చదువుకున్నోళ్లు కూడా కులాల సంస్కరణలకు పూనుకోవడం లేదు.. ఎందుకు?
రచయిత, సాహిత్య విమర్శకుడు, విప్లవ రచయిత సంఘం (విరసం) మాజీ కార్యదర్శి వి. చెంచయ్యతో ఇంటర్వ్యూ
(రాఘవశర్మ)
"ప్రజల భాష పేరుతో తిట్టు భాషను కొనసాగించడం సరైంది కాదు. సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలందరికీ అందుబాటులోకి రాగలిగితే, సైన్స్‌ను మతం నుంచి వేరుగా చూడగలుగుతారు. ప్రస్తుతం రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టును కూడా పక్కన పెట్టే హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో ఉన్న హక్కులను కాపాడ లేదు. ఇది మత రాజ్యం కనుక సంఘ సంస్కరణలను కూడా అణచివేస్తోంది. మన దేశంలో ప్యూడల్ పునాదిని వ్యతిరేకించకుండా పెట్టుబడి దారి వ్యవస్థ వచ్చింది” అంటారు విరసం చెంచయ్య.
విప్లవ రచయితల సంఘానికి ఎనిమిదేళ్ళు కార్యదర్శిగా, అరుణతార పత్రికకు పదేళ్ళు సంపాదకుడిగా పనిచేసిన విప్లవ సాహిత్యకారుడు వి. చెంచయ్య. కావలి జవహార్ భారతిలో తెలుగు అధ్యాపకుడిగా ఉద్యోగ విరమణ చేసిన చెంచయ్యపైన తొలుత కె.వి. రమణారెడ్డి ప్రభావం, తర్వాత త్రిపురనేని మధుసూదన రావు ప్రభావం బలంగా ఉంది. సాహిత్య దృక్పథం, వివేచన, కలం యోధుడు చెరబండరాజు, సాహిత్య వస్తురూప శిల్పాలు, గతితార్కిక భౌతికవాదం వీరి రచనలు. చెంచయ్య తిరుపతికి వచ్చిన సందర్భంగా సోమవారం సాయంత్రం ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ.
ప్రశ్న: వర్తమాన సమాజం మీకు ఎలా కనిపిస్తున్నది? ఎలా అనిపిస్తున్నది?
చెంచయ్య: వర్తమాన సమాజం సరిగ్గా అయితే కనిపించడం లేదు. భయంకరంగా కనిపిస్తున్నది. మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తున్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే మాత్రం ప్రజాస్వామ్యం ఉండదు. విప్లవోద్యమానికి చాలా నష్టం. ప్రశ్నించే గొంతులను పూర్తిగా నొక్కేసే ప్రమాదం ఉంది.
ప్రశ్న : నేటి సమాజంలో కులం, మతం, భాష, జెండర్, ప్రాంతం వంటివి వైవిధ్యంగా కాకుండా వైరుధ్యంగా ఎందుకు పరిణమించాయి?
చెంచయ్య: అవి వైవిధ్యంగా కనిపించడానికి తగిన సామాజిక పరిస్థితులు లేవు. ఈ దశలో అవి వైరుధ్యాలుగానే ఉంటాయి. వైరుధ్యాలుగా ఉండి, ఆ వైరుధ్యాలుగా ఏర్పడిన ఘర్షణలు, వాటి ఫలితాలు ఉంటాయి. అవి మంచివైనా, చెడువైనా ఈ సంక్షోభం తప్పదు. ఆ సంక్షోభం నుంచే వైరుధ్యాల నుంచి వైవిధ్యాలుగా మారే అవకాశం ఉంటుంది.
ప్రశ్న : స్త్రీ, పురుష తేడాలు ప్రకృతి వైవిధ్యమే! అవి పునరుత్పత్తికి దోహదపడేవే ! మాతృస్వామిక, పితృస్వామిక సమాజాలు ఏర్పడడం, స్త్రీలు ప్రశ్నించేసరికి పితృస్వామిక దుర్మార్గాలు బైటపడడం చూస్తున్నాం. అవి స్త్రీ, పురుషుల మధ్య తీవ్ర వైరుధ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ వైరుధ్యాలు సామాజిక సమస్యలకు పరిష్కారం కాదు కదా! మరి పరిష్కారం ఏమిటి?
చెంచయ్య: ఏ వైరుధ్యం కూడా వైరుధ్యంగా పరిష్కారం కాదు. స్త్రీ, పురుష వైరుధ్యాలు వర్గ వ్యవస్థలో వైరుధ్యాలుగానే ఉంటాయి. వర్గ వ్యవస్థకు ఉండే దోపిడీ స్వభావం స్త్రీలపైన పురుషుల అణచివేతకు దోహదం చేస్తాయి.
