట్రేలియా, 8 సార్లు ఫైనల్ చేరింది. అందులో రెండుసార్లు మాత్రమే ఓటమి పొంది, ఆరుసార్లు ప్రపంచ కప్ సాధించింది. ఫైనల్స్ సక్సెస్ రేటు 75%

భారతదేశానికి సంబంధించి ఈ ప్రపంచ కప్పు కు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో మూడుసార్లు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లతో సంయుక్తంగా (1987, 1996, 2011) ప్రపంచ కప్ నిర్వహించిన భారత్, ఈసారి ఒంటరిగానే ఈ కప్పును నిర్వహించింది. 2011 లో రెండోసారి ప్రపంచ కప్ గెలిచింది. 2023 ప్రపంచ కప్ లో కూడా ఫైనల్స్ వరకు తన ఆటతో అలరించి మరోసారి గెలుస్తామన్న ఆశలను పెంచి చివరకు ఆస్ట్రేలియా చేతుల్లోనే ఓడిపోవడం విశేషం. ఇప్పటివరకు భారత్ ను ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా ఓడించింది. రెండుసార్లు ఆస్ట్రేలియా చేతుల్లోనే చివరి మజిలీలో చతికిల పడడం భారత ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆస్ట్రేలియాకు ఇది ఆరో ప్రపంచ కప్ విజయం

ఇప్పటివరకు 13 సార్లు జరిగిన ఈ ప్రపంచకప్ లో, 8 సార్లు సెమీఫైనల్ లోకి, 4 సార్లు ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత జట్టు కేవలం రెండుసార్లు మాత్రమే ఫైనల్లో గెలిచి కప్పు సాధించింది.

గతంలోకి వెళ్లి ఒకసారి Australasia (1986 ,1990,1994) కప్పు గురించి చూస్తే రెండుసార్లు ఫైనల్ కి వెళ్లి, రెండు సార్లు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. మొదటి మ్యాచ్ లో జావిద్ మియందాద్ కొట్టిన లాస్ట్ బాల్ సిక్స్ మర్చిపోవడానికి జట్టుకి, అభిమానుల కు కూడా చాలా కాలం పట్టింది. ఆ మ్యాచ్ లో కపిల్ దేవ్ చాలా తీవ్రమైన విమర్శలకు గురయ్యాడు. "kapil needs maths tution" (కపిల్ దేవ్ కి లెక్కల ట్యూషన్ అవసరం) అని ఒక పేపర్ రాసింది. అప్పుడు ఏం జరిగిందంటే క్యాలిక్యులేషన్ తప్పి, కపిల్ దేవ్ 50 ఓవర్ వేయలేకపోయాడు. చేతన్ శర్మ 50 వ ఓవర్ వేయాల్సి వచ్చింది. దాని తాలూకు ప్రభావం రెండో మ్యాచ్ మీద కూడా పడటం వల్ల అది కూడా భారత్ ఓడిపోయింది.

ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే భారత జట్టులో తక్కువ కనపడేది ఫీల్డ్ లో కమ్యూనికేషన్. తరచూ ఆటగాళ్లు మాట్లాడుకోవడం అనేది తక్కువే. అది ఈ ప్రపంచకప్ ఫైనల్లో కూడా కాస్త కనపడింది

2023 ప్రపంచ కప్ విషయానికొస్తే, వివిధ రూపాల్లో భారతీయ ఆటగాళ్లలో ఒత్తిడిని పెంచిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి తప్పకుండా కొంత ప్రభావాన్ని చూపించే ఉంటాయిఫైనల్స్ లో భారత జట్టు ఫైనల్ ప్రదర్శన గురించి చర్చించే ముందు, కొన్ని అంశాలు పరిశీలిద్దాం.

భారత దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ క్రికెట్ అనే ఒక మతం ప్రత్యేకమైనది. దానికి రుజువు భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నమెంట్ ను వివిధ స్టేడియంలో రికార్డ్ స్థాయిలో మొత్తం 12 లక్షల 50 వేల 307 మంది వీక్షించడమే. ఇక టీవీలలో, సెల్ ఫోన్లలో, అమ్యూజ్మెంట్ పార్కులలో కొన్ని కోట్ల మంది చూసి ఉంటారు . ఇది కూడా ఒక రికార్డు. అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షించిన కప్ గా 2023 ప్రపంచ కప్ రికార్డు సృష్టించింది.

