వినియోగ సంస్కృతిలోనూ కవిత్వం ముడిసరుకు శ్రమే!

ఈరోజు 'ఖమ్మం ఇస్తటిక్స్' వారు 'ఒక కప్పు ఛాయా నాలుగు మెసేజులు' కి అవార్డు ఇస్తున్న సందర్భంగా...

Update: 2024-12-15 07:22 GMT
జూకంటి జగన్నాథం రాసిన కవితా సంపుటిపై గీసిన చిత్రం

(జూకంటి జగన్నాథం)

మానవ సమాజం ఉన్నతిని మరింత పెంచేది సౌందర్య కవిత్వమా లేక కవిత్వ సౌందర్యమా? ఏది ముందో ఏది వెనుకో కవిత్వ ప్రేమికులు కవులు విమర్శకులు తేల్చుకోవాలి. ఆ పిదపనే సాహిత్య సౌందర్య మూలాల అన్వేషణకు ఒక స్పష్టమైన ఒక తొవ్వ దారి దొరుకుతుంది. వర్తమాన కవిత్వం పోకడలను గమనంలోకి తీసుకుంటే అనేక అంశాలపై మరింత లోతైన చర్చ చేయవలసిన ఆవశ్యకత ఉందని అనిపిస్తున్నది .
పువ్వు పూయడం ఒక సౌందర్యం. ఆ పూలను తెంపుకొని స్రీలు కొప్పులో ధరించడం మరో సౌందర్యం. ఆ పూల మొక్కను పెంచి పెద్ద చేసి పూలను తెంపిన కూలీల చెమట శ్రమ సమాజ నిర్మాణ సౌందర్యం. ఇక్కడ మనం అంటే కవి ఏ సౌందర్యాన్ని ఆశిస్తున్నారన్నది, ఆస్వాదిస్తామన్నది ప్రధానం.
దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది, తేల్చుకోవాల్సింది మరొకటి ఉన్నది. అది సకల కళలు సమాజాన్ని ఊనిక చేసుకొని వికసిస్తాయా? లేక సమాజం నుంచి మనిషిని విడదీసి కేవలం మనిషి ఉనికిని కేంద్రం చేసుకొని ఉత్పత్తి అవుతాయయా? అనేది నేటి సాహిత్య కారుల ముందున్న ప్రశ్న. ఈ ప్రశ్నలను ఛేదించగలిగితే గానీ మిగతా విషయాలు అన్నీ దూద్ కా దూద్ పానీ కా పానీ కుల్లం కుల్లా తెలుస్తుంది. ఈ చర్చ ఆది నుంచి ఉన్నప్పటికీ అంతిమంగా శ్రమ సౌందర్యమే పై చేయి సాదిస్తూ వస్తున్నది.
సామాజిక శాస్త్రవేత్తలు యోచించాల్సిన అవసరం ఉన్నది. ఆధునికత, ఆధునికాంతరవాదం , ద్రవాధునికత ఇలా అనేక వాదాలు, కళలు ఆసరా చేసుకుని అనేకానేక దోరణులు, వాదాలు, చర్చలు విశ్లేషణలు కొనసాగించాయి.
అయితే ఈ చర్చల విశ్లేషణ సారాంశమంతా ఉత్పత్తిలో జరిగిన మార్పు చేర్పుల ఉపరితల అంశాలలో ఇమిడి ఉన్నాయి. అచ్చు యంత్రం సృష్టి ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలకు అంకురార్పణ చేసింది. శాస్త్రజ్ఞులు మనిషి తద్వారా సమాజం సర్వతోముఖోన్నతి కోసం నూతన ఆవిష్కరణలను కనుగొన్నారు.
అత్యాధునికత ఆలంబన మూలాలు కంప్యూటర్ కనుగొన్న తర్వాత ప్రారంభమైందని ఉజ్జాయింపుగా మన సామాజిక విశ్లేషకులు ఒక అంచనాకు వచ్చారు. మొత్తానికి మొత్తంగా చూస్తే పెట్టుబడి కేంద్రంగా మనిషి వలసలు నిరంతరంగా కొనసాగాయి. అలాగే వాటి వెంట కవిత్వమూ సకల సృజనాత్మక ప్రక్రియలు ప్రయాణించాయి. ఇవి కొన్నిసార్లు రాచరికానికి ఊడిగం చేస్తే మరికొన్నిసార్లు దేవాలయం చుట్టూ బాడుగకు నిర్మితమైనవి.