ప్రశ్న : పురాణ కాల్పనిక సాహిత్యం స్త్రీల అంగాంగ వర్ణనల వరకు వెళ్ళిపోయింది. స్త్రీల సాహిత్యంలోకి కూడా ఇవి చొరబడ్డాయి. స్త్రీని ఆధారం చేసుకుని తిట్టు భాష కూడా తయారైంది. ఎంత నాగరిక సమాజం అనుకున్నా దీని నుంచి బైటపడలేకపోతోంది. దీన్నెలా అర్థం చేసుకోవాలి?
చెంచయ్య: పురాణాలలో ఉన్న స్త్రీల అంగాంగ వర్ణన వల్ల దాని ప్రభావం ఒక కోణంలోనే ఉంటుంది. దాన్ని శృంగారం వైపు నుంచే ఆలోచిస్తారు. స్త్రీలను చిన్న చూపు చూడడం, స్త్రీలపై అణచివేత, పురుషాధిక్యత వల్ల చాలా నష్టం జరుగుతుంది.
తిట్టు భాష అనేది చాలా కాలంగా ఉంది. స్త్రీవాద ఉద్యమం వచ్చిన తరువాత తిట్టు భాష గురించి చాలా చర్చ కూడా జరిగింది. అందువల్ల కొంతమందైనా ఆ తిట్టు భాషను వాడడం తగ్గించారు. స్త్రీలపైన ఉపయోగించే తిట్లు గాని, కులం పేరుతో వచ్చే తిట్లు గాని భాషలో జాతీయాలుగా మారిపోయాయి. వాటికి ప్రత్యామ్నాయ పదాలను వెతకకపోతే వీటిని అదుపు చేయడం కష్టం. తిట్లని ప్రజల భాష అని అంటారనేది నిజమే.
అయితే ప్రజల భాష ప్రజలు వాడాలి. రచయితలు, మేధావులు వాడకుండా ఉండడం మంచిది. ఆ ప్రజలు పాత్రలుగా ఉన్న సాహిత్యంలో సహజమైన భాష పేరుతో ఆ తిట్లు వాడేస్తున్నారు. దీన్ని కాలక్రమంలో మార్చక తప్పదు. ప్రజల భాష పేరుతో దాన్ని ఎల్లకాలం కొనసాగించడం సరైంది కాదు. ఎన్నో విషయాల్లో ప్రజలు మారుతున్నారు. అలాగే భాష విషయంలో కూడా ప్రజలను మారుద్దాం.
ప్రశ్న : ఒక కులం వారి ముందు మరొక కులం వారు, ఒక ప్రాంతం వారి ముందు మరొక ప్రాంతం వారు, ఒక మతం వారి ముందు మరొక మతం వారు నిలబడి శత్రువులుగా చూస్తున్నారు. ఈ సంక్లిష్టత, ఈ సంక్షోభ పరిష్కారానికి ఏ మార్పులు తీసుకురావాలి? ఈ మార్పునకు రాజ్యం ఏం దోహదం చేస్తుంది?
చెంచయ్య: కులం, ప్రాంతం, మతం వంటి విభేదాలను తొలగించడానికి ప్రస్తుత పాలక వర్గాలు ఉపయోగపడవు. పాలక వర్గాలను కూడా మార్చుకోవలసిన అవసరం ఉంది.
ప్రశ్న : గతంలో వేమన, పోతులూరి వీరబ్రహ్మం, గురజాడ, కందుకూరి, త్రిపురనేని రామస్వామి చౌదరి, గోరా వంటి వారు తమ కాలంలోని సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడి ఎంతో కొంత సమాజానికి మేలు చేసిన పాత్ర నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న సామాజిక సంక్లిష్టతలో తలదూర్చి సంఘ సంస్కరణకు పాటుపడేవారెవరైనా మీకు కనిపిస్తున్నారా? సమాజం కోసం పనిచేయాలంటే కందుకూరిలాగా ఒక సామాజిక ఎజెండా ఉండాలి కదా!?
చెంచయ్య: వేమన కవిగా ఉన్నాడు. కందుకూరి ఆచరణలో ఉన్నాడు. సాహిత్యంలో వేమనలా చెప్పే వారు కనిపిస్తారు కానీ, ఆచరణలో చూపించేవారు ప్రస్తుతం కనిపించడం లేదు.
అయితే సంఘ సంస్కరణ అనేది పరిమితి. అదొక్కటే శాశ్వత పరిష్కారం కాదు. వర్గ స్వభావాన్ని, వర్గ దోపిడీ స్వభావాన్ని మార్చడానికి, వర్గ విభేదాలను రూపుమాపడానికి సంఘసంస్కరణ ఒక్కటే సరిపోదు. కందుకూరి స్థాయిలో ఎవరూ కనిపించడం లేదు. స్థానికంగా చిన్న చిన్న సంస్కరణలు చేసేవారు ఉంటారు. సాధారణంగా రాజ్యం సంఘ సంస్కరణలను వదిలిపెట్టదు. ఇది మత రాజ్యం కనుక అది సంఘసంస్కరణలను అణచివేస్తుంది.
