పత్తి ఎగుమతులపై పన్నులు రద్దు చేసి ప్రజా ప్రయోజనం అంటారా?
ఈ నోటిఫికేషన్ పత్రి రైతుల పాలిట శాపంగా మారనుంది. ప్రధాని మోదీ ద్వంద్వ వైఖరితో రైతులకు ద్రోహం చేశారంటున్న ఏపీ కౌలు రైతుల సంఘం నేత జమలయ్య..;
By : The Federal
Update: 2025-08-20 10:23 GMT
(పి.జమలయ్య)
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాన్ని తక్షణమే రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆగస్టు 19నుంచి అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పత్రి రైతుల పాలిట శాపంగా మారనుంది. ప్రధాని మోదీ ద్వంద్వ వైఖరితో రైతులకు ద్రోహం చేశారు.
2014లో ఎన్నికల సందర్భంలో మోదీ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డాక్టర్ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పిస్తామని, రైతుల ఆదాయాన్ని పెంచుతామని ఊరువాడ వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ఆ వాగ్దానాలను హామీలను తుంగలో తొక్కారు. ఒకవైపు ఆదాయాలు పెంచుతామని చెబుతూ మరోవైపు దేశీయ రైతులకు నష్టం చేసే విధంగా పత్తి దిగుమతి సుంకాలను ఎత్తివేయటం ఇంత కన్న దుర్మార్గం మరొకటి లేదు.
ప్రస్తుత జీవో ప్రకారం "పత్తి దిగుమతులపైన సుంకాలు ఎత్తివేశాం, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి దిగుమతి సుంకాలు ఎత్తివేయాల్సి వచ్చింది." ప్రజా ప్రయోజనార్థం కోసం సుంకాలను రద్దు చేశామని చెప్పడం వట్టి భూటకం.
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, పత్తి రైతులకు ఇది మరణ శాసనం లాంటిదిని పేర్కొంది. దిగుమతి సుంకం తొలగించడం వల్ల దేశీయ పత్తి ధరలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ నిర్ణయాన్ని అవకాశంగా తీసుకుని మన దేశంలో పత్తి దిగుమతి వ్యాపారస్తులు అతి తక్కువ ధరకు విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకొని నిలవ పెట్టుకుంటారు.
అక్టోబర్ నుండి మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో పత్తి మార్కెట్ వచ్చే సమయంలో పత్తి వ్యాపారస్తులు సిండికేట్ గా మారి పత్తి ధరలను తగ్గించి రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది చిన్న, సన్న కారు కౌలురైతులే.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల పత్తి ధరలు ఖచ్చితంగా పడిపోతాయి. దీంతో రైతులు మరింత కష్టాల్లో, అప్పుల్లో మునిగిపోతారు. ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ 11 సంవత్సరాల మోడీ పాలనలో సుమారు 1,50,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు చేసుకున్నారు. ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. వాటిని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకుపోగా ఈ దిగుమతి సుంకాలను రద్దుతో రైతాంగం మరింత సంక్షోభంలోకి వెళుతుంది.
ప్రధాని మోడీ ద్వంద్వ వైఖరితో దేశీయ రైతాంగానికి ద్రోహం చేశారని ఆయన చెప్పిన “అత్యున్నత ప్రాధాన్యత” రైతులకు ఇప్పుడు ఎక్కడ ఉందని రైతు సంఘం ప్రశ్నిస్తుంది.
గత 11 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం పత్తి రైతులకు డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు(C2+50%) ప్రకారం కనీస మద్దతు ధర ఇవ్వలేదు. వ్యవసాయ ఖర్చులు, ధరల సంఘం 2025 ఖరీఫ్ పంటలకు ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు పత్తికి రూ.7710లు మాత్రమే. ఇది C2+50% సూత్రం ప్రకారం రూ.10075లు ఉండాలి. కానీ రూ.2365 తక్కువగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దేశంలో పత్తి పంట పండించే ప్రాంతాలల్లో ఇప్పటికే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక, సాగు ఖర్చులు తీర్చే మార్గం లేక అప్పుల భారం పెరిగి పత్తి పండించే రైతులు సంక్షోభంలోకి కూరుకుపోయారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో లేకపోవడం భాదకరం. ఇప్పుడు పత్తిపై దిగుమతి సుంకం రద్దు చేయడం వల్ల లక్షలాది పత్తి రైతు కుటుంబాల జీవనోపాధి మరింత దెబ్బతింటుంది. పత్తి వ్యాపారం చేసే దేశీయ, విదేశీయ కార్పొరేటు సంస్థలు లాభపడతాయి. దీంతో భారత వ్యవసాయరంగం కుదేలు అవుతుంది.
భారతదేశంలో పత్తి సాగు విస్తీర్ణం సుమారు 120.55 లక్షల హెక్టార్లు, ఇది ప్రపంచంలో మొత్తం పత్తి సాగు విస్తీర్ణంలో సుమారు 36 శాతంగా ఉంటుంది. పత్తి సాగు భూభాగంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్దది.
భారతదేశంలో పత్తి సాగులో దాదాపు 67 శాతం వర్షాధారంగా సాగవుతుంది. రాష్ట్రాల వారీగా చూస్తే, మహారాష్ట్రలో పత్తి సాగు అత్యధికంగా ఉంది. తర్వాత గుజరాత్, తెలంగాణ ఉన్నాయి.
మనం రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ లో అన్ని పంటలు కలిపి 86 లక్షల ఎకరాలు సాగవుతుండగా ఇందులో 14 నుంచి 15 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తారు. ఈ దిగుమతి సుంకాలు ఎత్తి వేయడం వల్ల మన రాష్ట్రంలో పత్తి రైతులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఈ నేపథ్యంలో పత్తి రైతులు గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి, తీర్మానాలు చేసి, ఆ తీర్మానాలను ప్రధాని మోదీకి పంపాలని "సంయుక్త కిసాన్ మోర్చా" దేశవ్యాప్తంగా రైతాంగానికి పిలుపునిచ్చింది.
పత్తి దిగుమతులపై ఎత్తివేసిన సుంకాలను వెంటనే పునరుద్ధరించాలని తద్వారా దేశీయ పత్తి రైతులకు రక్షణ కల్పించాలని కోరుతున్నది. రైతాంగానికి బిజెపి 2014 మానిఫెస్టోలో చేసిన వాగ్దానం ప్రకారం సమగ్ర ఉత్పత్తి వ్యయానికి 50శాతం అదనంగా (C2+50%) కలిపి క్వింటాలకు రూ.10075లు చొప్పున ప్రకటించి సిసిఐ ద్వారా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
(రచయిత ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)