భారత ప్రేక్షకులు మతాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటారో, క్రికెట్ ను కూడా అంతే సీరియస్ గా తీసుకుంటారు. చాలా భావోద్వేగాలతో మ్యాచ్ లు చూస్తారు. మన క్రికెటర్లు కూడా కొంతమంది అలాగే ఉంటారు. ఆటను ఆటలాగా ఆడడం, ఓడిపోతే తేలికగా తీసుకోవడం భారత దేశంలో జరగదు.

అది ఆటగాళ్ల మానసిక స్థితిని కొంతవరకు ప్రభావితం చేసి ఉండవచ్చు. ఎందుకంటే భారతదేశంలో అభిమానులు, క్రికెట్ పిచ్చోళ్ళు, ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా భారతదేశ ప్రేక్షకులు అభిమానులు, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు. చాలా ఎమోషనల్ గా ఉంటారు. అది కొంతమంది మన ఆటగాళ్లకు కూడా వర్తిస్తుంది. 1996 శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్స్ లో అభిమానులు స్టాండ్స్ కి నిప్పు పెట్టడం, సీసాలు విసరడం ఎవరు మర్చిపోలేరు. గతంలో పాకిస్తాన్తో ఇండియా ఓడిపోయినప్పుడు అభిమానుల ప్రవర్తన కొంచెం అతిగానే ఉండింది. అందుకే ఇది కూడా ఒత్తిడిని పెంచే అంశమే.

మరో అంశం మీడియా. క్రికెట్ టోర్నమెంట్ మొదలుకాక ముందే కొన్ని నెలల నుంచి క్రికెట్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు, ప్రతి ఒక్కరూ ఈసారి తప్పకుండా కప్ గెలవాలని ఇచ్చిన, చేసిన ప్రకటనలు.

లక్ష మందికి పైగా అభిమానుల మధ్యలో అహ్మదాబాద్ లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం లో ఆడటం అనేది సహజంగానే కొంత ఒత్తిడిని కలిగించే అంశమే. మరో చిన్న అంశం స్వయంగా దేశ ప్రధాని క్రికెట్ ను వీక్షించడానికి స్టేడియంలో ఉండడం. ఇది అంత పెద్ద విషయం కాదు గాని కొంతమంది ఆటగాళ్లలో స్వల్పంగా కొంత ఒత్తిడిని పెంచి ఉండవచ్చు. ఇంకొక ప్రధానమైన ఒత్తిడి 2003లో ఫైనల్స్ లో, 2015 సెమీఫైనల్స్ లో భారత్ ను ఓడించిన ఆస్ట్రేలియా తో ఆడాల్సి రావడం. ఆస్ట్రేలియా జట్టు యొక్క ప్రొఫెషనల్ వైఖరి ఆటగాళ్లకు తెలుసు.

ఆటగాళ్లలో ఒత్తిడికి కారణమైన అంశాల్లో ముఖ్యమైనది ఒకటి ఉంది.. అదేంటంటే 2013 లో ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన తర్వాత 2023 ప్రపంచ కప్ దాకా భారత ప్రదర్శన జట్టుతోపాటు అభిమానుల ను కూడా ఒక విధమైన నిరాశ నిస్పృహల్లో ముంచేసింది.

ఆ మధ్య కాలంలో 8 టోర్నమెంట్లలో భారత్ ఒకటి కూడా గెలవలేదు. అందులో రెండు ప్రపంచ కప్ లు, ఛాంపియన్స్ ట్రోఫీలు, t20 ప్రపంచ కప్ లో ఉన్నాయి. అన్నింటిలో కలిపి ఎనిమిది సార్లు సెమీ ఫైనల్ కి వెళ్లిన భారత జట్టు, నాలుగు సార్లు ఫైనల్లోకి వెళ్ళినప్పటికి కూడా ఒకటి కూడా గెలవలేదు. అది జట్టుకు కొంచెం ఆందోళనకరమైన విషయమే. జట్టుగా కాకుండానే వ్యక్తిగతంగా కూడా కొంతమంది ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడికి లోనైన విషయం రహస్యం ఏమీ కాదు.

