శ్రీనాథ రెడ్డి కథలు పదమూడు పరిమళాలు

‘ డబ్బు అమ్మబడును’ కథా సంకలనం తాడి ప్రకాష్ పరిచయం

Update: 2024-12-02 08:33 GMT


పువ్వు పుట్టగానే పుష్కిన్ అయిపోదు.
చేత్తో కలం పట్టిన నాడే చెహోవ్ అయిపోరు కదా ఎవ్వరూ!
తొలిసారి కథలు రాస్తున్నప్పుడు కొంత ఉద్వేగమూ, తొట్రుపాటు ఉంటుంది.
ఏం రాయాలి? ఎలా రాయాలి? మలుపు ఎక్కడ ఉండాలి? కొసమెరుపు పెడదామా వద్దా? ప్రాసలూ, అతి డైలాగులు ఏవీ లేకుండా జాగ్రత్త పడదామా? లేక ధర్మోపన్యాసాలు దంచి పారేద్దామాా? ప్రపంచాన్ని మార్చాలంటే 13 కథలు సరిపోవా? ఇలాంటి ప్రశ్నలూ, డైలమా, తేల్చుకోలేని తనమూ ఉండటం సహజం.

కథలు రాయడం మొదలుపెట్టడానికి ముందే తెలుగు సాహిత్యం నిన్ను పలకరిస్తుంది. కొన్ని పేర్లు చెప్పి కలవరపరుస్తుంది. కాలర్ పట్టుకుని నిలదీస్తుంది.
డాక్టర్ గీతాంజలి, విమల, ఎండపల్లి భారతి, ఎంఎస్కే కృష్ణజ్యోతి, జూపాక సుభద్ర, రుబినాపర్వీన్, ఉమానూతక్కి రాసినవి చదువుకున్నావా? మెహర్, అజయ్ ప్రసాద్ కథలు నీకు మనశ్శాంతి లేకుండా చేశాయా?
ఇండస్ మార్టిన్, మల్లిపురం జగదీష్, సోలోమోన్ విజయ్ కుమార్, వెంకట్ సిద్ధారెడ్డి, పూడూరి రాజిరెడ్డి, మారుతీ పౌరోహితం, సురేంద్ర శీలం, గోపిని కరుణాకర్, నాగేంద్ర కాశి కథలేమన్నా చదివి ఉన్నావా?
వాళ్లు ఎంచుకున్న జీవిత సమస్యలు,
వాటిని ఆ రచయితలు చూసిన తీరు, ప్రేమో, కన్నీళ్లో, మోసమో, బిడ్డల ఆకలో...ఏదైనా, ఆ నేరేటివ్ ని వాళ్లు ప్రజెంట్ చేసిన పద్ధతిలోని శక్తిని, కొత్తదనాన్ని గమనించగలిగావా? వాళ్ల వచనంలోని ఒక అరుదైన మాధుర్యాన్ని నీ గుండెలో వొంపుకోగలిగావా? ఆ కళాత్మక సౌందర్యాన్ని అనుభవించి, తాత్విక నేపథ్యం లోతుని తాకగలిగావా? ఉత్తమ సాహిత్యానికీ, డిటెక్టివ్ పుస్తకాలకీ, డైలీ సీరియళ్ళకీ, వ్యక్తిత్వ వికాసం అంటూ రాసే వెర్రి మొర్రి వ్యాసాలకీ తేడా తెలుసుకోగలిగావా?

