భాష యాసలు జీవన నైపుణ్యాలు కావా?

‘ప్రాంత యాసలో ముచ్చట్లు ఎంతో రమ్యంగా ఉంటాయి. వాటిని బతకనీయాలి.’;

Update: 2025-03-30 04:30 GMT

- సానేం నర్సనగౌడు

యాస, భాషలు జీవన నైపుణ్యాలుగా ఇప్పటికీ విరాజిల్లుతున్నాయి. ప్రజల జీవితాన్ని ముందుకు తీసుకు పోవడంలో భాషలు యాసలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలను నెలకొల్పడంలో వీటి ప్రాముఖ్యతను అంత సులువుగా తీసివేయలేం. లిపి ఉన్న ఏ భాష కూడా కనుమరుగవుతుందని చెప్పలేం. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందని దశలో సింధు నాగరికత నాటి కొన్ని భాషలు అంతరించిపోయి ఉండవచ్చు. కానీ నేడు భాషల పరిరక్షణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటోంది. ప్రజలలో సైతం ప్రాంతీయ భాషల పరిరక్షణకు ఆ భాషలతో కలగల్సి ఉన్న యాసాలను కూడా కాపాడుకునేందుకు అవసరమైన కార్యాచరణ బలంగానే కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ప్రాంతీయ భాషల యాసలతో కూడిన సాహిత్యాన్ని వెల్లడించాలన్న పట్టుదల సైతం బాగా పెరిగింది. దీని అర్థం ప్రాంతీయ భాషలను, యాసలను కోల్పోకూడదనే.

ఇటీవల కాలంలో కొందరు 'ఆధునిక మానవులు ' పల్లెలు వదిలి పట్నాలు చేరి నగరాల్లో కాపురాలు పెట్టి విదేశాలలో సైతం చెక్కర్లు కొట్టే నయా మేధావులు యాస భాషలు ఉంటే ఏమిటి పోతే ఏమిటి అన్న తిరస్కార ధోరణితో వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా భాషా,యాసలు చాదస్తంగా కొట్టేస్తున్నారు. నిజానికి ఈ వైఖరి వారి ఆర్థిక మూలాల్లో నుంచి వచ్చిన ఆలోచనగా చూడాల్సి ఉంది. వీరి ఆలోచన దృక్పథముతో పల్లె పదాలకు, భాషా సంస్కృతులకు, యాసలకు ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ కూడా సహజంగా ఆ ప్రాంత ప్రజల జీవనంలో భాగమైన అంశాలు వాటిని విడదీయం వాటి పట్ల నిరాదరణ ఏమాత్రము అభినందనీయం కాదు.

భాష, యాసలు సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ ఒకదానికొకటి అంతర్గత సంబంధాలు కలిగి ప్రజల జీవనాన్ని రక్తి కట్టిస్తున్నాయి. దీనికి తోడు వేషధారణ కూడా ఈకోవలోకే వస్తుంది. కాలానుగుణంగా వచ్చే మార్పులు కొన్నిటిని కనుమరుగు చేసి ఉండొచ్చు.

జాతుల పోరాటాన్ని మనం గౌరవిస్తాము జాతులను కూడా ఈలక్షణాలతోనే గుర్తించడం రివాజు. మైదాన ప్రాంత గిరిజనులుగా పిలువబడుతున్న లంబాడీలు ఇప్పటికీ వారు ఏ స్థాయిలో ఉన్న ఆర్థికంగా, సామాజికంగా ఎదిగి ఉన్నా... ఐఏఎస్ లాంటి పోస్టుల్లో ఉన్న వారు అదే సామాజిక వర్గానికి చెందినవారితో లంబాడి భాషలోనే మాట్లాడుకోవడం గమనించదగ్గ విషయం. అంతేకాకుండా ఆదివాసీలు కూడా వారి ప్రామాణిక భాషలోనే మాట్లాడుకోవడాలు మనం చూస్తున్నాము.

ప్రజలకు లేదా సమాజాలకు సామాగ్రాభివృద్దికి దోహదం చేసే సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను ఎందుకు దూరం చేసుకోవాలి? అవి వారి మధ్యన సఖ్యతను సంబంధ బాంధవ్యాలను ఏర్పరచినప్పుడు వాటిని ఎందుకు వదులుకోవాలి!? నేను చాలా స్పష్టంగా లంబాడీల్లోనే ఈ ప్రత్యేక పరిస్థితిని గమనించాను. కన్నడ వాసులు సైతం ఇప్పటికీ ఇంకొక కన్నడ వ్యక్తి తారసపడితే తప్పకుండా కన్నడంలోనే సంభాషిస్తాడు.

దీని అర్థం వారికి మిగతా భాషలు రావని అనలేం కదా, అంతేకాకుండా వారు ఆ భాషల్లో వ్యవహరించడం వల్ల అక్కడే ఉండి పోవడం లేదు కదా మిగతా ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమలో కర్నూలుకు ఒక యాస కడపకు మరోక యాస అనంతపురానికి ఇంకొక యాస చిత్తూరులో తెలుగే తమిళ యాసాలో మాట్లాడతారు నేను సైతం రాయలసీమ వాసిగా ఆ ప్రాంతం వారు హైదరాబాదులో ఎక్కడైనా తారసపడి రాయలసీమ యాసలో మాట్లాడితే ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినట్లు అవుతోంది. వారితో మాటలు కలిపి వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఇది ఆ యాస పై ఉన్న మమకారాన్ని తెలియజేస్తుంది .

దీన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదనుకుంటా దాదాపుగా మీరు కూడా మీ ప్రాంతానికి సంబంధించి ఆ యాసలో మాట్లాడినప్పుడు మీ హృదయం సైతం పులకించి ఉండవచ్చు, ఇప్పటికీ నంద్యాల ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఉన్నవారు వారు చదువుకున్నప్పటికీ ఆ ప్రాంత యాసలో మాట్లాడుకోవడం, నిజానికి నాకైతే చాలా సంతోషం ఉంటుంది. ఆధునీకరణ పేరుతో మీరు ఇంగ్లీషు లేదా తెలుగేతర భాషలు నేర్చుకొని ఉండవచ్చు ఆయా భాషలో పట్టు సైతం సాధించి ఉండవచ్చు కానీ మాతృభాషలో నీ స్థానిక ప్రజలతో ఆ యాసలో మాట్లాడుకోవడంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం దీని అర్థం వేరే భాషలు నేర్చుకోవద్దని కానీ ముందుకు పోవద్దని గాని ఎవరూ కోరరు. కానీ మాతృభాషలో మరింత ముఖ్యంగా ఆ ప్రాంత యాసలో ముచ్చట్లు ఎంతో రమ్యంగా ఉంటాయన్నడంలో సందేహం లేదు.

Tags:    

Similar News

అవిటి నత్త