ఫైనల్స్ లో భారత జట్టు ఫైనల్ ప్రదర్శన గురించి చర్చించే ముందు, జట్టు ఓటమికి కారణమైన కొన్ని ఇతరా విషయాలు చూద్దాం

అనుభవం లేకపోవడం

జట్టులో కేవలం నలుగురు ఆటగాళ్ల కు మాత్రమే ప్రపంచకప్ ఆడిన అనుభవం ఉంది. షమి, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా ల కు తప్ప మిగతా వారికి అనుభవం లేకపోవడం ఒకరకంగా జట్టు సమతుల్యతను దెబ్బతీసింది. ఫైనల్స్ వరకు బాగా ఆడిన జట్టులో కొంతమంది ఆటగాళ్లు.. ఫైనల్స్ లో కొంత ఒత్తిడి గురై సరిగ్గా ఆడలేకపోయారు. ఉదాహరణకు శ్రేయాస్ అయ్యర్. రెండు సెంచరీలతో అలరించిన అయ్యర్ ఫైనల్ లో కొంత ఒత్తిడికి గురై ఉండవచ్చు

నాయకత్వం

రోహిత్ శర్మ.. మంచి ఆటగాడు. కానీ ధాటిగా జట్టు ను నడిపించే లక్షణాలు తక్కువే. 1983లో మొదటిసారి ప్రపంచ కప్ తెచ్చిన కపిల్ దేవ్ చాలా అగ్రెసివ్ బౌలర్, జట్టును కూడా తన పట్టుదలతో , స్వయంగా బాగా ఆడి చూపించి గెలిపించాడు.

అదేవిధంగా మహిందర్ సింగ్ ధోని 2011 కప్పు గెలిపించిన చాలా సమర్థవంతమైన నాయకుడు. వ్యూహాలు పన్ని అవతలిజట్టుని బోల్తా కొట్టించగల సామర్థ్యం ఉన్నవాడు. అన్నింటికన్నా ముఖ్యంగా మైదానంలో చాలా కూల్ గా ఉండే నాయకుడు.

ఈ రెండు లక్షణాలు రోహిత్ శర్మ లో లేకపోవడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది.

కోచ్ ద్రవిడ్

ద్రవిడ్ కి మిస్టర్ వాల్ అనే పేరు ఉంది. డిఫెన్స్ ఆటగాడు. చాలా నిదానస్థుడు, అతని వ్యూహాలు సరిగా పనిచేయవు. ఒకదానికే కట్టుబడి ఉంటాడు. ప్లాన్ ఏ తర్వాత బీసీ ఉండవు. దానికి ఉదాహరణ చెన్నై బౌలర్ అశ్విన్. మొదటి మ్యాచ్ తర్వాత అశ్విన్ టీం లో లేడు. ఎందుకో మరి తెలియదు. అశ్విని మాటల్లోనే చెప్పాలంటే " ధర్మశాలలో జరిగే న్యూజిలాండ్ మ్యాచ్ తో జట్టులోకి వస్తానేమో అనుకున్నాను. కానీ రాహుల్ ద్రవిడ్, వరుస విజయాలు సాధించిన జట్టునే ఏ మార్పు లేకుండా కొనసాగించాలనుకున్నాడు". ఇద్దరు ఎడమ చేతివాటం స్పిన్నర్స్ ( రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) ఉన్నారు. అశ్విని అనుభవమున్న ఆటగాడు. పైగా కుడి చేతివాటం స్పిన్నర్. స్లో పిచ్ ల మీద బాగా రాణించగల సత్తా ఉన్నవాడు. పైగా యాదవ్ కన్నా మంచి బ్యాట్స్మెన్. ఇది కూడా కొంతవరకు ఫైనల్స్ లో భారత్ ను దెబ్బతీసి ఉండవచ్చు.. .

హార్థిక్ పాండ్యా లాంటి ఆటగాడు గాయపడడం భారత్ కు దురదృష్టకరమైన అంశం. భారత్ కొంత బలహీన పడింది ఇక్కడే. సమర్థవంతమైన బ్యాట్స్మెన్, పనికొచ్చే బౌలర్, మిడిల్ ఆర్డర్లో ఎదురుదాడి చేయగలిగే బ్యాట్స్మెన్..ఇది ముఖ్యమైనది. ఎవరు ఏమీ చేయలేనిది .