"లేచిపోయినానని ఎవరన్నా అంటే నా మనసుకెంతో కష్టంగా ఉంటుంది" అన్న చలం మైదానం మొదటి వాక్యంలోని శక్తి, కన్నీటి వేదనా నీ హృదయాన్ని కదిలించాయా? వెన్నెల విరగకాస్తున్న వేళ ఆరుబయట కొబ్బరి చెట్ల కింద నులక మంచం మీద పడుకుని కిన్నెరసాని, యెంకి నాయుడు బావ ప్రేమ పాటలూ, జాజిపూల పరిమళంలా వీచే కృష్ణశాస్త్రి విరహ గీతాలు పాడుకుంటూ కళ్ళు చెమర్చిన అదృష్టం నీకెప్పుడన్నా దక్కిందా?
 "డబ్బు అమ్మబడును"
అనే తొలి కథల సంపుటి తో మన ముందుకు వస్తున్న శ్రీనాథ్ రెడ్డి అనే యువ రచయిత నడిచి వచ్చిన దారి ఇదే! ఎమ్మే ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన నేరానికి ఇంగ్లీషు లెక్చరర్ గా రాణిస్తున్నాడు. కథా రచయితగా కదం తొక్కి, దుమ్మురేపి, కొన్ని సినిమాలు తీసి, లేదా సినిమా కథలు రాసి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అడ్రస్ లేకుండా చేయాలని ఆరాటపడుతున్నాడు.
అవి వొట్టి కలల మేడలని కొట్టి పారేయడానికి లేదు. శ్రీశ్రీ ,చలం, బుచ్చిబాబు అనే అరాచక సాహితీవేత్తలు ఈ కుర్రాడి యవ్వనాన్ని పరవళ్ళు తొక్కించారు. అలిశెట్టి ప్రభాకర్, యండమూరి, సినీ వంశీ శ్రీనాథ్ ని పూర్తిగా పాడు చేశారు. చివరికి ఈ ఇంగ్లీష్ మాస్టార్ ని తెలుగు సాహిత్యం జయించింది. "చివరకు మిగిలేది", "పాకుడు రాళ్లు", వంశీ "నల్ల సుశీల", "గోదావరి కథలు", గొల్లపూడి "సాయంకాలమయింది", "జుజుమురా" ఇతని హృదయాన్ని ముక్కలు చేశాయి. ఆత్రేయ, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటల్లో గుబాళించిన సాహిత్యం ఇతనికి నిద్ర పట్టకుండా చేసింది. మేల్కోలిపింది.
ప్రకాశం జిల్లా నుంచి రెక్కలు కట్టుకు
ఎగిరొచ్చి ఈ హృదయం లేని హైదరాబాదును జయించాలనే
కాంక్షతో తపించిపోతున్నాడు.

మనం ఏం చూస్తామో అదే మనం. మనం ఏం తలపోస్తామో అదే కదా మనం. తనని వున్నచోట వుండనివ్వనివీ, రాయకుండా వుండలేక పోయినవీ ఈ కథలే!
శ్రీనాథ్ కళ్ళ ముందు కొత్తదారులు పరుస్తున్నాయి ఈ పదమూడు కథలూ.

"శీతాకాలం ఇప్పుడిప్పుడే తన చోటును వెతుక్కుంటూ బయలుదేరింది" అనే వాక్యంతో "అద్దె బ్రతుకులు" కథ మొదలవుతుంది. ఇందులో ధైర్యవంతురాలైన వేశ్య రమాదేవి,
"నేను నా ఒళ్ళు అమ్ముకోవడం లేదు, అద్దెకు మాత్రమే ఇస్తున్నాను" అని కోర్టులో చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
"silken bed sheets of dreams burnt by harsh realities" అన్నాడు సాహిర్ లుథియాన్వి. ఆ మహాకవి మాటలకు రుజువులూ, సాక్ష్యాలూ శ్రీనాథ్ కథల్లో లెక్కలేనన్ని ఉన్నాయి.
పరువు హత్యల విషాదం గురించి రాసిన కథ "సంపంగి".
protagonist - కూతురు కథ చెబుతూ ఉంటుంది....నాన్న గురించి, నాన్న ప్రేమ గురించి, తక్కువ కులం వాడైన ఒక క్రిస్టియన్ ని, పైగా ముష్టి ఆటో డ్రైవర్ గాడిని ప్రేమించిందని గారాబంగా పెంచుకున్న కూతుర్ని చంపేస్తాడు తండ్రి.
చనిపోయిన కూతురు మనకిలా చెబుతుంది... "మా నాన్న కంటే గొప్ప నాన్న ఎవరున్నారు ఈ లోకంలో? పెంచిన ఆ చేతులే పరువు కోసం నా ప్రాణాలు తీశాయి. ఉయ్యాలలూపిన చేతులే ఉరితాడు వేశాయి. ఊపిరి పోసినాయనే ఉసురు తీశాడు. కోడిని పెంచుకుంటాం...
ఆదివారం అమ్మవారికి బలివ్వట్లా...?
ఇది కూడా అంతే" అంటుంది.
ఇది చదువుతున్నప్పుడు రచయిత్రి సామాన్య ఎప్పుడో రాసిన మర్చిపోలేని కథ "మహిత" గుర్తొచ్చింది నాకు.
అందులో కూడా బతుకులో మోసపోయి చనిపోయిన కూతురే కథ చెబుతుంది. వాడిపోయిన, రాలిపోయిన సంపంగి వ్యథని ఎఫెక్టివ్ గా చెప్పగలిగాడు
శ్రీనాథ్ రెడ్డి.

