తామరాకు మీద నీటి బొట్టు
జూన్ 15, ఫాదర్స్ డే సందర్భంగా చెంగల్వ రామలక్ష్మి కవిత;
By : The Federal
Update: 2025-06-15 00:30 GMT
నాన్నకు మనుషులంటే
చాలా ఇష్టం
అందరితో కలసిపోతూ
చింతలు వంతలు లేకుండా
గడిపేయటం ఆయన నైజం
అలాగని ఇంట్లో ఎవరూ లేనపుడు
ఒంటరిలా బాధ చెందరు
పద్యాలు పాడుకుంటూ
ఆత్మానందంలో ఓలలాడుతుంటారు
నాన్న నిరంతర చిదానందమూర్తి
తనకు బి. పి. ఎక్కువ అంటారు
అంటే బంధుప్రీతిట
నాన్న
బంధుత్వాలను కలిపి నిలిపి ఉంచే మమతల వారధి
దూరపు, దగ్గర బంధువుల తేడా లేక
అన్ని శుభాశుభాలకు హాజరయ్యే నాన్నంటే అందరికీ ఓ ప్రత్యేకం
జగమంత కుటుంబం నాన్నది
స్టేజి పై పౌరాణిక పాత్రలను
అద్భుతంగా నటించే నాన్నకు
జీవితం లో నటించటం తెలియదు
పాలకు నీళ్లకు తేడా తెలియని
పసి మనస్తత్వమే మలి సంధ్య దాకా!
ధర్మరాజు పాత్రకి నాన్న పేటెంట్
అపర ధర్మమూర్తి, అజాత శత్రువు నాన్న బిరుదులు
ఏ గది గూటిలో చూసినా నాన్న గెలుచుకున్న పురస్కారాలు, సన్మాన పత్రాలే!
రోజంతా ఉద్యోగం చేసి,
రాత్రంతా నాటకాలాడుతూ
మళ్ళీ మర్నాడు యధావిధిగా
ఆఫీసుకు వెళ్లిపోయే
అలుపెరుగని ఆ శ్రమ జీవన సౌందర్యాన్ని చూస్తూ
ఆశ్చర్యం తో తలమునకలవటమే కానీ
ఆ పని చేసే తత్వాన్ని మాత్రం నేర్చుకోలేక పోయాను
మీ నాన్న నీకంటూ ఆస్తి, ఇల్లు
ఏమీ ఇవ్వలేదురా అనే బంధుమిత్రులకు
నాన్న నాకిచ్చిన
ఆరోగ్యమనే గొప్ప ఆస్తి గురించి తెలియదు
బిపి షుగర్ లు నాన్న దరి చేరటానికి భయపడ్డాయి
మరణపర్యంతం మైళ్లు మైళ్లు నడుస్తూనే ఉన్నారు
నడకే నాన్న ఆరోగ్యం
నటనే, నాటకాలలో మాత్రమే సుమా, నాన్న ఆనందం!
నడక, నటన నాన్న నాకిచ్చిన వారసత్వ సంపద!
సుఖం , దుఃఖం
రాగం , ద్వేషం
దేనినీ మనసుకు పట్టించుకోని
తామరాకు మీద నీటి బొట్టు నాన్న!
ప్రతిరోజూ ఒకే సమయానికి
విశేషాలమిటి బాబూ అంటూ పలకరించే నాన్న ఇప్పుడు లేక
నా ఫోన్ మూగబోయింది
పూలమాలను కలిపి ఉంచే దారం తెగిపోయింది
పూలన్నీ చెల్లా చెదరయిపోయాయి
తోబుట్టువుల రాకపోకలు
బంధువుల పలకరింపులు
దూర దూరంగా జరిగిపోతున్నాయి
నాన్న లేని ఇల్లు బరువుగా, భారంగా నిశ్శబ్దాన్ని మోసుకుతిరుగుతోంది.
-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
(డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గురజాడ రచనలపై పరిశోధన చేసారు. 'చెంగల్వ పూలు 'అనే కథా సంపుటాన్ని, 'గురజాడ అప్పారావు ', జాషువా జీవితం --సాహిత్యం ', అనే పుస్తకాలను ప్రచురించారు. ప్రస్తుతం సాహిత్య వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, కథలు, కవితలు వివిధ పత్రికలలో రాస్తున్నారు.)
ఇది కూడా చదవండి
గీతాంజలి ‘ఇల్లు’ కవిత సీక్వెల్ ‘వర్షంలో నానిన ఇల్లు’ ఇక్కడ చదవండి
వర్షంలో నానిన ఇల్లెంత అద్భుతం,
ఎంత మనోహరం ?
కానీ కొన్ని ఇళ్లకే వర్షానందం !
పూరి గుడిసెలు,
అసలు ఇళ్ళే లేని మనుషులకి
వర్షం ఒక భయం..విషాదం!...... (ఇక చదవండి)