ఇక జట్టులో అందరూ సమర్థవంతమైన ఆటగాళ్లే అయినప్పటికీ సమిష్టితత్వం కనబడలేదు. మొదట్లో జట్టు అంతా సమిష్టిగా విజయాలు సాధిస్తే ఫైనల్ కు వచ్చేసరికి అది లేకుండా పోయింది

జట్టులోకి రింకు సింగ్ లాంటి ఆటగాడిని తీసుకోకపోవడం కూడా ఒక తప్పిదమే. సంజు సాంసన్ లాంటి ఆటగాడిని మర్చిపోయారు. యశస్వి జైస్వాల్ అనే యువ ఆటగాడిని కూడా తీసుకొని ఉండాల్సింది. ప్రపంచకప్ తర్వాత మన దేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు టీ20 మ్యాచ్ లో ఈ విషయం స్పష్టమైంది. రింకు సింగ్ బ్యాటింగ్ చూసాం. రింకు సింగ్ ను తీసుకొని ఉంటే బాగుండేది. చాలా సులభంగా, ఏమాత్రం జంకుమంకు లేకుండా అతను ఫోర్లు సిక్సర్లు బాదడం చూస్తే అలాగే అనిపిస్తుంది.

ఇక ఫైనల్ మ్యాచ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం..

. * ప్రపంచ కప్ లో గతంలో ఆస్ట్రేలియాతో , ఒక సెమి ఫైనల్, ఫైనల్స్, ఓడిపోయిన భారత్ కొంత కసితో ఆడాలని ఉండడం సహజం. దానికి తోడు ప్రపంచ కప్ మొదటి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ని చాలా సునాయాసంగా ఓడించిన భారత్, ఫైనల్ మ్యాచ్లో కూడా ఓడిస్తుంది అన్న భావన ఉండింది. అయితే ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ప్రదర్శన పేలవంగా ఉండడం ప్రేక్షకులకి నిరాశ కలిగించింది. ఇక్కడే భారత్ కు ఫైనల్ ఫోబియా ఉందా, అని అనుమానాలు కలిగాయి.

* లీగ్ మ్యాచ్ లతోపాటు సెమి ఫైనల్స్ వరకు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ( ఒక ఇంగ్లాండ్ తో మాత్రం 229) ప్రతి జట్టుతో 300 పైగా పరుగులు చేసింది. ( లంకతో 357, దక్షిణాఫ్రికా తో 326, నెదర్లాండ్స్ తో 410, న్యూజిలాండ్ తో 397) పరుగులు వరద పారించిన భారత జట్టు ఫైనల్స్ లో మొదట బ్యాటింగ్ చేసి కేవలం 240 పరుగులు మాత్రమే చేయడం తో మ్యాచ్ సగం జారిపోయినట్లే అనిపించింది.

లీగ్ చివరి 4 మ్యాచ్లలో రాణించిన ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్(47), కోహ్లీ(54), రాహుల్(66) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు సాధించారు. అయితే కోహ్లీ, రాహుల్ బాగానే ఆడినట్టు అనిపించినా మ్యాచ్ మొత్తం పరిశీలిస్తే వారు సాధించిన స్కోర్లు పెద్దగా ఉపయోగపడలేదు. ఎందుకంటే రాహుల్, కోహ్లీ మధ్య పార్ట్నర్ షిప్ 67 పరుగులు. ఇదే ఆ పరుగులు సాధించడానికి వారు తీసుకున్న ఓవర్లు 18.1 !! అది ఎవరికి మింగుడు పడడం లేదు. పైగా 97 బంతులలో వారిద్దరు కలిసి ఒక్క బౌండరీ కూడా చేయలేదు!! ఇది పూర్తి నిరాశ జనకం. భారతి జట్టులో ఇద్దరు బెస్ట్ వన్డే ప్లేయర్స్ 109 బంతులు ఆడి ఒక్క బౌండరీ కూడా కొట్టకపోవడం షాకింగ్ గా ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే బ్యాటింగ్లో దాదాపు విఫలమైన భారత్ జట్టు నలభై ఓవర్లలో ఒక బౌండరీ కూడా సాధించకపోవడం. అంతేకాకుండా రాహుల్, కోహ్లీ స్ట్రైక్ ను రొటేట్ చేయలేకపోయారు. అది జట్టు ఓటమికి దారితీసింది.