"డబ్బు అమ్మబడును" ఒక సినిమాటిక్ కథ, అంత డబ్బు కూడా కస్తూరికి ఎలాంటి ఆనందమూ ఇవ్వదు. "నాకు ప్రేమ కావాలి, ఆప్యాయత, అనురాగం కావాలి, మనిషి తనాన్ని, మంచితనాన్ని నాకు పరిచయం చేయండి. ఈ డబ్బంతా తీసుకోండి" అని ప్రాధేయపడుతుంది. తన దగ్గరున్న డబ్బుతో తను పోగొట్టుకున్న వాటిని సంపాదించుకోలేకపోయిందంటాడు రచయిత. అసలు డబ్బుని అమ్మడం ఏమిటి? అనేది ఈ నాటకీయమైన కథ చదివి తెలుసుకోవాలి. డ్రమెటిక్ గా ఉన్నా ఒక లాజికల్ రియలిజం ఏదో శ్రీనాథ్ కథని ముందుకు నడిపిస్తుంది.
అసలు నాటకీయత లేనిదే కథలు పాఠకుల మనసుల్లో ముద్రలు వేయలేవు. కథ జీవితంలోని ద్రోహం, దౌర్జన్యం క్రూరమైన నేరాల డాక్యుమెంటరీ కాదు. అది అనుభూతికి ఆలోచనా వాహిక. చిరంతన దీప్తికీ, శాశ్వత కళాభినివేశానికి సంక్షిప్త వేదిక!

రోడ్డుమీద పూలమ్ముకునే ఒక ముస్లిం యువకుడి ప్రేమకథ "వాయిదా పడిన వసంతం" ఇందులో పేదరికం పెళ్లి చేస్తే, నివ్వెర పోయిన మూగ ప్రేమ గురించి రాసిన తీరు హృద్యంగా ఉంది.
ఈ కన్నీటి కథకి శ్రీనాథ్ రెడ్డి ఇచ్చిన ముగింపు చదివిన పాఠకుడు మౌనంగా మిగిలిపోతాడు. మనసు మూగగా రోదిస్తుంది. "జీవఫలం చేదు విషం"
అనే మాటకి అర్థం ఏమిటో తెలిసి వస్తుంది.

"కాసులు కురిసిన వేళ" ఒక గమ్మత్తయిన కథ. తాగుడికి అలవాటు పడిన ఒక ఆటో డ్రైవరు, భార్య, కొడుకు. ఈ పూట గడిస్తే చాలనుకునే పేద కుటుంబం.
వాళ్లకి హఠాత్తుగా లక్షలాది రూపాయలు దొరికితే? దానివల్ల ఆ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. నిష్పూచి లా బతికిన మునుపటి పేదరికమే మేలని, వాళ్లకి అనిపించేలా డబ్బు వాళ్ళ ఆనందం పై కక్ష సాధించిన తీరుని శ్రీనాథ్ చాలా కన్విన్సింగ్ గా పదునైన వాక్యాలతో కథ చెబుతాడు.
మానవత్వానికి తలవంచి నమస్కారం పెట్టే సంస్కారవంతుడీ రచయిత!

శ్రీనాథ్ రెడ్డి వచనం చదివిస్తుంది.
సజీవ జల ప్రవాహంలా నడుస్తూనే, ఒక్కోసారి సందేశాల తొందర లో తడబడుతుంది. కొద్దిపాటి శబ్ద లౌల్యాన్ని , అపరిపక్వపు ఆవేశాన్ని అధిగమించడానికి రచయితకి
ఇంకెంతో కాలం పట్టదు. దరిద్రపు జీవితంలోని ఘర్షణని, పెనుగులాటని ఖచ్చితంగా పట్టుకోగలిగాడు. ఇందులోని ఒక్కో కథా ఒక్కో రంగులో మన హృదయాన్ని తాకుతుంది.
మానవత్వపు మంచి గంధమై మనసుని పరిమళ భరితం చేస్తుంది.

ఆర్టిస్ట్ చరణ్ పరమి వేసిన అర్థవంతమైన బొమ్మలు శ్రీనాథ్ కథలకి కొత్త అందాన్ని ఇచ్చాయి.

కొత్త కథల కోసం అలమటిస్తున్న చిత్రపురి నీకోసం నిరీక్షిస్తోంది.
ఫిలింనగర్ గొంతెత్తి పిలుస్తోంది.
కన్నెపిల్ల లాంటి కృష్ణానగర్
కన్ను కొట్టి నిన్ను రమ్మంటోంది
శ్రీనాథ్ రెడ్డి.


Tags:    

Similar News