ఏమ్మా... కృష్ణమ్మా

విజయవాడ వరద కవిత

Update: 2024-09-05 02:40 GMT

-గోలి మధు


వెలుగు వాడ
విజయవాడ
జడివానకు
వెల వెల పోయిందీ వేళ!

చిగురు నిచ్చి
మెతుకు పంచే చినుకు
కంటిపై కునుకు
మాయం చేసిందీ వేళ!

నీరే కన్నీరై
విజయవాడ వైపుకు
విశ్వామంతా చూస్తుందీ వేళ

విల విల లాడుతూ
వల వల ఏడ్చే దుస్థితిలో
కాలం కన్నెర్ర చేసిన
వెలివాడ విజయవాడ

వాణిజ్య రహదారులపై
తిరుగాడే పడవలు
రాత్రికి రాత్రే
అన్నార్తులైన అభాగ్యులు

కాటికి కాలుచాపిన
కురువృద్దులు
అమ్మ పొత్తిళ్లలోని
పసి కందులు
బిక్కు బిక్కు మంటూ
జల దిగ్బంధం లో
కృష్ణమ్మ ఒడిలో

ముంచుకొచ్చిన
ఉపద్రవానికి
ముందుకొచ్చిన నాయకుల
నిందారోపణాల సమయమా ఇది

రోజుల తరబడి
ఉదయాస్తమయాల చీకటిలో
మా విజయవాడ

రోజూ దాహం తీర్చే
కృష్ణమ్మ
ఇళ్లలో జొరబడి
గుక్కెడు నీళ్ళే లేకుండా చేయడం
వింతగా లేదూ

కన్ను పొడుచుకున్నా
కానరాని చీకటిలో
దోమలకు ఆహరమే
మా శరీరాలు

వైద్యశాలలకు
విందు భోజనంగా
టైఫాయిడ్ మలేరియా
డెంగ్యూ విష జ్వరాలతో
మా దేహాలు

మాయమైన చెరువులపై
మొలుచుకొచ్చిన భవనాల క్రింద
మా శవాల శిధిలాలు
ఇక్కడ
ఎవరిని తప్పు పడదాం భారతమ్మ?

విజయవాడ కంట
పొంగి పోరలే
కన్నీటి ధారల నివారణకై
ఎన్నెన్ని చూపుడు వేళ్ళో
మరెన్ని ఆపన్న హస్తాలో

నిలకడ లేని నీరు
ఇంకెన్నాళ్ళని
మా కాళ్ళ కింద ఉంటుందిలే
మా కళ్ళలో నీటితో
శాంతించే ఉంటుందిలే

ఎంత గొప్ప పాఠం
నేర్పావు కృష్ణమ్మా!

ఎందరికి అర్ధమైందో గానీ
ఈ సారాంశం
ఈ పాఠం మాకు
గుణపాఠం అయ్యేనా?
మా తప్పులు
మాకు తెలిసొచ్చేనా?

కృష్ణమ్మా.....
ఇళ్లలో కాళ్ళ కిందకొచ్చి
కళ్ళలో నీరు నింపి నువ్వెళ్ళావు
నీతోటే....
సాయం చేసిన చేతులూ వెళ్ళాయి

మిగిలిన
మొండి చేతుల్ని
మొండి గోడల్ని తడుముకుంటూ
సత్తువ కూడగట్టుకుంటాంలే

ఒరిగిన దేహల్ని
నిలబెట్టుకుని
విరిగిన కుర్చీల్ని
చెల్లచెదురైనా సామాన్లని సర్దుకుంటూ

తడిచిపోయిన
వాహనాల ఇన్సూరెన్స్
పత్రాలను వేదకలేక
కొత్త అప్పుల కోసం
క్యూ కడతాం లే

నా దొక్క సందేహం
కృష్ణమ్మా...!

భారతమ్మ ఒడిలో
విజయవాడ సంకలో
నాకున్న జానేడు జాగాకి

ఇంటి పన్ను
కుళాయి పన్ను
కరెంటు పన్ను
ఆదాయం పన్ను
కేంద్రం పన్ను
రాష్ట్రం పన్ను.....అంటూ

పన్నుల మోతలు
మోగించే వారు వచ్చి
అన్నం పొట్లాలు విసిరి పోయారే గానీ
ఆరు నెలల పన్ను రాయితీ
ప్రకటించలేక పోయారే?
ఇదే కదూ
మొసలి కన్నీరు!

తూర్పున
భానుడు ఉదయంచాడు


Tags:    

Similar News