ప్రశ్న : పాలక పార్టీలు, కమ్యూనిస్టుల పేరుతో మరికొన్ని పార్టీలు, విప్లవం పేరుతో ఇంకొన్ని పార్టీలు సామాజిక సమస్యలకు ఒక పరిష్కార అజెండాను తీసుకురాలేకపోతున్నాయి. సామాజిక పరిస్థితిలో ఒక స్తబ్దత, ఒక నిరాశ, ఒక పరాధీనత, ఒక సంక్షోభం ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి? వీటిని మీరెలా అర్థం చేసుకుంటారు?
చెంచయ్య: మీరు చెప్పిన పార్టీలన్నీ ఎన్నికల ఊబిలో దిగబడిన పార్టీలే. ఎన్నికల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయనే భ్రమలు ప్రజల్లో కూడా తొలగిపోతున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు, కానీ విప్లవం పేరుతో ఉన్న పార్టీలు కాని ప్రజా ఉద్యమాలు నిర్వహించాలి. అవి ప్రజా ఉద్యమాల ద్వారానే అధికారంలోకి రావాలి.
అంతే కానీ బూర్జువా పార్టీలతో చేతులు కలిపి నాలుగు సీట్లు సంపాదించుకోవాలనే దుస్థితికి ఈ పార్టీలు చేరుకున్నాయి. దీనికి ప్రత్యామ్నాయం ఆదివాసీలు నిర్వహిస్తున్న దండకారణ్య పోరాటమే.
ప్రశ్న : కళ్ళ ముందే సైన్స్ ఎదుగుదలను మన సాంస్కృతిక రంగం చూస్తోంది. కానీ, సైన్స్ కు భిన్నమైన మత రాజకీయాల వైపు సాంస్కృతిక రంగం మొగ్గుచూపుతోంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సైన్స్ ను కాకుండా మతాన్ని ఆశ్రయిస్తున్నారు. సమానత్వ భావన దెబ్బతింటోంది. రాజకీయ ఉద్యమాలు వీటిని ఎందుకు పట్టించుకోవడం లేదు?
చెంచయ్య: ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సైన్స్ ను పక్కన పెట్టారు. సైన్సునుకూడా ఉపయోగించుకుంటారు. ఎందుకైనా మంచిదని తరతరాలుగా ఉన్న దైవ భావన, మత విశ్వాసాలు కూడా పనిచేస్తాయి.
ఆ నమ్మకం ఉన్న వారికి మానసిక మైన ఒక ఊరటను కలిగిస్తాయి. అందుకునే మార్క్స్ మతం మత్తు మందు అన్నాడు. ఎప్పటికైనా ఆ మత్తు నుంచి బయటపడాలి.
సైన్స్ పెరిగి, అందరికీ అందుబాటులోకి వచ్చే కొద్దీ ఈ మతం మత్తుమందు తొలిగిపోతుంది. మతాధిపతులు కూడా సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఉపయోగించుకుంటున్నారు. సమాజం పైన తమ ఆధిపత్యం చెలాయించడం కోసం మతాన్ని, దైవాన్ని తీసుకొస్తున్నారు.
ప్రశ్న : అన్ని కులాల్లో చదువుకున్న వారున్నారు. ఏ కులానికి ఆ కులం వారే సంస్కరణలు తేవాలని చర్చ జరుగుతోంది. చదువుకున్న వారు తమతమ కులాల్లో సంస్కరణలు ఎందుకు తేకూడదు?
జవాబు : చదువుకోవడం ఉద్యోగాలు సంపాదించడం, ఆర్థిక సంపాదన ఇవ్వన్నీ వర్గ స్వభావాన్ని కలిగిస్తాయి. వారుకూడా తమ కులంలో పేదలను మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రతి కులంలో చదువుకున్న వారు సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించిన వారు వారి కులాల్లో సంస్కరణలు తీసుకొస్తారనేది ఒక భ్రమగా మిగిలిపోతోంది. మొత్తం సమాజంలో సమస్యల పరిష్కార క్రమంలోనే ఈ విభేదాలు కూడా పోవాలి. వారి కులంలో వారే తెస్తే మంచిదే కానీ, ఒక భ్రమగా మిగిలిపోతోంది.
ప్రశ్న : మార్కెట్ ప్రయోజనాలే కులాన్ని కాపాడుతున్నాయా? కులాల మధ్య వైరుధ్యం పోవడానికి ఏం చేయాలి?