* ఇక బౌలింగ్ విషయంలో కూడా భారత్ జట్టు ప్రదర్శన ఊహించని విధంగా ఉంది. సెమి ఫైనల్స్ తో సహా పది మ్యాచ్ లు ఆడిన భారత్ ఆఫ్గానిస్తాన్(8 వికెట్లు), బంగ్లాదేశ్(8 వికెట్లు) తప్ప అన్ని జట్లను ఆల్ అవుట్ చేసింది!! ఇది ఒక గొప్ప విషయం. కానీ ఫైనల్స్ లో మాత్రం నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగింది. ఇది కూడా జట్టు ఓటమికి కారణమైంది.

* * ఈ మ్యాచ్లో భారత్ ఎదురుదాడికి దిగకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఒకటి రెండు వికెట్ల పడిన తర్వాత ఇండియన్ డీవిలియర్స్ గా పేరుపొందిన సూర్య కుమార్ యాదవ్ ని బ్యాటింగ్ కి దింపకపోవడం సరైన వ్యూహం కాదు. . ఇక్కడే భారత్ వెనకడుగు వేసింది. సూర్య కుమార్ ని ఆరో స్థానంలోకి దింపిన భారత్ చేసిన తప్పిదం అది. ప్రపంచ కప్ తర్వాత మన దేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు టీ20 మ్యాచ్ లో ఈ విషయం స్పష్టమైంది. మొదటి మ్యాచ్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ దిగిన సూర్యకుమార్ యాదవ్ 42 బంతుల్లో 80 పరుగులు చేశాడు. అతను ఎటువంటి బ్యాట్స్మన్ అన్నది చూపించాడు.

ఏది ఏమైనప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ఆటగాడు ఉద్వేగాలను అదుపులో పెట్టుకొని ప్రొఫెషనల్ గా ఆడక పోవడం అనేది సమ్మతించదగ్గ విషయం కాదు. పది మ్యాచ్ లలో గెలిచిన జట్టు 11వ మ్యాచ్ ఓడిపోవడం అన్నది ఎవరికైనా జరగవచ్చు కానీ ఎలా ఓడిపోయారు అనేది ముఖ్యం. చివరకు ఆలోచిస్తే భారత జట్టులో చాలామంది ఒత్తిడిని ఎదుర్కోలేక పేలవమైన ఆట ప్రదర్శించడం వల్ల భారత జట్టు ఓడిపోయింది. ఆస్ట్రేలియా జట్టు ప్రొఫెషనల్ ఆటగాళ్లతో కూడిన జట్టు. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ పడిన తర్వాత మ్యాక్స్ వెల్ డబుల్ సెంచురీ తో జట్టును గెలిపించాడు. అయితే అందరూ మాక్స్ లాగా ఆడలేకపోవచ్చు. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 68 బంతులు ఆడి కేవలం 12 పరుగులతో వికెట్ పోగొట్టుకోకుండా మ్యాక్స్ వెల్ కి తోడుగా ఉన్నాడు. అది చూసి మన వాళ్ళు నేర్చుకోవాలి.

చివరగా పోయిన ప్రపంచ కప్ గురించి ఆలోచించడం మానేసి, దూరదృష్టి తో 2027 ప్రపంచకప్ పై బీసీసీఐ, ఆటగాళ్లు దృష్టి సారించాలి.

కొసమెరుపు:

"భారతదేశ ఓడిపోవడానికి కారణం, మాజీ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పుట్టిన రోజున మ్యాచ్ నిర్వహించడమే" అని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా విశ్వాస్ శర్మ చెప్పడం బట్టి చూస్తే, క్రికెట్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు

అలాగే భారతదేశం గెలిస్తే నూరు కోట్ల రూపాయలు పంచుతానని ఒక Astrotalk కంపెనీ అధినేత పునీత్ గుప్తా ప్రకటించడం.. విశేషం. ఇది ప్రపంచంలో ఎక్కడైనా సరే జ్యోతిష్యం చెప్పించుకునే ఏర్పాటు చేసే కంపెనీ. ఆయన ఎవరు గెలుస్తారు అన్నది చెప్పలేదు పాపం!

Tags:    

Similar News