ఇలా ఆలోచిస్తే అక్షరాన్ని కొన్ని వర్గాలు తమ గుప్పిట్లో సంకెళ్లు వేసి కొన్ని వేల సంవత్సరాలు బంధించడం వలన ఇదంతా జరిగిందని అనిపిస్తున్నది. అక్షరాస్యులు, నిరక్షరాస్యుల మధ్య భేదాలు నిచ్చెన మెట్ల సమాజం ఆ వెంటే ఎక్కి వచ్చిన నిచ్చెనమెట్టను తన్నేసే తరం వచ్చింది. అంటే ఇక్కడే ఆధిపత్య కులాల ప్రాంతాల వారు ప్రయోజనాలు రక్షించుకునే విధంగా మిగతా ఉత్పత్తి కులాలకు మధ్య అంతరం అంటరానితనం ఏర్పచారు. అంటే శ్రమ చేసేవారు కొందరైతే కూర్చొని తినేవారు మరికొందరు.. ఈ సమాజాన్ని అవిచిన్నంగా ఏలారు . ఏది ఏమైనా పునాదిలో వచ్చిన ఉత్పత్తి సంబంధాల మార్పు ఉపరితలంలో కనబడుతున్న గందరగోళాలు అన్నిటికీ మనిషి లేక కవి కలత చెందే తక్షణ హృదయ స్పందన అయిన కవిత్వంలో ప్రతిబింబించాయి.
ఇది ఏందని ప్రశ్నించిన మనిషి, కవి అన్ని కాలాలలో రాజ్యానికి కంటగింపుగా మారాడు. మతాలు హింస యుద్ధాలు, యుక్తులు, కుట్రలు, కుతంత్రాలు ప్రజ్వరిల్లాయి. మానవజాతి వికాస చరిత్ర అంతా భూమి ఉన్నవాడిదే ఆధిపత్యంగా కొనసాగింది.
ఇదిగో ఇక్కడే శ్రమ, పెట్టుబడి, అదనపు విలువల మధ్య ఒక సంఘర్షణ వాతావరణం నెలకొన్నది. పెట్టుబడి లాభాపేక్షతో అనేక దేశాలకు విస్తరించింది. ఆ వెంటనే సుజనాత్మక ప్రక్రియలను విభజించే ఆధునికత, ఆధునికాంతరవాదం, ద్రవాదునికత వాదాలు సామాజిక శాస్త్రజ్ఞులు విశ్లేషణాత్మకంగా అనేక నూతన విషయాలను సమాజం ముందు విపులంగా అరటిపండులా ఒలిచి పెట్టారు, వింగడించారు.
రాచరికం, భూస్వామ్యం, సోషలిజం, ప్రజాస్వామ్య పరిపాలన విధానాలు శాస్త్రీయంగా రాజనీతి శాస్త్రం తెలియజేసింది. అలాగే ప్రజలు బానిసలు, భూస్వామ్య కాలంలో వెట్టి కౌలు రైతులు, కూలీలు అంతరాలు లేని సమాజం సోషలిజం ప్రజాస్వామ్యంలో- పెట్టుబడిదారీ విధానం ముసుగులో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. అలాగే ఈ అన్ని దశలలో ఆయా వ్యవస్థలలో కవిత్వం కొనసాగుతూ వచ్చింది. రాజు, బానిసలు, భూస్వామ్యం లో చేతులు కట్టుకొని నిలబడే జనం ప్రజాస్వామ్యంలో ప్రజలు మనుగడ సాగించారు. ఆయా కాలాలను అణచివేత వాళ్లకు వ్యతిరేకంగా సృజనాత్మక కళలు వర్ధిల్లాయి.
వారసత్వ రాజకీయాల లాగా వారసత్వ సాహిత్య కారులు కొనసాగారు. ఈ చట్రాన్ని బదాబదులు చేస్తూ మిగతా శ్రమ కులాల నుండి వారి వారి జీవిత సంఘర్షణా బుద్ధి తెలుగు సాహిత్యంలో ముందు ఎప్పుడూ లేనంత తమ తమ జీవిత నేపథ్యాల నుండి సుసంపన్నమైన సాహిత్యాన్ని పండిస్తున్నారు. తెలుగు సాహిత్య యవనిక మీద అత్యద్భుతమైన దృశ్యం కనిపిస్తున్నది.
చివరగా చెప్పేదేమంటే, అంతిమంగా మనిషి సంఘజీవి మాత్రమే కాదు, రాజకీయ జీవి అని కూడా తత్వవేత్తలు నిర్ధారించారు. ఈ నిర్ధారణతో రాజకీయాలకతీతంగా సాహిత్యం, కవిత్వం ఉండడానికి వీలు లేనిది కాదని తేలిపోయింది. ఇక్కడే అనుభూతివాదులు హృదయ సంబంధమైన కవిత్వం పూర్వ పూర్వపక్షమైపోయింది. మొత్తంగా శ్రమ సౌందర్యం అంతిమంగా కవిత్వ సౌందర్యం పై చేయి సాధించింది.
కాబట్టి ప్రస్తుత వినియోగ సంస్కృతిలో సేవల భావం పైన నిలకడలేని స్థలంలో మనిషి కేవలం వినియోగదారులుగా తన జీవన విధానాన్ని కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో కూడా శ్రమ మాత్రమే కవిత్వ సౌందర్యంగా బాసిస్తున్నదని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా భావించాల్సి ఉంటుంది .
Tags:    

Similar News