చెంచయ్య: కులాలను కూడా మార్కెట్ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. ఈ దేశంలో దేన్నైనా సరే మార్కెట్ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు.
ప్రశ్న : ఐరోపాలో సైన్స్ ముందుకు వచ్చి ఫ్యూడల్ సంస్కృతిని వెనక్కి నెట్టింది. మన దేశంలో ఎందుకలా జరగలేదు? మన దేశంలో సాంస్కృతికంగా మధ్యయుగాల లక్షణాలు కొనసాగుతున్నాయి. చదువుకున్న వారు కూడా కులం, మతం జాఢ్యం నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నారు? ఎందుకీ నైతిక పతనం?
చెంచయ్య: యూరప్ లో భూస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ పెట్టుబడి దారి వ్యవస్థ వచ్చింది . మన దేశంలో పెట్టుబడి దారి విధానం భూస్వామ్యంతో కుమ్మక్కైంది. ఐరోపాలో సైన్స్ అభివృద్ధి చెందిన తరువాత మతం సైన్స్ నుంచి వేరు పడింది. మన దేశంలో అలా జరగలేదు.
మన దేశంలో మతం వేరు, సైన్స్ వేరు అన్న అవగాహన చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంది. తరతరాలుగా మత ప్రభావం, దైవ ప్రభావం ఉన్నాయి కనుక, ఆ ప్రభావాలే పనిచేస్తాయి. సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలందరికీ అందుబాటులోకి రాగలిగితే, అలాగే వర్గ చైతన్యం ప్రజల్లో కలిగితే మతాన్ని, సైన్స్‌ను వేరుగా చూడగలుగుతారు.
ప్రశ్న : సమాజంలోకి పెట్టుబడి ప్రవాహంలా వచ్చిపడుతోంది. ఆ పెట్టుబడి ఫ్యూడల్ పునాదిని ఎట్లా పట్టుకోగలిగింది?
చెంచయ్య: మన దేశంలో ఫ్యూడల్ పునాదిని వ్యతిరేకించకుండా పెట్టుబడి వచ్చింది కనుక ఆ రెండూ సహజీవనం చేస్తాయి. నిజమైన పెట్టుబడి దారీ విధానం వస్తే మూఢనమ్మకాలు పోవాలి. సంప్రదాయక భావాలపైన ప్రగతిశీల భావాలు ఆధిక్యాన్ని సంపాదించాలి. ఇక్కడ అలా జరగలేదు కాబట్టి ఇక రెండూ కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఆ రెండింటి మధ్య వైరుధ్యం లేదు.
ప్రశ్న : ఒకప్పుడు కొందరు జీవితాదర్శాలతో సమాజానికి ఆదర్శంగా ఉండేవారు. అలాంటి వ్యక్తులే ఈ రోజు నిలబడలేనప్పు డు సంస్థలెక్కడ నిలబడతాయి? ఈ లోపం వ్యక్తుల్లో వచ్చిందా? వ్యవస్థకే వచ్చిందా?
చెంచయ్య: : వ్యక్తులు ఆదర్శాలతో నిలబడలేకపోయినా, సంస్థలు ఆదర్శాలతో నిలబడగలవు. సంస్థలే వ్యక్తులను మార్చగలవు.
ప్రశ్న: రాజ్యాంగ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారం కూడా రాజ్యానికి ఎందుకు ఎజెండా కావడం లేదు?
చెంచయ్య: రాజ్యాంగాన్ని చివరకు సుప్రీం కోర్టును కూడా పక్కన పెట్టే హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో ఉన్న హక్కులను కాపాడ లేదు. తమ భావాలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకోవాలని కూడా స్పష్టంగా బయటకు వెల్లడిస్తున్నారు.
ప్రశ్న : తెలుగు సమాజానికి హిందుత్వ బెడద ఎదురవుతూ ఉంది. ప్రగతిశీల శక్తులు బలహీనంగా ఉన్నాయి. బయటపడే మార్గం ఏమిటి?
చెంచయ్య: హిందుత్వ శక్తులు తెలుగు సమాజానికే కాదు, భారత సమాజానికంతటికి ఎదురవుతున్నారు. దీనికి పరిష్కారంగా కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకం కావాలంటారు. కానీ అది జరగదు. నిజాయితీగా పనిచేసే కమ్యూనిస్టు పార్టీ బలపడితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చాలా కమ్యూనిస్టు పార్టీలు ప్రజా ఉద్యమాలను నిర్వహించే ఓపికను కోల్పోయాయి. ఆదివాసీల సహకారంతో మన ఖనిజ సంపదను కాపాడుతున్న దండకారణ్యంలో పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీయే ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపగలుగుతుంది.